ముందుమాట
శ్రీ దక్షిణామూర్తి
స్తోత్రములకు వ్యాఖ్యానము చేయుటయే కష్టము. కొందరు పండితులు, పెద్దలు అద్వైత మతమునకు సరిపడేలా వ్యాఖ్యానము చేసిన
గ్రంథములను పరిశీలించితిని. బృహద్వాశిష్ఠ పద్ధతిగా సమన్వయము చేసినవారు లేరు.
స్వానుభవ జ్ఞానముననుసరించి, దర్శనముల ద్వారా అధిగమించినట్టి
శ్రీ ప్రాతూరి విద్యాసాగరు గారు ఇటీవల కొందరు శిష్యుల కొరకు ప్రవచనము చేసిరి.
ఈ ప్రవచనమును కొందరు శిష్యులు వినుచూ
నమోదు చేసిరి. దానిని మరల మరల వినుచూ వ్రాసిరి. చివరకు అచ్చుతప్పులు లేకుండా టైపు
చేసి పంపించిరి. ఇంత కష్టమైన పనిని శ్రమతో పూర్తిచేసిన శ్రీమతి అక్కినేని తులసి
గారు,
శ్రీమతి దోనేపూడి విజయలక్ష్మి గారు, శ్రీమతి రమ్యగారు, మొదలైన వారికి
ఆశీస్సులు.
మాట్లాడునప్పుడు వాడిన భాష గ్రంథరూపముగా
మార్చుటలో ఎక్కువ శ్రమ పడకుండానే సరిపోయినది. ఇది శ్రీ ప్రాతూరి విద్యాసాగరు గారి
ప్రతిభకు తార్కాణము. ఈ వ్యాఖ్యానము నిర్దుష్టముగాను, వస్తు నిర్ణయము గాను, సంశయచ్ఛేదముగాను చేయబడినది.
దశలవారీగా ఎంతవరకు సాధన అవసరమో, ఆపై దర్శనపద్ధతిగాను, చివరకు గురుశిష్య న్యాయముగాను, లేక మార్జాల కిషోర న్యాయముగాను విడమరచి చెప్పడమైనది.
ఇట్టి ఉత్క్పష్టమైన గ్రంథమునకు ముందుమాట
వ్రాయుట శ్రీసాగరు గారి కంటెతక్కువ వారికి సాధ్యముకాదు. అయినను, వారి గ్రంథమును చదివి, అందులోని
ముఖ్య విషయములనే, క్లుప్తముగా, సారముగా అందించే ప్రయత్నము మాత్రము చేయగలనేమో!
మౌనవ్యాఖ్య అంటేనే ఏ బోధ చేయనిది. మెహెర్‌బాబా
చెప్పినట్లు ''యదార్థ విషయములు మౌనములోనే ఇవ్వబడును, మౌనములోనే పుచ్చుకొనబడును''. అవతార్ మెహెర్‌బాబా కూడా మౌనావతారుడే. ఆయన చేతివ్రేళ్ళ సంఙలతో చేప్పేది
ఎవరికీ అర్థము కాదు. కాని ఒక్క శిష్యుడు మాత్రమే దానిని వివరించగలిగేవాడు. అవే
భగవద్వచనముగా, బాబా ప్రవచనములుగా, సత్య ప్రేమ సందేశాలుగా అందించబడినవి.
మౌనవ్యాఖ్య అంటే, బుద్ధి పరిథికి అతీత స్థితిలో స్థితప్రజ్ఞుడైన సచ్చిష్యునికి, అతని యోగ్యతనుబట్టి, నిర్వాసనా
మౌనముద్రాంకితుడైన సద్గురుమూర్తి ఆ శిష్యునిలో భ్రాంతిరహితము, స్వరూప నిర్ణయము
జరుగునట్లు చేసే ఆంతరికమైన రహస్యము. అట్టి సమర్ధులు శ్రీదక్షిణామూర్తి. అట్టి
యోగ్యులు బ్రహ్మమానసపుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వారు
బ్రహ్మనిష్ఠులు. వారికి కావలసినది
పరబ్రహ్మ సిద్ధి. అందించబడిన పద్ధతి మౌనవ్యాఖ్య. దీని వివరము
శ్రీవిద్యాసాగరుగారి ప్రవచనములో కనుగొనగలము.
మౌనవ్యాఖ్య ద్వారా నిష్క్రియ, నిర్వికల్ప సమాధి స్థితిలో గురు శిష్యుల మధ్య, ''గురోరుచ్చిష్ట భోజనము'' వలె, జ్ఞానోపదేశముజరిగి, ఐక్యతా సిద్ధి
జరుగును. దీనికి పంచవివేకములు తోడ్పడునని సూచించినారు.
1.
నిత్యానిత్య వస్తువివేకముద్వారా జగద్భ్రాంతి నశించును.
2.
ఆత్మానాత్మ వివేకముతో జీవభ్రాంతి వీడును.
3.
కార్యకారణ వివేకము వలన జీవేశ్వరైక్య భ్రాంతి పోవును.
4.
సదసద్వివేకము ద్వారా జీవబ్రహ్మైక్యతా భ్రాంతి తొలగును.
5.
దృక్‌దృశ్య వివేకము ద్వారా పరమాత్మ నిర్ణయము జరుగవలెను.
తదుపరి మౌన వ్యాఖ్య పద్ధతిలో సచ్చిష్యుడు కడదేరును.
మొదటి 3 వివేకాల వలన త్రిపుటి అంతరించును.
చివరి 2 వివేకాల వలన ద్విపుటి రహితమగును. త్రిపుటిని దాటినవాడు బ్రహ్మము. ద్విపుటి
రహితమైతే పరబ్రహ్మమే.
విచారణ ద్వారా తెలుసుకున్నది జ్ఞాతుం.
అన్నింటినీ ఆయా స్థితులలో దర్శించుచూ పోయినది ద్రష్టుం. దర్శించినస్థితులలో
ప్రవేశించి, అనుభూతినిర్ణయములు జరుగుట ప్రవేష్టుం.
ఈ విధముగా అధిగమించుచూ గమ్యము చేరుట అధిగచ్ఛతి. సచ్చిష్యుడు జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి అనే 4 దశలలో ప్రయాణించి తుదకు కడదేరును.
మాయాస్వరూప
మందు తోచేస్పష్టిని 4 విధములుగా సూచించినారు.
1.
బాహ్యమందు స్థావరజంగమాత్శకసృష్టి
2.
అంతరమందు జీవసృష్టి
3.
ఆధార పద్ధతిగానున్నదంతా బ్రహ్మసృష్టి
4.
అఖండాకారమై, బిందురూపమైనది విశ్వసృష్టి
ఈ నాల్గింటినీ నిరసించుచూ, రహిత పద్ధతిగా క్రమపురోగతిని సాధించినట్టి సచ్చిష్యుడు
అనంతుడై,
లేనివాడైయుండును. మొదటి సాధన ఉపాధికి విలక్షణమైన జీవభావనము
పొందుట. శరీరత్రయ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి, పంచకోశ ధర్మముల వ్యతిరిక్తమైన ఆత్మను స్వానుభవము లోనికి
తెచ్చుకొనుట మొదలైన సాధనలు, సాధనాఫలితములు ఇంతవరకే.
ఆపైన ఆత్మనిష్ఠుడైన సచ్చిష్యుడు
బ్రహ్మానుసంధానము ద్వారా బ్రహ్మనిష్ఠుడు కావలెను. ఇదియు ప్రత్యేకమైన సాధన
క్రిందికి వచ్చును. ఇట్టి అనుసంధానము మహావాక్యదర్పణ నిర్ణయ పద్ధతిగా చేయవలసి
యున్నది. పిమ్మట బ్రహ్మనిష్ఠుడైనవాడు వార్తీక నిర్ణయ పద్ధతిగా, లక్షణ పద్ధతిగా, గురుసూచన చేత
పరబ్రహ్మపదమును సిద్ధింపజేసుకొనును. ఇక్కడే మౌన వ్యాఖ్యలో అందించుట, పుచ్చుకొనుట జరిగి, గురుశిష్యులనే
గుర్తుల ఎరుక నశించి, బయలే ఉన్నదున్నట్లుండును. దీనినే
తిరిగిరాని మోక్షమందురు.
జగత్ జీవేశ్వరులకు అధిష్ఠానము ఈశ్వరుడు.
నాద బిందు కళలకు అధిష్ఠానము బిందువు. దేశ కాల కలనలకు అధిష్ఠానము కాలము. ఈ త్రివిధ
త్రయములకు అధిష్ఠానములైన ఈశ్వరుడు, బిందువు, కాలము అనేమూడూ కూడా చలించేవే. అనగా పునరావృతికి హేతువులు.
కనుక ఈశ్వరత్వమును, బిందురూపమును, కాలమును నిరసించి, రహితపద్ధతిగా
అధిగమించవలెను. ఆ పైస్థితి స్వతస్సిద్ధమైన బయలు. ఇట్టిబయలు నందు, బయలున కెట్టి సంబంధము లేకనే మాయకారణముగా, మాయలో భాగముగా, మూలకారణాంశమైన
శూన్యము,
సంకల్పము, కాలము అనే మూడూ లేకనే
ఉన్నట్లు తోచినవి. ఈ మూడూ ఒకానొకస్థితిలో అనుకూలమైనప్పుడు అనంత విశ్వము
ప్రకటించబడెను.
కనుక విశ్వమును బిందు మాత్రముగా దర్శించి, విశ్వాతీతుడై, కాలాకాలములను
దర్శించి,
కాలా తీతుడై, విశ్వమును
సంకల్పించుటను మాని, నిర్వికల్పుడై యున్న సచ్చిష్యుడే
అఖండ,
అనంత, నిర్వికల్ప, నిర్విశేష పరబ్రహ్మము అనెడి పరమపదమును పొందును.
శ్రీ సాగర్‌గారు వ్యాఖ్యానించే క్రమములో
పైచెప్పినవేగాక, అనేక అంశములను దృష్టాంతములతో సహా
ఉటంకించుచు, అనేక ఆధ్యాత్మిక రహస్యములను బయలుపరచుచు, ద్రాష్టాంతముతో సమన్వయము చేసిరి. విజ్ఞానశాస్త్రమును, అవతార్ మెహెర్‌బాబావారి భగవద్వచనమును, లలితా సహస్రనామముల అర్థమును, నమకచమకములను, ఇంకను అనేకమైన వాటిని
ఉదహరించుచు, వస్తునిర్ణయమును గావించిరి.
అద్వైత సిద్ధాంతమును మతాతీత పద్ధతిగా
తుదకంటా నిర్ణయమైనదేదో అది అచలసిద్ధాంతము కంటే వేరు కాదని అనేక ప్రమాణములను చూపి, ఈ దక్షిణామూర్తి తత్త్వమును వ్యాఖ్యానించిరి. ఇంత కంటే
ఉత్కృష్ఠమైన గ్రంథము, ఇప్పటి జిజ్ఞాసువులకు ప్రయోజనము
చేకూర్చ గలిగినది ఎక్కడనూ దొఱకదు. అశరీరియైన నిర్భయానంద శ్రీమేకా నరసింహారావు
సద్గురు మహారాజ్ మరియు దేశికేంద్రుల కృపాకటాక్ష వీక్షణము వల్లనే ఈ జ్ఞానపుష్పము
సచ్చిష్యబృందమునకు అందించడమైనది. దీనిని సద్వినియోగము చేసుకొన్నవారు ధన్యులు!
విజ్ఞాన్ స్వరూప్