గురుబోధ
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము - ధ్యాన శ్లోకములు
1. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానమ్,
వర్షిష్టాంతేవ సదృషి గణై రావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం,
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే ||
2. వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం
సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్ |
చిత్రం వట తరోర్మూలే వృద్ధాఃశిష్యా గురుర్యువా
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చ్ఛిన్న సంశయాః ||
3. ఓం నమః ప్రణవార్ధాయా శుద్ధజ్ఞానైక మూర్తయే,
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయేనమః ||
4. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||
5. నిధయే సర్వ విద్యానాం భిషజే భవ రోగిణామ్ |
గురవే సర్వ లోకానాం దక్షిణామూర్తయే నమః ||
6. త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం |
జనన మరణ దుఃఖ చ్ఛేద దక్షంనమామీ ||
7. ఈశ్వరో గురు రాత్మేతి మూర్తి భేద విభాగినే |
వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ||
''తస్మై శ్రీ గురుమూర్తయే నమఇదం శ్రీదక్షిణామూర్తయే'' అనే మకుటంతో పూర్తయ్యే విధానమంతా తత్త్వ విచారణలో ఆఖరిభాగం. అంటే బ్రహ్మ నిష్ఠ కలిగినటువంటివారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి, జన్మ రాహిత్య స్థితిని పొందటానికి ఏ రకమైన బోధ అందించాలో అది అందులో అందించారు. ఆ అందించినటువంటి గురుమూర్తి ఎలా ఉన్నారో తెలియటం కోసం ఇది చెప్తున్నారు. అదేమో ఆయనతో ఐక్యతా సిద్ధి పొందినవాళ్ళు మాత్రమే అందుకోగలుగుతారు. మరి ఆ ఐక్యతా సిద్ధి పొందాలనుకుంటున్న వారికోసం ఇది చెప్తున్నారు. అంటే గురుమూర్తిని ఆశ్రయించేప్పుడు ఏ రీతిగా శిష్యుడు దర్శించాలి అని. అక్కడేమో జన్మరాహిత్యం పొందడం ఎలాగో బోధించబడింది. గురుశిష్య అన్యోన్య దర్శనం అని కందార్థాలలో ఒక భాగం ఉంది.
గురువు శిష్యుణ్ణి చూశారా? శిష్యుడు గురువును చూశారా? అన్యోన్య దర్శనం.
జీవితంలో వివాహ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వారిమధ్య అన్యోన్య దర్శనం జరుగుతుందట. అంటే ఒకరికి ఒకరు గురువై పని చేస్తారన్న మాట. నిజానికి గురుశిష్య బాంధవ్యం నెలకొల్పడమే దానియొక్క ఉద్దేశ్యం. అందుకే దానికి ముహూర్తం దాటనివ్వరు. మిగిలిన వాటికి ముహూర్తంతో పనిలేదు. కాబట్టి వివాహంలో అత్యంత ప్రధానమైనది ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం. తద్వారా నీ లోపల ఆ గురుశిష్య బాంధవ్యం నెలకొల్పబడే అవకాశం ఉంది. మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది.
''మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం'' పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించుట అంటే తెలియచెప్పుట. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. ''విశేషేన ఆఖ్యానం ఇతి వ్యాఖ్యః''. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యకు మౌనమును జోడించడమైనది. మౌనవ్యాఖ్య.
మౌనంగా ఉండి ఆ మౌనం ద్వారానే సమస్తమూ బోధించాడట. ఇదెలా? రెండు విరుద్ధాలు ఒకచోట పొసగితేనే నీకు పరబ్రహ్మ నిర్ణయం సాధ్యం. కఠోపనిషత్ మిగిలిన ఉపనిషత్‌లలో ఆత్మ గురించి చెప్పేటప్పుడు దీనికంటే దూరం లేదు. దీనికంటే దగ్గరలేదు అని రెండూ ఒకేచోట చెబుతారు. అలా అర్థం చేసుకునే శక్తి నీకు వచ్చినప్పుడు మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. కాబట్టి బుద్ధి వికాసం ఎక్కడిదాకా వికసించాలి? నేను చూస్తేనే, నేను తెలుసుకుంటేనే, నేను అనుభూతి చెందితేనే సత్య ప్రమాణం అంటుంది నీ బుద్ధి. Two impossible at a time at a single point. ఒకే చోట చీకటి వెలుగు కూడా ఉన్నాయి. ఇది అసాధ్యం అంటుంది నీ బుద్ధి. అలా ఉంటాయనే దర్శన స్థితి నీకుంటే తప్ప సాధ్యం కాదు. మీ ముత్తాత గారిని మీరు చూడలేదు, కాబట్టి లేరందామా? నేను చూడందే ఎలా నమ్మేది అంటుంది బుద్ధి. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం ద్వారా తెలుసుకునే అవకాశం ఉందికదా! మీ ముత్తాత గారినే చూడలేనివాడివి బ్రహ్మమునెలా చూస్తావు? సృష్ట్యాది స్థితియందున్న బ్రహ్మమును సృష్టి మొదలైపోయి, కొన్ని లక్షల సంవత్సరాలైన తరువాత చూడటం సాధ్యమా అన్న సందేహం వస్తుంది.
మీ ముత్తాత గారు పోయారని నీకు రూఢిగా తెలుసు కాబట్టి చూడలేకపోతున్నావు. చూసే ప్రయత్నం చేయడం లేదు. మన బుద్ధికి తోచిన నిర్ణయం ఎలా ఉంది? ఉన్నదాన్ని ఎలా అన్నా చూడగలుగుతాము కానీ, పోయిన వాళ్ళని చూడలేము కదా!
కాబట్టి ఇప్పుడెలా నిర్ణయం పెట్టారు? బ్రహ్మము ఎల్లకాలము ఉన్నాడు, సృష్ట్యాది నుండి, సృష్టి లయము వరకు స్థిరముగా ఉండే వాడెవడో వాడే బ్రహ్మము. నీవు చూడలేకపోతే నీదే దృష్టి లోపము. ఎల్లకాలము ఉన్నాడని ఒక Abstract character ని మనం ప్రతిపాదన చేసాం. ఈ తత్త్వ విజ్ఞానంలో ఇది Abstract అన్నమాట. దీనికి మార్పుండదు. కాబట్టి బ్రహ్మమంటే ఏమిటి అంటే సృష్ట్యాది నుంచి సృష్టి లయమయ్యే వరకు స్థిరముగా, మార్పు చెందకుండా, ఎవరైతే సర్వ వ్యాపకునిగా, సృష్టియందు అంతటా వ్యాపించి ఉన్నాడో వాడు బ్రహ్మము.
వానియొక్క లక్షణము సచ్చిదానంద ఘనము. ఘనమేమిటి? సృష్టిలో రెండు స్థితులున్నాయని చెప్పుకుంటాం. పదార్థానికి చెందిన స్థితులు 3. ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. వాయువే ద్రవమైతే, ద్రవమే ఘనమైంది. దానికి ముందు ఇంకా ఏమీ లేవా? ఇంకా రెండున్నాయి. శూన్యము, జ్యోతి. ''భూమిరాపో అనలో వాయుః ఖం మనోబుద్ధి రేవచ అహంకార యితీయంమే భిన్నా ప్రకృతి రష్టదా!!'' భగవద్గీత. అష్టప్రకృతుల గురించి: ''భూరం భాస్య నలోనిలోంబర మహర్నాధో హిమాంశుః పుమాన్, ఇత్యాభాతి చరాచరాత్మక మిదం యస్యైవ మూర్త్యష్టకమ్'' ఈ పరిశోధన ఎంతవరకూ కొనసాగాలంటే, నీ బుద్ధి తెలుసుకునే, ఘన ద్రవ వాయు పదార్థాలనే మూడింటి వద్ద ఆగితే లాభంలేదు. దానిని దాటి శరీరం, ప్రాణం, మనసు అనే స్థితులను దాటితే తప్ప వాటి అవతల ఉన్నదానిని తెలుసుకోలేం. కాబట్టి సాధనలన్నీ ఎందులో ఉంటాయి? శరీరం, ప్రాణం, మనసు నీవు కాదని నిర్ణయించడానికిన్నీ అవి నేను కాదు అని తెలుసుకోవడానికి సాధనలు ఉన్నాయి. నీవు ప్రాణాయామం చేసినా, ఆసనాలు వేసినా మనసు, బుద్ధి నేను కాదు అనే స్థితికి చేరుకుంటావు. దాని పేరే నిర్వాణం. మౌనానికి ఒక దీక్ష ఉంది. దాని పేరు నిర్వాసనా మౌనదీక్ష. అంటే సమాధి స్థితిలో నిలకడ కలిగిన వాళ్ళకు జ్ఞానాగ్ని అనేటటువంటి స్థితి లభిస్తుంది. 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' అంటుంది భగవద్గీత. అంటే నీ లోపల ఉన్న వాసనా యుతమైన బీజములన్నీ నీ జ్ఞానాగ్నియందు దగ్ధమైతే మరల మొలకెత్తవు. ఇదీ నీవు చేయవలసిన యజ్ఞం. ఇది ఆంతరిక యజ్ఞం.
ఈ ఆంతరిక యజ్ఞం చేసే వారెవరైతే ఉన్నారో, వారంతా జ్ఞానమార్గంలో ప్రయాణం చేసినవారవుతారు. ఇది జ్ఞానయోగ సాధన. వీరు అంతర్ముఖాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. వీరు అవస్థాత్రయాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఎవరైతే 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' అనేటటువంటి తురీయ పద్ధతిగా వచ్చిన వారుంటారో, వారు బ్రహ్మాత్మ భావన చేసి, మహావాక్య నిర్ణయ పద్ధతిగా బ్రహ్మనిష్ఠని సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములనే చతుర్విధ ముక్తులకు అర్హులౌతారు. ఎందుకంటే ఈ స్థితులన్నీ జ్ఞానాగ్నితో సంబంధపడి ఉంటాయి. ఈ జ్ఞానాగ్నియందు సమస్త వాసనలు ఎవరికైతే దగ్ధమైపోయి, శరీరం నుండి (కొబ్బరికాయ నుండి కురిడీ విడిపోయినట్లుగా) విడిపోయి, శరీరమందు అశరీరిగా ఉన్నటువంటి స్థితిగా ఉండి, జీవన్ముక్తుడై ఉన్నటువంటి వారిస్థితి పేరు మౌనదీక్ష. అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అంటే ఈ నిర్వాసనా మౌనదీక్ష ద్వారానే వీలవుతుంది. కందార్థాలలో వాక్కు తన మూలము నెరుగగనే ఎరుక లేకుండా పోతుంది. 'ఎరుక మీరినచోట మాటెక్కడోయి' అంటారు. కాబట్టి మౌనం త్రివిధములు. వానిలో కూడ మూడు స్థితులున్నాయి. అవి 1. వాంగ్మౌనము. వాంగ్మౌనమంటే యోగసాధన. 2. మానసిక మౌనము. మానసిక మౌనమంటే జ్ఞానసాధన. నిర్వాణ స్థితిలో ఉన్నవాడు మానసిక మౌనం. ఎవరికైతే పరబ్రహ్మ నిర్ణయం కల్గిందో వారు 3వదైన ఈశ్వరీయ మౌనంలో ఉంటారు. దేశ కాల కలన అంటే మూడు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకున్నాం. ఇందులో కాలమును దాటాలీ అంటే ఈ ఈశ్వరీయ మౌన స్థితికి సంబంధించిన నిర్ణయముండాలి. అలాంటి నిర్ణయం లేకుండా కాలాన్ని దాటడానికి వీలవదు. కాబట్టి నిర్వాసనా మౌనదీక్ష ద్వారా ఈశ్వరీయ మౌనాన్ని సాధించాలి. సాధనలేవీ లేవు అంటూనే, దాని ప్రాప్తిని కనవలె అంటున్నారు. బ్రహ్మనిష్ఠ తరువాత అంతాకూడా ప్రాప్తి కనవలె. అనగా మార్జాల కిశోర న్యాయం ద్వారా ఆ ప్రాప్తిని పొందాలి. అట్లా ఈశ్వరీయ మౌన స్థితిని పొందిన వారెవరైతే ఉన్నారో వారు చిన్ముద్ర ద్వారా అభయమును ఇవ్వగలుగుతారు.
ఈ చిన్ముద్ర పరబ్రహ్మ నిర్ణయానికి సూచిక. చిన్ముద్ర అంటే శూన్యమును సర్వమును ఏక కాలంలో చూచుట. రెండు వేళ్ళ మధ్యలో శూన్యమున్నది. నిలబడి ఉన్న వేళ్ళు సర్వము. ఈ శూన్యసర్వములు ఒక్కటే. తెరిస్తే అభయముద్ర. ఈ అభయముద్ర ఎవరు ఇవ్వగలుగుతారంటే, ఎవరైతే శూన్య సర్వములు ఒక్కటే అనే స్థితిని పొందుతారో వారు అభయమివ్వ గలుగుతారు. శూన్య సర్వములు ఒక్కటేననే స్థితిని సాధించాలంటే ఇంకా సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని దాటాలి.
ఈ మూడింటినీ దాటిన దేశికేంద్రుల యొక్క అభయముద్ర చేత నీవు జనన మరణ రాహిత్యాన్ని పొందుతావు. కాబట్టి ఏ దేవుడి దగ్గరకెళ్ళినా కూడ ఆయన నీకు అభయముద్రతో దర్శనమిస్తాడు. వేంకటేశ్వరస్వామి దగ్గరకెళితే వరద హస్తము, అభయ హస్తము ఉంటాయి. దేవతా విగ్రహాలన్నీ కూడ ఈ అభయముద్రతో సృజించబడ్డాయి. కాబట్టి వాటిద్వారా నీకు సంఙారూపక బోధ చేస్తున్నారు అక్కడ మానవ జీవిత లక్ష్యం పరబ్రహ్మ నిర్ణయం, జనన మరణ రాహిత్యం. దానికోసం నీవు మౌన వ్యాఖ్యను, దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. నీవు దక్షిణామూర్తి స్థితిని ధరించాలి, ఆ స్థితిలో నిలబడి ఉండాలి, నీ ద్వారా, నీ జీవనం ద్వారా పరబ్రహ్మ తత్త్వం ప్రకటితమవ్వాలి. సూర్యుడు మౌనంగా ఉండి, ప్రకాశము, వెలుగు నిస్తున్నాడు కదా! సృష్టికంతటికీ ఆధారంగా ఉన్నాడు కదా!
ఆధార స్థితిలో ఉన్నది కేవలం మౌనమే. ఆధేయ స్థితిలో మాత్రం శబ్దాలున్నాయి. ఆకాశంలోకి దిగి వస్తేనే శబ్ద తన్మాత్ర చేత సృష్టి ప్రారంభమైంది. వాక్కు యొక్క మూలాన్ని ఎరగడమంటే, సృష్టి యొక్క మూలాన్ని ఎరగడమని అర్థం. ఈ రకంగా మౌనాన్నే ప్రాధాన్యంగా పట్టుకుని ప్రయాణించే పంచగగన పద్ధతిని ప్రతిపాదించారన్నమాట. సాధనలలో కెల్లా ఉత్తమమైనది పంచగగన పద్ధతిని. దీనిద్వారా ప్రయాణించేవారు దీనిని పొందగలుగుతారు. దర్శించినవాడు చెబుతున్నాడు పంచగగన పద్ధతి.
పంచగగన పద్ధతిలో భూతాకాశము అనగా నీవు చూసే ఆకాశ మొకటి. శబ్ద తన్మాత్ర కలిగియున్న భూతాకాశము ఒక ఆకాశము.
ఎవరైతే శబ్ద తన్మాత్రని తన లోపల పుట్టినటువంటి అనాహత నాదాను సంధానం ద్వారా అధిగమించినటువంటి ప్రజ్ఞాస్థితిలో చేరతారో, వారు మొదటిది దాటారు. ప్రజ్ఞ ఆకాశానికి అవతల ఉంది. చైతన్యం ఆకాశానికి అవతల ఉన్నది.
చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవలాకాశములతో కలిపి మొత్తం పంచగగనములు.
ఈ పంచ గగనముల పద్ధతిగా, బోధించబడే బోధ పేరు 'ప్రబోధ'. దక్షిణామూర్తి విధానంలో చెప్పబడేదంతా ప్రబోధ పద్ధతి. అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడామణి అని కందార్థాలలో ఒకటుంది. అచల సిద్ధాంతమంతా మౌనవ్యాఖ్యే. అంటే అచల సిద్ధాంతం గురించి వాక్కులోకి దిగివచ్చి చెప్పడమే పరిమితిని ధిక్కరించటం అని అర్ధం. గురువు గారిని చూస్తూ ఉండగానే హృదయ స్థానంలో గురుశిష్య ఐక్యతా సిద్ధిని పొంది, గురువు గారిలో ప్రబోధ చేయాలి, ప్రకటించాలని సంకల్పం కలగగానే శిష్యుడికి అర్థం కావాలి.
గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి. అర్థమైతే చెప్పక్కర్లేదు. ఇంటిలో వారి అవసరాన్ని గుర్తెరిగి ఆ అవసరాన్ని తీర్చావు గనుక వారికి సంతోషం. అలా కాకపోతే అన్యోన్యత లోపించినట్లవుతుంది. అన్యోన్యత ఉన్నచోట మౌనం ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడే విధానం గురించి భాగవతంలో ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఢమఢమ ధ్వనుల ఢక్క గాక! సదా ఈశ్వరీయ బుద్ధితో, ఈశ్వరీయ చింతన చేసేవారికి, సదా విష్ణు పదాంబుజ నిరతి కలిగినటువంటి వారికి అన్యం ఎలా తోస్తుంది?
అన్యం తోస్తే కదా మాట్లాడటానికి? సదా ఆత్మోపరతి యందు నిష్ఠ గల్గినవాడికి అన్యమే తోచడం లేదు. అన్యం తోచనప్పుడు వాక్కులోకి ఎలా దిగి వస్తాడు? ఎంతటి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన సాంప్రదాయం, ఉన్నతమైన బోధ, ఉన్నతమైన శాస్త్రాలు అయినప్పటికీ, దీనిని బోధించే మహానుభావులు ఉన్నారు. భారతీయ ధర్మంలో అశరీరులైన మహానుభావులు ఉన్నంతమంది బయట ప్రపంచంలో ఎక్కడా లేరు. కానీ అందుకోవాలంటే ఏం చేయాలి? దక్షిణామూర్తిని ఆశ్రయించాలి.
దక్షిణామూర్తిని గమనిస్తే 'వటమూల నివాసిని' వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. 'ఊర్ధ్వ మూలమదఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, ఛందాంసి యధ్య వర్ణాణి యుక్తం వేదసవేదవిత్' అంటున్నారు.
పైన మూలం ఉందట, క్రిందికి శాఖలున్నాయట. పైన మూలముంటే విత్తనం ఎక్కడుండాలి? విత్తనం కూడ పైనే ఉండాలి. కాబట్టి శూన్యమనే విత్తనం ద్వారా సర్వం అనే సృష్టి వ్యక్తమైంది. మరి ఆ సర్వం అంతాకూడ కొమ్మలని, రెమ్మలని, ఆకులని అధ్యయనం చేద్దామా? ఎంతకాలం చేస్తే మాత్రం ఏమి అవుతుంది? అందువలన 'వటమూలనివాసిని' ఏ శూన్యం నుండి సర్వం వ్యక్తమైందంటున్నావో, ఆ శూన్యాతీతమే పరబ్రహ్మము. అక్కడ ఉన్నాడు దక్షిణామూర్తి. పరబ్రహ్మ నిర్ణయం ద్వారా దక్షిణామూర్తిని ఆశ్రయించు. అప్పుడు ఏం పొందుతావు? ఆవరణ రహితం, జనన మరణ రహితం, సాయుజ్యం పొందుతావు.
'మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం' కాబట్టి ఆ శూన్యాతీత, కాలాతీతమైనట్టి, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన మహానుభావుడైన, దేశికుడైన దక్షిణామూర్తి చిన్ముద్ర ద్వారా, మౌన వ్యాఖ్య ద్వారా దేశము, కాలము, కలన గురించి ప్రబోధిస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు? ''మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం, వర్షిష్టాంతేవ సదృషి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః'' ఇప్పుడు ఆశ్రయించిన వారంతా బ్రహ్మనిష్ఠులు. చిత్రంలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు ఋషులు ఉన్నట్లుగా వేస్తారు. ఆ నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. ఆ నలుగురి పేర్లు ''సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతుడు''.
మొట్టమొదట దక్షిణామూర్తి నాశ్రయించి మొదట పుట్టినవాళ్ళే ఈ ప్రబోధ పొందారు. వాళ్ళ చిత్తమే లక్షల సంవత్సరాలైనా కొనసాగుతోంది. ఎప్పుడైనా, ఎక్కడైనా దక్షిణామూర్తి అంటే, నలుగురు శిష్యులే. వారు నాలుగు వేదములకు నిరూపణ. మొట్టమొదట పరబ్రహ్మ స్వ నిష్ఠలో ఉండి ఆది సంకల్పం చేయగానే ఆ బ్రహ్మ మానస పుత్రులు సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతుడు ఉద్భవించారు. వాళ్ళు మహా పరినిర్వాణం వరకూ ఉంటారు. అనంత సృష్టి వెనక్కి తీసుకోబడి, సర్వమంతా శూన్యంలో లయమైపోతే వారు పోతారు. కాబట్టి బ్రహ్మనిష్ఠులైన వారందరికీ కూడ సంఙా రూపకమైన నిర్ణయ సూచన ఈ సనక సనందాదులే. ఎవరైతే ఈ బ్రహ్మనిష్ఠ స్థాయికి వస్తారో, వారిలో ఆ బ్రహ్మీభూత స్థితి నిలకడగా నిలిచే అనుగ్రహాన్ని ఇచ్చేవారు ఈ నలుగురన్నమాట. తాత్త్విక దృక్ సంఙా రూపకమైన బోధ అన్నమాట. తాత్త్విక దృక్పధంలో బ్రహ్మనిష్ఠులు నలుగురు. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు. ఇలా బ్రహ్మ నిష్ఠలో ఉన్నవారికి నాలుగు స్థితులు. జీవన్ముక్తులు ఈ నాలుగు స్థితులలో ఉంటారు. ఈ నలుగురిలో ఉత్తముడు బ్రహ్మ విద్వరిష్ఠుడు. ఇదీ ఆ నలుగురికి అర్థం. సత్యమేమిటంటే బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అయిన మహానుభావుల స్థితికి చేరిన సత్పురుషులు ఎవరైతే ఉన్నారో, వారికి పరబ్రహ్మ నిర్ణయాన్ని, జన్మ రాహిత్యాన్ని దేశికేంద్రుడైన మహానుభావుడు బోధిస్తున్నాడు.
'వర్షిష్టాంతేవ సదృషి గణైః రావృతం బ్రహ్మనిష్ఠైః' - వర్షిష్టం అంటే వర శిష్యుడు. శిష్యుడిలో కూడ ఎటువంటివాడు? శిష్యాచార్య సాంప్రదాయంలో 'వర' అనగా ఉత్తమమైనటువంటి వాళ్ళు. బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు అయినవారు 'సదృషిగణైః' వారు బ్రహ్మనిష్ఠులు. ''ఆవృతం బ్రహ్మ నిష్ఠయే'', బ్రహ్మ నిష్ఠ అనే ఆవరణ స్థితిలో ఉన్నవారు. వారు ఆవరణను పోగొట్టుకోవడానికి, ఆవరణ రహితం అవడానికి సద్గురుమూర్తియైన దక్షిణామూర్తిని ఆశ్రయించారు.
''ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందమూర్తిం'' ఆచార్యేంద్రం అంటే ఆయన కన్నా ముందు ఆచార్యుడెవరూ లేరు. ఆచార్యులలో ఇంద్రుని వంటివాడు. అనగా శ్రేష్ఠుడు. ఆచార్యులలో మొదటివాడు దక్షిణామూర్తి. కాబట్టి అందరూ గురు పరంపరను ప్రారంభించేటప్పుడు ''సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం, అస్మదాచార్య పర్యంతాం, వందే గురుపరంపరం'' అని ప్రార్థిస్తారు. 'కరకలిత' అంటే చేతితో చిన్ముద్రను ధరించి, సచ్చిదానంద స్వరూపంగా కళ్ళముందు కనబడుతున్నాడు. అలా దర్శించారీ బ్రహ్మనిష్ఠులు. ఇంకా ఎలా ఉన్నాడు ?
''స్వాత్మారామం ముదితవదనం, దక్షిణామూర్తిమీడే'' -
'స్వాత్మారామం' అంటే తనలో తాను రమిస్తూ ఉన్నవాడు. దశరధ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు కాదు. స్వాత్మారాముడు. ఇక్కడ రెండు శబ్దాలున్నాయి. స్వాత్మ, ఆరామ, స్వాత్మారామ. స్వ ఆత్మారామముగా ఉన్నాడు. తాను తానైన స్థితిలో, తనను తానెరుగక ఉన్నాడు అని అర్థం. అంతేకానీ జడుడుగా ఉన్నాడని కాదు. పూర్ణము, శూన్యము రెండూ ఒకే రకంగా సూచితమౌతాయి. పూర్ణము అంటే సర్వం. పూర్ణము అంటే శూన్యము కూడా. కాబట్టి ఈ స్వాత్మారామ స్థితి అంటే తనయందు తాను రమించుతూ తనను తాను గుర్తెరుగక యున్నాడు. అంటే ఎరుక లేక మాయకు అతీతుడై ఉన్నాడు. తనయందు తాను రమించుచున్నాడు. తనను తాను గుర్తెరుగక ఉన్నాడు. తాననే ఎరుక లేక ఉన్నాడు. బ్రహ్మమనెడి ఎరుక లేక ఉన్నాడు. లేనెరుకగా ఉన్నాడు. ఇది స్వాత్మారామం.
'ముదిత వదనం' అంటే మందస్మిత వదనారవిందము. ప్రపంచంలో ఏ దేవతా విగ్రహాలైనా మందస్మిత వదనారవిందంతో ఉంటాయి. అదే ముదిత వదనం. కాళీ మాతది కూడ ముదిత వదనమే. ఆచార్యుల కళ్ళు సూర్యచంద్రులు. కాబట్టి ఆయన ప్రకాశమే స్వరూపంగా కలిగినటు వంటివాడు. ఆయనద్వారా ప్రకాశం ప్రకటితమౌతుంది. ముదితవదనమంటే అర్థం ఇది.
ప్రకాశమే స్వరూపంగా ప్రకటిస్తున్నవాడు, ఆ అమృత స్వరూపుడు ఆ ప్రకాశం అంటే నీవు అమృత స్వరూపుడివి అనే సూచన చేయడమే ఆ ముదిత వదనానికి అర్థం. సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడు అయిన మహానుభావుడి యొక్క వదనం ఎలా ఉందట? ఆయనని చూచిన ప్రతి ఒక్కరికీ తాను అమృత స్వరూపుడనని తోచిందట. అప్పటివరకూ శరీరం నేనుగా, ప్రాణం నేనుగా, మనసు నేనుగా, బుద్ధి నేనుగా సమాజమందు, ప్రపంచయుత సంబంధాలతో కూడిన నేనుగా ప్రతిఫలించిన ప్రతిబింబముగా ఉన్నవాడు. దేశికేంద్రుని యొక్క దర్శనం చేత ఒక స్ఫురణ కలిగింది. ముదిత వదనం వలన ఒక స్ఫురణ కలిగింది. నేను అమృత స్వరూపుణ్ణి అని. క్యూలో నిలబడి వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు రెండు లిప్తల కాలం మాత్రమే దర్శించడానికి అవుతుంది. అది చాలట. ఆ రెప్పపాటు కాలంలో నేను అమృత స్వరూపుడను, నేను మరణమే లేనివాడను అనే స్ఫురణ నీకు కలుగుతుంది. మరణం ఎందుకు లేదంటే నేను పుట్టుకే లేనివాడను గనుక I have never born. నేను అమృత స్వరూపుణ్ణి అనే మేలుకొలుపు కలిగిందట. అదీ ముదిత వదనం యొక్క ప్రభావం. ''స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే'' ఆ దక్షిణామూర్తిని దర్శించిన మహానుభావులకు వెంటనే ఒక మేలుకొలుపు వచ్చిందట. ఒక మెలకువ వచ్చింది. అవతార్ మెహెర్ బాబా ''నేను బోధించుటకు రాలేదు, మేల్కొలుపుటకే వచ్చితిని. అందుకే మౌనము పూనితిని'' అంటారు. ''మేల్కొలుపుటకే వచ్చెనటా, అందుకే మౌనము పూనెనటా'' అని గొప్పదైన మెహెర్ బాబా పాట ఒకటి ఉంది. కాబట్టి మహానుభావులు, అవతార స్వరూపులు ఎవరైతే ఉన్నారో వారు మౌనం ద్వారా బోధించారు. భగవద్గీతలో కూడ భగవానుడు అర్జునునికి చాలాసేపు బోధించి, రావలసినంత స్థాయికి అర్జునుడు రాలేదని, తన యోగ శక్తిని ఆయనలో ప్రవేశపెట్టాడు.
''పశ్యమే పార్థ రూపాణి శతశో-థ సహస్రశః! నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ!!'' అని అంటారు విశ్వరూప సందర్శన యోగంలో.
జ్ఞాతుం అంటే తెలుసుకోవటం. నీవు తెలుసుకోవటం అనేది బ్రహ్మ పుట్టిన దగ్గరనుండీ బ్రహ్మ పోయేవరకూ చేస్తున్నావు. జ్ఞాతుం పూర్తవటం లేదు. ఎలా పూర్తవుతుందట? ''పశ్యమే యోగమైశ్వర్యం'' భగవత్ విభూతిని, ఆ యోగైశ్వర్యాన్ని నీవు ఒకసారి దర్శించినట్లైతే, ఆ ఈశ్వర విభూతిని దర్శించినట్లైతే అది నీవే అవుతావు. కానీ ఆ 'జ్ఞాతుం' అన్న స్థితి నుండి 'ద్రష్టుం' అన్న స్థితికి రాలేదు అర్జునుడు. అందువల్ల తానే అర్జునుడిలో ప్రవేశించాడు. అప్పుడు అర్జునుడికి పరమాత్మకెంత శక్తి ఉందో, అంత శక్తి వచ్చేసింది. ఆ శక్తివల్ల విశ్వరూపమును దర్శించగలిగాడు. గురువు సంకల్పంలోకి దిగి తన ప్రజ్ఞని శిష్యునియందు ప్రవేశపెట్టాలనేటటువంటి సూచన చేస్తున్నారు. విశ్వరూప సందర్శన యోగం ద్వారా, శిష్యుణ్ణి ఉద్ధరించాలీ అంటే ఒక మార్గం ఉంది. సాంఖ్య విచారణ అంతా బోధించి, బోధించేప్పటికి తరించాలి అంటే గురువు శిష్యునియందు ప్రవేశించాలి. ఏనుగు గుడారంలో ప్రవేశిస్తే, గుడారం నామరూపాలు లేకుండా పోయింది. శిష్యుడు తన తెలివిని కోల్పోయి ఇప్పుడు గురువుయొక్క తెలివితో తెలుసుకున్నాడు. అప్పటివరకు తన తెలివితో, తన సాధనా బలంతో తను తెలుసుకున్న పరిజ్ఞానంతో మాత్రమే పరిమతించబడిన శిష్యుడు ఇప్పుడు మౌనవ్యాఖ్య ద్వారా తెలుసుకుంటున్నాడు.
''మౌనవ్యాఖ్యా ప్రకటిత... దక్షిణామూర్తిమీడే'' ఎవరైతే శిష్యునిలో ప్రవేశించి, ఆ దర్శన శక్తిని ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరూ దక్షిణామూర్తి స్వరూపులే. ఇప్పుడు సద్గురువులు ఎవరు ? ఎవర్ని ఆశ్రయించవచ్చు? ఎవరికైతే ఈ సమర్ధత ఉంటుందో, ఎవరైతే దక్షిణామూర్తి స్థితిని పొందిన దేశికేంద్రులైన వారుంటారో వారు శిష్యునియందు ప్రవేశించడానికి సంకల్పిస్తారు. ఇదీ ఉద్ధరించేటటువంటి పద్ధతి.
''ఉద్ధరేదాత్మ నాత్మానాం ఆత్మాన మవసాదయేత్'' అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని, తనయొక్క ఆత్మ శక్తిని నీయందు ప్రేరేపిస్తారు, ఆరోపిస్తారు, అదీ సద్గురు సంకల్పమంటే. ఆ రకంగా చేయడం ద్వారా నీలో ఒక మెలకువ వస్తుంది. ఎక్కడ మేల్కొంటావూ?
''వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!'' ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. దాత అంటే ఒకడు ఇవ్వాలి, మరొకడు పుచ్చుకోవాలి. పుచ్చుకునేవాడు ఏ స్థితిలో ఉండాలి? 'సకల ముని జనానాం' మౌన వ్యాఖ్యనెరిగినవాడు, తెలుసుకోగల సమర్ధుడు ముని. అంటే మనం ఆ మౌనాన్ని ధరించినవారమై ఉండాలి. దానికోసం తపస్సు చేసేవారు. వారందరూ మునులు. భారత దేశము మునులకు స్వర్గధామం. ఎక్కడ చూసినా మునులే ఉండేవారు. కానీ ఈరోజు ప్రపంచం అంతా ఢమఢమ ధ్వనుల ఢక్కలుగానే కనపడుతున్నాయి. ఎక్కడా మౌనం కనపడటం లేదు. ఎందుకంటే బుద్ధిశక్తి లోపించి పోయింది. చెపితేనే అర్ధంకావట్లేదు. ఇంక చెప్పకపోతే ఎలా అర్థమౌతుంది? అనే దశకు వచ్చేసింది బుద్ధి. కాబట్టి ''సకల ముని జనానాం జ్ఞాన దాతార మారత్'' ఎవరికైతే ఈ ఈశ్వరీయ మౌనం యొక్క స్థితి తెలిసినటువంటి వారున్నారో, వారికి జనన మరణ రాహిత్య స్థితిని, జనన మరణ భ్రాంతి రహిత పద్ధతిని ఆ సద్గురువు మేల్కొలుపు ద్వారా ఇచ్చాడు. మేల్కొల్పు ద్వారా నిరంతరాయంగా ఇస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడాయన? 'వటమూల నివాసినే'. నీవు వటవిటపి సమీపంలోకి వెళ్ళాలి. ఒకటి చెప్పి దానికి అనుసంధానించి చెప్తున్నారు. నీవెక్కడో కొమ్మలు, రెమ్మలు పట్టుకుని ప్రపంచంలో ఆడుకుంటుంటే లాభంలేదు. ఆయనెక్కడున్నాడో వెతకాలి. ఆయన వటమూలనివాసిని. అట్టి శూన్యాతీత స్థితిలో ఉన్నటువంటి ఆయనను పట్టుకునే స్థితికి నీవు ఎదగాలి. 'వటవిటపి సమీపే' అలా సమీపానికి చేరినవాడెవరైతే ఉన్నాడో వారు ప్రబోధను పొందుతారు. ఉపనిషత్ అంటే అర్థం. 'ఉప' అంటే సమీపము. 'నిషత్' అంటే గురువును ఆశ్రయించి బోధను పొందుట. గురువును ఆశ్రయించి, పరబ్రహ్మ లక్ష్యంతో చెప్పబడ్డ ఉపనిషత్ బోధను పొందాలి.
'వటవిటపి సమీపే భూమిభాగే విషణ్ణం' అంటే, ఆయన నాశ్రయించి ద్విపుటి, త్రిపుటి లేకుండా ఉండాల. సృష్టి మొత్తంమీద ఈ రెండే సమస్యలు. వీటివల్ల ఒక బాధ కలుగుతోంది. 'విషణ్ణవదనం' బాధ, దుఃఖం కలిగినప్పుడు విషణ్ణ వదనంతో ఉంటాము. ముదిత వదనం ఉండదు. ముడుచుకుపోయి, వికాసం లేక ఉంటాడు. ఇప్పుడు వాణ్ణి ముదిత వదనం చేయాలి. (మీ సంగతి మీకు గుర్తుండే అవకాశం లేదు, మీ పిల్లల ద్వారా మీరు నేర్చుకోవాలన్నమాట.) అవస్థాక్రమంలో వాళ్ళద్వారా నీ పుట్టుకని తెలుసుకునే అవకాశం వచ్చింది. వారిద్వారా నీవు అధ్యయనాన్ని పూర్తిచేస్తున్నావు. ఇది వాళ్ళు నీకిచ్చిన అవకాశం కాబట్టి వాళ్ళే నీకు గురువు. వాళ్ళవకాశం ఇవ్వకపోతే నీకెప్పటికీ తెలిసే అవకాశం లేదు.
ఇలా విషణ్ణవదనంతో ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారిని ముదిత వదనంతో ఆశీర్వదిస్తున్నారు గురువు. 'వటవిటపి సమీపే భూమిభాగే విషణ్ణం, సకల ముని జ్ఞానానాం జ్ఞాన దాతార మారాత్' ఆ తరువాత వాళ్ళకి సంఙగా ఉంది. జ్ఞాన ప్రబోధకు సమయమాసన్నమైంది. అందరూ విషణ్ణ వదనంతో ఆశ్రయించారు, ఆయన ముదిత వదనంతో ఆశీర్వదించారు. అందుకే మెహెర్ బాబా Don’t worry, be happy, all will be well అన్నారు. ఆశ్రయించినవారు 'మా సమస్య ఒక్కటే, ఆవరణ దోషం పోవటం లేదు. ఆ ఒక్కటీ పోగొట్టుకుంటే మరల జన్మ నెత్తవలసిన అవసరము లేదు. ఆ ఒక్కటీ ఉంటే దశవిధ ప్రళయాలలో పుడుతూ పోతూ ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కటి పోగొట్టుకోవడానికి మిమ్మల్ని ఆశ్రయించాము' అని వేడుకున్నారు. అప్పుడెలా ఉందంటే, ''చిత్రం వట తరోర్మూలే, వృద్ధాశిష్యా గురుర్యువా! గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చ్ఛిన్న సంశయాః!!'' ఇలా జరిగిందట. చిత్రం అంటే ఏమిటి? చిత్తము, చిత్రము మొత్తాన్ని ఒక మాటలో చెప్పిస్తాడన్నమాట.
ముందెలా ఉంది? 'చిత్'గా ఉంది. తరువాత 'చిత్త'మయింది. తరువాత 'చిత్ర'మయింది. అంతే, అంతకు మించి ఏమీలేదు. ఇలా అవకుండా ఉంటే నీవు దక్షిణామూర్తివే. బోధ ఎలా జరిగింది? చిత్రం అని నోటితో చెప్పలేదు. 'కరకలిత చిన్ముద్ర మానంద మూర్తిం' చిన్ముద్ర చూపెట్టారు. ఆ చిన్ముద్రే దానికి సంకేతం. ''వృద్ధా శిష్యా గురుర్యువా'' - వృద్ధా అంటే బ్రహ్మ నిష్ఠులైనటువంటి వారు జ్ఞాన వృద్ధులు. ముందు చెప్పుకున్న ఆ నలుగురు ఎవరు? బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరేణ్యుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు. వారు జ్ఞాన పండితులు. అటువంటి బ్రహ్మనిష్ఠులను 'వృద్ధా' అనే శబ్దంతో చెప్తున్నారు. 'చిత్రం వట.. గురుర్యవా' 'యవా' .. ఉపనయన కాలంలో యవలు అనే ధాన్యం తెస్తారు. అవి తడిపి మట్టిలో వేస్తే, ఒక పగలు, ఒక రాత్రి గడచేప్పటికి ఒక సూర్యోదయం నుండి మరొక సూర్యోదయం లోపుగా అవి మొలకెత్తుతాయి.
వాటి విశేషం అది. ఎందుకు అవే వాడతారు? కర్మ మార్గంలో చేయబడేవన్నీ కూడ జ్ఞాన లక్ష్యంతోనే పెట్టబడతాయి. అలాగే చనిపోయిన తరువాత కూడ శిలా న్యాసము అంటారు. ఒక రాయి కడతారు, రోజూ దానిమీద నీళ్ళు పోస్తూ ఉంటారు. క్రిందేమో 'యవలు' పెడతారు. యవలు ఓ మూకుడులో మట్టిలో పెడతారు. ఎన్ని నీళ్ళు పడ్డా ఆ శిలేమీ మారదు. క్రింద యవలు మాత్రం మొలక వస్తాయి. ఇలాంటి విధి విధానాలు మన వైదిక కర్మలో ఉన్నాయి. వీటియొక్క బోధ ఏమిటంటే బ్రహ్మ గారి ఒక్క రోజులో సృష్టి మారిపోయింది. నీ కాలంలో ఒకరోజు కాదది, బ్రహ్మ గారి ఒక రోజని చెప్పటం అది. బ్రహ్మ గారి ఒక పగలు, ఒక రాత్రి ఎంత అంటే బ్రహ్మాండ పురాణం చదవాలి. 'వర్షిష్టాంతే వ సదృషి గణై రావృతం బ్రహ్మనిష్ఠైః' - ఆశ్రయించిన వారంతా ఎవరిప్పుడు? బ్రహ్మనిష్ఠులు. వీరికి బ్రహ్మ గారి కాల విశేషమంతా తెలుసు.
''చిత్రంవట.. గురుర్యువా'' - ఆ శబ్దం ఎందుకు వేసారంటే ఆ బోధించేవారు కాలాతీతులు, దక్షిణామూర్తి. యువ అన్న శబ్దం వేయటంలో ఉద్దేశ్యం అదే. బ్రహ్మగారి యొక్క పరిణామ కాలాన్ని దాటినటువంటివాడు అని అర్ధం.
బ్రహ్మ గారికి కూడ సృష్టి, స్థితి, లయలు ఒక కాలంలో ఉన్నాయి. ఆ కాల ప్రమాణానికి అవతల ఉన్నవాడు అని సూచించటం 'యువానం'. కాలాతీతమైనవాడు కాలానికి లోబడి ఉన్న వారిని బట్టి బోధిస్తున్నాడు. కాలమనే ఆవరణను దాటటం ఎలా?
''మౌనవ్యాఖ్య... యువానం'' అక్కడ కూడ యువానమే వేశారు. ఇక్కడ ''చిత్రం... గురుర్యువా'' అన్నారు. మౌన వ్యాఖ్యానంతో చ్ఛిన్న సంశయః. అలా ఆయన చిన్ముద్రని చూపగానే శిష్యులందరిలో కూడ శూన్యము, సర్వము యొక్క మర్మము విడింది.
కాలము యందు శూన్య సర్వములు ఎట్లా ఉత్పన్నమౌతున్నాయో. ఎలా లేకుండా పోతున్నాయో తెలియబడి, కాలాతీతులైనవారు అని చెప్పటం. ఇది చిత్రమట. చిత్రములలో కెల్లా విచిత్రమేమిటట? ఇదీ ఆయనేం చెప్పలేదు. వీళ్ళేమీ వినలేదు. చూపెట్టారు, వీరికి అర్థమైపోయింది. ఆయన సూచించారు, వీళ్ళు అధిగమించారు. ఇంతకంటే చిత్రమేదియునూ లేదయ్యా!
''చిత్రం వటతరోర్మూలే.. చ్ఛిన్న సంశయః'' భూమండలం మీద ఏమి చూసినా ఏమీ చిత్రం కాదు.
చిత్రం ఒక్కటే ''చిత్రం... గురుర్యువా'' అదే అన్నింటి కంటే చిత్రం. చిత్రములలో కెల్లా చిత్రమేమిటంటే, గురువు మౌనవ్యాఖ్య ద్వారా బోధిస్తే శిష్యులకు అర్థమైపోవడం. 'నిధయే సర్వ విద్యానాం, భిషజే భవరోగిణాం!', 'ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే! నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః!!'
ఆయనిప్పుడు దక్షిణామూర్తి యొక్క విశేషం చెబుతున్నారు. 'నిధయే సర్వ విద్యానాం' - విద్యలన్నీ కూడ ఆయనను ఆశ్రయించియే ఉన్నాయి. విద్య అంటే ఏమిటి? 'విద్' అనే ధాతువు నుండి వచ్చింది విద్య. విద్ అంటే ప్రకాశం. 'నిధయే సర్వ విద్యానాం' - సర్వ అంటే అన్నీ అనేది సామాన్యార్థం. విశేషార్థం ఏమిటంటే శూన్యమూ సర్వమూ ఒక్కటే. సర్వమూ ప్రకాశం మీదే ఆధారపడి ఉంది.
ప్రకాశము యొక్క మూలకము పరబ్రహ్మ ము. ప్రకాశమనే మూలకం లేక అనంత విశ్వం లేదు.
మనం కూడ విచారణ చేసే విజ్ఞాన శాస్త్రంలో ఏమి తేల్చాము. మూడే ఉన్నాయి. ఏమిటవి ? ఫోటాను, రెజోనెన్స్. అంతరిక్షంలో ఏముంది? రెజోనెన్స్ వుంది, ఫోటానుంది. ఇంకేముంది? స్పేస్ ఉంది. ఈ మూడూ కూడా ఒక టైం స్కేల్‌లో నాన్ రియాక్టెంట్‌గా వున్నవి. అప్పుడు కాలాతీతంగా వున్నాయి. మూడూ విడివిడిగా వున్నాయి. మూడింటికి ఉనికి లేదు. మూడింటికి రియాక్షన్ లేదు. ఒక టైం స్కేల్‌లో ఏమైనాయి? రియాక్టెంట్‌గా మారినాయి. ఒకదానితో ఒకటి సంయోజనం, వియోజనం పొందటం ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన స్థానం పేరు నాదము. ఆ ప్రారంభమైన స్థానం పేరు బిందువు. ఆ ప్రారంభమైన స్థానం పేరు ఆత్మ. స్థితి పేరు ఆత్మ. పరమాత్మ. అన్నీ అదే. అక్షరుడు అన్నాం అందుకే దానిని. దాని అవతల ఏముందయ్యా? అది ముందే చెప్పాం కదా! శూన్యాతీతము, కాలాతీతము.. అంటున్నామా లేదా? అదే పరబ్రహ్మము. దాని అవతల ఏముందయ్యా? ఏమీలేదు. నువ్వు కూడా లేవు. నేను జీవాత్మ, నేను పరమాత్మ అంటున్న 'నేను', దాని అవతల లేదు. అది పరాత్పరము. అది బయలు.
ఈ రకంగా తత్వౖ విజ్ఞానం క్రమమైనటువంటి విధానంలో ఆ చివరి మెట్లదాకా ఎక్కింది. కాబట్టి 'నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం'. ఆయన వలన నీకు ఏమిటయ్యా ప్రయోజనం? ఒకటే ప్రయోజనం భవరోగం ఒక్కటే పోతుంది. ఇంకేం పోదు. భవరోగం చేత నేను బాధించబడుతున్నాను అనేటటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మాత్రమే పనికొచ్చేటువంటి వైద్యుడాయన.
ప్రారబ్ధ కర్మను తొలగించుకోవాలంటే, నావల్ల నీకు ఏం ప్రయోజనం లేదు అంటాడు. అంతే! ఎందుకని? వాడు 'వటమూల నివాశినే' దగ్గరకు వెళ్ళలేడు కదా! వటవిటపి సమీపం చేరలేడు కదా! కాబట్టి ఎవరైతే జీవన్ముక్తులై, బ్రహ్మనిష్ఠులై ఉండి చిట్టచివరి మజిలీ అయినటువంటి దివ్య స్థితిని పొందడానికి సిద్ధంగా వుంటారో వారికి విశేషించి దక్షిణామూర్తి చేస్తున్నటువంటి చిట్టచివరి బోధన్నమాట. కాబట్టి 'నిధయే సర్వ విద్యానాం భిషజే భవ రోగిణాం ఓం నమః ప్రణవార్థాయా శుద్ధజ్ఞానైక మూర్తయే' శుద్ధజ్ఞానం అంటే ఎఱుక అనే మాలిన్యం చేత జ్ఞానం మలిన పడిందట. ఆ ఎఱుకని విడిపించాడు. అది శుద్ధజ్ఞానం. అలా అటువంటి ఎఱుక లేనటువంటి స్థితిని మూర్తిమంతంగా నువ్వు గనుక చూచినట్లయితే అది ఎవరయ్యా? దక్షిణామూర్తి.
''ఓం నమః ప్రణవార్థాయా'' ప్రణవానికి ఆది స్థితికంటే ముందున్నటువంటి వాడెవ్వడో అతడు దక్షిణామూర్తి.
ప్రణవం కంటే తరువాత వచ్చినటువంటిదంతా బోధించేవాడు కాదు. ప్రణవానికి వెనుకున్నటువంటి స్థితిని తెలియజెప్పేవాడు ఎవడో అతడు దేశికుడు. అతడు దేశికేంద్రుడు. అతడు సద్గురుమూర్తి. అతడు దక్షిణామూర్తి. 'ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ'.. నిర్మలాయ అంటే?
మల, విక్షేప, ఆవరణ దోషములనేటటువంటి త్రిపుటి బ్రహ్మనిష్ఠ వరకే చెబుతాం. ఎవరికైతే ఈ మల, విక్షేప ఆవరణలనే త్రివిధ దోషములు పోయినవాళ్ళు ఉంటారో వాళ్ళు బ్రహ్మ నిష్ఠులు. ప్రతిరోజూ మీరు పూజ చేసేటప్పుడు కూడా.. నిన్న పూజ చేసినటువంటి దానిని నేడు తీసివేస్తామా? లేదా? నైర్మాలిన్యము అంటారు దానిని. ఆ నిర్మల స్థితిని సాధించకుండా నువ్వు పూజించకూడదు అని అర్థం. నీ లక్ష్యం ఏమిటి? నీ పూజకు లక్ష్యం ఏమిటి? నిర్మల స్థితి. మల విక్షేప ఆవరణ దోషములు లేని స్థితిని పొందాలి. అదే అభయస్థితి. అయితే ఇక్కడ చెప్పేటటువంటిది ఏమిటట? అన్ని మాలిన్యములూ, మల విక్షేప ఆవరణ దోషములు ఏ ఎఱుక చేతైతే ఏర్పడు తున్నాయో, ఆ ఎఱుక లేనివాడు ఎవడో వాడు నిర్మలుడు. కాబట్టి దక్షిణామూర్తి ఎవరటా? 'నిర్మలాయ, ప్రశాంతాయా దక్షిణామూర్తయే నమః' . 'ప్రశాంతి నిలయం' అని పేరు పెట్టుకుంటున్నారా లేదా ఇంటికి? కానీ లోపలకి వెళ్ళి చూస్తే ఏముంటుంది? అశాంతి ఉంటుంది. ఎందుకని? ఎఱుక అనే మాలిన్యాన్ని దాటినటువంటి వాడికే ఈ ప్రశాంతి అనేటటువంటి స్థితి తెలుస్తుంది.
శాంతి, ఉపశాంతి, ప్రశాంతి. కాబట్టి ప్రశాంతి అంటే ప్రకృష్ఠమైనటు వంటి శాంతి. ఇక ఆ శాంతం చెదరదన్నమాట. ఎందుకని? నిర్మల స్థితిలో ఎఱుకను మీరిపోయాడు కాబట్టి శుద్ధ జ్ఞానైక స్వరూపుడు కాబట్టి. ఈ రకంగా దక్షిణామూర్తిని మనం తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఆశ్రయించాలి. ఐక్యతా సిద్ధిని సాధించాలి.
''చిత్ఘనాయ మహేశాయ, వటమూల నివాసినే! సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః!!''
ఆయన ఇంకా చిత్ ఘనంగా ఉన్నారట. ఘనము అంటే కదలనిది అని అర్థం. (పదార్థానికుండే వాయు, ద్రవ, ఘన స్థితులను గురించి కాదు చెప్పేది.) కొండ కదలదు, ఘనం, అచలం. కాబట్టి ఘనం అనే పదానికి కదలదు అనే అర్థం ఉంది. అక్కడ కదలదు అనే పద్ధతిలో ఆ పదాన్ని వేశారు. చిత్ ఘనము అంటే? తనకు తానుగా కదిలే స్వభావమున్నది చిత్. తనకు తానుగా కదలనిదేదో అది ఘనం. రెంటినీ చెప్పారు. ఎలా సాధ్యం అనిపిస్తుంది మనకు?.బోధించేవన్నీ బుద్ధి ప్రమాణంతో విచారణ చేస్తే సాధ్యం. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని అసాధ్యమైన వాటిని ఒక్కటిగా చేసి చూస్తే అవే అసాధ్యాలను ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే అవన్నీ తత్త్వ విజ్ఞానములో ఉంటాయి. ఇది తెలుసుకోవాలంటే ఓ సూత్రాన్ని పట్టుకోవాలి.
''తనకు తా కదలడట పరమ శివుడు. తా కదిలెడిది మాయ యట''.
దానినే ఇక్కడ సంస్కృతంలో వేశారు. 'చిత్ ఘనము'. ఎవరైతే ఈ రహస్యాన్ని పట్టుకోగలిగారో, వారికి గురుబోధ ద్వారా, గురువు యొక్క సూచన ద్వారా ఏమి తెలిసిందంటే, కదలనిది ఎప్పటికీ కదలడం లేదు. అంతరిక్షం కదలడం లేదు. విశ్వము కదలకుండా ఉండటము లేదు. అంతరిక్షమూ, విశ్వమూ రెండూ ఒకేచోట ఉన్నాయిప్పుడు. అంతరిక్షం విశ్వమంతా వ్యాపించి ఉంది. ముల్లు గ్రుచ్చ సందులేక ఉంది. కదిలే విశ్వం మాత్రం పరిమితంగా ఉంది. కాబట్టి బింబ ప్రతిబింబ న్యాయం ద్వారా అనంత విశ్వాన్ని, అఖండ ఎరుకని తెలుసుకోగలుగుతామేమో కాని, బయలును తెలుసుకోలేవు. ఎందుకంటే అక్కడ బింబ ప్రతిబింబ న్యాయం సమర్ధనీయం కాదు. ముల్లు గ్రుచ్చ సందులేక యున్నది అంతరిక్షం. అది కదలదు. ''తా కదలడట పరమ శివుడు, కదిలెడిది మాయ యట''. అనంత విశ్వం కదలకుండా ఉండలేదు. రెండూ ఓ చోటే ఉన్నాయి. ఘటము వేరుగా, ఆకాశము వేరుగా ఉన్నాయా? ఘటము లోపల ఉన్న ఆకాశము కదులుతున్నట్లుగా కనబడుతోందట. ఘటము బయట ఉన్న ఆకాశము కదలకుండా ఉందట.
ఘటమునకు ఉండటం లేకపోవడం అనేది సాధ్యం కావచ్చేమో కాని, ఆకాశం మాత్రం ఎప్పుడూ ఉంది. అలాగే బయలు ఎప్పుడూ ఉంది.
విశ్వానికి రాకడ, పోకడ ఉండవచ్చు గాని, బయలు ఎల్లకాలము, సర్వకాలము ఒక్క తీరుగా ఉంది. పరబ్రహ్మము ఎల్లకాలము ఒక్క తీరుగా ఉంది. కాలాతీతమైనటువంటిది ఎల్లప్పుడు ఒక్క తీరుగానే ఉన్నది.
'చిత్ ఘనాయ మహేశాయ...' రెండు సూచనలు ఒకే చోట చెప్పారు. ఒకటి ఆ చివరి సూచన. ఒకటి ఈ చివరి సూచన.
అణువు నుండి మహత్తు వరకు, బ్రహ్మ నిష్ఠ వరకు ఇదొక క్రమం. జీవుడిగా చూస్తే బ్రహ్మము కదలకుండానే ఉన్నది. బ్రహ్మముగా చూస్తే బయలు కదలకుండా ఉన్నది.
'చిత్ ఘనాయ... వటమూల నివాసినే' మరల వటమూలం వద్దకే వచ్చాడు. ఎందుకలా చెప్తున్నారంటే ఆ మఱ్ఱి వృక్షం ఎంత బలంగా ఉందో, ఆ ఎరుక అంత బలంగా ఉందిట. ఈ అఖండ ఎరుకకి ఆ మఱ్ఱి చెట్టు గుర్తన్నమాట.
సంఙారూపకమైన బోధ. నామరూపాలతో కూడిన నేను ఫలానా అనేది వటవృక్షమంత బలంగా ఉందంటున్నారు. ఇంకో పేరుపెట్టి పిలిస్తే వారు పలకరు. వటవృక్షమంత బలంగా ఉన్నాయి, నామరూపాలు. కాబట్టి మనం ఏంచేయాలి? వట వృక్షాన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే సద్గురు దర్శనాన్ని పొందుతావు.
''చిత్ ఘనాయ మహేశాయ వటమూల నివాసినే, సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః'' ఏమిటి ఆయన రూపం? సచ్చిదానందం. ఈ పద్ధతిలో నామరూపాలను విడిచిపెట్టి సచ్చిదానందాన్ని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించిన నీవు బ్రహ్మనిష్ఠుడవు. ఆ తరువాత ఆ సచ్చిదానందమనే ఆవరణను తొలగించుకొని సత్ చిత్ ఆనందమైన పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. అలా పొందిన చిత్ కాస్తా జ్ఞానంగా, జ్ఞానానందంగా మారింది. ఈ సత్‌చిత్ జ్ఞానానందమైనటువంటి పరబ్రహ్మ యందు ఎరుక లేదు. ఆ ఎరుక లేని స్థితిలో నీవు బయలును దర్శించి, బయలుగా ఉండిపోయావు. పరాత్పరముగా ఉండిపోయావు. 'తత్ పరంచావలోకయేత్'గా ఉండిపోయావు.
తాను లేనివాడిగా, నేను లేని వాడవుగా ఉన్నావు, 'నాహం'గా ఉంది అనే మాటలన్నీ ఒకే పదంలో సూచించారు.
'చిత్ ఘనాయ మహేశాయ.. దక్షిణామూర్తయే నమః'' నమః అంటే ..
మంత్రములు త్రివిధములు:
1. ఉచ్ఛారణ
2. ధారణ
3. మోహన మంత్రములు
2. ధారణ
3. మోహన మంత్రములు
ఈ నమః అనే శబ్దంతో సంపుటీకరించబడిన వాటన్నింటిని మోహన మంత్రములు అని చెబుతారు. అంటే నీకు నేను వశవర్తినై ఉంటానని చెప్పటం.
ఈ స్తోత్రంలో మనం దక్షిణామూర్తయే నమః అంటున్నాం. ఆ దక్షిణామూర్తికి వశవర్తినై ఉంటాను అంటున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా, జనన మరణాలతో సహా నీ వశవర్తినై నేనుంటాను అని.
అంటే ఇక నా నిర్ణయం లేదు. నా యిచ్ఛ, నిర్ణయాలనేవి వదిలేశాను. నమః అంటే యిచ్ఛా నిర్ణయములు వదలివేయుట. ఎవరికి వదలాలి? లేనెరుక పద్దతిగా ఉన్న దేశికేంద్రునికి వదిలేయాలి. ఎందుకంటే వారు ఇచ్ఛా నిర్ణయాలు లేకుండా ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇచ్ఛా నిర్ణయాలు లేక ఉన్నారో వారు దేశికేంద్రులు. వారు సద్గురుమూర్తి. వారు దక్షిణామూర్తి. వారు ఎట్లా ఉన్నారో చూసి, అనుసరించి, గ్రహించి పొందాలి. ఎలా? అందువల్లనే పునః పునః ''వటమూల నివాసినే'', ''వటవిటపి సమీపే'' అంటున్నారు. కాబట్టి వేరే మార్గం లేదు.
చూచుట, అనుసరించుట, గ్రహించుట. ఇవే ఎవరైనా చేయవలసినది. మా గురువును నేను ఆశ్రయించి చాలాకాలం వెళ్ళినప్పుడు, రోజూ మౌనంగానే ఉంటూ, ప్రక్కవారు ఏమైనా అతనికి చెప్పవచ్చు కదా అని అంటూంటే, చివరకు ఓరోజు, ''ఏమిటి చెప్పేది, చూసి నేర్చుకోమని'' చెప్పారు.
చూడటం, నేర్చుకోవటం ఇది మొదటి పాఠం అయిపోయింది. అసలు చేయాల్సినవి ఏం చెప్పారు? చూడటం, అనుసరించటం, గ్రహించడం. ఇవి చేస్తే పాఠం పూర్తయిపోతుంది. కాబట్టి మొదటి పాఠం చెప్పారు, ఇక నేనేం చేయాలి? ఇక అప్పటినుండి పరిశీలనగా చూడటం మొదలుపెట్టడమైంది. అప్పుడు మాత్రమే అన్యోన్య దర్శనం ప్రారంభమైంది. అప్పటివరకు వట్టి దర్శనమే, దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి ఈ సృష్టి మొత్తం మీద ఏది జరిగినా కూడ అదంతా ఖండ ఎరుకలో భాగమే. అన్ని కదలికలూ అఖండ ఎరుకలో భాగమే. ఏ కదలికా లేనటువంటిది బయలు, అచలం, అంతరిక్షం. ఏ పేరు పెట్టినా ఒకటే. నామరూపాలు మనం పెట్టుకున్నవి. దానికి లేవు. కాబట్టి 'చిత్ ఘనాయ మహేశాయ, వటమూల నివాసినే! సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః'
రెండో పాఠం 'నమః'. 'నమశ్శివాయ' అంటే ఏమిటి అన్నారు? సాధారణంగా నమశ్శివాయ అంటే పంచాక్షరీ మంత్రమని చెప్తాం.
శివునికి వశవర్తినై ఉండటం నమశ్శివాయ. అంతేకదా! ఎందుకంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంటే ఒక చీమ కదలాలన్నా సరే, ఆ మహేశ్వరుని అనుమతి లేనిదే కదలదు. కాబట్టి ''నీవు అలా ఉన్నావా'' అన్నారు. ఇది రెండవ పాఠం.
మొదటిది చూసి నేర్చుకోమని, రెండవది నీవలా ఉండు అని. అలా ఉండమంటే అనుసరించటం. కాబట్టి రెండవ పాఠం అనుసరించటం. అప్పటినుండి ఒక నియమం పెట్టుకోవడమైంది. ఏదైనా సరే శివుడాజ్ఞ అయితేనే ఆచరించటం, లేకపోతే మానెయ్యటం. శివుడాజ్ఞ నాకు తెలిస్తేనే చేస్తా, లేకపోతే నేను చేయను అని నియమం పెట్టుకోవడమైంది. ఆ రకంగా మాట ఒక్కటే అయినప్పటికి కూడ అది ఎంతో విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది.
దేశికేంద్రుల యొక్క ప్రతిమాట అత్యంత విలువైనదిగా భావించి, ఆ ఐక్యతా సిద్ధిని పొందాలి.
మూడవ ఉపదేశం - 'గ్రహించాలి'. గ్రహించాలంటే ఏం చేయాలి? నీవు, నేను వేరుగా ఉన్నంతసేపుగా నీవెప్పటికీ తెలుసుకోలేవు.
''స్వాత్మానమేవాద్వయం..'' ఈ ఆది శంకర స్తోత్రాలే వల్లె వేస్తుంటే, అదేమిటి అని అడిగారు. 'స్వాత్మానమేవాద్వయం' అని చెప్పడమైంది. అంటే ఏమిటి అని అడిగారు. వేరుగా లేకుండుట. మరి నీవలా ఉన్నావా? అని అడిగారు. దానితో 3వ ఉపదేశం పూర్తయింది.
కాబట్టి ఇప్పుడు ఏం సాధించమన్నారు? గురుశిష్య ఐక్యతా సిద్ధి ద్వారా నీవు గ్రహించాలి. లేకపోతే ఎప్పటికీ గ్రహించలేవు.
కాబట్టి చూచుట, అనుసరించుట, గ్రహించుట ఇదే ఉపనిషత్ అంటే అర్థం. ఆ రకంగా ఉపదేశత్రయం, దీక్షాత్రయం పూర్తయింది. ఈ విధానంలో నేను ప్రయాణించాను. గురువు ఈశ్వరీయమౌనం నుండి బయటకు వస్తున్న, వ్యక్త స్థితిలో వారిని ఆశ్రయించడమైనది. ఆ దశలోనుండి వచ్చిన ఈ మూడు మాటలే మంత్రత్రయం, దీక్షాత్రయం అయినవి. ఆ సిద్ధి కల్గినది.
''చిత్ ఘనాయ... దక్షిణామూర్తయే నమః'' ఎవరైతే ఈ దక్షిణామూర్తయే నమః అన్న స్థితిలో లయించి, ఏకత్వ స్థితిని, ఆ ఐక్యతా సిద్ధిని పొందుతారో వారికి, ఆ నమః స్థితిలో వేరుగా లేరు.
అలా వారు ప్రక్కన కూర్చుంటే, ఏదైనా చెప్పగల సమర్ధత వచ్చేసింది. అప్పటికి ఏ శాస్త్రాలూ చదువుకోలేదు, ఏదీ సాంగంగా అధ్యయనం చేయలేదు. ఎవరివద్దా శుశ్రూషలు చేయలేదు. కానీ వారి ప్రక్కన కూర్చొని ఆ ఐక్యతా సిద్ధి అనే పట్టుకొమ్మను మాత్రమే పట్టుకొని ఉండటం అయ్యేది. అప్పుడు గురువు, వారేదో అడుగుతున్నారు. అష్టావక్ర గీత చెప్పమనో, లేక వేదాంత పంచదశి బోధించమనో, అచల సిద్ధాంతం వివరించమనో అంటే, వారి ఆజ్ఞ అయితే చాలు, ధారాళంగా, ప్రవాహంగా వచ్చేసేది బోధ.
ఎందుకని? 'నిధయే సర్వ విద్యానాం'. ఈ విద్య, ఆ విద్య అనేది లేదు. ఏ విద్యయినా సరే వారి అంతరంగంలో ప్రవేశించటం ద్వారా వారిలో ఉన్న చైతన్యం, మనలో ఉన్న చైతన్యం వేరుగా లేదు. ఆ చైతన్య స్థితిలో ఐక్యతా సిద్ధిని పొందటం ద్వారా, వారిలో ప్రవేశించి పనిచేయడం అనేది సిద్ధించింది. కాబట్టి దేశికేంద్రుడైనటువంటి వాడు ఎలా బోధిస్తాడయ్యా అంటే ఏనుగు గుడారంలోకి ప్రవేశించినట్లుగా నీ హృదయంలో ప్రవేశిస్తారు. ప్రవేశింగానే నీవు కూడ ఆయన ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిని అనుభూతి చెందే స్థితికి ఎదిగావు. అనుభూతి చెందావు, మేలుకొన్నావు. ఇదీ దక్షిణామూర్తి పద్ధతంటే.
''ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే! వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః!!'' ముఖ్యమైన శ్లోకమిది.
'ఈశ్వరో గురురాత్మేతి' కాబట్టి గురువులందరికీ ఆత్మ స్వరూపుడెవరు? ఈశ్వరుడు. రూపభేదములు గురువుకు లేవు.
నీవు శరీరాన్ని పట్టుకున్నావా! లేక దక్షిణామూర్తిని పట్టుకున్నావా అనేది ముఖ్యం.
నీవు నామరూపాలతో ఉన్నావు కాబట్టి గురువును కూడ నామరూపాలతో భావించి, ఆ నామరూపాలనే పట్టుకున్నావు. అలా పట్టుకుంటే ప్రయోజనము సిద్ధించదు అని స్పష్టంగా చెప్తున్నారీ శ్లోకంలో. ''ఈశ్వరో గురురాత్మేతి...'' మూర్తివంతమైనటువంటి భేదములతో చూడరాదు, వివరించరాదు. విభజించుటకు వీలు లేనిది ఏదో అదే గురువంటే. అవిభాజ్యం ఏదైతే ఉందో దాని పేరే ఈశ్వరుడు.
ఎందుకని? ''వ్యోమవత్ వ్యాప్తదేహాయ...'' ఆయన వ్యోమంగా వ్యాపించి ఉన్నాడు. వ్యోమం అంటే అంతరిక్షం, బయలు.
ఏ అంతరిక్షమైతే, ఏ బయలైతే ములు గ్రుచ్చ సందు లేక వ్యాపకమై ఉన్నదో అట్టి బయలునందు ఉన్న విశ్వం ఎంత? ఒక బిందువుగా ఉన్నది, ఒక ఘటముగా ఉన్నది. మరల ఆ విశ్వంలో నీదాకా వచ్చావు, అన్నీ బిందువులే. బిందువులన్నీ కలిపితే ఒక సింధువు, సముద్రం. కానీ అంతరిక్షం అనే బయలులో ఈ సముద్రమెంత? మరల ఒక బిందువు. అలాగే ప్రకాశములు వెదజల్లుతున్నటువంటి సమస్తము, ఈ విశ్వంలో ప్రకాశిస్తున్నట్లుగా కనపడుదున్నదంతా కలిపితే ఏమైంది? ఒక 'ప్రకాశబిందు'వయింది. అలాగే దాని చుట్టూ వ్యాపించి యున్న చీకటి ఉంది. చీకటి ఉండబట్టే ప్రకాశం, ప్రకాశం ఉండబట్టే చీకటి.
ఆ చీకటంతా ఏమిటి? అది 'విమర్శ బిందువు'. ఈ ప్రకాశ బిందువు, ఆ విమర్శ బిందువు కలిస్తే ''సంవిద్ బిందువు''. ఇదే బిందు త్రయమంటే. ఇదే ప్రథమ త్రిపుటంటే.
నాదబిందు కళలతో బిందుత్రయం ఏర్పడినాకే బిందు మధ్యమునందు నాదమేర్పడింది. ఈ రకంగా నాదబిందు కళల ద్వారా ఇది వ్యక్తమైంది, అదే వ్యోమము.
''వ్యోమవత్ వ్యాప్తదేహాయ'' ఆ దక్షిణామూర్తియైన గురువు ఎటువంటివారు? ఆయన ఆ వ్యోమమే, ఆ బయలే, ఆ పర బ్రహ్మమే, ఆ పర శివుడే. అందుకని మూర్తిమంతముగా దక్షిణామూర్తిని చిత్రించవలసి వచ్చినప్పుడు శివుడనే ఆకార రూపంతో చిత్రించటం అలవాటైంది.
నిజానికి ఆయన రూపం ఎటువంటిదటా? ''వ్యోమవత్... దక్షిణామూర్తయే నమః'' మరల నమః అంటున్నారు. ఇపుడెవరికి వశవర్తియై ఉండాలి? దక్షిణామూర్తికి. ఆ అంతరిక్షం వలె ఉండాలి, ఆ వ్యోమము వలే ఉండాలి.
''బ్రహ్మానందం పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం! ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం''
గగన సదృశం అన్నారు ఇక్కడ కూడ. గగనం అంటే వ్యోమం.
కాబట్టి తత్త్వ జ్ఞానంలో ఎంతో విశేషమైన, ముఖ్యమైన సూచన ఇది.
''ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే! వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః!!''
ఈ స్థితులకు సంబంధించిన బోధ అర్థరాత్రి సమయంలోనే బోధించాలి. ఎవరైతే నిద్రను జయించే సమర్ధత కలిగిన ఉన్నారో వారే అధికారులు ఈ బోధ వినుటకు.
కాబట్టి తురీయనిష్ఠ కలిగిన వారికి మాత్రమే ఈ పరబ్రహ్మ నిర్ణయ విధానాన్ని, ఈ అఖండ ఎరుక లేని పద్ధతిని అందించడానికి వీలవుతుంది.
కాబట్టి అధికారిత్వాన్ని పొందాలంటే అవస్థాత్రయాన్ని దాటాలి. అలా అవస్థాత్రయాన్ని దాటిన బ్రహ్మనిష్ఠులెవరైతే ఉన్నారో వారే అధికారులు. అందువల్లనే ఈ సమయంలో బోధించడం, అర్థరాత్రి సమయంలో బోధించడం.
ఏ విషయం లేకుండా నిర్విషయంగా ఉండాలి. ప్రతిరోజూ నిద్రావస్థని నిర్విషయంగా ఆచరించగలిగే సమర్ధుడవాలి.
నిజానికి సరియైన సత్ సాంప్రదాయక ఆరాధనా విధి విధానమేమంటే సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 8 గంటల వరకు ఆరాధనా విధి జరిగి 8 గంటల నుండి 10 గంటల వరకు బోధ. తరువాత ఉపాహారం బ్రేక్. మరల 11-30 నుండి సమాధి నిష్ఠలో కూర్చుంటే, గురువుగారు తెల్లవారు ఝామున 3-30 గంటల వరకు సమాధి స్థితిలో ఉంటారు.
ఆ సమయంలో శిష్యులంతా తత్త్వాలు పాడుతూ ఉంటారు. గురుగీతకు సంబంధించిన తత్వాలు గానీ, తారకామృత సారము కానీ, ఈ రకంగా రకరకాలైన సాంఖ్య, తారక, అమనస్క పద్ధతికి సంబంధించి, బోధనావిధిలో గీతాలు ఆలపిస్తూ ఉంటారు.
గురువుగారు సమాధి నిష్ఠనుండి 3-30 గంటలకు బయటకు వచ్చిన తరువాత హస్తమస్తక సంయోగ దీక్షద్వారా ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇస్తారు. ఈ ఆశీర్వచనం ద్వారా గురుశిష్య అన్యోన్య దర్శనం జరుగుతుంది. ఇది పూర్తయ్యే సరికి తెల్లవారుఝామున 5-30 అవుతుంది.
అప్పుడు శిష్యులందర్నీ బయటకు తీసుకు వస్తారు. అప్పుడు ఏకకాలంలో ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు దర్శనమిస్తారు పౌర్ణమినాడు. ఇది కూడ ఒక సంఙా రూపకమైనటువంటి బోధ. గురువు ఎలా ఉన్నారట? సూర్యుని యొక్క వెలుగులో కనపడీ కనపడకుండా ఉన్నటువంటి చంద్రునివలె ఉన్నాడు.
ఇక్కడ సూర్యచంద్రులను బింబ ప్రతిబింబ న్యాయముతో చూడటంలేదు. లేని ఎరుకకు గుర్తు చంద్రుడు ఒకడు. అఖండ ఎరుకకి గుర్తు సూర్యుడు. అది గుర్తుగా చూపెట్టడం కోసమే పౌర్ణమి రోజు రాత్రంతా ఈ రకమైన బోధ, సమాధి నిష్ఠ, మంత్రత్రయ దీక్ష.
అవస్థాత్రయం దాటినటువంటి తురీయనిష్ఠ కలుగజేసి, అక్కడి నుండి తెల్లవారే సమయానికల్లా, ఎరుక మీరినటువంటి, ఆ కనపడీ కనపడకుండా ఉన్నటువంటి ఆ చంద్రునివలె నీవుండాలి అనే నిర్ణయాన్ని నీకు దర్శనంగా చూపుతారు.
ఇదే అచలంలో, ''బట్టబయలును గురుడు చూపిన నట్టులేకను పుడమి యందున, పట్టు వదలక, గుట్టు మరువక దిట్టమై పోవే'' అని ఒక సూచన ఉంది.