7

7వ శ్లోకం

        బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి,
      వ్యావృత్తా స్వను వర్తమానం అహమిత్యంతః స్ఫురంతం సదా |
      స్వాత్మానం ప్రకటీ కరోతి భజతాం యో భద్రయా ముద్రయా
      తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

        మన ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది? ఇదంతా ఒక ప్రయాణం అన్నమాట. అవతార్‌ మెహెర్‌బాబా చెప్పారు. 'పరాత్పర పరబ్రహ్మ స్థితినుంచి చైతన్య వికాసం జరిగింది'.

        ఆ పరాత్పర పరబ్రహ్మ నుంచి చైతన్య వికాసం జరిగీ జరిగీ, చైతన్య వ్యావర్తనం జరిగీ జరిగీ మానవ ఉపాధికి వచ్చింది. వచ్చాక మరల ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి చేరాలి. ఈ చేరడం అనేది చాలా ముఖ్యం. ఈ చేరవలసిన ప్రయాణం తెలియాలి అంటే, మొట్టమొదట ఎలా వచ్చిందో తెలియాలి.

        ఇపుడు మనం దానిని గురించి తెలుసుకుంటున్నాం. అనంత విశ్వం యొక్క ప్రాదుర్భావ స్థితులు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? పిండాండం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? వీటిని ఒకేసారి ప్రతి పద్యంలోనూ వివరిస్తున్నారు. ప్రతి పద్యంలో కూడాను పిండాండ స్థితిలో ఎలా ఉంది అనేది వివరించి, ఇవేవీ నీవు కాదని అంటున్నారు.

        నిర్ణయం అవ్వాలి. కనుక ఇవేవీ నేను కాదు అనే నిర్ణయాన్ని పొందగలిగేటటువంటి స్థితికి చేరాలి. కారణం ఏమిటి?

ద్వాదశియైన 'ఈ ఉత్త బట్టబయలు ఏమీలేదు'.
అదే సంస్కృతంలో  'ఏతన్మిధ్యా శుద్ధ వియత్క్ంచిన్నాస్తి'

షోడశి : 'ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీలేదు'
'నిర్మూలమే తథా జ్ఞానాచ్చరీరం నాస్తి కేవలం’

        కాబట్టి మానవుడు ఈ రెండు నిర్ణయాలను ప్రబోధ ద్వారా పొందాలి. అందుకని వార్తీక పద్ధతిలో ప్రబోధ అనేది మాత్రమే ఉంటుంది.

        'వివేక చూడామణి' అని ఆదిశంకరులు ఎలా అయితే బోధించారో అలాగే 'ప్రబోధ చూడామణి' అని ఇంకొకటి ఉన్నది. ఈ ప్రబోధ చూడామణి అనేది వార్తీక విద్యకి ఆధారభూతమైనది. ఇట్లా బృహద్వాశిష్ఠ పద్ధతిగా  ఈ వార్తీక విద్యంతా బృహద్వాశిష్ఠంలో ఉంది.

        జీవుడి నుంచి ఆత్మనిష్ఠకు కావలసినటువంటి బోధ అంతానేమో 'యోగవాశిష్ఠం'లో ఉంది. కాబట్టి ఇదంతా కూడ వాశిష్ఠ సాంప్రదాయానికి సంబంధించిన విధానం. దీనిని వివరించటానికే ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నారు. ప్రతి వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటున్నాడట? 'బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా' అంటున్నాడు.

         బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య స్థితిగతులను తాను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనందరం 8 సంవత్సరముల లోపు బాలురమే అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా! నేను పెద్దవాణ్ణయ్యాను, నేను 8 ఏళ్ళ వాడిని కాను అంటాము.

        మరి ఆ బాల్య కౌమార, యౌవ్వన వృద్ధాప్యములు 'నేను' కొచ్చాయా? శరీర ప్రాణ మనోబుద్దులకు వచ్చాయా?శరీరము అంటే గుర్తుపెట్టుకోవాలి. తత్త్వ విజ్ఞానంలోకి రానంత వరకు శరీర ప్రాణ మనోబుద్ధులు అని అంటుంటాం.

        ఎవరైతే తత్త్వ విజ్ఞానంలోకి ప్రవేశించారో వారు ఇక శరీరము అంటే దాని అర్థం అన్నీ చెప్పినట్లే.

        కాబట్టి బాల్య, కౌమార, యౌవ్వన, వృద్ధాప్యాల దృష్టితో జీవితమంతా పరుచుకుపోయి, తాను ఏదైతే వ్యవహారాన్ని చేస్తున్నాడో, ఆ వ్యవహార సదృశ్యమైనవాడు జీవుడు.

        జీవుడంటే నిర్ణయం ఏమిటి? ఈ వ్యవహారాత్మకంగా, చిదాభాసుడుగా ఉన్నవాడు జీవుడు. ఇలా తెలుసుకోవడం కష్టం కదా! ఎందుకంటే ఒకప్పుడు ఒక అవస్థలో వ్యవహరిస్తున్నట్లున్నాడు, మరొక అవస్థలో వ్యవహరించకుండా ఉన్నట్లు కనబడుతున్నాడు. కనుక నిర్ణయంగా తెలియడం లేదు కదా అంటావు.

        నిర్ణయంగా చెప్పటం కోసం జీవుడు అంటే, నిత్య ప్రళయం అనుభవించేవాడిని జీవుడు అన్నారు. అంటే జీవుడు రోజూ పోతున్నాడు. ఒక్కసారి పోవడం లేదు. ఎవరైనా చనిపోయిన వారివద్దకు వెళ్ళి టైం అయిపోయింది జీవుడు వెళ్ళిపోయాడు అంటారు.

        ఆ బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్యములు తాను కాదని నిరసించ గల సమర్ధతని సంపాదించాలి. ఆ సమర్ధతని సంపాదించక పోయినట్లయితే ఈ జీవుడు అనే చిదాభాస లక్షణంలోనుండి వాడు బయటకు రాడు.

        నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జీవుడు నేను ఆత్మ స్వరూపుడినని గ్రహించవలసిన వివేకాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే వాడు వివేక శీలి అవుతాడు. అంటే నీ క్రమశిక్షణ ఎంత ఉండాలి అంటే ప్రతిక్షణము కూడ నీకు తోచే వాటిని కాదనగలగాలి

        నేను బాలుడిని, నేను కౌమారుడిని, నేను యౌవనుడిని, నేను వృద్ధుణ్ణి అనే స్థితులు నీకు ప్రతిక్షణం తోస్తూ ఉంటాయి కదా! ఎందుకంటే నీవు శరీరంతో ఉన్నావు, శరీర సంగతమై ఉన్నావు. శరీరం ఇచ్చే వేదనలను గ్రహిస్తున్నావు.

        మరి ఆ సంవేదనల ప్రభావం చేత నీకు నిరంతరాయంగా ఏమి తోస్తాయి? అవస్థాత్రయం, బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్యాలు ఈ నాలుగూ తోస్తూ ఉంటాయి.

        ఇవి తోచకుండా ఉండటం లేదు. కలలోకూడ నీవు 8 ఏళ్ళ పిల్లవాడిగా వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకని? నీవు ఎలా ఉన్నావో, నీ కలలో కూడ నీవు అదే బాలుడిగానో, యౌవనుడిగానో, వృద్ధుడివిగానో ఉంటావు.

        కాబట్టి శరీర ప్రాణ మనోబుద్ధులనే నాలుగు కూడ ఈ బాల్య యౌవన, కౌమార వృద్ధాప్యాలను అనుభవిస్తున్నాయి. అలాగే పంచేంద్రియ విషయాలను కూడ అనుభవిస్తాయి. ఆ శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు మారలేదు. ఈ బాల్య, యౌవన కౌమార వృద్ధాప్యములు మారలేదు.

        అలాగే మెలకువ కల నిద్ర కూడా మారలేదు. వీటన్నింటినీ కలిపి నిత్య ప్రళయము అన్నారు. అంటే ఇవి కలిగినప్పుడల్లా నీవు పోతున్నట్లే. ప్రత్యేకించి పోవడం లేదు.ఇవి కలిగినప్పుడల్లా పోతున్నావు అంటే నీ స్వరూప జ్ఞానం మరుపుకు వచ్చింది అని అర్థం.

        స్వరూప జ్ఞానం మరుపుకు రాగానే ఏమౌతావు? అజ్ఞానావృత జీవనాన్ని జీవించడం చేసేస్తావు. అలా ఎప్పుడైతే అజ్ఞానావృత జీవనాన్ని జీవించడం మొదలుపెట్టావో, నీకొక దుర్లక్షణం, నీకు లేని లక్షణం ఒకటి నీకు వచ్చింది. ఏమిటది? రాకడ, పోకడ.

        వాస్తవంగా నీవు రానివాడివి, పోనివాడివి. నీ వాస్తవిక లక్షణంలో నీవెప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ పోవు. Never you have born, never you will die తత్త్వ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఇదే.

        ఈ ప్రంపచంలో ప్రతి ఒక్కరికీ, శరీర ధారులెల్లరికీ కలిగినటువంటి సామాన్య నిర్ణయం ఏమిటి అంటే, 'నేను పుట్టాను', పుట్టాం అంటున్నాం కదా! ఎందుకని? శరీర ధారులం కాబట్టి. కాని శరీరం ధరించినంత మాత్రాన నేను పుట్టినట్లు ఎలా అవుతాను అని ప్రశ్నించాడు ధ్రువుడు.

        శరీరధారినైతే నేను పుట్టినట్లు ఎలా? నేనెవరిని? అసలు అని ప్రశ్నించాడు. నీవు సర్వ వ్యాపకుడివి, సర్వే సర్వత్రా ముల్లుగ్రుచ్చ సందు లేక వ్యాపించి ఉన్నవాడవు.

        సర్వే సర్వత్రా ఉన్నవాడు కుండలో కూడా ఉంటాడు కదా! ఇంతకు ముందు ఉపమానాలలో చెప్పాడు. ఈ శరీరం ఒక ఘటం. జగత్‌ చక్షు స్థానం సూర్యుడినుంచి చూస్తే పంచభూతాత్మకమైన సృష్టి ఒక ఘటం. అనంత విశ్వం నుంచి చూస్తే అది కూడ ఒక ఘటం.

        దాని అవతల అంతరిక్షం నుండి చూస్తే విశ్వమే ఒక ఘటం. ఒక ఘటన ద్వారా వచ్చినవి ఇవన్నీ. కాబట్టి దాని పేరు ఘటం అని పేరు పెట్టారు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం కుండలో ఉంది. కుండ పగిలింది. కుండ పగిలితే ఆకాశం ఏమైనా పెరిగిందా? కుండలో ఆకాశం ఏమైనా తగ్గిందా? లేదు.

        ఘటంలో ఉన్న ఆకాశం వచ్చి, పఠంలో ఉన్న ఆకాశంలో చేరడం ద్వారా ఏమైనా పెరిగిందా? పోనీ పటంలో ఉన్న ఆకాశం కుండ ఏర్పడటం ద్వారా ఏమైనా తగ్గిందా?

        'పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే
         పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే'

        పూర్ణమైన నీ స్వరూపం ఎప్పుడూ నీ స్వరూపంగానే ఉంది. ఒక శరీరం రావడం ద్వారా గాని, పిండాండములు ఏర్పడటం ద్వారా గాని బ్రహ్మాండములు ఏర్పడటం ద్వారా గాని, విశ్వాండములు ఏర్పడటం ద్వారా గాని నీ స్వరూపం ఏమీ తగ్గలేదు. అవి పోయినప్పుడు పెరగనూ లేదు.

        నీవెప్పుడూ పూర్ణమే. అట్టి పూర్ణ స్థితిని చేరిన వాడికి శరీరాలు ఉన్నాయా? లేవుకదా? అంటే నీ Identity ని పూర్ణంగా చూస్తున్నావా? అపూర్ణంగా చూస్తున్నావా? ఈ నవరంధ్ర కాయంతో ముడిపడిన దృష్టితో గనుక నువ్వు చూసినట్లయితే ఏమైంది?

        ఏదో ఒక రంధ్రం ద్వారా గాలి బయటకు పోయినట్లయితే ఎందుకూ పనికిరాదు. తోలుతిత్తి కదా ఇది!  అంతకు మించి ఏమున్నది ఇందులోకాసేపు ఇందులో గాలి  కొట్టుకుంటుంది. అద్భుతం అన్నాం. ఆ గాలి బయటకు పోతే చిలుక ఎగిరిపోయింది అన్నాం. మరో కొమ్మమీద వాలింది. ఇలా సృష్టి ప్రవాహంలో అనేక జీవరాసులు పుడుతున్నట్లు కనపడతున్నాయి. వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నాయి. మరలా నిర్గమిస్తున్నట్లు కనబడుతున్నాయి. మరణించడం కాదది. నిర్గమనం. నిర్గమనమంటే స్వస్థానమున కేగుట. స్వస్థితికేగుట. స్వస్థితినెరుగుట. ఇదీ నిర్గమనమంటే.

        మరి నీవు అలా ఉంటే కదా అలా నీవు స్వీకరించడానికి. అంతేకదా!  కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా ఘటించినటువంటి ఘటనల ద్వారా ఏర్పడిన సమస్త ఆవరణలను శరీర సదృశ్యంగా చూచి, నిమిత్త మాత్రంగా చూసి కార్యకారణ వ్యవస్థీకృతమైన ప్రవాహరూపంగా చూసి, సదసత్‌ విలక్షణమైనటువంటి పరబ్రహ్మమునకు ఇవి లేవుకదా! కార్యములు లేవు. కారణములు లేవు. వాస్తవమునకు నీ స్వరూపం సదసత్‌ విలక్షణం. దృక్‌ దృశ్య విలక్షణం. దృశ్యమే లేదు. పోయినసారి ఏం చెప్పారు? దృశ్యము, దర్శనము, ద్రష్ట. ఆ ద్రష్ట, దర్శనము, దృశ్యము కూడ నీవు కాదు అంటున్నారు. ఎందుకని అంటే నీవు సర్వే సర్వత్రా సర్వకాలములందును కూడ మార్పులేక ఉన్నవాడివి. సర్వకాలము లందును మార్పు లేక ఉన్నదేదో అది నీవు. అది ఎలాంటిది? 'పరశివం'.

        కాబట్టి నేను శివ స్వరూపుడిని అన్న స్థితికి ఆగిపోతావేమో, ఆగాల్సిన అవసరం లేదు. అదికూడ ఆవరణే. కాబట్టి నీకు అనుభూతమవుచున్న ప్రతీదీ కూడ ఆ ఆవరణ సహితమే కాని, ఆవరణ రహితము కాదు.

        ఏ అనుభూతి చెందాలన్నా దానికి ఒక ఆవరణ ఉంటే తప్ప అనుభూతమవదు. ఆవరణ రహిత స్థితిలో నీవే లేవు. 'నాహం'. ఎరుకే లేదు. ప్రజ్ఞే లేదు. చైతన్యమే లేదు. దేనినైతే సర్వవ్యాపకం, సర్వ వ్యాపకం అని ఆశ్రయిస్తూ అధిష్ఠానంగా నిలబెట్టుకుంటూ వచ్చావో, ఆ అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిలో నిలబడుతున్నటువంటి బ్రహ్మమే లేదు. అట్టి ఆధారమే లేదు, అట్టి ఆవరణమే లేదు. ఇన్నింటిని ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఏమిటది? 'బాల్యాదిష్యపి' ప్రయోగం అలా ఉంది. బాల్యంతో మొదలు పెట్టినట్లు కనబడుతోంది. ఇంకా ఏమిటి? జాగ్రదాదిషు మేల్కొన్నట్లుగా కూడ కనబడుతోందట.

        నిద్ర బాగా తెలుస్తుందా? మెలకువ బాగా తెలుస్తుందా? మెలకువ. అందుకే దాని విషయం చెప్పారు.మనకి బలంగా తెలిసేవి బాల్యము, మెలకువ. ఈ రెండు ఆవరణలే చివరిదాకా ఉన్నాయట.

        'సర్వాస్వవస్థాస్వపి' - 'సర్వ' చాలా గొప్ప శబ్దం ఇది. 'సర్వం' ఎక్కణ్ణించీ వచ్చింది ఈ సర్వం.

        బాల్యము, జాగ్రదావస్థలతో మొదలైనటువంటి నీ ఉనికి సర్వం దాకా ఉందట. సర్వము అంటే బ్రహ్మము. కాబట్టి ఇక్కణ్ణించీ అక్కడిదాకా ఉన్నదంతా. 'సర్వం' అన్న ఒక చిన్న మాటతో, ఒక శబ్దంచేత ఎనిమిది శరీరాలను ప్రతిపాదించాడు.

        ఏమిటా సర్వము పిండాండములోని నాలుగు తనువులు. విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ.

బ్రహ్మాండములోని నాలుగు తనువులు : విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. 
మొత్తం ఎనిమిది శరీరాలు ఉన్నాయిప్పుడు. ఎనిమిది ప్రపంచాలున్నాయిప్పుడు. ఎనిమిది వ్యవహారాలున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎనిమిది లయాలు ఉంటాయి కదా!

        అలా ఈ ఉనికి ఉంటే వ్యవహారం ఉంటుంది. వ్యవహారం ఉంటే ప్రపంచం ఉంటుంది. ఈ మూడూ ఉంటే లయం తప్పదు. లయించినా నీవు మిగిలావు కదా! అన్నీ పోయినా నీవున్నావు. ఆ ఉన్న స్థితుల పేర్లు, ఆ ఎనిమిది సాక్షుల పేర్లవి.

        విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మ, విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనే ఎనిమిది సాక్షీ స్వరూపాలు ఉన్నాయి.

        ఈ ఎనిమిది సాక్షీ స్వరూపాలకు Common name బ్రహ్మము.
బ్రహ్మము అని అంటాము అందరం, బ్రహ్మమంటే ఈ ఎనిమిదీ తెలియాలి.

        ఈ ఎనిమిది వస్తుగతంగా ఎలా ఉన్నాయి? వస్తు నిశ్చయంగా ఎలా ఉన్నాయి? ప్రపంచ ప్రమాణంతో ఎలా ఉన్నాయి? వ్యవహార ప్రమాణంతో ఎలా ఉన్నాయి? ఉనికి అనే ప్రమాణంతో ఎలా ఉన్నాయి? సాక్షి అనే ప్రమాణంతో ఎలా ఉన్నాయి? అని తెలిసిపోవాలి. వ్యవహరించి లేకుండా పోవాలి. లయించి లేకుండా పోవాలి. నీవు సాక్షిగా మిగిలిపోవాలి.

        మరి ఇప్పుడు ఇది దర్శనం లేకుండా సాధ్యమా? కాదు. కాబట్టి ఈ అతీతమైన అంతర్ముఖ ప్రయాణమే ఈ ఎనిమిది శరీరాలను నిర్ణయించేది, అనుభూతమయ్యేటట్లు చేసేది, ఆ ఆవరణని నిరూపించేది. దానిని నిరావరణ చేయగలిగే శక్తి సద్గురుకృప మాత్రమే.

        ప్రతిసారి ఆయన ఏమన్నారు? 'తత్త్వమసి'. ప్రతిసారి ప్రబోధ వాక్యం ఏది? ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అని తెలిసేవరకు 'తత్త్వమసి' మహా వాక్యమే. పరబ్రహ్మ నిర్ణయం అంటే ఏమిటి? ప్రత్యక్‌ పరమాత్మలు ఒక్కటే. ఈ ప్రత్యగాత్మే ఆ పరమాత్మ అని నిర్ణయం పొందాలి.

        ఈ నిర్ణయం పొందిన వాడికి పరబ్రహ్మ నిర్ణయం పొందే అధికారిత్వం ఉంటుంది. ఈ ఎనిమిది శరీరములు ఎరిగి జీవ తనువులు నాలుగు, ఈశ్వర తనువులు నాలుగు, పిండాండం, బ్రహ్మాండం, అందలి అహములు రెండు.

        దీని కందార్థము 'పిండాండము, బ్రహ్మాండము, అందలి అహములు రెండు. ఈ నాల్గింటి కూడిక చేరి అఖండంబౌ యెరుక కదరా మాయన్న'.

        పిండము, పిండములోని అహము, బ్రహ్మాండము, బ్రహ్మాండములోని అహము ఈ నాలుగు కలిస్తే అఖండ ఎరుక. 'అఖండంబౌ ఎరుక కదరా మాయన్నా'. ఇది ఎన్నడు లేదని ఎరుగరా మాయన్నా. వెంటనే ఏంచెప్పారు ఆయన? ఎన్నడూ ఏ కాలంలోనూ లేదు. కాని ఉన్నట్లు తోచడమే దాని గొడవంతా.

        మాయ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లు తోచుట. సర్వకాలములందు ఉన్నది ఏదో అది తోచదు. సర్వకాలములందు ఉన్నది ఏది? బయలు, శాశ్వతం, పరాత్పరం, పరశివం.

        దానిలోని లవలేశ భాగము ఒక ఆవగింజంత విశ్వం అయింది. దానిలో విశ్వం ఎంతయ్యింది? ఒక అణు స్వరూపం విశ్వం అయింది. ఆ అనంత విశ్వంలో ఒక అణు స్వరూపం మరల బ్రహ్మాండం అయింది. ఆ బ్రహ్మాండంలో ఒక అణు స్వరూపం ఒక పంచభూతాత్మకం అయింది.

        ఆ పంచ భూతాత్మకంలో వున్న ఒక అణుస్వరూపం జీవసృష్టి అయింది. ఆ జీవ సృష్టిలో ఒక అణుస్వరూపం మానవులయింది.

        అట్టి మానవులలో ఒక అణు స్వరూపం నీ శరీరంలో కొట్టుకుంటోంది పైకి, క్రిందకు.
     
ఇప్పుడు అఖండ ఎరుక స్థానం నుండి వచ్చి ఈ శరీరంలో పైకి, క్రిందకు చలిస్తున్నటువంటి పరమాణు స్వరూపం ఏదైతే ఉందో, ఇదీ అదీ ఒక్కటే. అదీ కదులుతోంది ఇదీ కదులుతోంది. ఏమనాలి'కదలికలుడిగిన తానె లేదుకదా!'

        ఆ ఎరుకకి కదలికలున్నాయి. నీ లోపల ఉన్న పరమాణువుకి కూడ కదలికలు ఉన్నాయి. కదలికలు ఉడిగితే ఏమైంది? వీడు పోయాడు అన్నాం.
అక్కడ ఎరుక కూడా అంతే. కదలికలు ఉడిగితే అదికూడ లేకుండా పోయింది. కాబట్టి 'కదలడట పరమ శివుడు, కదిలెడిది మాయయట'.

        మానవుడు రెండు విషయాలు తెలుసుకోవాలిట. కదలడట పరమ శివుడు, కదిలెడిది మాయయట.ఈ రెంటినెరిగి తనను తాను పోగొట్టు కోవాలి. తానే లేనివాడైనటువంటి స్థితికి చేరుకోవాలి.

        ఎట్లా లేనవాడు అవ్వాలి? ఈ ఎనిమిది శరీరాలుగా లేనివాడు అవాలట. ఆ దశవిధ ప్రళయాలలోనూ పోనివాడిగా అవాలిట. రెండు ప్రమాణాలు చెప్పారు. అష్టతను నిర్ణయం ఎరిగి లేనివాడు అవ్వాలి. రెండవ ప్రమాణం ఏం చెప్పారు? దశవిధ ప్రళయములయందు పోనివాడు కావాలి.

        ఈ సర్వసృష్టి, సర్వ విశ్వము కూడ దశవిధ ప్రళయాలలో పోతుంది. పది కాల ప్రమాణాలు ఉన్నాయి. ఆ పది టైం స్కేల్స్‌లోనూ పోనివాడు శాశ్వతుడు అన్నారు. మరి అష్టతను నిర్ణయాన్ని ఎరిగాడని ఎలా తెలుస్తుంది? దానికీ ఒక ప్రమాణం ఉండాలి కదా! షోడశావస్థల నిర్ణయం ఎరిగినవాడు మాత్రమే అష్టతను నిర్ణయాన్ని తెలుసుకోగలడు అన్నారు.

        షోడశావస్థలంటే? మూడవస్థల గురించే తెలియనపుడు షోడశావస్థలు ఎలా తెలుస్తాయి?

        తత్త్వ విజ్ఞానం అంత లోతుగా విచారణ చేసింది. అంత దర్శన పద్ధతిగా ప్రయాణం చేసింది. స్పష్టముగా చూసింది.

        'అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌' అణు స్వరూపం నుంచి మహత్‌ స్వరూపం దాకా స్వరూప విజ్ఞానం నిర్ణయం చేస్తూ పోయింది. కాబట్టి షోడశావస్థల నిర్ణయం ఎరగాలి అన్నారు. షోడశావస్థలు అంటే ఏమిటి?

జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నం, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురీయము;
స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో స్వప్నం. స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తురీయము;
సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నం, సుషుప్తిలో సుషుప్తి, సుషుప్తిలో తురీయము; తురీయములో జాగ్రత్త, తురీయములో స్వప్నం, తురీయములో సుషుప్తి, తురీయములో తురీయము. ఇవి షోడశావస్థలు.

        ఈ షోడశావస్థల యొక్క వివరం ఎరిగిన వాడికి అష్టతను నిర్ణయ భ్రాంతి పోతుంది అంటున్నారు.అష్ట తనువులూ ఉన్నాయనే భ్రాంతి తొలగుతుంది. అష్ట తనువులు ఉన్నాయని చెప్పడం లేదు, భ్రాంతిగా ఉన్నాయని చెప్తున్నారు.

        కాబట్టి ఈ ఆవరణలన్నీ నిరావరణం అవ్వడానికి నీవెపుడూ కూడా సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువును ఎందుకు ఆశ్రయించాలి? ఆవరణలన్నీ తొలగించుకునేందుకు.
'నిరావరణం, నిరామయం, నిరంజనం, నిర్వికారం, నిర్వికల్పం, నిష్కళం'

        సద్గురు కృప - ఈ ''కార శబ్దంతో ఉన్న లక్షణాలు అన్నీ కూడ సద్గురు కృపే. కాని గురుపరంపరలో చూచినట్లయితే ఎలా ఉందయ్యా అంటే  మొట్టమొదట 'శ్రీ గురువు' చేత ప్రేరేపించబడతాడు. జ్ఞాన మార్గంలో, స్వరూప జ్ఞాన మార్గంలో, నిన్ను ప్రవేశింపజేసేటటువంటి శక్తి శ్రీ గురువుకు ఉన్నది.

        ఆ శ్రీ గురువు నిన్ను మొట్టమొదటి దీక్ష అయిన 'ఆణవీ దీక్ష' ద్వారా ప్రేరేపిస్తాడు. అంటే నీ ఇష్ట దైవాన్ని నీవు ఉపాసించే విధానాన్ని నీకు బోధిస్తాడు. నీ చిత్త శుద్ధి కారకమైనటుంటి ఉపాసనా విధిని అంతా కూడ నీకు బోధించేవాడు శ్రీ గురువు.

దీక్షాత్రయమని మూడు దీక్షలున్నాయి.
1. ఆణవీ దీక్ష 2. అంతర్యామి దీక్ష 3. శాంభవీ దీక్ష

దానిద్వారా అంతర్యామి స్థితిని కలిగిస్తారన్నమాట. దానినే ఆత్మ సాక్షాత్కారం అని కూడ అంటారు. శాంభవీ దీక్ష ద్వారా బ్రహ్మ నిర్ణయం జరుగుతుంది. బ్రహ్మ నిష్ఠ కలుగుతుంది. అయితే యోగ పద్ధతిలో కూడ పంచముద్రల పద్ధతిని తెలియచేశారు. పంచముద్రలు ఉన్నాయి.

        అయితే ఇప్పుడు చెప్పుకునే యోగం యోగ లక్షణాలతో కూడుకున్నటు వంటిది కాదు. ఇదంతా కూడ భౌతిక మార్గంలో పడిపోయిన విధానం, ఈ రోజు ప్రపంచంలో కనపడుతున్నది ఉద్దేశించబడిన యోగం కాదు.

        నిజానికి యోగ లక్ష్యం బ్రహ్మనిష్ఠ. కాబట్టి ఈ పంచముద్రల యొక్క విధానం అంతా కూడ బ్రహ్మ నిష్ఠని పొందటానికి వీలైన పద్ధతిలోనే చెప్పబడింది.

        అంటే బ్రహ్మ విద్యలో భాగంగా యోగం బోధించబడింది. అంటే జ్ఞాన విద్యలో భాగం. ఆ పంచముద్రలు భూచరి, ఖేచరి, షణ్ముఖి, మధ్యలక్ష్యం, శాంభవి.

        ఈ పంచ ముద్రలలో చిట్టచివరిది శాంభవి. శాంభవిలో మిగిలినవి అన్నీ భాగమై ఉంటాయి. శాంభవీ దీక్షలో ఎవరైతే సిద్ధహస్తులై ఉంటారో, సిద్ధులై ఉంటారో, వీరిని శాంభవీ సిద్ధులు అంటారు. వీళ్ళు సర్వమూ ఎరిగినవారన్న మాట.

        ఇక వీరు తెలుసుకోవలసింది ఏమీలేదు. సర్వజ్ఞులు. దీనిద్వారా మాత్రమే ఈ అష్టతను నిర్ణయాన్ని తెలుసుకోలుగుతారు. ఈ అష్టతను నిర్ణయాన్ని ఎరగాలీ అంటే నీ అధికారిత్వం ఎంతుండాలంటే, ఆ శాంభవీ దీక్షకు సమర్ధుడవై ఉంటాలి.

        'పంచముద్రలందు పరమ శాంభవి హెచ్చు'. కాబట్టి తురీయంలో తురీయ స్థితిని లక్ష్యించినటువంటి ఈ అష్టతను నిర్ణయ నిరసన పద్దతి ఏదైతో ఉందో, అటువంటి విధానమును తెలుసుకోవాలి అనేది ప్రబోధ. మిగిలినవన్నీ బోధలే.

        అంటే శ్రీ గురువు దగ్గరనుండి మొదలు పెట్టినటువంటి బోధా సాంప్రదాయం.

        శ్రీ గురువు, గురువు, శ్రీ సద్గురువు, సద్గురువు, పూర్ణ సద్గురువు, పరిపూర్ణ సద్గురువు, పరమేష్టి గురువు (అవతారుడు). ఇది క్రమం.

        అంటే స్థాయి భేదంగా, స్థితి భేదంగా ఈ అంతర్ముఖ ప్రయాణానికి సహకరించే మహానుభావులు అందరూ కూడా ఈ పేర్లతో పిలవబడుతూ ఉంటారు.

        ఇలా అత్యుత్తమమైనటువంటిది అవతార స్థితి. అవతారుని యొక్క కృపని పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే చిట్టచివరిదైనటువంటి బయలు, లేని ఎరుక, ఆ స్థితిని పొందగలుగుతారు. పరిపూర్ణ స్థితిని పొందగలుగుతారు.

        పూర్ణ గురువులు ఎరుకని విడిపించడంలో సిద్ధహస్తులు. ఎరుకని విడనాడాలి అంటే పూర్ణ గురువు కృపను పొందాలి. బయలులో అంటే చిట్టచివరిదైన శాశ్వత స్థితిలో కూడ నాలుగు అంతర్భాగములు ఉన్నాయి. బయలు, లోబయలు, బట్టబయలు, పరబయలు.

        చివరివైన బట్టబయలు, పరబయలు రెండూ ఒకటే. ఈ పరబయలు స్థితికి చేరినవారెవరైతే ఉన్నారో వారందరినీ 'దేశీకేంద్రులు' అన్నారు. వాళ్ళు అవతార స్థితిని దాటేశారు. వారు కాలాన్ని, దశవిధ కాలాలని, దశవిధ ప్రళయాలను దాటేశారు.

        వీరందరూ దేశికేంద్రులు. ఈ విధంగా పరబయలు నెరిగినవారు 'దేశికేంద్రులు'. బయలునెరిగిన వారందరూ 'దేశికులు'.

        ఈ రకంగా వారి వారి స్థితిని సూచించే విధంగా ఆయా నామములు ఇవ్వబడుతుంటాయి. 'బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా' ఇక్కడ ఒక ఆవరణ వచ్చింది. దేశికుల గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దేశికులు నిరావరణ. వారు దేశం అనే ఆవరణను పోగొట్టుకున్నవారు.

ఆ దేశం ఉంటేనే కాలం, కలన వచ్చాయి. లేకపోతే అవి లేవు కదా!

        కాబట్టి ముందు నామరూపాలతో కూడిన ఒక (దేహం) దేశం వచ్చింది. అలాగే ఇంకా ఏర్పడ్డాయి కదా! ఇక అందులో జరుగుచున్న వ్యవహారమంతా చెప్పాల్సి వచ్చేప్పటికి నీ జీవితం గురించి చెప్పవలసి వచ్చింది. ఇలా ఎక్కడెక్కడైతే దేశ ప్రధానంగా నీవుంటున్నావో, అష్టతను నిర్ణయ ప్రధానంగా నీవుంటున్నావో అవన్నీ దేశములు.

        కాబట్టి ఈ దేశం అనే ఆవరణ ఏదైతే ఉందో, ఆ ఆవరణను నిరావరణ చేయాలి. 'బాల్యా.. సర్వాస్వవస్థాస్వపి' సర్వము, స్వ అవస్థ. ఎంత పరిశీలించినా ఈ రెండే కనబడుతున్నాయి.

        జీవితమంతా పరిశీలిస్తే బాల్య, యౌవన, కౌమార వృద్ధాప్యములు కనబడుతున్నాయి. ఇంకా జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు కనబడుతున్నాయి.సృష్టి మొత్తాన్ని పరిశీలించాం. అనంత విశ్వాన్నీ కూడా పరిశీలించాము. ఏం కనబడింది? సర్వమూ, స్వ అవస్థ. ఇంతకుమించి ఏమీ కనబడటము లేదు. ఇదంతా నేనే కదా!

        కానీ ఏ దృష్టితో చూడమంటున్నారు? ఇదంతా ఆవరణ సహితం కాదా! ఎరుక, అఖండ ఎరుక అనేది ఆవరణ సహితం కదా! మరి నేనెవరిని? శాశ్వతుడను, నాకు ఆవరణ లేదు, నేను ఆవరణ రహితుడను కదా! 'నేను' నిరావరణను కదా! అనే నిర్ణయాన్ని పొందు.

        'సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను'. వ్యావృత్తా అంటే నేను వ్యాపించి ఉన్నాను అని అర్థం. ఎంత వ్యాపించి ఉన్నాను? అనంతం. ఆద్యంతములు లేకుండా వ్యాపించి ఉన్నాను.

        అట్టి ఆద్యంతములు లేక వ్యాపించి యున్న అణు స్వరూపం విశ్వం. మరి ఇప్పుడు అణువుచేత నేను పరిమితించబడ్డాననడం సమంజసమా?

        దృష్టి లేకపోతే ప్రపంచం లేదు. కళ్ళజోడు లేకపోతే ప్రపంచం కనబడదు. దృష్టి దేనితో ముడిపడి ఉంది? దృశ్యము, దర్శనము, ద్రష్ట. వాస్తవానికి చూస్తే గాని లేవు కదా! 'ఉన్నట్లు తోచడం భ్రాంతి'.

        ఎనిమిది తనువులు ఉన్నవని తోచటం భ్రాంతి. ఎనిమిది ప్రపంచాలు ఉన్నవనటం భ్రాంతి. ఎనిమిది వ్యవహారాలు ఉన్నవని తోచటం భ్రాంతి. ఎనిమిది స్థానాలలోను లయ స్థితిని కలిగి ఉండటం భ్రాంతి. సృష్టి, స్థితి, లయలు భ్రాంతి. ఎందుకని? ఏకాలమందునూ నేను పుట్టలేదు, నేను పోను.

Never I have born, Never I have gone. రాకడ పోకడ లేనివాడను.

        'వ్యావృత్తి' చిన్న శబ్దంలో ఎంత అర్థాన్ని వేశాడో? ఈ దృష్టితో చదవాలి. 'వ్యావృత్తా.. స్ఫురంతం సదా' సదా అంటే దశవిధ ప్రళయాలలో కూడ, ఏమని చెప్పాలట? వ్యావృత్తం అంటున్నారు కదా! దశవిధ ప్రళయాలు నాయందు జరుగుతున్నాయి. నేను అనంతుడను. యత్స్ఫురంతం సదా అది నీ స్ఫురణలో ఉండాలట.
'శతాయుష్మాన్‌ భవ' అంటే సరిపోతుందా!

        లేక బ్రహ్మాయుర్దాయం అనగా బ్రహ్మ ఎంతకాలము ఉంటాడో అంతవరకూ ఉంటే సరిపోతుందా? చాలదు.ఎందుకని అలా అంటున్నారు అంటే స్ఫురణ మాత్రం చేత క్షణంలో అలా ఉండగలుగుతాడట. బయలు దర్శించినవాడు.

        బయలన్నది ఎల్లప్పుడు, ఏ మార్పు లేక ఏ కదలిక లేక శాశ్వతముగా అంతటా ఉన్నది. ఇలా ఈ స్ఫురణతో సదా ఉండాలి. 'అహమిత్యంతః స్పురంతంసదా... యోభద్రయా ముద్రయా' అందుకని పంచముద్రలో పెట్టేశారు. ఏ ముద్రతో ఉంటే నీవు భద్రంగా ఉంటావో అది శాంభవి. ఆ శాంభవీ స్థితిలో తురీయం ఉంటుంది. ఆ తురీయంలో ఉన్న నాలుగు అవస్థలను దాటాలి. ఈ శాంభవీ ముద్ర తురీయ స్థితికి సంబంధించినది. అందులో ఉన్న నాల్గింటినీ దాటితే తురీయంలో తురీయం లేక తురీయాతీత మైనటువంటి లేని ఎరుక పద్ధతిగా అవుతాము. అలా ఉన్న ఎరుకగా ఉండగా కొంత కాలానికి నీవు సంకల్పాన్ని దాటాలి, తురీయాన్ని దాటాలి, కాలాన్ని దాటాలి.

        ఈ మూడే పైన ఉండేవి. దేశము, కాలము, కలన, సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము, శూన్యాతీతము, కాలము, కాలాతీతము అనే స్థితులను దాటినవాడు బయలు స్థితికి చేరతాడు. అపుడు దేశికుడు అవుతాడు. దేశికవర్యుడు, దేశికేంద్రులు ఎప్పుడవుతారు? ఆ బయలు స్థితికి చేరినప్పుడు.

        కాబట్టి ఈ ద్వాదశి, షోడశి అనే ఈ రెండింటినీ ఆశ్రయించిన వారెవరైతే ఉన్నారో, 'ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకగనే నీవిక భ్రాంతి వదిలెదవూ' అని చెప్తున్నారు.

        'స్వాత్మానం ప్రకటీకరోతిస్వాత్మానం అంటే స్వ+ఆత్మ. నీ స్వస్థితి. కరోతి అంటే నీవు లేనప్పుడు ఎలా చేశావు? నీవులేని వాడవుకదా! నేను చూశాను అంటే ఎరుక ఉంది. ప్రకటీ కరోతి, ఒట్టి 'కరోతి' కాదు. చూసేవాడికి ఉన్నట్లుగా తోస్తోంది.

        చూచేవాడికి వ్యవహరిస్తున్నట్లుగా కనబడుతోంది. కానీ వాస్తవానికి వాడు లేడు. విరుద్ధాలన్నీ ఒకేచోట చెప్తున్నట్లుంది. తత్త్వ విజ్ఞానంలో ఉన్న విశేషం ఇదే. 'తద్దూరే తద్వదంతికే' అంటుంది ఉపనిషత్తు.

        అంటే దీనంత దూరం ఏదీ లేదు. దీనంత దగ్గర ఏదీ లేదు. 'తదేజతి తన్నైజతి' దీనంత కదిలేది లేదు. దీనంత కదలనిది లేదు. దీనంత ఘనమూ లేదు, దీనంత స్వల్పమూ లేదు. దీనంత కష్టము లేదు. దీనంత సులభమూ ఏదీ లేదు.  రెండు వ్యతిరేకాలు ఒకేచోట చెబుతున్నారు ఏమిటి? అందులో ఉన్న లాజిక్‌ ఏమిటి?

        నీ లోపల ఉన్న 'నేను' అనేది ఎలా ఉంటుందట? నేనున్నాను, నేను చేస్తున్నాను అంటుంది. ప్రతి స్థితిలో కూడ ఈ 8 తనువులలో వ్యవహరించేటప్పుడు ఏముంటుంది? నేనున్నాను, నేను వ్యవహరిస్తున్న వాడిని అంటుంది. అలా అన్నప్పుడల్లా 'నేను' లేని వాడిని, 'నేను' వ్యవహరించని వాడిని అని చెప్తూ ఉండమంటున్నారు.

        'యోభద్రయా ముద్రయా' ఏ ముద్రలో అయితే నీవు భద్రంగా ఉంటావో, ఆ ముద్రలో ఉండి ఏం చేయాలి? నువ్వు బయలును సదా స్ఫురణ చేయి.

        ఆ బయలును స్ఫురణలో ఉంచుకున్నట్లయితే 'స్వాత్మానం ప్రకటీకరోతి' 8 తను నిర్ణయాలలో నీవు వ్యవహరిస్తున్నప్పుడల్లా ఆ బయలును ఆ స్థానంలో ఉంచుకున్నట్లయితే, బయలు స్థితిలో ఉండి నీవు 8 తను నిర్ణయాలు చేసినట్లయితే, ఇవన్నీ భ్రాంతి అని తేలిపోతుంది. కాబట్టి

        'మొదలచలము నెరిగించెద, విదితముగా లేని ఎరుక ఎరిగించెద
         తుదకు ఎరుక విడిపించెద', ఇది దేశికేంద్రుల వాగ్దానము.

        నీవు అంటనని బాస చేసితివి. 'ఎరుకని విడిచి పెట్టిన తరువాత అష్టతనువులతో కూడినట్టి ఎరుకను నేను అంటను'. అంటకుండా ఉంటాను. నేను లేనివాడిగా ఉంటాను, నిరావరణ పద్ధతిగా ఉంటాను అనే ప్రమాణం చేయాలి.

        అలా ఉండేవారికి ఈ వార్తీక పద్ధతిలో ప్రయాణం సాధ్యం. ఇలా చేరిన వారు ఏ స్థితిలో ఉన్నారు? 'స్వాత్మానం'. ఇదీ 'స్వాత్మానం ప్రకటీ కరోతి' అంటే.

        'యోభద్రయాముద్రయా' వాడు భద్రమైన స్థితిలో ఉన్నవాడు. ఎప్పటికీ రానివాడు.

        కాబట్టి తత్త్వ విజ్ఞానాన్ని ఆశ్రయించితే ఒక ప్రయోజనం చేకూరింది.
నేనెప్పటికీ పుట్టలేదు, నేను శాశ్వతుడను.

        కానీ మనం ఏం గొడవ పెడుతున్నాం? నేను పుట్టాను కదా, ఎలా అయినా పోతాను కదా. నన్ను ఈ భయం నుండి విడిపించండి, నన్ను అభయ స్థితికి చేర్చండి అంటున్నాం కదా! దేవుడి విగ్రహాలన్నీ అభయ ముద్రతో ఉంటాయి.

        ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు కూడ, వారినుండి అభయ ముద్రనే   కోరుతాం. ఈ అభయ ముద్రలో ఉంది రహస్యం. జనన మరణమనేటువంటి ఆ భ్రాంతి నుండి నీవు విడిపించబడిన వాడవై, అపుడు మాత్రమే నీవు అభయ స్థితిని పొందుతావు.    

        కాబట్టి గురువు లేక ఈశ్వరుడు అభయమిచ్చారంటే నీవు చేయవలసిన పనిని వారే చేస్తారని కాదు. అష్టతను నిర్ణయ పద్ధతిగా ఉన్నటువంటి భ్రాంతిని తొలగించడంతో ఆయన సహాయకారి కాగలడు.

        కాబట్టి ఈ 8 తనువుల యొక్క వ్యవహారము, స్థితులను, 'స్వాత్మానం. యో ముద్రయా భద్రయా' ఇది రాజయోగము. రాజయోగమని ప్రపంచమంతటా చెప్పబడే దానితో ఈ అష్టతను నిరసన స్థితిని సాధించాలి. అవన్నీ తాను కాదని నిరసించగలిగేటటువంటి సమర్ధతను సంపాదించాలి.

        కాబట్టి ఎవడైతే ఈ పరమ శాంభవీ స్థితులలో ఉన్నాడో, ఎవడైతే దేశ కాల కలనలను లేనివిగా నిరూపించినట్టి నిర్ణయాన్ని పొందాడో, ఎవరైతే ఈ నిరావరణ పద్ధతిని ఆశ్రయించాడో, ఎవడైతే ఈ శాశ్వతత్వాన్ని పొందాడో వాడు ఎప్పటికీ రానివాడు.

        ఇంక వాడికి భయమేమిటి? భద్రమైన స్థితిలో ఉన్నాడు. స్వాత్మానం. సర్వాత్మత్వ.. 'అహమిత్యంతః స్ఫురంతం సదా'

        అహం అహం అంటూ 8 తనువుల వద్దా ఉంటోంది. కాబట్టి నేను అన్నప్పుడల్లా 'నేను లేనివాడను', అనే నిరావరణ పద్ధతిని ఆశ్రయించాలి.
అపుడేమైంది? 'భద్రయా' భద్రమైన స్థితికి చేరుకుంటావు.
'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'.

        అటువంటి శ్రీగురువైనట్టి, ఆదిగురువైనట్టి దక్షిణామూర్తిని ఆశ్రయించినటువంటి స్థితి ఈ నిరావరణ స్థితి, ఆవరణ రహిత స్థితి.
ఆశ్రయించితే ఏమి చూపించారు? చిన్ముద్రను చూపించారు.

        ఈ చిన్ముద్రే 'పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవా వశిష్యతే' అనే దానికి సంఙారూపకమైన బోధ.


        కాబట్టి దక్షిణామూర్తిని ఆశ్రయించినటువంటి శాశ్వతమైన స్థితిని సాధకులు సాధించాలి.