5

5వ శ్లోకం

        దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాబుద్ధించ శూన్యం విదుః
       స్త్రీ బాలాంధ జడోపమాస్త్వ హమితి భ్రాంతా భృశం వాదినః |
       మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే
       తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

మొదటి శ్లోకంలో ఏమి చెప్పారు?

        ''విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం..'' అనంత విశ్వాన్ని దర్పణ దృశ్యంగా ప్రతిబింబ సమానంగా చూడగలిగేటటువంటి బింబ స్థితిని సాధించమని చెప్తున్నారు. నీ దర్శనం దృక్‌ స్థితిలో ఉండాలి. దృక్‌ స్థితిలో ఉండి సర్వాన్నీ దృశ్యంగా చూసే స్థితిలో చేరి, మరలా ఆ సర్వమూ లేనటువంటి శూన్య స్థితిలో ఉండాలి.

        దృక్‌ రహిత పద్ధతిని ఆశ్రయించి ఉండాలనే సూచన చేశారు. ఎలా? అంటే ఉపమానం చెప్పారు. నిద్రలోకి పోతే, నిద్రలోకి పోయేముందు మెలకువలో ఉన్నవన్నీ ఎలా అయితే లేకుండా పోతున్నాయో, లేకుండా పోయి మరల ఎలా వ్యక్తమౌతున్నాయో, ఎలా అవ్యక్తంలోకి చేరుతున్నాయో అదే రీతిగా నీలో ఉన్నటువంటి ప్రజ్ఞా స్థితిలోనికి చేరినప్పుడు ఆ ప్రజ్ఞ తన మూలమైనటువంటి పరమాత్మ స్థితిలోకి చేరినప్పుడు అదే రీతిగా జరుగుతుంది అని ఈ ఉపమానాన్ని జోడించారు.

నిజానికి ఎలా ఉన్నాయట?
''స్వాత్మానమేవాద్వయం..''

అద్వయం : రెండుగా లేవయ్యా బాబు! ఇవన్నీ అనేకంగా ఉన్నట్లుగా తోచేదంతా భ్రాంతి. ద్విపుటి, త్రిపుటి రెండూ భ్రాంతే అనేటటువంటి నిర్ణయాన్ని సూచిస్తున్నారు. రెండవ శ్లోకంలో ''బీజస్యాంత రివాంకురో'' ఒక బీజము నుండి ఒక అంకురము ఎట్లా తనకు తానే ఉత్పన్నం అవుతోందో, ఆ అంకుర శక్తి ఎట్లా అయితే అందులో స్థిరంగా ఉందో, కాలం అనుకూలించినప్పుడు దేశ కాల కలనలందు మూడు స్థితులందు అనంత విశ్వము ఎలా ఉందో చెప్పారు.

        ప్రాథమిక స్థితిలో, బీజ స్థితిలో దేశకాల కలనలున్నాయి. వాటిలో నుంచి అనంత విశ్వం అనే అంకురం ఉత్పన్నమవుతుంది. ఉత్పన్న మయినాక అది మరల వ్యావృత్తి చెందింది. ఎట్లా వ్యావృత్తి చెందింది?

''బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః''

        సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠనుండి ఎలా సంకల్పములు ఉత్పన్న మవుతున్నాయో, అదే రీతిగా బ్రహ్మ నిష్ఠలో ఉన్నటువంటి ప్రజాపతికి  సృష్టి సంకల్పం ఉద్భవించింది.

        అలా దానిద్వారా ప్రణవ బీజాక్షరం ఉత్పన్నమైంది. ఆ ప్రణవ బీజాక్షరం నుండే త్రిపుటి, త్రిగుణాత్మకమైనటువంటి ఈ శక్తి ఉత్పన్నమైంది. అటువంటి ప్రాదుర్భావం చేతనే, ఆ త్రిపుటియందు ఏర్పడినటువంటి అసమత్వం వల్లనే సమస్త సృష్టి తయారైంది.

        త్రిగుణాలు సమంగా ఉన్నప్పుడు 'అవ్యక్తం' అని పిలవబడుతోంది. అదే త్రిగుణాలు అసమత్వంనకు లోనవగానే సమస్త సృష్టి వ్యక్తమైంది. ఈ రకంగా తయారైంది.

''బీజాస్యాంత.. మాయాకల్పిత...''
మొదట మాయ కల్పించబడింది. దాన్నుండి దేశకాల కలనలు వచ్చినవి.

''మాయా కల్పిత.. వైచిత్ర చిత్రీకృతమ్‌''
        అనేక రకాలుగా కలసిపోయినవి. (permutations and combinations అపుడే మొదలయ్యాయి) విశ్వ ప్రాదుర్భావ కాలంలోనే అవి మొదలయ్యాయి.

        అయితే ఏమైందటా? ''మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా'' మాయ విజృంభణాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో, వాడు మహా యోగి.
'మహాయోగి' అంటే ఎవరు? సదా శివుడే మహాయోగి.

        ఆయనయందు ఈ మాయ యొక్క విజృంభణ శక్తి ప్రారంభమైంది. ప్రారంభమై, వ్యక్తమై, అనంత విశ్వాన్ని తానే తయారు చేసింది, పోషించింది, తానే మరల లేకుండా పోయింది.

        తనకు తానే పుట్టి, తనకు తానే లయించే మాయాశక్తి ప్రాదుర్భావం జరిగింది. ఇది రెండవ స్థితిలో చెప్పారు.

        బ్రహ్మాండములో నాదబిందుకళలు, విశ్వములో దేశ కాల కలనలు. ఈ రకంగా బ్రహ్మాండ సృష్టి, విశ్వ సృష్టి జరిగినవి. ఇది మాయా శక్తి యొక్క విలాసము.
విలాసము అంటే ఏమిటి? నీ విలాసము (నీ అడ్రస్‌) ఎక్కడా? మాయ యొక్క అడ్రస్‌ ఏమిటయ్యా!

''మహాయోగీవ యః స్వేచ్ఛయా..''
        నీవు ఆ సదాశివ స్థితిని పొందినట్లయితే, ఈ మాయా శక్తి నుండి విడుదల పొందుతావు. ముక్తి పొందుతావు, మోక్షాన్ని సాధిస్తావు. మాయ అనే బంధం లేకుండా పోతుంది ఇక.

        కాబట్టి మానవులందరూ కూడ అట్టి సదాశివ స్థితిని సాధించాలి. మహాయోగియైనటువంటి సదాశివ స్థితిని సాధించాలి. అప్పుడే నీవు దీన్నుండి విడుదల పొందుతావు.

దీనినే భగవద్గీతలో ఎలా చెప్పారు?

        గుణత్రయ విభాగ యోగంలో 'దైవీహ్యేషాగుణమయీ, మమమాయా దురత్యయా'
        ఈమూడు గుణాలతో కూడుకున్నటువంటి, దివ్యత్వంతో కూడినటువంటి మాయాశక్తిని దాటటం చాలా కష్టసాధ్యమైనటువంటిది,.

        కానీ ఎవర్ని ఆశ్రయిస్తే దాటవచ్చు? నన్నే శరణు పొందిన నీవు దానిని దాటగలవు అని చెప్తున్నారు.

        3వ శ్లోకంలో బ్రహ్మాండ సృష్టి నుండి పిండాండ సృష్ఠి ఎట్లా వచ్చిందో చెప్పారు. ఇందులో ''యస్యైవ స్ఫురణం సదాత్మకం..''

        ఆ 'సత్‌' అన్నటువంటి శుద్ధ సత్వం అనే దానిలో నుండి దైవీ సృష్ఠి వచ్చింది. రజస్సు నుండేమో జీవులొచ్చారు. తమస్సునుండేమో జడ పదార్థమైనటువంటి స్థావర జంగమాత్మకమైన సృష్ఠి ఏర్పడింది. ఇలా త్రివిధంగా సృష్టి ఏర్పడింది.

        శుద్ధ సత్వం అంతానేమో దైవీ సృష్టిగా ఏర్పడింది. దివ్యత్వానికి సంబంధించినటువంటి ప్రాదుర్భావం అంతా శుద్ధ సత్వంతో ప్రారంభమైంది.

        మిశ్రమ గుణమైనటువంటి (సత్వ, తమస్సుల మిశ్రమ గుణమైన) రజోగుణంలో జీవులన్నీ ప్రాదుర్భవించాయి.

        అట్లాగే కేవల తమస్సు ద్వారా పంచ భూతాత్మకమైన జడసృష్టి ప్రారంభమైంది.
ఈ విధంగా ''యత్సాక్షాత్కరణాద్‌ భవేన్న పునరావృతి ర్భవాం...''
ఈ పిండాండ సృష్టి నుంచి నీ లక్ష్యం ఏమిటటా? మరలా ప్రాదుర్భావమే జరగనటువంటి, ఏ కాలంలోనూ మరల పుట్టనటువంటి జన్మ రాహిత్య స్థితిని నీవు లక్ష్యించాలి.

        ఎలా వచ్చిందో చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్తున్నాడు? మరల నీవు ఏ కాలంలోనూ పుట్టనటువంటి ఏ స్థితిని లక్ష్యించాలో దానిని సూచిస్తున్నారు.

కాబట్టి 3వ శ్లోకం అత్యంత ముఖ్యమైనది.
        ''యస్యైవ స్ఫురణం.. భాసతే'' భాసించేవన్నీ అసత్తే. ప్రతిబింబించే వన్నీ అసత్తే. ఎన్ని స్థాయిలలో ప్రతిబింబాలున్నాయో, ఆ ప్రతిబింబాలన్నీ కూడ అసత్తే. సత్తు కాదు.

        నీవెవరు? సదాత్మకం : సత్యమైన ఆత్మ స్వరూపం. ఆ ఆత్మ ఎన్ని స్థానాలలో ఉంది? పరమాత్మైనా ఆత్మే. సర్వాత్మైనా ఆత్మే. ఇలా అన్నింటా ఆత్మ  శబ్దమే ఉంటుంది.కాబట్టి ఆత్మన్నా, నేనన్నా అభిన్నం. ఆత్మన్నా నేనన్నా భిన్నం అని అనుకోవడంతో వచ్చింది తగాదా.

కాబట్టి 'సాక్షాతత్త్వ మసీతి వేద వచసా...'
సాక్షాతత్త్వ అంటే - తత్త్వ సాక్షాత్కారాన్ని పొందాలి.

        ''తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః'' శ్రీ గురువు అంటే ఎవరయ్యా! ఎవరైతే ఆ 'తత్‌' అనే పదం యొక్క దర్శనం అనుగ్రహిస్తారో వారందరూ శ్రీ గురువులు.

        కాబట్టి గురుగీతలో అన్నీ ఎలా వస్తాయి? తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః
        ''అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం, తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః''

        అట్లా ఈ తత్పద దర్శనాన్ని 'సాక్షాతత్త్వ మసీతి వేద వచసా' నిరూపించినటువంటి పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉందో, అలాంటి మహానుభావుడుగా పరిణామం చెందాలి. ఆ మహత్తత్వ అనుభూతిని సాధించాలి. అలాంటి మహత్‌ స్థితిని సాధించిన వాడివైతేనే ఈ మాయను, అసత్తును దాటగలుగుతావు.

        'వేదవచసా' ఆ వేదం చెప్పినట్లుగా, శ్రుతులు చెప్పినట్లుగా పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో నీవుండాలి.

        ''సాక్షాతత్త్వ మసీతి వేద వచసా యో బోధ యత్యాశ్రితాన్‌''  ఎటువంటి బోధను ఆశ్రయించాలి? జన్మ రాహిత్య మార్గాన్ని అందించేటటు వంటి బోధను ఆశ్రయించాలి.

''యోగ వాశిష్ఠం, జ్ఞాన వాశిష్ఠం, బృహద్వాశిష్ఠం''
        వాశిష్ఠ సాంప్రదాయంలో ఇలా 3 రకాల స్థితులకు సంబంధించిన బోధను అందిస్తాయి. యోగ వాశిష్ఠం జీవ భావం నుండి ఆత్మ సాక్షాత్కారం వరకు ఉపయోగపడుతుంది. జ్ఞాన వాశిష్ఠం ఆత్మ సాక్షాత్కార స్థితినుండి, ఆత్మ నిష్ఠ నుండి బ్రహ్మ నిష్ఠుడిగా అవడానికి ఉపయోగపడుతుంది. బృహద్వాశిష్ఠం బ్రహ్మ నిష్ఠులై, జీవన్ముక్తులైనటువంటి వారికి అద్వైత సిద్ధి స్థితి నుండి పరబ్రహ్మ నిర్ణయానికి ఉపయోగపడుతుంది.

        కాబట్టి ఈ మూడు గ్రంథాలు వాసిష్ఠ సంప్రదాయంలో కెల్లా ఉత్తమమైన బోధను అందించేవి.

''యోబోధ యత్యాశ్రితాన్‌'' అందుకని అలా ఆ బోధను ఆశ్రయించాలి.
        అలాంటి సాంప్రదాయకమైన సాంఖ్య తారక అమనస్క పద్ధతులుగా ఉన్నటువంటి విధానాన్ని ఆశ్రయించాలి.

        బోధ అంటే ఏముండాలి? మూడు లక్షణాలుండాలి. సాంఖ్య తారక అమనస్కం. ఈ మూడు పద్ధతులుగా ఎవరైతే వివరించి, అందించి, దర్శించి, దర్శన స్థితిని నీకు అందిస్తున్నారో అటువంటిదేదో బోధ అనబడుతుంది.

        కేవల శాస్త్ర వచనములు గాని, కేవల శాస్త్ర సమన్వయము గాని, కేవలం సాధికారత లేనటువంటి స్వానుభూతి ప్రమాణం లేనటువంటి, దర్శన స్థితిని అందించలేనటువంటి బోధను 'బోధ' అనడానికి వీలుకాదు. సందేహ రహితంగా చెప్పడం ఎంత అవసరమో, శిష్యునియందు గురువు వ్యాపించడం కూడ అంతే అవసరము.

        శిష్యునియందు బోధ రూపంతో గురువు వ్యాపిస్తున్నారు. అలా వ్యాపించినప్పుడు మాత్రమే నీకు అందుతుంది.

        అలాగే అది నీకు దర్శన స్థితిగా ప్రాప్తిస్తుంది. అలా ప్రాప్తింప చేయకలిగే శక్తి సద్గురువుకు మాత్రమే ఉంటుంది. ఇప్పటివరకు అనంత విశ్వ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి వరకు చెప్పి ఈ నాల్గవ శ్లోకంలో ఒక వ్యష్టి గురించి చెబుతున్నారు.

        'నానాఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరం..' ఇప్పుడు మనందరం ఎలా ఉన్నాం? వ్యష్టి శరీరాన్ని ధరించి ఉన్నాం. ఈ వ్యష్టి శరీరాన్ని ఒక ఘట ప్రమాణంతో నిరూపించి చెబుతున్నారు. ఈ శరీరాన్ని ఒక కుండగా భావించు. ఆ కుండకు 9 చిల్లులు పెట్టాం. ఆ కుండ లోపల ఒక ప్రకాశించే దీపాన్ని కూడా పెట్టాం. ఈ చిల్లుల నుండి ప్రకాశం బయటకు పడింది. పడినప్పుడు బయట ఉన్న ప్రపంచంమీద ఈ ప్రకాశం ఎక్కడెక్కడైతే ప్రకాశించిందో ఆ ప్రపంచమే నీకు కనబడుతుంది. సత్యమేనా? ఎలా సత్యం?

        ఈ ప్రపంచంలో 750 కోట్ల మానవులున్నారు. నీ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? 10,20,50 లేక ఒక లక్ష. అంతేగాని 750 కోట్లమంది ఉండే అవకాశం ఉందా? లేదు.

        ఎందుకని? ''నానాఛిద్ర.. జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిః స్పందతే'' ఈ చక్షురాది ఇంద్రియముల ద్వారా బయటకు ఆ ప్రకాశము పడి ఏయే వాటియందు తాదాత్మ్యత చెందిందో, ఏ ప్రతిబింబ భావాన్నైతే పొందిందో అక్కడ అది పని చేసింది. ఆ వ్యహార రీత్యా ప్రపంచం ఏర్పడింది.

        కాబట్టి ప్రతిబింబ భావం చేతనే వ్యవహారం ఏర్పడుతోంది గాని, అభావ స్థితిలో ప్రపంచం లేదు. ఇది నీకు ప్రతిరోజు తెలుస్తున్నది కదా! అని చెప్తున్నారు.

        మరి ఒక శరీరమే ఒక ఘటమైనప్పుడు ఒక పిండాండం అంతా, సమస్త జీవరాసులూ ఘటములే. ఈ సమస్త జీవరాసులనే ఘటములందు, కుండ మధ్యలో ఉన్న ఆకాశం, కుండ చుట్టూతా ఉన్న ఆకాశం కంటే భిన్నమా? అభిన్నమా? అభిన్నం.

        కుండ చుట్టూతా ఆకాశం ఉందా? లేదా? ఉంది. కుండ లోపల కూడా ఆకాశం ఉందా? లేదా? ఉంది. మరి ఈ ఆకాశం, ఆ ఆకాశం భిన్నమని చెబుదామా? చెప్పటానికి వీలుకాదు కదా! ఆకాశాన్ని కుండ వేరు చేసిందని అనవచ్చా? అనకూడదు కదా! కాబట్టి ఈ పిండాండం అనేటటువంటిది కూడ ఘటమే.

        అరే, పిండాండం కాదయ్యా, పంచభూతాలతో కూడిన సమస్త సృష్టితో కూడిన బ్రహ్మాండం కూడ ఒక ఘటమే.  అనంత విశ్వం అనే అంతరిక్షంలో భూమి అనే పరిమితి చేత ఏర్పడినటువంటి పరిమాణం భిన్నం అయిపోయిందా? ఎట్లా అయిపోతుంది, అవదు కదా?

        కాబట్టి అనంత విశ్వంలో ఇది కూడ ఒక అంశమే. ఒక అణు స్వరూపమే. మరి ఒక సూర్యుడు, సూర్యుని చుట్టూతా తిరుగుతున్నట్టి  నవ గ్రహాలు, ఇదంతా పరిగణనలోకి తీసుకుంటే, అది కూడా ఒక ఘటమే.

        అందులో వెలుగుతున్న ప్రకాశదీపం సూర్యుడు. అంతేకదా! అంతకు మించి వేరే ఏముంది? అందులో నుండి ఏర్పడుతున్న ప్రతిబింబ ప్రకాశాలే నవగ్రహాలు. సూర్యుడనే ప్రకాశంలో నుంచి ఏర్పడుతున్న గ్రహాలు.

        ఒక ఘటానికి 9 చిల్లులు పెట్టాం. అందుకే గ్రహాలు కూడ 9. 9 పెట్టడానికి కారణం అదే. 9 గ్రహాలు అనడానికి కారణం అదే. ఇక్కడ నవ ద్వారములు, అక్కడ నవ గ్రహములు.

        ''నానాఛిద్ర ఘటోదరస్థిత మహా దీప ప్రభా భాస్వరమ్‌, జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిఃస్పందతే..''

        కాబట్టి ఎప్పటికప్పుడు ఏమౌతున్నాయి? ఆ 9 చిల్లుల ద్వారా బయటకు ప్రసరించినదంతా ప్రతిబింబ భావమే. ఎక్కడెక్కడైతే ఆయా ప్రతిబింబ భావం ప్రకాశించిందో అక్కడక్కడల్లా ప్రపంచం ఉన్నట్లుగా తోచింది. కాబట్టి సూర్యుడనే ప్రకాశం ద్వారా నవగ్రహాలేర్పడ్డాయి. ఆ ఘటానికి 9 చిల్లులు పెడితే నవగ్రహాలు ఏర్పడ్డాయి. అట్లాగే ఒక బ్రహాండ సృష్టి ఒక బిందు స్థానానికి వచ్చాం. నాదబిందు కళలలో బిందువే ప్రకాశించేది. బిందువులో ప్రకాశించేది కళ.

        ఆ ప్రకాశానికి మరల 9 చిల్లులు పెట్టాం. నవావరణములు ఏర్పడ్డాయి. సృష్టి మొత్తం నవావరణములుగా ఉన్నది. భూగ్రహం దగ్గర్నుండీ మొదలుపెడితే బిందువుదాకా ఆ విధానాన్ని వ్యక్తీకరించేదే శ్రీ విద్య.

        అక్కడ కూడా తొమ్మిదే. సృష్టి మొత్తం నవావరణములు. నీ శరీరానికి కూడ నవ రంధ్రాలున్నాయి.
''నవరంధ్ర కాయమన్నా, నిను నట్టేట ముంచునోరన్నా''
        ఇక్కడ కూడ 9 ఉన్నాయి. కాబట్టి ఈ 9 అనే సంఖ్య చాలా ఉత్తమమైన సంఖ్య అన్నమాట. వేదాంతంలో 9కి చాలా విలువివ్వబడింది.

9 తరువాత అంకెలు లేవు. 9 తరువాత సంయుక్త సంఖ్యలే ఉంటాయి.
అంటే '1' ప్రక్కన '0' పెట్టాలి. 9  తరువాత దశం లేదు.

'దశముడు ఎవరయ్యా' అనేది వేదాంత విచారణలో చాలా గొప్ప విచారణ.
'సోయం దేవదత్త' అనే విచారణకు నాంది పలికింది. దశముడు ఎవరయ్యా అంటే ఆ దేవదత్తుడెవరో వాడు వీడే. దీనినే మనకు కథలుగా అందించేపుడు ఎలా అందించారు? పరమానందయ్య శిష్యుల కథ ద్వారా పరమానందయ్య అంటే ఎవరు? గురువు గారు, సదాశివుడు సదాశివుడే పరమానందయ్య.
మనందరం ఎవరం? పరమానందయ్య గారి శిష్యులం.

        శిష్యులు ఎవరికి వారు వాణ్ణి వదిలేసి మిగిలిన శిష్యులను లెక్కపెడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎనిమిదే వస్తుంది. తొమ్మిదవది రాదు.సరే, ఇంతకీ ఎవరో వచ్చి ఏం అడిగారు? గురువుగారు వచ్చి, నాయనా! పదవ వాడు ఏడీ? దశముడెక్కడా? అని ప్రశ్నించారు.

ప్రశ్న : తొమ్మిదవ వాడు ఏడి అని అడగలా, పదవవాడు, దశముడెక్కడా? అని మరలా లెక్కించితే తొమ్మిది వచ్చింది.

        నాయనా! సోయందేవదత్త నీవే ఆ సదాశివుడవు, ఆ దేవదత్తుడవు నీవే. ఆ బ్రహ్మవు నీవే. ఆ ఆత్మ స్వరూపుడవు నీవే అని గుర్తు చేశారు. అప్పుడు లెక్క తేలిపోయింది.

''నానా ఛిద్ర ఘటోదరస్థిత ప్రభా భాస్వరమ్‌''
        కాబట్టి తొమ్మిది చిల్లులు లెక్క పెడదామా? పదవ వాడైన స్వప్రకాశాన్ని లెక్కలోకి తీసుకుందామా? నిజానికి పదవవాడా? మొదటివాడా? ఉన్నది ఒక్కడే. పది లేవు, తొమ్మిది లేవు. ఈ తొమ్మిది చిల్లులు మాత్రమే. అందుకని ఆయన ఏమన్నారు? నీవు తొమ్మిది, తొమ్మిది అంటే ఈ తొమ్మిది పట్టుకుంటావని, నానాఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరమ్‌

        ఒక కుండకు లెక్కలేనన్ని చిల్లులు పెట్టామండి. లెక్కలేనన్ని చిల్లులు పెట్టేప్పటికి 84 లక్షల జీవరాసులు అందులో ఉన్నట్లుగా వేరువేరుగా తోస్తున్నాయి.

        అమీబా వేరే, చేపలు వేరే, పక్షులు వేరే, ఖగ, మృగ వాటి సంతతులు వేరే. అలా విభిన్న సంస్కృతులతో, విభిన్న పద్ధతులుగా జీవరాశి అనేకత్వంగా తోచింది. భోగ్యంగా తోచింది. ఈ ప్రపంచం అంతా ఎలా తోచింది?   ఆభాస వలన భోగ్యంగా తోచింది.

        ఆ భోగ్యంగా తోచిన ప్రపంచం వలన మరల పడిపోయాడు. కనుక వెనక్కి తీసుకోవాలి. విరమించు, నిరసించు, నీ స్వస్థితిలో నీవు నిలబడి ఉండు అని 4వ శ్లోకంలో అతి ముఖ్యమైనటువంటి విధానమన్నమాట. కాబట్టి ఘటపట ప్రమాణం అనేది దేనికి వాడాలి?

        శరీరం దగ్గర్నుండీ మొదలుపెడితే, నవావరణ సహితమైన బ్రహ్మాండం కూడ ఘటమే. అట్లాగే 9 గ్రహాలతో కూడిన బ్రహ్మాండ సృష్టి కూడ ఘటమే. అలాగే అనంత విశ్వం కూడ ఘట సదృశమే. అనంతంగా కనపడుతున్న విశ్వం కూడ ఘటమే, ఒక కుండలాంటిదే. దానిలో నుండి ఏమి వచ్చింది?

        చిల్లులు పెట్టాం, పెడితే ఏమయింది? అనేక నక్షత్రాలు భాసిస్తున్నట్లు కనబడుతున్నాయి. అవి వాస్తవానికి ప్రకాశించడం లేదు. చిల్లులు ప్రకాశిస్తాయా ఎక్కడన్నా! ప్రకాశించవు. అందుకని ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఈ యూనివర్స్‌ మొత్తాన్ని కూడ ఒక బ్లాక్‌ హోల్‌ థియరీగా చెప్పుకుంటున్నాం.

        బ్లాక్‌ హోల్‌లో ఏముందీ అంటే అక్కడ ఈ సూర్యుడికి ఉన్న శక్తియే కాదు. బిలియన్‌ బిలియన్‌ ట్రిలియన్‌ సూర్యుళ్ళకు ఉన్నంత శక్తి ఉందట. నిన్ను ఆకర్షించడానికి దానికెంత శక్తి ఉండాలి? కాబట్టి అనంత కోటి బ్రహ్మాండములు కూడ ఆ కృష్ణ పదార్థము వలన, ఇదే 'కృష్ణ శక్తి' అంటే ఇదే 'కృష్ణుడంటే', కృష్ణతత్వం అన్న ఇదే.

        'కర్షతీతి ఇతి కృష్ణ' ఏదైతే బయటకు వెడల తోస్తోందో అదే మరల లోపలికి ఆకర్షిస్తుంది. అదే 'కృష్ణ' శబ్దం. 'కాబట్టి కృష్ణుడే ఆఖరి అవతారం'. 'అవతారాలు ఎనిమిది. తొమ్మిదవ అవతారం గురువు. పదవ అవతారం శిష్యుడు'. ఇవి దశావతారాలు.

        ఎవరెవరు గురువైతే వాళ్ళందరూ అంటే సదాశివ స్థితిని పొందిన వారందరు కూడా తొమ్మిదవ అవతారం. ఆ సదా శివుని ఆశ్రయించి ఎవరైతే అదే స్థితిని సాధించారో, ఆ గురువుతో ఐక్యతా సిద్ధిని సాధించారో వారే దశములు. దశముడు ఎవరయ్యా! అని గురువు శిష్యులలో వెతుకుతూ ఉంటారట.

        ఇదీ దశముడంటే అర్థం. తనతో ఐక్యతా సిద్ధిని పొందగలిగేటటు వంటి సచ్చిష్యుడు ఎవరా? అని గురువు వెతుకుతూ ఉంటారు.

        అదే దశమావతారం. పదవవాడే 'కల్కి'. కల్కి అంటే గుఱ్ఱం ఎక్కి అందరి తలుపూ తడతాడని కాదు. మానవ పరిణామాన్ని శాసించగలిగేటటు వంటి విజ్ఞానాన్ని అందించే వారందరు కూడ కల్కి స్వరూపులే. కాబట్టి ఈ దశావతారాలను జ్ఞాన పద్ధతిగా నిర్ణయం తెలుసుకోవాలన్నమాట.

        ఇలా పౌరాణికంగా చెప్పబడిన వాటినన్నింటిని, ఈ ఆత్మ జ్ఞాన పద్ధతిగా, బ్రహ్మజ్ఞాన పద్ధతిగా, పునర్నిర్వచనం చేసుకోవాల్సిన అవసరమున్నది.      అవి యే స్థితిని సూచిస్తున్నాయో, ఆ స్థితిని ఆధారం చేసుకుని, పరబ్రహ్మ నిర్ణయానికి చేరడానికి సోపానములుగా వాటిని మార్చుకోవాల్సిన అవసరమున్నది.

కాబట్టి ఈ శ్లోకంలో ఏమి చెప్తున్నారు?
''నానాఛిద్ర.. ఏతత్‌ సమస్తం జగత్‌''

        ఈ రకంగా జగత్‌ ప్రాదుర్భావ లయాలను బోధిస్తూ, ఇంకా ఏం బోధించుచున్నారు?
        అవతారాలు అనంతంగా యుగప్రమాణంగా వస్తున్నాయి. కాలానుగుణ్యంగా ఎన్నో యుగాలు గడిచిపోతున్నాయి.

సంకల్పంలో ఏం చెబుతారు?
        వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, 'మేరో దక్షిణ దిగ్భాగే' ఇలా చెప్పుకుంటున్నారుగా...

        కాబట్టి ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాం? 'వైవస్వత మన్వంతరంలో ఉన్నాం'.  మనకి మన్వరతరాలున్నాయన్నమాట. ఆ కాల విభజన అంతా బ్రహ్మాండ పురాణంలో చక్కగా చెప్పబడింది.

        ఒక్కొక్క మన్వంతరం ఎంతకాలం ఉంటుంది? ఆ మన్వంతరంలో ఎన్ని మహా యుగాలుంటాయి? ఆ మహా యుగాలలో ఎన్ని యుగాలు గడచిపోయినవి? ఇప్పటికి ఎంతమంది రాముళ్ళు, కృష్ణుళ్ళు వచ్చి వెళ్ళిపోయారు? ఎన్ని దశావతారాలు వచ్చి వెళ్ళిపోయినవి? ఈ వివరణ అంతా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది

        అందుకనే లలితా సహస్ర నామంలో ఏమంటున్నారు? ఆమె కొనగోట మీటితే అనంతసృష్టి ఏర్పడింది అంత సమర్ధవంతమైనటువంటిది 'మూల ప్రకృతి'. ఆమె ఎవరు? 'అనంత విశ్వశక్తి కాస్మోస్‌' ఆ కాస్మోస్‌లో బ్రహ్మాండాలెన్నో పుడుతుంటాయి. ఒక్కో బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు రుద్రులుంటారు. సృష్టి స్థితి లయాలు జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి అనంత విశ్వంలో అనేకం జరిగిపోతూ ఉంటాయి.

        ఆ జరిగిపోయే వాటన్నింటికి ఆధారంగా ఉన్నది మూల ప్రకృతి. అట్టి మూల ప్రకృతిని దాటినటువంటి వాడెవరో వాడు జన్మ రాహిత్య స్థితిని సాధించినవాడు. మరి అట్టి మూల ప్రకృతిని గురించి వాక్కులో చెప్పడం వీలవుతుందా? అవాంగ్మానసగోచరం నీవు నిద్రలోకి వెళితేనే నీవాక్కు వెనక్కు వెళ్ళింది కదా, నీ మనస్సు వెనక్కి పోయింది కదా! కాబట్టి వ్యక్తముగా ఉన్నంతసేపే వాక్కు, మనసు పని చేస్తుంది.

        ఈ వ్యక్తం నుండి అవ్యక్త స్థితికి, అవ్యక్తం నుండి మహత్‌ స్థితికి, మహత్‌ నుండి మహతత్త్వ స్థితికి, అక్కణ్ణించీ ఇంకా ముందున్న బ్రహ్మీభూత స్థితికి, దానికంటే ముందున్నటువంటి పరబ్రహ్మ నిర్ణయ స్థితికి తీసుకుని వెళ్ళాలి అంటే, మరి ఈ వాక్కు, మనసు తోడ్పడతాయా?

         ఏ దర్శనంలో అయితే వాక్కును, మనసును దాటినటువంటి అతీతమైన దృష్టి ఉన్నదో, అటువంటి అతీతమైన దృష్టి ద్వారా మాత్రమే దీనిని ఎవరైనా పొందగలరు.

        కాబట్టి దృక్‌ దృశ్య వివేకం లేకుండా, కేవలం దృక్‌ స్థితి లేకుండా దీనిని సాధించలేరు అని మనకి పునఃపునః బలపరుస్తున్నారు.

        కాబట్టి మానవులందరూ మొట్టమొదట ఆత్మ సాక్షాత్కారం అనే దర్శనాన్ని హృదయ స్థానంలో పొందాలి. ఆ దర్శనంతో ప్రారంభమై అనంతమైన దైవీ దర్శన స్థితులను సాధిస్తూ ఆ దివ్యత్వ స్థితిని అందుకోవాలి. తరించేటటువంటి తారకము అంటే అర్థం అదే. జీవభావం నుండి ఆత్మభావం వరకు రావడానికి, ఆత్మ భావం నుండి బ్రహ్మ భావానికి, బ్రహ్మ భావం నుండి పరబ్రహ్మ నిర్ణయానికి తరించడమే తారకం. ఆయా స్థితులలో నిష్ఠ కలిగి నిశ్చలముగా ఉండడమే అమనస్కం.

ఎందుకనిటా?
        జీవ భావంలోనే మనస్సు యొక్క ప్రాధాన్యత ఉంది, తరువాత లేదు. మనసుకు ఉనికే లేదు. అసలు మనసున్నదనడానికి మనసు లేదు. మనసే లేకపోతే నీవున్నావని ఎలా చెబుతావు? ప్రపంచం ఉన్నదనీ, అనేకత్వం ఉన్నదనీ ఎలా చెబుతావు? భోగి, భోగ్యముల నిర్ణయాలు ఎలా చెప్పడం? ఇదంతా, విచారణంతా కూడ జీవభావంలోనే ఉంటుంది. కానీ పైకి వెళ్ళేకొద్దీ ఈ అనేకత్వ విచారణకు అవకాశమే లేదు. కేవలం ఏకత్వానుభూతి ద్వారా ద్వైత పద్ధతిగా మాత్రమే విచారణ సాగుతూ ఉంటుంది.

        ఈ ఆత్మ నిష్ఠ, బ్రహ్మ నిష్ఠ, పరబ్రహ్మ నిర్ణయం ఇదీ ఈ దర్శన పద్ధతిగా సాగేటటువంటి విధానం.

        కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్పాయి? షడ్డర్శనాలను ఎవరైతే సాధించారో వారు ఆ దర్శన పద్ధతిగా వీటిని పొందగలిగే అవకాశం ఉంది. సాంఖ్యము, యోగము కూడ దర్శనములే. ఇవి అన్నీ దర్శన గ్రంథాలు. నీలో ఆ దర్శన స్థితిని ఆవిర్భవింపజేసేంతవరకే వాటియొక్క ప్రభావం. ఆ తరువాత వాటి ప్రభావం లేదు.

        ఎప్పుడైతే నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందావో, సాంఖ్యం యొక్క ప్రభావం గాని, యోగం యొక్క ప్రభావం గాని, షడ్దర్శనాలలో మిగిలిన వైశేషిక, మీమాంస దర్శనాలు గాని -వీటన్నింటియొక్క ప్రభావం ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ముగిసిపోతుంది.

        తరువాత కేవలం సద్గురు బోధా శ్రవణం చేత మాత్రమే దీనిని సాధించడానికి వీలవుతుంది.

        కాబట్టి అటువంటి 'దక్షిణామూర్తి అయినటువంటి సద్గురు మూర్తిని ఆశ్రయించాలి. హృదయంతో ఆశ్రయించాలి. హృదయంతో ఏకత్వ స్థితిని సాధించాలి'.

        గురువు ఏ స్థితిలో అయితే 'సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ' పద్ధతిలో ఉన్నారో, ఆ స్థితిగా నీవు ఉండటం తెలియాలి, సిద్ధింపజేసుకోవాలి. అక్కడ సాధన ఉండదు, సిద్ధి మాత్రమే ఉంటుంది.సాధన లేనిదే సిద్ధి ఎలా ఉంటుందంటాడు జీవ భావంలో ఉన్నవాడు? ఐక్యత చెందితే సాధనతో     పనిలేదు.

        గర్భస్థ శిశువును తల్లి పోషిస్తుందా లేదా? పిల్లవాడు ఏమి అడిగాడని తల్లి తీరుస్తోంది? అడిగాడా? అడగలేదుగా. కానీ తల్లి తీరుస్తోంది. తల్లి నుండి స్వీకరించడం పిల్లవాడి ప్రభావమా? తల్లి ప్రభావమా? పిల్లవాడిదే కదా. సిద్ధస్థితా? సాధ్యస్థితా? ప్రయత్నం చేసి తీసుకుంటే సాధ్యస్థితి. ప్రయత్నంతో పనిలేకుండా అయితే సిద్ధస్థితి.


        కాబట్టి గురువుతో ఐక్యతా సిద్ధివల్ల మాత్రమే, ఇటువంటి అంతర్ముఖ మైనటువంటి ప్రయాణం పూర్తి అవుతుంది. కాబట్టి అటువంటి సిద్ధస్థితిని సాధించమని ఈ దక్షిణామూర్తి మౌనవ్యాఖ్యా విధానం బోధిస్తుంది.

5వ శ్లోకం

       దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాం బుద్దించ శూన్యంవిదుః |
       స్త్రీబాలాన్ధ జడోపమాస్త్వహమితి భ్రాన్తా భృశం వాదినః |
       మాయా శక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే |
       తస్మై శ్రీ గురుమూర్త యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్త యే ||

        'వ్యామోహ సంహారిణే' అనేది ముఖ్యమైన పదం.
        ఇప్పటివరకూ సృష్టి క్రమం అంతా వివరించి చెప్పిన తరువాత మానవుడి యొక్క వ్యామోహ లక్షణాన్ని చెప్పుచున్నారు. ఈ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? వ్యామోహ లక్షణాన్ని సంహరించడం ఎలాగా? సంహరించడం అంటే? మహిషాసుర సంహారం. హరణము అంటే తొలగించుట. అసలు ఈ 'హర' అనే శబ్దం ఇద్దరికుంది. హరిహరులకు. ప్రధాన దేవతలు శివుడు, విష్ణువు (హరిహరులు). వాళ్ళ పనేంటి? సర్వమును హరించడమే వారి పని. హరి పనిగాని, హరుని పనిగాని ఒక్కటే సర్వాన్ని హరింపజేయడం.

        మనందరం సర్వాన్నీ హరింపజేసేటటువంటి హరిహరుల్ని ఆశ్రయిస్తున్నామా? లేక వారి సంకల్ప శక్తులైనటువంటి లక్ష్మీ పార్వతులను ఆశ్రయిస్తున్నామా? వారి సంకల్ప శక్తి మాయా శక్తి కాదా! కాబట్టి మాయను ఆశ్రయిస్తున్నామా? ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నామా? మాయను ఆశ్రయిస్తున్నాం. కాబట్టి వ్యామోహం బాగా పెరిగిపోయింది. ఇదీ కారణం.

        కాబట్టి కేవల జ్ఞాన పద్ధతిగా ఎవరైతే సాధన చేయదలచుకున్నారో వారేం చేస్తారు? ఈ హర అనే శబ్దాన్ని, సర్వమును హరింపజేసేటటువంటి పద్ధతిని ఆశ్రయిస్తారు. ఏదీ మిగల్చకూడదు. చిన్నప్పుడు భాగాహారాలు చెప్పేవారు.

        నిశ్శేషముగా భాగించవలెను, శేషం ఉండకూడదు. శేషం ఉంటే ఏమౌతుంది. 'బీజస్యాంత రివాంకురో...' బీజం మిగిలిపోయింది. శేషం మిగిలిపోతే ఏమైంది? ఒక కాలంలో కాకపోతే ఒక కాలంలో అది మరల పునః అంకురిస్తుంది. తప్పదు.

        కాబట్టి నేనెప్పటికైనా సరే నిశ్శేషంగా లేకుండా పోవాలి. 'నాహం' నేను లేనటువంటి స్థితిని సాధించాలి. నన్ను నేను ఎవరో తెలుసుకోవాలి, నన్ను నేను పోగొట్టుకోవాలి. ''వ్యామోహ సంహారిణే'' వ్యామోహం అంటే ఏమిటి?

        విశేషమైన మోహం. విశేషమైన మోహం అంటే? హరి జగన్మోహిని అవతారం ఎత్తాడు. ఆయన అవతారం జగన్మోహిని అవతారం. ఎప్పుడూ? అమృతాన్ని పంచేప్పుడు. క్షీర సాగర మధనం జరిగేప్పుడు జగన్మోహినీ అవతారం ఎత్తాడు. అంటే జగత్తును మోహింపచేయగల్గే సమర్ధత, శక్తి ఎవరిలో ఉందట? ఆ మాయా శక్తిలో ఉంది. జగత్తును అంటే దేవతలను, అసురులను అందర్నీ ఏక కాలంలో మోహింపజేయగల్గిన శక్తి.

        కాబట్టి అనంతమైనటువంటి కాస్మోస్‌ నే వశపరచుకున్నట్టి మోహశక్తి ఏదైతే ఉందో,ఆ మోహానికి లోనైన వాడేమవుతాడట? కదుల్తూ ఉంటాడు.

        ఉన్న స్థితిలో కదలకుండా ఉండవయ్యా! అని గురువుగారు చెబుతూ ఉంటే ఉన్న స్థితిలో నుంచి కదులుతూ ఉంటాం. కదలికయే మోహం అంటే. ఈ మోహానికి మూడు ప్రతిబింబాలున్నాయి. 'ప్రియమోద ప్రమోదాలు' ఈ ప్రియమోద ప్రమోదాలే కారణావస్థగా తయారైనాయి. స్థూల సూక్ష్మ కారణములలో ఆ కారణావస్థలో ప్రియమోద ప్రమోదము లున్నాయి. ఈ మూడూ కలిపితే 'మోహం'.

        కాబట్టి ఆది శంకరులు ఏం చేసారంటే, ఈ మోహం తొలగితే కాని వీళ్ళు బాగుపడరు అని 'మోహముద్గరం' అని ఒకటి చెప్పారు.

        'ముద్గరం' అంటే ఏమిటి? ఒక గదతో నెత్తిమీద కొడితే గాని ఆ మోహం దిగదట. మామూలుగా దిగదట. హరి చేతిలో ఉండేటటువంటి  'కౌమోదకీ' అనే గదతో జీవుల తలమీద కొడితే గాని ఆ తలకి ఎక్కి ఉన్న మోహం దిగదట.

        మనందరం నిద్రావస్థలో తల వాల్చేస్తున్నామా లేదా? తల స్థిరంగా ఉంటే లాభం లేదు, అలా రాదు నిద్ర.

        'భజగోవిందం' అనే పేరుతో ప్రాచుర్యం పొందిన స్తోత్రం 'మోహముద్గరం'. భజగోవిందం యొక్క వాస్తవికమైన పేరు మోహముద్గరం. అందరూ అనే భజగోవిందం అనేది అందులోని మకుటంలోనిది. ''గోవిందం భజ మూఢమతే''  ఆ మూఢమతి దేనివలన వచ్చిందటా? ఈ మోహం వలన వచ్చింది.

        మోహం అంటే ఏమిటి? పునః పునః, పునః పునః ఏమైనా సరే పొందాలి అనడమే 'మోహం'.

        కాబట్టి ఆ మోహ లక్షణాలు వేటితో అయితే ముడిపడి ఉన్నాయో ఈ శ్లోకంలో చెబుతున్నారు. ఎలాంటి మోహం? వట్టి మోహం కూడ కాదు, విశేషమైన మోహం. వ్యామోహం. విశేషమైన మోహం అంటే ఏమిటి?

        మనం రోజూ తినే అన్నమే తినుట లేదా? రోజూ పోయే నిద్ర పోవుట లేదా? ఇక నాకు వద్దు అని ఎప్పుడైనా అన్నామా? అనలేదుగా ఎందుకు? విశేషమైన మోహం. 84 లక్షల జీవరాసులందంతటా ఈ మోహ లక్షణం వ్యాపించి ఉన్నది.

        తత్‌ ప్రభావం చేతనే ఎన్నోసార్లు పుట్టి, ఎన్నోసార్లు జీవించి ఎన్నోసార్లు పోయినప్పటికీ జనన మరణాల మీద నీకు మోహం పోలేదు అని మరల మరల చెప్తున్నారు.

        ఇంకా పుట్టాలి ఇంకా అనుభవించాలి, మళ్ళీ పోవాలి, పోవటం కూడ మోహంలో భాగమే. శరీరం శిధిలమై, సహకరించక అశక్తత వచ్చేస్తుంది. కానీ లోపలున్నటువంటి జీవుడికి మాత్రం ఆసక్తులు నశించలేదు.

''తలలు బోడులైన తలంపులు బోడులగునా!'' అన్న సామెత ఇదే.
        కాబట్టి ముందు మనం ఏం పోగొట్టుకోవాలి? ఆసక్తులను పోగొట్టు కోవాలి.    కానీ ఆ ఆసక్తులు పోగొట్టుకోకుండా జీవించితే ఏమయింది? ఆ ఆసక్తులకు అనుగుణంగా ఈ శరీరం సహకరించదు. ఇప్పుడు ఏం వాంఛించడం మొదలుపెట్టారు? ఇది పోయి ఏదో కొత్త శరీరం వస్తే బావుండు అని. కొత్త శరీరం వస్తే మరల అనుభవమే, మరల పుట్టనూవచ్చు, మరల అనుభవించనూ వచ్చు.

        కాబట్టి ఇప్పుడు మరణం కూడ ఎందులో భాగమైంది? మోహంలో భాగమైంది. కాబట్టి మరణం కూడ నీ వాంఛలో భాగమైంది.

        అవతారుడైనట్టి మోహర్‌బాబా ఒక ప్రశ్న అడిగారు. ' నా వాంఛితము ననుసరించి నీవు జీవిస్తున్నావా? నీ వాంఛల ననుసరించి నీవు జీవిస్తున్నావా?' 'నా వాంఛితము ననుసరించి నీ మూలాన్ని నీకు తెలియజెప్పి నీ మూలమే లేనటువంటి స్థితిలోకి జన్మ రాహిత్యమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికే నా ఈ అవతారం ప్రాదుర్భవించింది' అన్నారు 'మెహర్‌బాబా'. కాలంలో అవతారములు ఎప్పుడు ప్రాదుర్భవిస్తాయి? ఆ అవతార కాలంలో వారిని ఆశ్రయించినటువంటి వారు జన్మ రాహిత్య స్థితికి చేరతారు. అవతార లక్ష్యం అది.

        'అది సంహరణ'. సంహరణ అంటే అర్థం ఏమిటి? నీ మూలం అనేటటువంటి జనన మరణాలనేవి సమూలంగా లేకుండా పోవడం. మరల జన్మే లేనటువంటి స్థితి 'సంహరణ'.

        దీనికొక రహస్యం ఉంది. ఎలా అంటే మనకి వ్యతిరేకార్థంతో తీసుకోవడం అలవాటైపోయి పురాణాలను కూడ అలా తీసుకుంటున్నాం.

        జయ విజయులు అని ఒక కథ ఉంది. బ్రహ్మ మానస పుత్రులైనటు వంటి సనక సనందాదులున్నారు.

        సనక సనందనాదులంటే? సృష్ట్యాదియందు బ్రహ్మమమనే ప్రజాపతి ఒక్కరే ఉన్నారు. వారికి ఈ నలుగురు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఉన్నారు. వీరు బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళు పుడుతూనే బ్రహ్మ జ్ఞానంతో పుట్టారు. వీళ్ళకి వ్యామోహం లేదు. వాళ్ళు పుడుతూనే ఒక ప్రశ్న అడిగారట. వీళ్ళు సశరీరులుగా పుట్టలేదు. అశరీర పద్ధతిగా పుట్టారు.

                అలా పుట్టినవాళ్ళు మహా వ్యామోహం అనేది లేకుండా చేసేదేమైనా ఉందా? ఏ కాలమునందునూ మరల జన్మ ఎత్తే అవకాశం లేని పద్ధతేదైనా ఉందా? అని అడిగారట.

        బ్రహ్మగారు 'అస్తు' 'ఉంది' అన్నారట. 'తథాస్తు' అన్నారట. అనగానే ఏమైంది? 'తత్‌' 'అస్తు' అదే సిద్ధించుగాక! మనం ఎవర్నైనా ఆశీర్వదించాలంటే ఏమంటాం? 'తథాస్తు'

        పెళ్ళి మంత్రాల్లో గాని, చాలా వాటిల్లో ఆశ్వీచనం తరువాత 'తథాస్తు' అంటారు. అంటే అర్థం అదే అగుగాక! అని.

'అదే' అంటే ఏ పరబ్రహ్మమైతే నిర్ణయమై ఉన్నదో, అదే అగుగాక!

        కాబట్టి 'బ్రహ్మ జ్ఞానంతో పుట్టిన మీరు ఆ పరబ్రహ్మమే' అని బోధించారు. బోధించగానే వాళ్ళకు ఏమైందటా? జన్మ రాహిత్య స్థితి సిద్ధించింది. బోధాకాలము నందే, ఏ తత్‌ క్షణమే పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ నిర్ణయాన్ని వారు తెలుసుకున్న వారయ్యారు. అందువలననే వారు బ్రహ్మ మానస పుత్రులయ్యారు.

        అటువంటి బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సచ్చిష్యుని కోసం వెదుకుతూ ఉంటారట, సద్గురుమూర్తి. సద్గురుమూర్తి యొక్క అన్వేషణంతా ఎప్పుడూ ఎవరికోసం? ఇటువంటి బ్రహ్మ మానస పుత్రులు ఎక్కడున్నారా? అని.

        అవతారాలన్నీ దానికోసమే వస్తాయి. కానీ ఈ అవతార వైశిష్ఠ్యత చేత, ఆ విశిష్ఠతను తెలుసుకోలేక, వ్యామోహం చేతనే ప్రవర్తించేటటువంటి జన్మలతో మనం జీవిస్తున్నాం.

        ఏమిటట విశేషమైన మోహం? ఎన్నో లక్షల సార్లు పుట్టాం. ఎన్నో కోట్లసార్లు పోయాం. అవునా లెక్కేమైనా ఉందా దానికి?

        ఎన్నిసార్లు ఏ బ్రహ్మాండములో పుట్టావో, ఈ బ్రహ్మాండములోనే కాదు, ఈ సారి ఇలా ఈ బ్రహ్మాండములో ఈ భూమిమీద పుట్టావు. ఈ భూమిమీద కూడ అమీబా నుండి మొదలుపెడితే మధ్యలో ఎన్నిసార్లు పుట్టావో, ఎన్ని సార్లు పోయావో, ఎన్ని సార్లయినా అదే సంసారం కదండీ!

        కొత్త సంసారం ఏమైనా వచ్చిందా? కుక్కకి, పిల్లికి, నక్కకి, పులికి, సింహానికి, పక్షులకూ ఏ సంసారం ఉందో, మానవులకు కూడ అదే సంసారమే ఉంది కదా!

        ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? లేదే. మరి ఈ సంసార వ్యామోహం నశించలేదే. ఎన్నిసార్లు నీవు ఆ సంసారాన్ని అనుభవించినప్పటికీ తరించాలనే లక్షణం స్ఫురించలేదే. ఆ స్పర్శ కలగటం లేదే, ఆ అధిగమించాలనే స్ఫురణ కల్గటం లేదే.

        అధిగమించాలా వద్దా? మరి వ్యామోహాన్ని సంహరించాలా వద్దా? బీజమే లేకుండా ఉండేలా సంహరించాలా వద్దా? కాబట్టి సద్గురు మూర్తిని దేనికొరకు ఆశ్రయించాలి? వ్యామోహాన్ని బలపరచడానికా? వ్యామోహాన్ని సంహరించడానికా? సంహరించడానికి. సంహరించడానికే.

        కాబట్టి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సద్గురు మూర్తిని ఆశ్రయించి, తాత్కాలిక కష్టసుఖాలు తీర్చమని అడగాలా?

        ప్రపంచంలో మానవులందరూ కోరికలతో దైవాన్ని ఆశ్రయించి, ఏమి పొందాలని ఆశిస్తున్నారు? ఏ సంసార భ్రాంతిని తొలగించడానికైతే దివ్యత్వం ఆధారపడాలో, ఆ సంసార భ్రాంతిని బలపరచుకునే నిమిత్తం నీవు దానిమీద ఆధారపడుతున్నావు. వివాహం చేసేప్పుడు లక్ష్మీ నారాయణ స్వరూపులుగా భావించి, నీకు వివాహం జరుపుచున్నారు.

        అందువలన పెండ్లికుమారుని కాళ్ళు అతడి మామగారు కడుగుతున్నారు. ఆయనెవరు? సీనియర్‌ లక్ష్మీ నారాయణులు. వీరు జూనియర్‌ లక్ష్మీనారాయణులు. కాబట్టి వివాహ కాలంలో బోధించేదంతా ఏమిటి అంటే ఈ వ్యామోహాన్ని హరించిన 'హరి' స్వరూపులు వాళ్ళు. వారు బోధిస్తున్నారు నీకు అప్పుడు.

        'నాయనా! నేను తరించాను, గృహస్థాశ్రమం ద్వారా ఆ 'హరి' ఎలా ఉన్నాడో తెలుసుకోగలిగాను. సర్వమునూ హరించేటటువంటివాడు, ఆ హరుడు ఎలా ఉన్నాడో తెలుసుకున్నాను. ఆ హరిహరుల యొక్క స్థితిని నేను అనుభవించాను. కాబట్టి ఆ మార్గంలో నీవు కూడ ప్రయాణం చేయి. ఈ వ్యామోహాన్ని సంహరింపజేసుకో. గురువును ఆశ్రయించు'. అనే బోధ ద్వారా నిన్ను గృహస్థాశ్రమంలో ప్రవేశపెడ్తున్నారు.

        కానీ మానవులందరూ గృహస్థాశ్రమాన్ని భోగ్య జీవనంగా మార్చుకుని జీవించే పద్ధతిగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు మనకీ, జంతువుకీ పెద్ద తేడా ఏముంది? ఎన్నోసార్లు అది పుట్టిపోయింది. మనమూ పుట్టి పోయాం. పెద్ద తేడా ఏమీలేదు. మానవుడు చెప్పుకునేటటువంటి వస్త్రధారణ, అలంకార ధారణ, ఇతరత్రా ప్రపంచ వ్యావృత్తి, విస్తృతి ఇవన్నీ మోహ లక్షణాన్ని బలపరచేవిగా ఉన్నాయి కాని, మోహ సంహారకములు కావయ్యా! అసలు మనసును మధించేటటువంటి మన్మధుడు బలపడుతున్నాడా? మన్మధుడికి శత్రువైన హరుడు బలపడుతున్నాడా? మన లక్ష్యం ఎవరు? హరుడా? మన్మధుడా? హరుడే!

        కానీ మనం నిరంతరాయంగా ప్రపంచంలో ఏమి చేస్తున్నాం? ఏది చూస్తే మనసులో కదలికలు కదులుతున్నాయో, అది 'మధనం'. అంటే బలమైన కదలికలు, వాంఛలు బలపడుతున్నాయి. కొత్తవి మేల్కొంటున్నాయి.
తద్వారా ఏమౌతున్నావు? వ్యామోహంలో పడుతున్నావు. ''వ్యామోహ సంహారిణే'' అనే లక్ష్యం పోయింది. లక్ష్యాన్ని సాధించాలనే దృష్టితో ఉండాలి.

        ''దేహం ప్రాణమపీంద్రియాణ్యపిచలాం బుద్ధించ శూన్యంవిదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః''

        మన గురించి ఎంత బాగా చెప్పారు! ఇంతకంటే చెప్పగలిగినవారు లేరు. ఏమిటటా?
'దేహం ప్రాణ.. చలాం..'

        నీ దేహాన్ని చూసి మురిసిపోతున్నావు. ఆ ప్రాణం అనే కదలిక లేకపోతే ఈ దేహం ఎక్కడా? ప్రాణ చలనం అనే కదలిక లేకపోతే ఈ దేహానికి విలువుందా? అని ప్రశ్నించుకోమంటున్నారు.

        రోజూ అద్దంలో చూస్తున్నప్పుడు, నా శవాన్ని నేనే చూస్తున్నాను అనుకోవాలి. ఎందుకని? ఆ ప్రాణ చలనం ఉడిగిపోతే ఈ దేహమే శవం. అంతకంటే దీనికేం విలువ లేదు. కానీ నీ మొదటి వ్యామోహం దేనితో ముడిపడింది? దేహంతో ముడిపడింది. కాబట్టి వ్యామోహం గురించి వివరించడానికి దేహం దగ్గరే మొదలుపెట్టారు.

        దేహం అంటే ఏమిటి అసలు ''దహితీతి ఇతిదేహః'' దహియించబడేది దేహం. దహించబడటం అంటే కాలిపోవడం. ఎప్పుడు కాలిపోతుంది ఈ దేహం? నిరంతరాయంగా వైశ్వానరాగ్నిచేత దహింపబడుతోంది.

        నీ లోపల పంచాగ్ని స్వరూపం ఉన్నది. అదే అగ్ని పంచకం. ఆ అగ్ని స్వరూపం నీ లోపల కూడ ఉంది. పంచభూతాలలో ఉన్న అగ్ని స్వరూపం నీలో లేదా? ఆ అగ్ని పంచకం చేత నిరంతరాయంగా దహించ బడుతున్నది ఏదో అది దేహము.

        కాబట్టి సాంఖ్య విచారణ అత్యావశ్యకము. అది తెలుసుకోకుండా, ఎన్ని తెలుసుకున్నా కూడ అది స్ఫురించదు.

        కాబట్టి మృత్యువు ఎక్కణ్ణుంచి వస్తోంది. ఏ వైశ్వానరాగ్ని అయితే ఒక స్థానంలో మాత్రమే ఉండి, నన్ను దహిస్తూ ఉన్నప్పుడు అది ఆకలిగా పేర్గాంచిందో ఆ ఆకలే దేహమంతటా వ్యాపించినప్పుడు మృత్యువైంది.

        కాబట్టి మృత్యువు కూడ అగ్ని స్థానమే. కాబట్టి ఈ దేహం అనేది నిరంతరాయంగా దహింపబడుతోంది.  కాబట్టి దేహం అనేది దహి అనే శబ్దంచేత ప్రారంభించారు. ప్రాణాగ్నిచేత దహింపబడుతోంది. గాలి కొడుతున్నామా లేదా?

        గాలి కొడుతున్నంతసేపూ నీ లోపల ఏం జరుగుతోంది? అగ్ని పుడుతోంది. వైజ్ఞానిక శాస్త్రం చెబుతోంది. మైటోకాండ్రియాలో శక్తి విడుదల అవుతోంది. ఎలా విడుదల అవుతోంది? కణాలు బద్దలై పోతున్నాయి. అణు విభజన జరుగుతోంది. అయొనైజేషన్‌ జరుగుతోంది. విస్పోటనం జరుగుతోంది. శక్తి విడుదల అవుతోంది. ఆ శక్తి విడుదల జరిగినప్పుడల్లా పాత కణాలు నశించి కొత్త కణాలు పుడుతూ ఉంటున్నాయి. పాత కణాలు నశించి కొత్త కణాలు పుడుతూ ఉంటే నీ చర్మం 7 సంవత్సరాలలో పూర్తిగా మారిపోతూ ఉంటుంది. 7 సంవత్సరాల క్రితం చర్మం, ఇప్పటి చర్మం ఒక్కటే కాదు. 7 సంవత్సరాలలో 7 కొండలు మారుతూ ఉంటాయి. అది సృష్టి ధర్మం. నిరంతరాయ పరిణామ శీలం కలది. నిరంతరాయంగా చస్తోంది. నిరంతరాయంగా పుడుతోంది. ఈ చావు పుట్టుకల మధ్య దహించబడుతోంది. పోతూ ఉన్న కణాలన్నీ నిరంతరాయంగా దహించబడుతున్నాయి.

        ఆ పోయేటటువంటి లక్షణం దహించబడే లక్షణం శరీరం అంతా వ్యాపించింది. అప్పుడేమైంది? ఏ ప్రాణం చేతైతే ఈ దేహం పోషింపబడు తోందని అంటున్నావో, ఆ ప్రాణమే నిన్ను దహించడానికి కూడ కారణమైనది.

        కాబట్టి ''దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాం'' ఇంద్రియాలు కదులుతున్నాయంటే దేనివల్ల కదులుతున్నాయి? ఆ ప్రాణ శక్తి ప్రభావం వల్లనే ఇంద్రియాలు కదులుతున్నాయి.

        ఆ ప్రాణశక్తి విరమించింది. అప్పుడేమయ్యాడు? ఇవన్నీ లేకుండా పోయినవి. ఎక్కడకు పోయాయి? ఎక్కణ్ణుంచి వచ్చాయో, అక్కడికే పోయాయి.

        ''దేహం ప్రాణ మపీంద్రియాణ్యపి చలాం'' ఆ ప్రాణం కదుల్తున్నంత సేపూ ఇంద్రియాలన్నీ కదుల్తున్నట్లు కనపడుతూ ఉన్నాయి.

        కాబట్టి గాఢ నిద్రావస్థలో కూడ ప్రాణ కదలికలున్నాయి. నీలో ఇంద్రియాలున్నాయి. ప్రియమోద ప్రమోదాలను పొందుతున్నాయి. భౌతికమైన జాగ్రదావస్థను విశ్లేషించి చూసుకుని మెలకువలో కదుల్తున్న వాటిని చూసుకుని గాఢనిద్రలో కదలడం లేదంటున్నావు. అది సాపేక్ష పద్ధతి. అది అసంబద్ధం. నిరపేక్ష పద్ధతిగా చూస్తే కారణ శరీరంలో కూడ కదలికలున్నాయి. కారణ శరీరంలో కూడ కారణ ప్రపంచం ఉంది.

        అక్కడ వ్యవహారం జరుగుతోంది. అక్కడ నీవు ప్రాజ్ఞుడుగా వ్యవహరిస్తున్నావు. ప్రజ్ఞా స్వరూపుడుగా వ్యవహరిస్తున్నావు. అక్కడ ప్రియమోద ప్రమోదాలతో కూడిన వ్యవహారం ఉంది. అది మహాకారణ స్థితికి చేరినటువంటి వాళ్ళు. తెలుసుకున్నవారు బోధించారు. కాబట్టి "దేహం ప్రాణ.. చలాం..'' ఈ కారణ శరీరంలో కూడ కదలికలున్నాయి. ప్రియం మోద ప్రమోదాలు నీ కారణ శరీరంలో అత్యంత సూక్ష్మస్థాయిలో జరుగుచున్నాయి. దానినే నిద్రాసుఖంగా అభివర్ణించుచున్నాము. కాబట్టి ఈ నిద్రాసుఖం కూడా విషయ సుఖం. ఒక ఇంద్రియంతో ఒక విషయాన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకంగా భౌతికంగా అనుభవిస్తే ఏ సుఖం కలుగుతుందో ఆ సుఖం అంతా కూడా ఈ ప్రియ మోద ప్రమోదముల యొక్క లవలేశమే.

        ఆ ఆనందమయ కోశం యొక్క లవలేశం వల్లనే ఇంద్రియ సుఖం నీవు అనుభవిస్తున్నావు.

        కాబట్టి ఏ మహా ప్రాణం యొక్క కదలికచేత నీలో ప్రాణ కదలిక ఏర్పడుతుందో అట్టి మహా ప్రాణమునందు ఇవన్నీ చేరిపోతున్నాయి. 'రై' అనే సూర్యశక్తి చేత మహా ప్రాణమే సమస్త జీవరాశిని పోషిస్తోంది.

        ఈ ప్రాణశక్తి ఎక్కణ్ణించి వచ్చింది? సూర్యుడులో ఉన్నటువంటి 'రం' అనే బీజం 'రై' అనే శక్తి నుండి. ఆ శక్తే సర్వ జీవరాశియందు ప్రాణశక్తిగా పనిచేస్తోంది. మహా ప్రాణం అదే. ఆ మహా ప్రాణమే ఆత్మ చైతన్యం. కాబట్టి సూర్యుడు ప్రకాశించడానికి కారణం ఆత్మ స్వరూపం. ఈ రకంగా ప్రాణ చలనమనేది అన్ని దేహ చలనాలనూ శాసిస్తోంది. ఈ దేహం.. 'చలాం బుద్ధించ శూన్యం విదుః' నాయనా! నేను తెలివి స్వరూపుడిని, నేను జ్ఞాన స్వరూపుడిని, నేను బుద్ధిగత జీవిని అని నీ గురించి నీవు విశేషంగా చెప్పుకోడానికేముందీ?

        ఈ బుద్ధంతా ఏమయ్యింది? ఎక్కణ్ణించి ఉత్పన్నమైంది? ఆ చైతన్య మహా సాగరం యొక్క ఒక ప్రతిబింబం, ఒక అణుమాత్రం నీలో బుద్ధిగా పని చేస్తోంది. ఈ బ్రహ్మాండ సృష్టియందు ఏ చైతన్యం అయితే వ్యాపకమై పనిచేస్తోందో, అట్టి చైతన్య శక్తి నీ మానవ దేహంలో ఒక అణుమాత్రంగా ప్రవేశించింది. ఆ అణుమాత్ర ప్రభావంచేత నీలో బుద్ధిగల జీవిగా ఆవిర్భవించింది.

                అది చైతన్య మహా సాగరము. దానితో పోల్చి చూస్తే నీ బుద్ధి ప్రమాణం ఎంత? ఇది వెళ్ళి అందులో కలిస్తే దీనికేమన్నా ఉనికి ఉందా?

        ఒక వర్షపు బిందువు పడి, నేను వేరే అందట. సముద్రం లేకుండా వర్షం ఎలా వచ్చింది? పడ్డ వర్షం మరల సముద్రానికే చేరింది. చేరి మరల నేను వేరే అందట. అర్థం ఉందా ఏమన్నా! కాబట్టి ఏ శూన్యం నుండైతే ఈ సర్వమూ ఉత్పన్నమౌతున్నదో మరల ఈ సర్వం శూన్యంలోకే చేరుతోంది కదా! మరి అలాంటి ఆవిర్భావ, తిరోధానములు ఉన్నవని అంటావేమిటి?

        సృష్టి స్థితి లయములే లేవు. ఏక కాలంలో రెండు బోధిస్తున్నాడు. మానవుని యొక్క జనన మరణాలను ఆధారంగా పెట్టుకుని సృష్టి యొక్క సృష్టి స్థితి లయాలను కూడా బోధిస్తున్నాడు.

        ''...బుద్ధించ శూన్యం విదుః'' ఎవరైతే బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడో వాడికి ఈ బ్రహ్మాండ సృష్టి అంతా ఎలా కన్పడుతుంది?

        లేనిదిగా కనబడుతుంది. ఎందువల్ల? ఈ అనంత సృష్టి ఒక శూన్యం నుండి ఉద్భవించింది. మరల ఎక్కడ కలసిపోతోంది. మరల ఆ శూన్యంలోనే చేరిపోతోంది. శూన్యం నుండి సర్వం వచ్చింది. మళ్ళీ ఈ సర్వం శూన్యస్థితికి చేరింది. మరి ఈ శూన్యం ఉన్నదని చెబుదామా? లేనిదని చెబుదామా?

దీనినే బోధిస్తున్న విధానం

''పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే!''
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవా వశిష్యతే!!

అని పూర్ణ పద్ధతిగా చెబితే. కాని శూన్య పద్ధతితగా చెబితే
'అంతఃశూన్యం బహిఃశూన్యం శూన్యకుంభమివాంబరే!'

        పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో ఉన్నవాడికి కేవల శూన్య దర్శనమే కనపడుతోందట. అసలు విశ్వమే కనపడటంలేదు వాడికి. ఎందుకని? వాడే లేడు కాబట్టి.

        శూన్యమేమో 'నాహం' అనే దానికి నిదర్శనం. పూర్ణము 'సోహం' అనే దానికి నిదర్శనము. 'కోహం' అన్నది ప్రశ్న. నేనెవరు? దీనికి రెండు సమాధానములున్నాయి. 'సోహం', 'నాహం' - రెండూ సున్నాలే. పూర్ణానికి అదే గుర్తు, శూన్యానాకి అదే గుర్తు. అది సంఙారూపక చిహ్నం. దానికేమీ వ్యావృత్తి లేదు. వ్యాఖ్య లేదు

        కాబట్టి మనవాళ్ళు అనంత విశ్వాన్నీ అంతరిక్షంలోనుండి ఫోటోలు తీసినట్లయితే ఎలా కనపడుతుందటా? ఒక జీరో '0' అండాకృతి కలిగినటువంటి 'జీరో'.
Hyperbola, Double Hyperbola

        అదే, దాన్ని చూసే, ఆర్యభట్టు '0' సున్నా పెట్టాడు. మనవాళ్ళు కనుక్కున్నారు, ఆ సున్నాని. అంతా దీనియందే ఉంది అన్నారు.
ఆ సున్నానే విశ్వం. ఆ సున్నానే సృష్టి, ఆ సున్నానే సమస్తం.

        కాబట్టి ఈ పూర్ణాన్ని, శూన్యాన్ని కూడ తెలుసుకున్న వాడెవరైతే ఉన్నాడో ఇదే బుద్ధినుపయోగించి ''బుద్ధించ శూన్యం విదుః'' ఇప్పుడు మనం ఏ భేదాలు చెబుతున్నాం?

        పురుషులుగానే పుట్టాలి, స్త్రీగా పుట్టకూడదు. స్త్రీ పురుష భేదం. పుడితే సంపనన్నుడుగానే పుట్టాలి, దరిద్రుడుగా పుట్టకూడదు. సంపన్నులు, బీదవారు భేదం.

        పుడితే విద్యాగంధం అబ్బేట్లు పుట్టాలి, విద్యాగంధం లేని శూన్యుడుగా పుట్టకూడదు. పండితులు, పామరులు భేదం చూపిస్తున్నాం.

        కాబట్టి మనం ఎప్పుడూ శూన్యాన్ని ద్వేషిస్తూ వస్తున్నాము. ఆ లేమిని ద్వేషిస్తూ వస్తున్నప్పుడు, ఒక కాలంలో లేనివాడిగానూ, ఒక కాలంలో ఉన్నవాడిగానూ ఉంటున్నాడు.

        ఒక జన్మలో బహు సంతానంచేత బాధింపబడతాడు. అప్పుడు నాకు ఈ గోల వద్దు అనుకుంటాడు. ఈశ్వరుడు 'తథాస్తు' అంటాడు.

        మరుజన్మకు సంతాన హీనుడుగా పుట్టాడు. ఎంత ప్రయత్నించినా సంతానాన్ని పొందలేడన్నమాట. ఈశ్వరుడి పని, బ్రహ్మ గారి పని ఏం లేదు. బ్రహ్మ మానస పుత్రులడిగినా ఏం చెప్పాడు? తథాస్తు అన్నాడు.

        అలాగే మానవుడు తన ప్రార్థనలన్నింటిలో కూడ ఏవో చెప్పుకుంటాడు. ఈశ్వరుడు చూసీ చూసీ 'తథాస్తు' అంటాడు.

నీ Life time మొర విన్నాడన్నమాట.
        బహు సంతానం ఉన్నవారికి తెలుస్తుంది. ఎంత కష్టపడాలో. అపుడు నిరంతరాయంగా నీ మనసులో ఏం మెదుల్తుంది, వచ్చే జన్మలోనన్నా ఇంత బరువు లేకుండా ఉండాలి అని.

        కాబట్టి నీ బుద్ధి నిరంతరాయంగా ఎటువైపు తిరిగి పనిచేస్తోంది. జనన మరణాల మధ్యలో ఉండే వ్యామోహములతో కూడి పనిచేస్తోంది. దీన్ని ఎటువైపు తిప్పాలి?
'బుద్ధించ శూన్యం విదుః' సాధన చెప్తున్నారు.

        నీ బుద్ధి ఎప్పుడూ ఎటువైపు తిరిగి పనిచేస్తోంది? జనన మరణాల మధ్యలో ఉన్న వ్యామోహములవైపు తిరిగి పని చేయుటకు కారణమేమిటి?

        బుద్ధి కర్మానుసారిణి. బుద్ధికి స్వయంగా పనిచేసే శక్తి లేదు. బుద్ధి కర్మననుసరించి పనిచేస్తోంది. నీవేం చేయాలి? కర్మకు అతీతంగా ఉండే శూన్య స్థితికి చేరి ఉండు. బుద్ధికి అతీతంగా ఉండే శూన్యాన్ని లక్ష్యించినప్పుడు మాత్రమే కర్మాతీతం అవుతావు.

        'విదుః' 'విద్‌' అన్న ధాతువు నుండి వచ్చింది. 'విద్‌' అంటే వేదం, జ్ఞానం.

        'సంవిత్‌' బిందువు నుండి ఉత్పన్నమైంది ఈ సృష్టి. నవావరణ సహితమైనది 'సంవిత్‌' బిందువు. ఆ సంవిత్‌ బిందువే సర్వసృష్టికి ఆధారభూతంగా ఉంది. నాద బిందు కళల రూపంలో.  మరి ఆ బిందువునందు కూడ శూన్యమున్నది. దీనిని 'బింద్వాకాశము' అని అంటారు.

        అనంత సృష్టి ఒక బిందువుగా ఉన్నట్లయితే ఆ బిందువు యొక్క మధ్య స్థానము నందు బింద్వాకాశముంది.

        అక్కడ ఆ బిందు ప్రభావమే లేదు. దానినే మనవాళ్ళు Black hole గా పిలుస్తున్నారు. వారు ఆనాడే చెప్పారు, ఆ బిందు స్థాన మధ్యమందు ఆకాశం ఉంది అని. సమస్త బిందువూ అందులోకే సంగ్రహించబడుతోంది. అందులోంచే వ్యక్తమౌతున్నది అని శ్రీ విద్యలో బోధించారు. ఈ బ్లాక్‌ హోల్‌ థియరీ ఆనాడే ప్రతిపాదించారు. ఇది బింద్వాకాశ సిద్ధాంతం. ఇది ప్రత్యేకమైన సిద్ధాంతం.

        ఇలా నీ బుద్ధిని గనుక వ్యావృత్తి చెందిస్తూ పోయినట్లయితే నీవు వ్యామోహాన్ని దాటుతావు. అదే ఒక పరిమితికి లోబడిపోతే, దాటలేవు. అది లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. చివరికి ఆ దశ వస్తుంది.

        ఒక వస్తువును ఆశ్రయించినట్లయితే అది వస్త్వాశ్రయపద్ధతి. అది బుద్ధికున్నటువంటి బలహీనత. చైతన్యం అనేది వృత్యవచ్ఛిన్న చైతన్యంగా, వస్త్యవచ్ఛిన్న చైతన్యంగా ఉండి వస్త్వాశ్రయంగా ఉంది.

        చైతన్యం ఘటావచ్ఛిన్న చైతన్యంగా, పటావచ్ఛిన్న చైతన్యంగా ఉన్నప్పుడు నీకు ఆ అవిచ్ఛిన్నత చేత వ్యామోహం కలుగుతుంది.

        ఒక్క చైతన్యమే ఘటం దృష్ట్యా చూసినప్పుడు ఘటావచ్ఛిన చైతన్యంగా, పటం దృష్ట్యా చూసినప్పుడు పటా వచ్ఛిన్న చైతన్యంగా ఉన్నది. నీవు కూడ ఈ ప్రపంచ భావన చేయగానే, నీలో ఉన్న చైతన్యం కాస్తా వ్యావృత్తి చెంది, ముక్కలైపోయి అనేకత్వాన్ని చెంది ప్రపంచ రూపాన్ని ధరిస్తుంది. అది వెనక్కి తీసుకో. ఈ చైతన్యమే లేనటువంటి శూన్యస్థానమొకటి ఉన్నది. ఎక్కణ్ణించి ఈ చైతన్యం ప్రాదుర్భవించిందో అది శూన్యం. అట్టి శూన్య స్థానమును గనుక నీవు లక్ష్యించినట్లయితేస్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః

        నాయనా! ఆ శూన్యస్థితి నీకు లక్ష్యమైనట్లయితే, ఏ శూన్యం నుంచయితే సర్వమూ ఉత్పన్నమౌతుందో, వ్యవహరిస్తూ, లయమై పోతుందో ఆ శూన్యాన్ని స్వీకరించినటువంటివాడికి ఇదంతా ఎలా తోచింది?

        ''స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం..'' భ్రాంతి వలే తోచింది. స్త్రీలు, పురుషులు, భోగ్య వస్తువులేనా?

        మొట్టమొదటి భోగ్య వస్తువులు స్త్రీలు, పురుషులు. వాటిని భోగ్య వస్తువులుగా చూసేటటువంటి భ్రాంతిచేత నీవు తయారవుతున్నావు. శుక్లశోణిత సంయోగముచేత తయారవుతున్నావని అనటం లేదు. ఎలా? స్త్రీ పురుషులనే విభజన వలన జీవులనే వ్యామోహం ద్వారా తయారవు తున్నావ్‌. (ఇక్కడ స్త్రీ పురుషులనడం లేదు, జీవులు అంటున్నారు)

        నీవెవడివి? జీవుడివయ్యా! జీవుడనేవాడు అన్నింటిలో సమంగానే ఉన్నాడు. దేహధారణ చేత అవచ్ఛిన్నం అవటం లేదు. ముక్కలవటం లేదు. ప్రతివాడు 'నేను' అనే అంటున్నాడు.

        ఈ నేననేవాడు జీవుడు. ఈ జీవుడు ఏమి తెలుసుకోవాలి? ఆత్మ స్వరూపాన్ని, బ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి. అటువంటి నేనును కలిగియున్న వాడనై, సమర్ధమైన 'నేను' నీలో ఉన్నప్పటికీ 'బుద్ధించ శూన్యం విదుః' నీ బుద్ధి శూన్య స్థితిని, పూర్ణ స్థితిని లక్ష్యించక పోవడం వలన ఆ లక్ష్యాన్ని స్వీకరించి నీవు ప్రయాణం చేయకపోవడం వలన, పరిణామం చెందకపోవడం వలన జన్మ రాహిత్య స్థితిని నీవు లక్ష్యించక పోవడం వలన ఏమౌతున్నావు?

స్త్రీ బాలాంధ జడోప మాస్త్యహమితి భ్రాంతా భృశం వాదినః

        చిన్న పిల్లలను చూసి ఎవరైనా మురిసిపోతుంటారు కదా! ఎందుకని? వాళ్ళలో తమను చూసుకుంటున్నారు.

        ప్రపంచం ఎప్పుడూ ప్రతిబింబ సమానం. తన బాల్యపు స్మ ృతి, తన శైశవావస్థ తన ముందుకొచ్చి, తనను తానే చూచుకున్నట్లుగా మురిసిపోతుంటారు. శైశవావస్థలో బాలుడికి అద్దం ఒకటి ఇస్తే చాలు. వాడు తనను తాను చూసుకుంటూ మురిసిపోతాడు. వాణ్ణి చూసి వాడే మాట్లాడుకుంటాడు, నవ్వుకుంటాడు, వాడే వ్యవహరించుకుంటూ ఉంటారు.

        ఎందుకనిటా? వాడి దృష్టికి అద్దంలో వేరేవాడున్నాడు. మనకి కూడ ఆ లక్షణం పోయిందా? నీ ప్రతిబింబాన్నే ప్రపంచంలో నీవు చూస్తున్నట్లుగా తెలివి వస్తే ఎవరన్నా ఈ ప్రతిబింబాన్ని చూసి మోహపడతారా? ఈ ప్రతిబింబాన్ని కాంక్షించి అనుభవించాలనుకుంటారా? అసలు ప్రతిబింబాన్ని ఎలా అనుభవిస్తావు? కాబట్టి ఈ వ్యామోహానికి అసలు అర్థం లేదయ్యా!

        ''స్త్రీ బాలాంధ.. వాదినః'' అంధుడివలె, బాలాంధుడివలె ఉన్నావట. ఒక బాలుడు శైశవావస్థలో ఎలా అయితే క్రీడిస్తున్నాడో ఆ క్రీడా లక్షణమే నీలోనూ ఉంది. ఒక అంధునివలె ఈ ప్రపంచాన్ని అనుభవించాలను కుంటున్నావు. ప్రపంచం ఎంత అని అంధుణ్ణి అడిగితే ఏం చెపుతాడు? పుడుతూనే అంధుడు. వాడికి ప్రపంచం తెలీదు, గుర్తించలేడు, నిర్ణయించలేడు.

        కానీ ప్రపంచం గురించి అడిగితే మాత్రం 'ప్రపంచం చాలా అందంగా ఉంటుందండీ, ప్రపంచం చాలా వింతగా విచిత్రంగా ఉంటుందండీ, వాడు చెప్పే లక్షణాలిలా ఉంటాయి. మనం కూడా కళ్ళున్న అంధులం, బుద్ధి లేదు. అందువలన ఏమై పోయావు? అంధునివలే ప్రవర్తిస్తున్నావు. ప్రపంచం వింతగా, విచిత్రంగా, అందంగా, ఐశ్వర్యయుతంగా ఉందంటున్నాం. ఎవరైనా ప్రపంచం గురించి మాట్లాడమంటే ఎంతసేపైనా మాట్లాడుతారు. కానీ అదే వానియొక్క స్వరూప జ్ఞానం గురించి మాట్లాడమంటే మాటలు రావు.

        ఎందుకని? 'బుద్ధించ శూన్యం విదుః' బుద్ధి శూన్యం అయిపోయింది అక్కడ. బుద్ధి ఎప్పుడైతే శూన్యం అయిపోయిందో, ఇక మాట్లాడే అవకాశం ఏది?

        స్వస్వరూప జ్ఞానంలో నీ ఇంద్రియాలు లేవు. చలనాలు, కాంక్షలు, మోహం, జనన మరణాలు లేవు. నేనెప్పుడూ పుట్టలేదు. ఎందుకని? నేను పూర్ణాన్ని, నేను శూన్యాన్ని. I have never born నేను ఏ కాలమునందూ పుట్టలేదు. ఏ కాలం నందూ నేను పోవడం జరగదు.

        ఈ రకంగా ''స్త్రీ బాలంధ జడోపమాః అహమితి'' అహం ఇతి చాలా ముఖ్యమైన పదం. పైన లేవు అనుకున్న వాటన్నింటితో ఎవరు చేరుచున్నారు? 'అహం' నేను చేరుచున్నాడు.

        ''స్త్రీ బాలంధ జడోప..'' ఇంకా దేనితో చేరాడు? జడంతో కూడ చేరాడు. ఉదా: ఫలానా వస్తువైతేనే బావుంటుంది.

        ఎప్పటికప్పుడు పరిణామ శీలం సృష్టి ధర్మం. పరిణామశీలమై  నూతనత్వాన్ని సంతరించుకున్నట్లు కనపడుతోంది. కానీ వాస్తవానికి అది జడం. ఎవరికైతే బహిర్ముఖం మాత్రమే ఉందో, వాడు ఈ జడ వస్తువుల వెనుక పడుతున్నాడు.

        కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయమంటున్నారు? జడమా? చేతనమా? అని విమర్శ చేయమంటున్నారు. ఎవరైతే అంతర్ముఖ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకున్నాడో వాడు చైతన్యాన్ని, చేతనత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు.

        ఎప్పుడైతే చేతనత్వాన్ని దృష్టిలో పెట్టుకున్నావో అప్పుడేమి తెలుసుకున్నాడు?

        పరమాణువు అనే అంశ స్వరూపం జడం. ఇన్ని జడములూ చైతన్యంలోనే ఉన్నాయి. సూర్యుడు చైతన్యమైతే నవగ్రహములు జడం కాబట్టి ఆ చేతన వస్తువు చుట్టూతా ఈ జడ వస్తువులు తిరుగుతున్నాయి.

అదేమిటి? కదిలేవన్నీ చేతనత్వములే కదా అంటారా?
        ఆ చేతనత్వం యొక్క ఒక అణువు, ఒక స్పర్శ ఇందులో పడిందయ్యా! ఆ సూర్యాంశలో నుంచి ఇవి ఉత్పన్నమైనవి. కాబట్టి ఒక అంశీభూతం ఇందులో కలిసింది.

        కాబట్టి సూర్యుడితో పోల్చితే నవగ్రహాలకు లెక్కేముందినవగ్రహాల కంటే కొన్ని లక్షల రెట్టు పెద్దది సూర్యుడు.  అట్టి సూర్యుడు గెలాక్సీలో ఉన్నదానితో పోలీస్తే అణు స్వరూపం అట్టి గెలాక్సీలను నెబ్యూలాతో పోలిస్తే, పరమాణు స్వరూపం.

        కాబట్టి మహా చైతన్యం అయినటువంటి ఆ విశ్వం, ఇప్పుడు మన కళ్ళముందున్న జడవస్తువు. దేనిని పట్టుకున్నాం? దేనియెడల ఏ దృష్టితో చూస్తున్నాం? మన లక్ష్యం అట్టి మహా చైతన్య స్థితిని దాటటమా? ఈ జడ వస్తువునామహా చైతన్యాన్ని.

        కాబట్టి ఎప్పటికప్పుడు దేనితో బంధింపబడుతున్నావో, బాధింప బడుతున్నావో గ్రహించు. జడానికి నిన్ను బంధించే శక్తి ఉందా? బంధించ గలదా? లేదుకదా! మరి అది లేకపోతే నేను ఉండలేననడం సబబా?

        మన వద్ద పెద్ద లిస్ట్‌ ఉంటుంది. ఇవి లేకపోతే నేనుండలేను అని. అవన్నీ ఏమిటటా? ''స్త్రీ బాలాంధ జడోపమః అహమితి భ్రాంతా భృశః వాదినః'' వాటన్నింటితో 'నేను' కలసిపోతోంది..

        నేను శుద్ధ చైతన్యాన్ని, నేను మహా చైతన్యాన్ని, నేను ఆత్మ స్వరూపుణ్ణి. నేను బ్రహ్మ స్వరూపుణ్ణి. నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి అయివుండి ఇది లేకపోతే నేను ఉండలేననడం అసంబద్దం కదా! అసమంజసం కదా! వ్యామోహం కదా ! భ్రాంతి కదా! కాబట్టి ఇది లేకపోతే నేనుండలేనని నీవు చెప్తున్నది అంతా భ్రాంతియే కదా!

        అవి అసంబద్ధమైనవి, అసంకల్పితమైనవి కాబట్టి జీవితంలో మానవుడెప్పుడూ కూడ దైవీస్థితి, మోక్ష స్థితి లేక, నేను జీవించజాలననుట మాత్రమే సమంజసమౌతుంది. కాబట్టి భ్రాంతితో, వ్యామోహంతో కూడుకున్నట్టి, జనన మరణాలతో కూడుకున్న దానిని ఆశ్రయించడం అజ్ఞానం, అవిద్య కదా! కాబట్టి ఏమైనా ఒక ఆలోచనను అనుమతించే టప్పుడు ''ఇది జ్ఞాన పరిధిలోకి వస్తుందా?'' లేక ''అజ్ఞాన పరిధిలోకి వస్తుందా?'' 'విజ్ఞాన పరిధిలోకి వస్తుందా?' లేక 'అవిద్యగా వస్తోందా?' నీ మూలాన్ని గుర్తెరిగి నీవు లేకుండా పోయేట్లుగా చేస్తోందా? 'శేషాన్ని మిగిల్చేట్లుగా చేస్తోందా?' 'భ్రాంతిని బలపరచేట్లుగా చేస్తోందా?'  విజ్ఞానాన్ని బలపడేట్లు చేస్తోందా? ఈ విచారణంతా చేయాలి కదా!

        దీపారాధన తూర్పుకు పెట్టాలా? పడమరకు పెట్టాలా? అని కాదు. ఎటుపెట్టినా ప్రకాశమే ప్రధానం. ఆ ప్రకాశం నీలో ఉండటం ప్రధానం. నీవు ప్రకాశ స్వరూపుడవని తెలుసుకోవడం ప్రధానం.      ఏ లక్ష్యంతో దీపారాధన పెట్టబడిందనేది ముఖ్యం.

        కాబట్టి భ్రాంతితో కూడి ఆలోచించకూడదు దేనినీ. ''స్త్రీ బాలాంధ.. వాదినః'' గుండ్రంగా తిరిగే భూమికి దిక్కులు ఎలా, పోనీ నిలకడగా ఉందంటే దిక్కులు చెప్పవచ్చు. భూమి గుండ్రంగా తిరిగి పోతోంది కదా! 8 దిక్కులు ఎలా చెప్పావు?

        దిక్కులు స్థిరమా? గుండ్రంగా ఉన్నటువంటి భూమి స్థిరమా? ఏదీ స్థిరంగా లేవుగా! భూమి దానితోపాటు దిక్కులు తిరిగిపోతున్నాయి. నీకు తూర్పు అయితే మాకు పడమర, నీకు పడమర అయితే మాకు తూర్పు, అంతేకదా! అందువలన ఏం చెప్పారు? సూర్యుడు ఎటువైపు ఉదయించాడో చూడు, అటు తూర్పు అన్నారు. సూర్యుడు ఎటువైపు ఉదయిస్తే అటే నీకు తూర్పు. అలా అయితే పొరపాటు పడే అవకాశం లేదుకదా!

        కాబట్టి వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పారు దిక్కులు దిక్పాలకుల గురించి. కాబట్టి సూక్ష్మమైన శరీర నిర్మాణాన్ని, దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న విద్యను మనం ఏం చేశాం? ''భ్రాంతా భృశం వాదినః''

        మన వాదనలు ఎప్పుడూ కూడ లాభనష్టాలు బేరీజు వేసేటటువంటి వాదన చేసే పద్ధతిగా వస్తే, అది భ్రాంతితో కూడినదే.

        ఏ వేద విద్య అయితే నీలో విజ్ఞానాన్ని మిగల్చడానికి నిన్ను నిశ్శేషంగా, లేకుండా చేయడానికి గుర్తించబడిందో, అట్టి వేద విద్యలను ఏ తీరుగా చూడటం అలవాటు చేసుకున్నావు?

        'భ్రాంతా భృశం వాదినః' ఆ లక్షణాన్ని మానుకో, మానుకుని ఏం చేయమంటున్నారు?
'మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే'

        ఇదంతా ఎవరిశక్తి? మాయా శక్తి వలన నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను పోతున్నాను. ఇదే పెద్దమాయ. 

మాయ అంటే 'యా మా సా మాయ'
యా : ఏదైతే, మా : లేదో, సా : అది.
        ఏదైతే లేదో అదే మాయ. ఏవి లేవంటున్నారు? జనన మరణాలే లేవు. నాకు జనన మరణాలే లేవు.

        I have never born కాబట్టి 'మాయాశక్తి విలాస కల్పిత మహా' ఇదంతా ఒక విలాసం. విలాసం అంటే చిరునామా, లీల, ఆట, ఎవరి ఆటటా? ఇదంతా మాయ శక్తి యొక్క ఆట. ఏదైతే లేదో అదే నిన్ను ఆడిస్తోంది.

        నీవేం చేయాలి? ఆ పరమాత్మను పట్టుకో. ఆ పరబ్రహ్మను పట్టుకో, ఆ సద్గురు మూర్తిని పట్టుకో. ఇది లేనిదని తెలుసుకో. ఇది భ్రాంతని తెలుసుకో. ఈ వ్యామోహం నుండి బయటపడు. అప్పుడేమయ్యావు? ఆ విశేషమైన మోహం అంతరించిపోయింది. 'వ్యామోహ సంహారిణే' ఎటువంటి విద్యను ఆశ్రయించాలయ్యా! వ్యామోహ శేషం మిగలకుండా ఉండేటటువంటి, నిశ్శేషంగా నిన్ను లేకుండా చేసేటటువంటి, ఆ అవిద్యామోహం ఉన్నవాణ్ణి నిశ్శేషంగా లేకుండా జేసేటటువంటి స్థితిని నీవు ఆశ్రయించాలి.
'మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే'.

        అలా నీవు సంహరణం అవ్వాలి. నిశ్శేషంగా లేకుండా పోవాలి. అటువంటి పరబ్రహ్మ స్థితిని సాధించాలి.          ఆ స్థితిలో నిలకడగా ఉండాలి. ఏ కాలమునందునూ పుట్టనివాడు గానూ, దశవిధ ప్రళయములందు పోనివాడుగానూ ఉండాలి.

        మృత్యువు లేకుండ కాదు, మృత్యువు లేకపోతే రాక్షసుడవౌతావు. వారంతా దానికోసమే తపస్సు చేశారు. (పురాణాలు చదివితే తెలుస్తుంది)
హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు కూడ తపస్సు చేసి ఏమి వరాలు పొందారు? మేము దేనిచేతా పోగూడదు. దేనివలనా పోగూడదు. ఎక్కడా పోగూడదు, ఎలాగూ పోగూడదు. ఇది తన దేహమును అనుసరించి అడిగిన వరము.

        కాని దీని ఆంతర్యం తెలుసుకుంటే, దేశకాల ప్రదేశముల పరిచ్ఛిన్నతలకు లోబడక పోవడంగా సాధకులం తీసుకోవచ్చు. అంటే వాటికతీతమైన అమృతత్త్వముగా తీసుకొనవచ్చును.

        కాబట్టి మృత్యువు లేకుండా వరం అడిగితే ఏమయ్యావు? ఆ తామసిక ఆ గాఢమైన తమస్సు, అవిద్యా మోహాలకు లోబడ్డావు.

        కాబట్టి I have never born నేనెపుడూ లేనివాడనే. నేనెప్పుడూ ఉండలేదు. నేనెప్పటికీ పోను. నేను శాశ్వతుడను. అటువంటి శాశ్వతమైన స్థితిని పొందడానికి.
''తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే''