4వ శ్లోకం
నానాచిధ్ర ఘటోదరస్థిత మహా దీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాది కరణ
ద్వారా బహిః స్పందతే |
జానామీతి యమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం
జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||
ఇప్పటివరకు అనంత విశ్వం గురించి, అనంత బ్రహ్మాండం గురించి, వాటి వాటి
అంశీభూతములైన అంశాలను వివరించి, మానవులలో ఏదైతే ప్రజ్ఞ పని
చేస్తోందో, ఏదైతే చైతన్యం పని చేస్తోందో దాని సంగతి చెప్తున్నారు.
''నానా
చిద్రఘటోదరస్థితి'' ఘటం అంటే ఏమిటి? కుండ, ఒక ఆశ్రయం. ఘటోదరం అంటే కుండకు
మధ్య భాగం అని అర్థం. మన శరీరాన్ని ఒక కుండగా భావించినట్లయితే, ఈ కుండకు మన్ను ఎక్కణ్ణించి వచ్చింది?
ఘటకుడ్యాదికంసర్వం
మృత్తికామాత్రమేవచ
తద్వద్భ్రహ్మ
జగత్సర్వం ఇతి వేదాంత ద్బ్రడింఢిమః
ఘటం అనగానే ఈ సూత్రం గుర్తుకు రావాలి.
కాబట్టి ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా ఒక ఘటం.
అనంత విశ్వం ఒక ఘటం. మానవ దేహం ఒక ఘటం. ఘటం అనే ఉదాహరణ క్రింది నుండి పైకి 4
స్థితులలోను వర్తిస్తుంది.
ప్రత్యేకించి దేనికి దానికి విడివిడిగా
ఘటాలుగా కనపడుతున్నాయి. కానీ ఘటన ద్వారా వచ్చింది కాబట్టి ఘటమయింది. ఒక ఘటన ద్వారా
వ్యక్తమైంది కాబట్టి దానికి ఘటం అనే పేరు వచ్చింది. మరి మానవోపాధే ఒక ఘటన ద్వారా
వచ్చినదనుకుంటే, సృష్టి కూడ ఎలా వచ్చింది? పంచభూతాత్మకమైన సృష్టి కూడ ఒక ఘటన ద్వారానే వచ్చింది. అలాగే అనంత విశ్వము
కూడా ఒక ఘటన ద్వారానే వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడ ఘటములే.
ఈ
ఘటములన్నింటి యందు కూడ ఘటయు యొక్క ఉదరము నందు ఎలా ఉందట? ఇది అంతా కుండగా భావిస్తే దీనిని ఊహకు అందిస్తున్నారు కుండకు
చిల్లులు పెట్టామట. కుండ తయారు చేసేప్పుడే చిల్లులు పెట్టాం. చిల్లులున్న కుండ.
కార్తీక మాసంలో ఆకాశ దీపం అని పెడతారు.
దేవాలయాలలో ధ్వజ స్థంభానికి ఆకాశదీపం పెడతారు. దానికి చిల్లులున్న కుండను పెడతారు.
ఆ చిల్లులున్న కుండయొక్క సంఙారూపక ఉపదేశం ఇదే.
ఆ ఆకాశ దీపం యొక్క కాంతి పడినటువంటి
కీటకములు కూడ ముక్తి చెందుతాయి. కీటకములు గాని, మశకములు
గాని, భృంగములు గాని వగైరా అన్నీ ముక్తి చెందుతున్నాయి.
మానవులు కూడ ముక్తి చెందుతారు. కారణం ఏమిటిట?
నీవు కూడ అలాగే ఉన్నావు. ఈ అనంత ఆకాశంలో
నీవు ఒక ఘటంలా ఉన్నావు. ఘటం మధ్యలో ప్రజ్ఞ, చైతన్యం
అనే దీపం వెలుగుతోంది.
ఆత్మ అనే దీపం, స్వప్రకాశం అనే దీపం వెలుగుతోంది. అదే మహా దీప ప్రకాశం.
ఆ చీకటిలో, ఆ ఘటంలో ఆ స్వప్రకాశం ప్రకాశిస్తూ ఆ ఘటానికి ఉన్న చిల్లుల ద్వారా ప్రకాశం
బయటకు ప్రసరిస్తోంది. నీవిప్పుడు చూస్తున్నావు కదా! ఎలా
చూస్తున్నావు? నీలో ఉన్న ప్రకాశం నీ కళ్ళు అనే
రంధ్రాల ద్వారా బయటకు ప్రసరిస్తోంది. నీ శరీరం ఒక కుండ అనుకున్నట్లయితే, ఆ కుండ మధ్యలో ఒక దీపాన్ని పెట్టినట్లయితే, ఆ దీపపు కాంతి నవ రంధ్రాల ద్వారా బయటకు వ్యక్తమవుతోంది.
ఇంతేనయ్యా! దేహమంటే ఇంతే. మానవోపాధి
గురించి ఆలోచించి నేనంతటి వాడిని, నేనింతటి వాడను
అనే అహంకారానికి తావు లేకుండా వివరిస్తున్నారు. నీవు దేనిమీద ఆధారపడి ఉన్నావయ్యా?
నీవు నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం మీద ఆధారపడి ఉన్నావు.
అదెలా ఉందీ? 'నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరమ్'. అది ఎటువంటి దీపం అట? ''మహాదీపం'' అటువంటి 'మహాదీప ప్రభా భాస్వరమ్' అంటే అర్థం ఏమిటి?
బ్రహ్మాండము నంతటినీ వెలిగింపజేసేటటువంటి
వెలుగు ఏదైతే ఉందో, ఆ వెలుగే నీలో ఆత్మ
ప్రకాశంగా ఉంది. బ్రహ్మాండం అంతటా జ్యోతి స్వరూపం నిండి
ఉంది. ఎలా నిండి ఉంది? సోమ, సూర్య, అగ్ని మండలము లనే
మండల త్రయముల ద్వారా జ్యోతి ప్రకాశం నిండి ఉంది. ఆ మండల త్రయము మూడు కూడ
స్వప్రకాశంగా, ప్రజ్ఞగా, చైతన్యంగా ఈ
ఘటంలో ప్రకాశిస్తుంది.
కాబట్టి సీతారామాంజనేయ సంవాదం ఏం
చెప్పిందయ్యా అంటే, యదార్థ బింబము సూర్య
ప్రకాశము. ఆ ప్రకాశం వచ్చి బయట పెట్టినటువంటి కుండలో ఉన్న నీటిలో పడింది. నీళ్ళలో
ఉన్న ప్రతిబింబ సూర్యప్రకాశము చేత నీళ్ళు కూడ ప్రకాశిస్తున్నట్లు కనపడినవి.
ఆ ప్రకాశ ప్రభావం ప్రతిబింబింబించి గోడమీద
పడింది. గోడ కూడ ప్రకాశిస్తున్నట్లు కనపడింది. జీవుడు ఈ మూడింటినీ చూశాడు. ఒక
బింబాన్ని రెండు ప్రతిబింబాలను. చూసినటువంటివాడు మొదటలో భ్రాంతి చెందాడు. ఏమిటి ఆ
భ్రాంతి? గోడ ప్రకాశిస్తోంది అనుకున్నాడు. గోడ
ఎక్కడైనా ప్రకాశిస్తుందా?
'తను
కుడ్యజాల రంధ్రములు' కదా ఇవి. ఈ మాటలు శరీరం గురించి
ప్రహ్లాదుడన్నాడు. ఒక గోడకు రెండు రంధ్రాలు పెడితే ఎంత విలువో, నీ కళ్ళకు కూడ అంతే విలువ ఉంటుంది. అలా ఎప్పుడయ్యాయి. ''చక్రిని గాంచని కన్నులు కన్నులే?''
శ్రీహరిని దర్శించని కన్నులేవైతే ఉన్నాయో
అవి రెండూ గోడలకు పెట్టినటువంటి రంధ్రాల్లాంటివి తప్ప వాటికేమీ విలువా, విశేషం లేదు. 'శ్రీహరిని పూజించని
చేతులు చేతులే?' 'పటుశాఖ దర్విగాక' అన్నాడు
ప్రహ్లాదుడు. అంటే చెట్టు కొమ్మలకు ఎంత విలువుందో, నీ
చేతులకు కూడ అంతే విలువుంది. ఈ రకంగా ఆయనేం చెబుతున్నాడు?
దైవ సాక్షాత్కారాన్ని, ఈశ్వర సాక్షాత్కారాన్ని, 'నేను
ఈశ్వరుడను' అనే స్థితిని, 'నేను ఆత్మ
స్వరూపుడను' అనే స్థితిని, 'నేను
పరబ్రహ్మ' మనే నిర్ణయాన్ని కనుక పొందకపోయినట్లయితే ఈ దేహము
చిల్లుల కుండ వంటిది.
అంతకంటే ఏమి విలువుంది దీనికి? కాబట్టి ఈ మట్టి కుండని చూసి మోహంలో పడిపోకు. నీవు దేనిని
చూసి మోహపడుతున్నావు? దేనిని ప్రేమిస్తున్నావు? ప్రొద్దున లేచిన దగ్గర్నుండి రాత్రి నిద్రపోయే వరకు, ఒక మోహంలో పడ్డావు. కుండ అనే మోహంలో పడి ఉన్నావు.
ఈ శరీరం అనే తొమ్మిది చిల్లులున్న కుండనీ
నీదనుకునే భ్రాంతిలో పడి, మోహంలో పడి, విచారణ చేసి జీవిస్తున్నావు. దీనిలోనుండి బయటకు రా! ఈ తొమ్మిది రంధ్రాలున్నటువంటి కుండకు
లోపలున్న ఆత్మ ప్రకాశము అనే మహాదీపం గనుక లేకపోయినట్లయితే, ఏమైనా విలువుందా? ఏ విలువా లేదు.
కాబట్టి 'నానాఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరమ్'. 'భాస్వరమ్'
అంటే తనకు తానే వెలుగుతున్నది. 'స్వప్రకాశము'.
'దీప ప్రభా భాస్వరమ్'.
'జ్ఞానం
యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిః స్పందతే' నీకు చక్షురాది
ఇంద్రియముల ద్వారా జ్ఞానం తెలుస్తోంది కదా అనుకుంటావేమో! ఈ జ్ఞానేంద్రియముల ద్వారా
నీకు జ్ఞానం తెలుస్తోంది కదా, నేను ప్రపంచాల్ని
తెలుసుకుంటున్నాను కదా, ప్రపంచం నాకు అనుభూత మవుతోంది కదా,
నా దేహం నాకు అనుభూతమౌతోంది కదా అని అనుకుంటున్నావేమో! ఆ అనుభూతం
అంతా ఈ స్వప్రకాశపు వెలుగు యొక్క ప్రభావం, ప్రతిబింబసాక్షి.
కాబట్టి నీ శరీరం గాని, నీ ప్రపంచం గాని, ఈ సృష్టిగాని ప్రతిబింబ సమానమైనటువంటిది.
ఏది సత్యం? బ్రహ్మ సత్యం, జగన్మిధ్య. జగత్‌ః జాయతే గచ్ఛతే ఇతి
జగత్ ఏదైతే పుడుతుందో, ఏదైతో పరిణమిస్తోందో, ఏదైతే లేకుండా పోతోందో,
అది సర్వమూ జగత్తే.
కాబట్టి ఈ జగత్తంతా కూడా వాస్తవానికి
లేనిదైనప్పటికీ ఉన్నట్లుగా తోచుచున్నది. కావున ఇది మిధ్య. అని ఈ ఉపమానం ద్వారా
నిరూపిస్తున్నారు.
ఎట్లా అట? ఒక చీకటి గదిలో ఒక చిల్లుల కుండ బోర్లించి, దాని
మధ్యలో ఒక దీపాన్ని పెడితే ఏమైందట?
ఆ చిల్లుల ద్వారా లోపల ఉన్న ప్రకాశం
ప్రసరించింది. ప్రసరిస్తే, ఆ గదంతా వెలుగు నిండినట్లుగా
కనపడింది. ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులు
కూడా, ఆ రంధ్రాలనుండి పడుతున్న ప్రకాశంలో ఏ వస్తువులు
ప్రకాశిస్తున్నాయో, అవి మనకు కనబడుతున్నాయి.
నీవు కూడ ప్రపంచంలో నీదైన ప్రపంచాన్ని ఎలా
ఏర్పాటు చేసుకుంటున్నావు? నీలో ఉన్న ప్రకాశం ఆ
చక్షువుల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా బయట ఉన్న ప్రపంచంలో
ప్రసరించినటువంటి ప్రకాశపు ప్రభావం చేత, ప్రతిబింబ ప్రభావం
చేత ఏ ప్రపంచం అయితే నీకు తోచిందో, దానినే నిజమైన ప్రపంచంగా
నీవు స్వీకరించావు.
వాస్తవానికి నీ బయట అంతా చీకటే ఉంది. నీ
లోపల మాత్రమే ఆత్మ ప్రకాశం ఉంది. నీ లోపల కూడ చీకటి ఉంది. ఇది ఎప్పుడు
అనుభూతమౌతోంది? సుషుప్తిలో.
కానీ వాస్తవానికి ఏమి అనుభూతమవ్వాలి? - ఆత్మ ప్రకాశం అనుభూతమవ్వాలి. ఎందుకని? మిగిలిన ఇంద్రియాలన్నీ మూసుకు పోయినవి. ప్రపంచం ఉండీ లేనిదై పోయింది.
అప్పుడు స్వప్రకాశాన్ని సహజంగా గుర్తించగలిగే అవకాశం ఉంది.
కానీ మనం ఏం చేస్తున్నాం? స్వప్రకాశంలో లీనమవ్వాల్సిన అవస్థలో, గాఢ
తమస్సులో లీనమవుతున్నాం. కాబట్టి మెలవకులో, కలలో, నిద్రలో నిన్ను నీవు ఈ ఉపమానంతో చూసుకోవడం ఎవరికైతే వస్తుందో వారు ఆత్మ
నిష్ఠులౌతారు.
ఆత్మ నిష్ఠకు ఒక గొప్ప ఉపమానం ఏమిటయ్యా
అంటే,
'నానాఛిద్ర
ఘటోదర స్థిత ప్రభా భాస్వరమ్, జ్ఞానం యస్యతు చక్షురాది కరణ
ద్వారా బహి స్పందతే'.
నీ జ్ఞానేంద్రియముల ద్వారా ఏదైతే బయటకు
కనబడుతున్నదో, అది గుర్తిస్తూ, తెలుసుకుంటూ ఉన్నావో అదంతాకూడ ఒక కుండకు పెట్టినటువంటి చిల్లుల ద్వారా
బయటకు ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశము వ్యక్తమౌతున్నటువంటి అంతఃప్రకాశమే. స్వాత్మ
ప్రకాశమే అని రూఢిగా, నిర్ణయంగా చెప్తున్నారు.
కాబట్టి నిన్ను నీవు ఇలా దర్శించుకోవడం
రావాలి. ఈ ప్రపంచాన్ని అలా దర్శించడం రావాలి. బింబ ప్రతిబింబ న్యాయంతో నిషేధించడం
రావాలి. ఇలా ఎవరైతే నిషేధించగలిగారో, ఘటాన్ని, కుడ్యాన్ని (కుండను, గోడను) రెండింటినీ నిరసించ గల్గినవారై, రెండింటికీ
మూల తత్త్వమైనట్టి బ్రహ్మమును పట్టుకోగలిగే సమర్ధులౌతున్నారు.
'ఘటకుడ్యాదికం
సర్వం మృత్తికా మాత్రమేవచ, తద్వద్ బ్రహ్మ జగత్సర్వం ఇతి
వేదాంత డింఢిమః' అని వేదాంత డింఢిమం మనకి మరల మరల
తెలియజెప్పుచున్నది.
కాబట్టి అనంతంగా కన్పడుతున్నటువంటి, 84 లక్షల జీవరాసులతో కనపడుతున్నటువంటి, స్థావర
జంగమాత్మకమైన సమస్త సృష్టి కూడ బ్రహ్మ పదార్థము యొక్క అభివ్యక్తమే. ఒక్క పదార్థమే
ఉంది. ఏమిటది? బ్రహ్మమనే పదార్థం.
దానియందు ఓంకారమనే ఘటన ద్వారా, ఆది బిందువైనటువంటి ప్రణవ నాదం వ్యక్తయయే ఘటన ద్వారా
సర్వసృష్టి వ్యక్తమైంది. ఒక ఘటన ద్వారా వ్యక్తమైంది కాబట్టి సర్వసృష్టి కూడ ఘటమే.
ఆ సర్వ సృష్టియందున్న ఘటమునందు కూడ సూర్యుడనే స్వప్రకాశం ద్వారా ఈ సృష్టి అంతాకూడ
నడుపబడుతోంది.
కాబట్టి జగత్చక్షువైనట్టి సూర్యుడు కూడ
అక్కడ ఆధార బిందువుగా ఉన్నాడు. నిజానికి ఏ బిందు ప్రకాశం చేతైతే ఈ సృష్టి అంతా
నడుప బడుతోందో, తెలియబడుతోందో, పరిణమిస్తోందో ఆ ప్రకాశమే సత్యము.
వ్యష్టిగా చూస్తే స్వాత్మ ప్రకాశమే
సత్యము. అట్లాగే సమష్టిగా చూస్తే బ్రహ్మ ప్రకాశమే సత్యము. ఇలా ఎరిగినటువంటివాడు
వ్యష్టి. సమష్టి దాటి, సర్వ సమష్టియైన అనంత
విశ్వాన్ని గుర్తించకలిగే స్థితికి చేరాడు.
దేశము, కాలము,
కలన అనే మూడింటియందు అనంతంగా ఉన్నటువంటి కాలంలో మిగిలిన రెండూ
వ్యక్తమైనాయి. దేశము, సంకల్పము, అనగా
శూన్యము, సంకల్పము.
ఈ రకంగా ఒకదానిలోనుండి మరొకటి
వ్యక్తీకరించడుతూ మొదటగా ఉన్న కాలంలో సంకల్పం వ్యక్తమైంది. సంకల్పంలో నుంచి శూన్యం
వ్యక్తమైంది. అట్లా ఒకదానిలో నుండి మరొకటి వ్యక్తీకరించబడుతూ అనంత విశ్వం
ఉత్పన్నమైంది. అది కూడా ఒక ఘటమే. కాలమనే ఘటన ద్వారా అనంత విశ్వం వ్యక్తమైంది.
కాబట్టి ఎవరైతే కాలాతీతులైనట్టి
వారున్నారో వారు మండల త్రయమును దాటి, అనంత
విశ్వమును దాటి, తానే లేనటువంటి స్థితిలో స్థిరముగా ఉన్నారు.
కాబట్టి ఘటమునందు ప్రకాశించేటటువంటి
ప్రకాశ లక్షణము ఏదైతే ఉందో, అట్టి ప్రకాశమే
సత్యమనే ఉపమానం ద్వారా ఈ మూడు ఘటాలను నిర్ణయించి, వాటియందు
అంతర్భూతమై ఉన్నటువంటి ప్రకాశాన్ని లక్షణంగా స్వీకరించి, ఆ
స్వప్రకాశాన్ని, బ్రహ్మ ప్రకాశాన్ని, పరశివ
తత్త్వాన్ని, పరశివ ప్రకాశాన్ని నిర్ణయంచేసి..
'లోకంబులు,
లోకేశులు, లోకస్థులు తెగిన తుది అలోకంబగు
పెెంజీకటి కవ్వల ఏకాత్మగా వెలిగేటి ప్రకాశం ఏదో, అదే పరశివ
ప్రకాశము'
ఆ పెంజీకటి కవ్వల వెలుగుతున్న ప్రకాశం
ఏదైతే ఉందో అదే పరశివ ప్రకాశము. అది అంతరిక్షం. అది బయలు. అది ఉన్నదున్నట్లున్నది.
కాబట్టి అన్ని చోట్లా ప్రకాశ ప్రధానంగా
ఉండమని చెప్తున్నారు. అంతేకాని ఘట ప్రధానంగా ఉండవద్దని చెప్తున్నారు.
రెండు బోధలను ఏక కాలంలో అందిస్తున్నారు.
బింబ ప్రతిబింబ న్యాయాన్ని కూడ అర్థం చేసుకుని ఏది మిథ్యా వస్తువో తెలుసుకుని
దానిని విడవమంటున్నాడు. ప్రతిబింబం మిథ్య. ప్రపంచం మిథ్య. ఘటం
మిథ్య. సృష్టి మిథ్య. పిండాండం మిథ్య, బ్రహ్మాండం.
విశ్వం మిథ్య.
కేవలము, కైవల్యం అంటారందరూ. ఆ కేవలత్వ స్థితి ఏదైతే ఉందో, ఆ లేని యెరుక
స్థితి ఏదైతే ఉందో ఆ లేనెరుకకు ఆవల బయలు ఏదైతే ఉందే, అది మాత్రం ఎల్లకాలమూ ఉన్నది. సర్వకాల, సార్వ
జనీనముగా, సర్వ వ్యాపకముగా, అనంతముగా
ఉన్నది ఏదో అది మాత్రమే సత్యము.
అట్టి సత్యాన్ని ఎవరైతే గుర్తించారో, వారికి ఈ మధ్యలో ఉన్నటువంటి పరిణామ భేదం గురించి
నిర్వచించబడినవి అన్నీ కూడా లేనివై పోయాయి.
కాబట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తులలో
జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నటువంటి సర్వ ప్రపంచము, అంతరింద్రియముల ద్వారా తెలుసుకున్నటువంటి సర్వ ప్రపంచము
జగత్చక్షువైనటువంటి సూర్య స్థితిలో ఉండి పంచభూతాత్మకంగా, పంచ
తన్మాత్రలతో ఎరిగేటటువంటి సర్వ సృష్టి, దేశ కాల కలనలతో,
నాద బిందు కళలతో సర్వసృష్టి, సర్వ విశ్వమూ
ఇవన్నీ కూడ ఒక కాలమందు వ్యక్తమై, మరొక కాలమందు లయిస్తున్నవే.
కాబట్టి కాలాతీతులైనటువంటి వారికి ఇవన్నీ
లేనివే. కట్టకడపటికి తానే లేనటువంటివాడు. 'తద్రహితం'.
'వస్తుమద్రహితం',
'ఆవరణ రహితం'. కాబట్టి 'ఘటన'
అనే ఆవరణను ఆధారంగా స్వీకరించి, ఆ ఆవరణయందున్న
ప్రకాశమే సత్యం కాని ఆవరణ సత్యం కాదు. ఆవరణలో తోచినవీ సత్యం కాదు. సర్వ వ్యాపక
ప్రకాశమే సత్యం. అట్టి ప్రకాశ లక్షణంతో ఉండమని బోధిస్తున్నారు. కాబట్టి ''ఘట కుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవచ''. అనేటటువంటి
సామాన్య లక్షణంతో సర్వ సృష్టినీ గమనించగలిగే బ్రహ్మ నిష్ఠుడవు కావాలి.
కాబట్టి ఈ సూత్రంలో ఏమి చెప్తున్నారు?
'నానాఛిద్ర
ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరమ్ జానామీతి యమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్...'
జానామీ -
తెలుసుకున్నాను, నిశ్చయించాను, నిర్ణయించాను, స్పష్టముగా నిర్ణయించాను. మరపు లేని
పద్ధతిగా నిర్ణయించాను.
'ఎరుకన,
మరుపన తొలిమేనులు, మలిమేనులు'
అంటుంది కందార్థం.
మనకు 8 శరీరాలున్నాయి. పిండాండ పద్ధతిగా
ఉన్న జీవ తను చతుష్టయం ఏదైతే ఉందో అంటే విశ్వ, తైజస,
ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలనే జీవ తను చతుష్టయం
మరపు తనువులు. విరాట్, హిరణగర్భ, అవ్యాకృత,
పరమాత్మలనే ఈశ్వర తను చతుష్టయం ఎరుక తనువులు.
ఈ అష్ట తను నిర్ణయం అంతా కూడా 'జానామి' నిర్ణయంగా తెలుసుకున్న వారెవరైతే
ఉన్నారో, 'ఇతి' ఈ రకంగా అష్ట తను
నిర్ణయం ఎరిగి ఉన్న వాడెవడైతే ఉన్నాడో వాడు 'జానామీతి యమేవ
భాంత మను భాత్యేతత్సమస్తం జగత్'.
'ఎక్కడెక్కడైతే
శరీరం ఉందో ఆయా శరీర వ్యవహారమునకు ఆయా ప్రపంచం ఉన్నది'. నీకు స్థూల శరీరం ఉన్నదనుకుంటే
స్థూల ప్రపంచం ఉన్నది. సూక్ష్మ శరీరం అనుభూతమైందనుకో, సూక్ష్మ
ప్రపంచం కూడ ఉన్నది. కారణ శరీరం అనుభూతమౌతున్నప్పుడు కారణ ప్రపంచం కూడ ఉన్నది. మహా
కారణ స్థితియందు మహా కారణ ప్రపంచం కూడ ఉన్నది.
అట్లే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలనే స్థితులలో కూడ ఆయా స్థితులకు సంబంధించినటువంటి
ప్రపంచాలున్నాయి.
శరీరము, ప్రపంచము ఉన్నప్పుడు వాటి వాటి వ్యవహారములు కూడ సిద్ధముగనే ఉంటాయి. కాబట్టి ఆయా స్థితులను, ఆయా శరీరములతో, ఆయా వ్యవహారములను
సలుపుచూ ఆయా కాలాలు అయిపోగానే అంతరించి పోతున్నావు. కాబట్టి జగత్తులో కనుక నీవు కలసిపోయినట్లయితే, జగత్ సమానమైతే, ఘట సమానమైతే, ఒక ఘటన ద్వారా వ్యక్తమై, మరొక ఘటనలో లేకుండా పోతావు.
సృష్టి వ్యక్తము చెందుట అనే ఘటనలో లేచావు.
స్థితి అనే ఘటనలో ఉన్నట్లు తోచింది. లయము అనే ఘటనలో మరల లేకుండ పోతున్నావు. ఈ రకంగా ఎక్కడికక్కడ ఆయా ఆవరణ దోషం చేత
పరిమితమై, పరిణామం చెందుతూ మరల లేకుండా పోతున్నావు.
కాబట్టి ఆవరణ రహిత పద్ధతిని ఆశ్రయించు. 'జానామీ' ఆవరణ రహిత పద్ధతిని తెలుసుకో.
తెలుసుకుని ఏం చేయాలీ? ఆ రూపంగా నిన్ను నీవు పోగొట్టుకో.
''జానామీతి
సమస్తం జగత్''
జగత్ అనేది ఎలా లేదో, ఘటము అనేది ఎలా లేదో, ఏ ఆవరణ కా ఆవరణ
ఎలా లేదో, ఈ అష్టతను నిరసన పద్ధతిని ఎరిగి, నీవు బయలుగా శేషించు. సర్వ కాలములో ములుగ్రుచ్ఛ సందులేక ఉన్న, సత్యమై, అనంతమై ఉన్న ఏ అంతరిక్షం లేక
బయలైతే ఉందో అదే నేను, 'నేను' లేని
స్థితి.
ఈ 8 తనువులకూ మూలాన్ని అక్కడ గనుక
గుర్తెరిగినట్లయితే ఆ మూలం అక్కడ లేదు. 'ఈ
మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీలేదు' అనేటటువంటి షోడశీ
మంత్రమును ఇక్కడ ఘటం అనేటటువంటి ఉపమానం ద్వారా నిరూపిస్తున్నారు.
నీ శరీరము ఒక ఘటమే. నీ స్థూల శరీరం
దగ్గర్నుండీ మొదలు పెడితే స్థూల సూక్ష్మ కారణ మహా కారణములనే శరీరముల యందు సాక్షీ
స్వరూపమైనటువంటి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలనేటటువంటి జీవ తను చతుష్టయము,
విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత,
పరమాత్మలనే ఈశ్వర తను చతుష్టయము కలసి మొత్తం 8 శరీరములు.
ఇవి అన్నీ ఘటములే. ఈ 8 శరీరములూ కూడా వాటి
వాటి స్థితులలో, వాటి వాటి పరిణామాన్ని, వాటి వాటి వ్యవహారాన్ని కలిగి యున్నాయి. శరీరం అనడానికి కారణం ఏమిటంటే 'శీర్యతి ఇతి శరీరః' తనకు తానే కాలగతి యందు నశించి పోవునది. తనకు
తానే వ్యక్తమై, తనకు తానే పరిణమించి, తనకు
తానే ఏదైతే లేకుండా పోతున్నదో అదే శరీరము.
కాబట్టి ఈ అష్ట తను నిర్ణయాన్ని ఎరిగి, దశ విధ ప్రళయాలను తెలిసినవాడవై, నిన్ను
నీవు లేకుండా చేసుకునేటటువంటి, సరైనటువంటి కేవల జ్ఞాన
పద్ధతిని ఆశ్రయించు.
'జానామి'
ఈ కేవల జ్జానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, వాళ్ళు
ఈ జగత్ యొక్క స్వరూపాన్ని ఎరిగినటువంటివారు.
జగత్ అంటే ''జాయతే గచ్చతే ఇతి జగత్''
మరల ఒకసారి
పరిశీలిస్తే ''నానాఛిద్ర
ఘటోదరస్థిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే''.
కాబట్టి ఈ అష్ట తను నిర్ణయాన్ని
దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి దక్షిణామూర్తి అయిన సద్గురుమూర్తి మౌన వ్యాఖ్య
ద్వారా ఏ బయలు చిత్ గగనమునకు అవతల ఉన్నటువంటి అనే స్థితిని సూచిస్తున్నారో, అది అందుకునే ప్రయత్నం చేయాలి.
ఎన్ని గగనములు
ఉన్నాయి?
పంచ గగనములు. ఈ పంచ గగన పద్ధతి
సాధనములలోకెల్లా ఉత్తమమైన సాధనా పద్ధతి. ఈ పద్ధతిని ఆశ్రయించినటువంటివారే జన్మ
రాహిత్య స్థితిని చేరగలుగుతారు.
పంచ
గగనములు :
భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, దహరాకాశం,
కేవలాకాశం.
ఈ పంచ గగన పద్ధతిగా ఎవరైతే ప్రయాణం
చేస్తారో వారు నిరావరణ స్థితికి చేరుతారు. ఆవరణ రహిత పద్ధతిగా ఉంటారు. మల విక్షేప ఆవరణ దోషములలో చిట్టచివరి దోషం
ఆవరణ దోషం. ముందుగా అన్ని సాధనలతో మల విక్షేప దోషములను పోగొట్టుకోవాలి.
కాబట్టి జీవ భావం నుండి ఆత్మ భావానికి
వెళ్ళి ఆత్మ నిష్ఠుడయ్యే లోపల విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి. ఆత్మ నిష్ఠుడైన
తరువాత బ్రహ్మాను సంధానంతో మల దోషాన్ని పోగొట్టుకోవాలి. బ్రహ్మానుసంధానం అయిన
తరువాత బ్రహ్మ నిష్ఠుడయిన తరువాత, పరబ్రహ్మ
నిర్ణయాన్ని పొందేటప్పుడు ఈ ఆవరణ దోషాన్ని పోగొట్టుకోవాలి.
కాబట్టి మల విక్షేప ఆవరణ దోషములనే త్రివిధ
దోష రహితమైనటు వంటిది, ఆవరణ రహితమైనటువంటి
బయలే సత్యము.
అటువంటి సద్గురుమూర్తి దక్షిణామూర్తి మౌన
వ్యాఖ్యగా, వ్యక్తీకరిస్తున్నటువంటి ఆ సర్వం
శూన్యం, శూన్యమే సర్వంగా తోస్తున్నది. సర్వ శూన్యములు రెండూ
ఒకచోటే ఉన్నాయి. అందుకే చిన్ముద్రయందు సూచ్యముగా సూచించబడుతున్నది ఏమిటంటే
''పూర్ణమదః
పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణ మేవా వశిష్యతే''
సర్వ కాలమూ ఉన్నది పూర్ణమే.
పూర్ణమెటువంటిదటా? ఆ పూర్ణము నుండి ఏదైనా
తీసివేసినా అది తగ్గదు. కలిపినా పెరగదు. ఎల్లప్పుడూ పూర్ణమే. అలాగే ఈ పూర్ణము
శూన్యమనే అర్థానికి కూడా సరిపోతుంది.
''అంతఃశూన్యం
బహిఃశూన్యం మధ్య శూన్యం శూన్య కుంభ మివాంబరే''
ఒక ఆకాశంలో ఒక ఘటం వచ్చింది. ఆ ఘటములు ఒక
కాలంలో లేకుండా పోతున్నాయి. అప్పుడు ఆకాశం ఏమైనా పెరిగిందా? పెరగలేదు. ఎందుకని?
84 లక్షల జీవరాసులు ఏ ఘటానికి ఆ ఘటం తాను
నేను నేను అనుకుంటోంది. ఇవన్నీ ఏ ఆకాశంలో అయితే ఉద్భవించాయో, ఆ ఆకాశం ఏమైనా తరిగిందా, ఇవి రావడం వల్ల?
తరగలేదు. పోనీ ఇవన్నీ పగిలి పోయినవి. అప్పుడు ఆకాశం ఏమైనా పెరిగిందా?
పెరగలేదు.
మరి ఇక్కడే పెరగనప్పుడు, బ్రహ్మాండ స్థితిలో మాత్రం ఎలా పెరుగు తరుగులు ఉంటాయి?
అక్కడ లేనిది అనంత విశ్వంలో తరుగుట పెరుగుట ఎలా ఉంటాయి? కాబట్టి ఆవరణ అనేది కల్పితం. శరీరం అనే ఆవరణ కూడ కల్పితం. అట్టి కల్పిత
ప్రభావంచేత తోచిన జగత్ ఏదైతే ప్రతిబింబ సమానమో, దానిని
సత్యమనుట విక్షేప దోషము. ప్రతిబింబమును సత్యమనుట విక్షేప దోషము.
నీ ఘటమును, శరీరమును సత్యమనుట ఆవరణ దోషము. అయితే ఈ శరీరం
సత్యం అనడానికి కారణం ఏమిటంటే, మలదోషం కారణం.
సమష్టి అయినటువంటి మల దోషంగా పరిణమించి, ఈ జీవభావ
మేర్పడింది. అట్టి మలదోష ప్రభావంచేత నా ప్రపంచం వేరే, నేను
వేరే అనే బేధబుద్ధి అయిన విక్షేప దోషానికి అవకాశమొచ్చింది.
ఈ మూడింటినీ చక్కగా విచారణ చేసి జ్ఞాన
మార్గం ద్వారా దర్శన పద్ధతిగా, స్వప్రకాశ దర్శన
పద్ధతిగా తనను తాను గుర్తెరిగి తాను లేనటువంటి వాడుగా ఉండిపోవాలి.
'కోహం'
అనే ప్రశ్నకు 'సోహం' అని
గుర్తెరిగి 'నాహం' అనే చిట్టచివరి
స్థితికి చేరుకోవాలి. అప్పుడు ఉన్నది పూర్ణమే. ఉన్నది శూన్యమే. పూర్ణము, శూన్యము అభేదము. కాబట్టి 'జానామి' తెలుసుకున్నాను. 'జానామి' బాగా
తెలుసుకున్నాను. 'జానామి' నేనే లేని
వాడనని తెలుసుకున్నాను.
''నానిఛిద్ర
ఘటోదరస్థిత ... తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే''
కట్టపడపటికి మౌన స్థితే మిగిలింది. సర్వమూ
శూన్యమై, మౌనమే మిగిలింది. కాబట్టి దక్షిణామూర్తి యొక్క మౌన
వ్యాఖ్యను తెలుసుకోవాలి అంటే ఈశ్వరీయ మౌనాన్ని ఆశ్రయించినవాడు మాత్రమే
తెలుసుకోగల్గుతాడు.
మౌనం
త్రివిధంబులు:
1. వాచిక
మౌనం
2. మానసిక
మౌనం
3. ఈశ్వరీయ
మౌనం
అట్టి ఈశ్వరీయ మౌన స్థితిలో ఎవరైతే
నిలిచారో, అటువంటి స్థితిలో ఉన్నారో వారు మాత్రమే ఈ
మౌన వ్యాఖ్యను తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి
అలాంటి ఈశ్వరీయ మౌన ప్రాప్తి కొఱకై మానవుడు ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ''తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే''
గురువులకెల్లా గురువైనటువంటి ఆది గురువైన దక్షిణామూర్తి యొక్క కరుణని పొందగలుగుచున్నారు. అప్పుడు మాత్రమే జన్మ రాహిత్య స్థితి అందగలుగుచున్నారు. పొందుట, అందుట. సాధనంతా ఈ రెండు మాటల్లోనే ఉంది.