3వ శ్లోకం
యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధగం భాసతే
సాక్షాత్తత్వ మసీతి వేదవచసా యో
బోధయత్యాశ్రితాన్ |
యత్సాక్షాత్కరణాద్ భవేన్న
పునరావృతి ర్భవాంభోనిధౌ
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
శ్రీ దక్షిణామూర్తయే ||
ఈ శ్లోకంలో
అతి ముఖ్యమైన, ప్రాణప్రదమైనదేమిటంటే 'న
పునరావృత్తిర్భవాంభోనిధౌ'
భవము : జనన
మరణ ఆవృత్తి. 'భవాంభోనిధౌ' అదెట్లా
ఉందట? సముద్రం వలే అంతం లేకుండా ఉందట. కాలమనే సముద్రంలో మనం
జీవుడుగా, ఆత్మగా, బ్రహ్మగా ఆ పరబ్రహ్మ
నిర్ణయం పొందేవరకు అనేక కాలములలో, అనేక దేశములలో, అనేకమైన దేవతా స్థితులతో, అనేకమైన నిర్ణయాలతో,
అనేకమైన జన్మలతో పరిణామం చెందుతూ ఉంటాము. 14 లోకాలలో ఎక్కడైనా
పుట్టవచ్చు.
అశరీరులు ఎంతమంది? యక్ష, కిన్నెర, కింపురుష,
గాంధర్వ, పిశాచ, సాధ్య...
వీళ్ళందరూ అశరీరులే. వీళ్ళందరూ సృష్టిలో ఉన్నారు. వీళ్ళందరూ ఆయా సృష్టియొక్క అధి
దేవతలుగా, మనసుగా ఆవేశించినటువంటి త్రిగుణాత్మక శక్తులుగా
ఉంటారు.
కాబట్టి నీ మనసులో ఏ గుణం యొక్క బలం, ఏ గుణం యొక్క బలహీనత ఉంటాయో ఆ గుణాన్ని ఆశ్రయించి ఈ
అశరీరులందరూ నీ మనసులో ప్రవేశిస్తారు. అందుకే ఇప్పటిదాకా బాగానే ఉన్నారు.
కాసేపట్లో ఏదో తేడా వచ్చేస్తుంది. అంటే గుణం ద్వారా వాడు ఆవేశించాడన్నమాట.
ఆవేశించేప్పటికి నీలో, భావంలో భేదం వచ్చేస్తుంది. స్థిరమైన
సంకల్ప ఉండదన్నమాట. కాబట్టి జ్ఞానం చేత మాత్రమే ఈ 14 లోకాలను భ్రాంతిగా
నిర్ణయించాలి. 'లోకంబులు, లోకేశులు,
లోకస్థులు తెగిన తుది అలోకంబగు, పెంజీకటి
కవ్వల ఏకాకృతియై వెలిగెటి జ్యోతి..' అని పోతన భాగవతంలో
చెప్పారు కదా! కాబట్టి ఎన్ని ఉన్నాయి? ఆయన కూడా confirm చేసేశారు. ఏమిటి? లోకంబులు, లోకేశులు,
లోకస్థులు. ఎందుకు చెప్పారిలా? అంటే, ముక్తి చతుర్విధములు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ముక్తులు. కాబట్టి మనం కర్మ
మార్గంలో, యోగ మార్గంలో, భక్తి
మార్గంలో, జ్ఞాన మార్గంలో కూడ ప్రయాణం చేసేటప్పుడు ఈ
చిట్టచివరిదైనటువంటి సహజ అమనస్క
నిర్వికల్ప రాజయోగ పద్ధతిని చేరేంతవరకు, ఈ దృక్ రహిత
స్థితిని చేరేంత వరకూ పరబ్రహ్మ నిర్ణయ స్థితిని చేరేంతవరకూ కూడ మీకు పునరావృత్తి
తప్పదు.
కాబట్టి ఈ మూడవ శ్లోకంలో ఏం
చెప్తున్నారంటే, ''పునరావృత్తి భవాంభోనిధౌ''
నాయనా! నీవు అనేకమైన స్థాయిలలోను పొందుతున్న జన్మ ఏదైతే ఉందో,
ఆ జన్మను పోగొట్టుకోవాలీ అంటే ఒకసారి జన్మించావంటే ఏదో ఒక కాలంలో
నీవు పోక తప్పదు. ఏ కాలంలో గాని ఏ లోకంలో గాని ఉన్నావంటే పోక తప్పదు. కాబట్టి నీ
ఉనికిని నీవు పోగొట్టుకునే పనిలో నీవు పడినప్పుడు మాత్రమే నీకిది సాధ్యమౌతుంది.
తనను తాను పోగొట్టుకోవడం, 'నాహం' అనే
స్థితికి చేరటం అని చెప్తున్నారు. కాబట్టి ఏం చెప్తున్నారు? 'యస్యౖౖెవ స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్ధగం భాసతే' అన్నారు.
'యస్త్యైవ స్ఫురణం' పైన చెప్పిన విధంగా
'బీజస్యాంత రివాంకురో' ఇది
మొలకెత్తుతోందా? నిర్బీజమౌతోందా? నిర్బీజమవ్వాలంటే
ఏం చేయాలి? ఆ మూడూ పోవాలి కదా?
శూన్యము, కాలము, సంకల్పము. అనగా శూన్యము- శూన్యాతీతము,
కాలము- కాలాతీతము సంకల్పము-సంకల్పాతీతము.
ఇది ఎలా సాధిస్తావు? విత్తనాలు మరల అంకురించకూడదు అంటే వేపాలి.
ఉదా: పల్లీలు,
అట్లాగే ఎన్ని బీజములు ఉన్నాయో, ఏయే
పరిస్థితులలో అవి అంకురిస్తున్నాయో సమగ్రంగా తెలిసినవాడవై వాటిని పునః
అంకురించకుండా ఉండేటటువంటి పద్ధతిగా నిరసించే నేర్పు కల్గినవాడవై ఉండాలి. కాబట్టి
అచల సిద్ధాంతంలో ఏం బోధిస్తారంటే, బృహద్వాశిష్ఠ సిద్ధాంతంలో
ఏం బోధిస్తారంటే అక్కడ నిరసన ప్రకరణాలే ఉంటాయి.
1. చైతన్య తను
నిరసన ప్రకరణము
2. అహంకార తను
నిరసన ప్రకరణము
3. త్రిగుణ
నిరసన ప్రకరణము
ఇలా అన్నీ నిరసన ప్రకరణాలే ఉంటాయి. 16
ప్రకరణాలు. బృహద్వాశిష్ఠంలో ద్వాదశి ఉపదేశం. వ్యాఖ్య ఏమో షోడశి. ద్వాదశి:
ఉన్నది బయలు, లేనిది ఎరుక. సర్వ కాలమూ ఉన్నది బయలే లేనిది ఎరుక. ''ఏతన్మిధ్యా శుద్ధ వియత్కించిన్నాస్తి''
షోడశి : 'నిర్మూలమేతథాజ్ఞానా చ్చరీరం నాస్తి కేవలం' ఈ గుర్తెరిగే శరీరం ఏమీలేదు. కాబట్టి ఈ రకమైన ద్వాదశి, షోడశి బోధను పొందినవారు ఎవరైతే ఉన్నారో, ''ద్వాదశీ
షోడశులనే జలధార కర్ణములందు సోకిన, బాధలన్నియు తొలగి నీవిక
భ్రాంతి వదిలెదవూ'' అని మేలుకొలుపులో ఉంటుంది. అటువంటి
ద్వాదశి, షోడశి, పంచదశులతో ఎవరైతే
తెలుసుకున్నారో, వాటిద్వారా దృక్ రహిత స్థితిని
సాధించినవారు దేనినుండి బయట పడ్డారు?
పునరావృత్తి రహిత పద్ధతిగా మారారు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు?
యస్యైవ స్ఫురణం : స్ఫురణ అనే చైతన్యమే
అన్నింటికీ మూలం. ఆ స్ఫురణ రహిత పద్ధతిగా మారాలి.
''యస్యైవ
స్ఫురణం సదాత్మకం'' అది ఆత్మగా స్ఫురించింది. సదా నీలో
స్ఫురణ ఉందా లేదా? నాలో ఆత్మ స్వరూపం ఉందా లేదా? ప్రతి వారికి సందేహమే. నీలో ఆ స్ఫురణ కలుగుతోందా లేదా? ఆ స్ఫురణయే ఆత్మ స్వరూపము.
స్ఫురించకలిగే
శక్తి మానవ దేహంలో ఉందా లేదా?
అదే నాయనా! చైతన్యం అంటే. ఏమి స్ఫురించాలి
అని అడుగుతారు? 'యస్యైవ స్ఫురణం, అసత్ కల్పార్ధగం భాసతే' సత్యమేదో, అసత్యమేదో నీకు యథాతథంగా స్ఫురించుతుంది. అనంత సృష్టిలో, జాగ్రద్ స్వప్న సుషుప్తులలో, త్రిపుటులలో మార్పు
చెందనటువంటిదేదో అది సత్యము. సత్యమంటే అర్థం ఏమిటి? త్రిపుటిలో
మార్పు చెందనిదిలేదో అది సత్యము. ఆ 'సత్' స్థితి యొక్క స్ఫురణ కల్గటమే ఆత్మ. కానీ ఇంద్రియాలలోకి దిగి వచ్చేప్పటికీ
ఏమైంది? ఆ 'సత్' స్ఫురణ కాస్తా మరుగై 'అసత్' యొక్క
'కలన'గా బలపడిపోయింది. 'అసత్ కల్పార్ధగం భాసతే' భాసతే అంటే ప్రకాశించుట.
జీవుడికి మరో పేరేమిటి? చిదాభాసుడు. చిత్ యొక్క ఆభాస. ఆభాస అంటే ప్రతిబింబము. 'అసత్
కల్పార్ధగం భాసతే' నిర్వికల్ప స్థితిలో తోచిన సంకల్పం యొక్క
ప్రతిబింబ రూపంగా విశ్వము, బ్రహ్మాండము, పిండాండములుగా ఇన్నిసార్లు అంచెలుగా ప్రతిబింబించింది.
'సాక్షాత్
వేద వచసా..' వేదం వీటన్నింటినీ మధించి, పరిశోధించి, 'ఉన్నది ఇది' అని
నిగ్గు తేల్చింది.
ఏమని చెప్పింది? ఏ బయలైతే, ఏ పరబ్రహ్మైతే, ఏ అంతరిక్షమైతే అనంత విశ్వమును ఒక
బిందువు వలే కలిగి యున్నదో, ఆ బయలులో ఈ విశ్వమంతా ఒక బిందువు
వలె ఉన్నది.
మీరు కూడ ఒక బిందువు పెట్టుకుంటారు, ఏమిటది? తిలక ధారణ. అది కూడా బిందు
స్థానమే. ఒక మనిషిని చూడగానే దృష్టి దేనిమీద పడిందట ఇప్పుడు? బిందువు మీద. అలా బిందువు మీదే ఎందుకు పడింది?
ఆ బిందు
స్థానమే వ్యావృత్తి చెందింది. నీ దేహ నిర్మాణం జరిగేటప్పుడే మొట్టమొదటగా ఏర్పడింది
బిందువే. 'జైగోట్' కూడ
బిందువే. సంయుక్త బీజకణమైన జైగోట్ కూడ బిందువే. ఆ బిందు స్థానమే వ్యావృత్తి చెంది
గర్భస్థ శిశువైంది.
ఎప్పుడైతే ఈ బిందు స్థానములో నిలకడలేమి
ఏర్పడుతుందో అప్పుడు గర్భస్రావం అవుతుంది. కాబట్టి జీవసృష్టి దగ్గర్నుండి మొదలు
పెడితే, జైగోట్ శిశువుగా మారటం దగ్గర మొదలుపెడితే
సర్వసృష్టి నియమాలు కూడ ఈ బిందు స్థానంతోనే ముడిపడి ఉన్నాయి.
సర్వ దేవతా స్థానములు కూడ ఆ బిందువు నందే
ఉన్నాయి. ''బిందూనాం సర్వ దేవతాం ప్రతిష్ఠితం''
కాబట్టి నవావరణ సహితమైన శ్రీచక్రమే ఈ అనంత సృష్టికి కనుక
మూలాధారమైనట్లయితే, దానికి ఆధార స్థానం బిందువు కాబట్టి,
ఆ బిందు స్థానాన్నాశ్రయించి 64వశిన్యాది దేవతలున్నాయి. భువనేశ్వరీ పీఠమైన బిందు స్థానాన్నశ్రయించే
పంచ శక్తులు, పంచ బ్రహ్మలున్నాయి. కాబట్టి
బిందు స్థాన నిర్ణయం అధి దేవతా నిలయం, అధ్యాత్మ నిలయం. అదే
బిందు స్థానము నాదము, కళలతో సంయోగించినప్పుడు బ్రహ్మాండ
సృష్టి ఏర్పడింది.
జగత్ జీవేశ్వర త్రయంతో కూడినప్పుడేమో
జీవేశ్వర సృష్టి ఏర్పడింది. నాద బిందు
కళలతో కూడినప్పుడు బ్రహ్మాండసృష్టి. దేశ కాల కలనలతో కూడినప్పుడు విశ్వ సృష్టి ఈ
రకంగా ఏర్పడుతున్నాయి. ఈ రకంగా స్ఫురించాలి నీకు.జీవ సృష్టిని చూచినప్పుడల్లా అక్కడున్న జగత్ జీవేశ్వరులు తోచాలి. దానికి అతీతమైన ఆత్మ స్థితి తోచాలి. ఈ రెండింటినీ
ఏక కాలంలో దర్శించి నీవు ఆత్మ స్వరూపుడవనే నిర్ణయంతో జగత్ జీవేశ్వర త్రయాన్ని
నిరసించాలి. అదే బ్రహ్మాండ సృష్టిని చూచేటప్పుడు అక్కడ నాదబిందుకళ లను చూడగలగాలి.
ఆ నాద బిందుకళ లను దాటగలిగనటు వంటి బ్రహ్మము అనేటటువంటి బ్రహ్మీభూత స్థితి
సాధించాలి.
ఆ అధిష్ఠాన స్థితిలో నిలబడి ఉండాలి. ఆ
బ్రహ్మము అనే స్థితిలో నిలబడిన వారెవరైతే ఉన్నారో వారు నాదబిందుకళ లకు అతీతంగా
ఉన్నారు. అదే అనంత విశ్వాన్ని దర్శించిన వారికి దేశము, కాలము, కలన అనే సంయోగం చేత విశ్వమెలా
ఏర్పడిందో తెలియాలి.
దానికి అతీతమైనటువంటి 'బయలు' అనే దర్శన స్థితిలో నిలబడి ఉండాలి.
ఈ రకంగా వాటియొక్క స్ఫురణగా చెప్తున్నారు. స్ఫురణకు అతీతమైన స్థితిని కూడ
బోధిస్తున్నారు. అందుకని
'యస్యైవస్ఫురణం సదాత్మకం..' అన్ని చోట్ల ఆత్మ శబ్దం సాక్షిత్వాన్ని
బోధిస్తోంది.
''యస్యైవ
స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్ధగం భాసతే''
నాయనా ! జగత్ జీవేశ్వరులతో కూడిన
జీవసృష్టి లేనిదే. నాద బిందు కళలతో కూడిన బ్రహ్మాండ సృష్టి లేనిదే. దేశ కాల కలనలతో
కూడిన విశ్వ సృష్టి కూడ లేనిదే.
ఈ రకంగా 'అసత్ కల్పార్ధగం భాసతే'. అది ఆభాసతో కూడినది.
ప్రతిబింబ సమానమైనది. అధిష్ఠానమైనటువంటి నీవు అసలు వాస్తవంగా ఈ మూడింటియందు అఖండ
ఎరుకగా ఉన్నటువంటి వాడవు. నీవు కనుక నీ మూలాన్ని బయలులో చూడబోతే ఈ
అఖండ ఎరుక లేని ఎరుకగా అయింది. లేని ఎరుక స్థితిని తెలుపుతుంది. ఈ రకంగా నీవు
ఎప్పుడైతే చేరావో, ఆ రకమైనటువంటి జనన మరణ
రహిత స్థితి, పునరావృత్తి రహిత స్థితి చేరుకున్నావో,
'యస్యైవ
స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్ధగం భాసతే', 'సాక్షాత్తత్వమసీతి'
తత్, త్వం, అసి అని
మూడూ స్థితులు. ఈ మూడు పదములూ మూడు స్థితులు.
'తత్పదం
దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః' అని గురు స్తోత్రాలన్నీ 'తత్' పదంతో ముడిపడి ఉంటాయి. నీవు ఎవరు 'త్వం'; 'అసి'
పదమైన అబేధ స్థితిలో, ఏకీకృత స్థితిలో 'తత్', 'త్వం' అనే రెండు
పదములు లేవు. అందుకని 'తత్త్వమసి' మహా
వాక్యం ఉపదేశ వాక్యమై, పరబ్రహ్మ సూచక పదమై మాత్రమే ఉన్నది.
ఆ 'అసి'
పదం అనే పరబ్రహ్మ పదంలో ఎవరైతే నిలచి ఉన్నారో వారు సహజ అమనస్క
నిర్వికల్ప రాజయోగులు. వారు దేశికులు.
వారు పూర్ణ గురువులు. ఇటువంటి పూర్ణ గురువును ఆశ్రయించి కాలాతీత స్థితిని
సాధించాలి.
''యస్యైవ
స్ఫురణం సదాత్మకం అసత్ కల్పార్ధగం భాసతే, సాక్షాత్తత్వ
మసీతి వేదవచసా''
ఇప్పుడు వేదం ఏ నిర్ణయాన్ని చెప్పింది? పరబ్రహ్మ నిర్ణయాన్ని అందించింది.
వ+ ఇదం:
ఉన్నది పరబ్రహ్మమే మధ్యలో చెప్తున్నటువంటి కల్పనలైనటువంటి
జగత్
జీవేశ్వర త్రయంతో కూడుకున్నట్టి జీవసృష్టి గాని, నాద బిందు కళలతో కూడుకున్నట్టి బ్రహ్మాండ సృష్టిగాని, దేశ కాల కలనలతో కూడుకున్నట్టి విశ్వ సృష్టిగాని ఇవి అసత్, ఇవి లేనివి.
''అసత్
కల్పార్ధగం భాసతే'' ఆభాసలే అన్నీ.
''సాక్షాత్తత్వ
మసీతి వేద వచసా యోబోధ యత్యాశ్రితాన్''
తిరిగి రానటువంటి బోధను ఆశ్రయించిన
వారెవరైతే ఉన్నారో, 'యోబోధ యత్యాశ్రితాన్'
ఎటువంటి బోధ అంటే పునరావృత్తి రహిత శాశ్వత పదమునకు సంబంధించినటువంటి,
మౌన వ్యాఖ్యను ఆశ్రయించి నటువంటి వారెవరైతే ఉన్నారో 'యత్సాక్షాత్కరణాద్' కరణాత్ అంటే? ఏవేవైతే మూడు మూడుగా ఉంటాయో అవి కరణములు.
అటువంటి కరణములు ఏవీ కూడ బయలు దర్శనం
పొందినటు వంటి వారికి ఈ పరబ్రహ్మ నిర్ణయం పొందినటువంటి వారికి పునరావృత్తి కావు.
మరల ఆ కరణములు పునరుద్భావం చెందవు.
'యత్సాక్షాత్కరణాద్
భవేన్న పునరావృత్తి ర్భవాంభోనిధౌ' అదిట. ముందు ఈ కరణ స్థానములు
ఉత్పన్నమవుతున్నాయట.
'కరణంకార్యం
గహనోగుహః' అనంటోంది విష్ణు సహస్ర నామం.
నాయనా! ఈ భూమండలం మొత్తం మీద ఏమైనా
తెలుసుకోవడానికి ఉన్నదీ అంటే, అత్యంత గహనము,
అత్యంత రహస్యము, ఇంకా ఆత్యంతికమైన దేమన్నా
ఉందీ అంటే, 'కరణం కారణం కర్తా గహనో గుహః' కరణము - కారణము - కర్త. ఈ
మూడింటిని తెలుసుకోవడమే అత్యంత రహస్యము. ఆత్యంతికం. అదే విషయాన్ని మరల ఇక్కడ
ప్రస్తావించారు.
'యత్సాక్షాత్కరణాద్
భవేన్న పునరావృతిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీ
గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'
కాబట్టి కరణములేంటి? జగత్ జీవేశ్వర త్రయం, నాద బిందు కళలనే
త్రయం, దేశకాల కలనలనే త్రయం. ఇవే కరణములు.
ఈ కరణముల వల్లనే కారణములుద్భవిస్తున్నాయి.
కరణం - కారణం
కారణం అంటే
అధిష్టానం. జగత్ జీవేశ్వర త్రయంలో అధిష్టానం - ఈశ్వరుడు, నాదబిందు కళలలో అధిష్టానం- బిందువు, దేశ
కాల కలనలలో అధిష్టానం - కాలం.
కరణం - కారణం - కర్తా : ఈ మూడింటిలో ఎవరు ప్రధానం?
కర్త లేకుండా
కరణం, కారణం పని చేయవు. కర్త ఎవరు? 'నేను' కాబట్టి పరబ్రహ్మ పదంలో ఆ 'కర్త' లేదు, కాబట్టి దీన్నేమన్నారు?
కర్తృత్వ రహిత పద్ధతి.
కర్తను లేకుండా చేసే పద్ధతి ఏమైనా ఒకటి
ఉన్నదంటే, అదే బృహద్వాశిష్ఠ పద్ధతి. ఇదే పరబ్రహ్మ
నిర్ణయ పద్ధతి. అదే అద్వైతంలోని చిట్టచివరి భాగము.
బ్రహ్మజ్ఞానావళీమాలలో చిట్టచివరి శ్లోకం ఏం చెప్తోంది?
''అంతర్జ్యోతి
బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః''
అక్కడొక ప్రతిపాదన చేశారు - 'పరాత్పరః'. దీనియందు నాలుగు స్థితులు చెప్పారు. ఇట్లా అద్వైత వేదాంత సిద్ధాంతమంతా పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ రకమైన సూచనలతో, ఈ మూడవ శ్లోకంలో మరింత విస్తారంగా చెప్పారు.
మొదటి శ్లోకంలోనేమో దర్పణ ప్రతిబింబ
సమానంగా, దర్శన పద్ధతిగా ఎలా అందుకోవాలో చెప్పారు.
రెండవ శ్లోకంలో 'బీజస్యాంత రివాంకురో' అనే ఉపమాన పద్ధతిగా
ఎలా ఇవన్నీ అంకురిస్తున్నాయో, ఎలా వ్యావృత్తి చెందుతున్నాయో,
ఎలా వ్యవహరిస్తున్నాయో, దాన్ని ఎలా
అధిగమించాలో చెప్పారు.
ఈ మూడవ శ్లోకంలో పునరావృత్తి ఏ స్థితిలో
ఎలా కలుగుతోంది, ఈ మూడు స్థితులను ఏ సృష్టికాసృష్టి
స్పష్టంగా 'అసత్ కల్పార్ధగం భాసతే' అనగా
లేని ఎరుక పద్ధతిగా వివరించారు.
దీనిని ఎలా వివరించారు? లేని ఎరుక పద్ధతిగా చెప్తున్నారు, ఇవన్నీ
ఉన్నట్లుగా చెప్పడంలేదు. ''అసత్ కల్పార్ధగం'' ఏ కాలములోనూ ఇవి లేనివే. సర్వాధిష్ఠానమైన కాలము నందు ఇవన్నీ లేనివే. కాబట్టి అట్టి కాలాతీతుడైనట్టి
మహానుభావుడైన సద్గురుమూర్తిని ఆశ్రయించి ఈ 'ఎరుక'ను పోగొట్టుకోవాలి.
దీనిని అధిష్ఠాన ఆశ్రయ పద్ధతి, ఆధార ఆధేయ పద్ధతి అంటారు. అందుకని ద్విపుటిని తెలిసి
తెగకోయాలట. అధిష్ఠానమూ లేదు, ఆశ్రయమూ లేదు. అధిష్ఠానమున్నంత
వరకూ ఆశ్రయాలుంటాయి, ఆధారమున్నంత వరకూ ఆధేయముంటుంది.
కాబట్టి ఈ విమర్శను సక్రమంగా సాంఖ్య తారక
అమనస్క పద్ధతిగా ఎవరైతే విచారణ చేసి దర్శన పద్ధతిగా తెలుసుకున్నవాడై అధిగమించి, తానే లేని స్థితికి చేరుతున్నాడో అతడు, 'నపునరావృతిర్భవాంభోనిధౌ' ఇదీ ఫలితం! తిరిగి మరల ఏ కాలమునందూ పుట్టడు. న
పునః. మరల రాదు.
''తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే''