10

10వ శ్లోకం

                సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్‌ స్తవే
             తేనాస్య శ్రవణా త్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్‌ |
             సర్వాత్మత్వ మహా విభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
             సిద్ధ్యేత్‌ తత్పునరష్టదా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్‌
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

        ఆ దేశికేంద్రుడు పరబ్రహ్మ నిర్ణయం దాకా తీసుకెళ్తున్న శ్లోకమిది.

    ఇందులో రెండే భాగాలున్నాయి. ద్విపుటి అంటారు. అవి శూన్యము, సర్వము, శూన్యం నుండి సర్వం వచ్చింది. సర్వం మరల శూన్యంలో కలిసిపోతుంది.శూన్య సర్వములు ఒకటే అన్నప్పుడు సర్వాత్మ. శూన్య సర్వములు ఒక్కటే అనే నిర్ణయము పొందినటువంటివాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సర్వాత్మ అనే నిర్ణయం తెలిసింది.

     అప్పటికి పంచీకృతం, అపంచీకృతం అనే రెండు భాగాలు లేవు. ఈ రెండు భాగాలున్నంత వరకు శూన్యం వేరుగా, సర్వం వేరుగా ఉంటుంది    సర్వం అంటేనేమో ఐదు ఐదులుగా 25గా కనబడుతున్న పంచీకృత భాగం అంతా. శూన్యం అంటే అపంచీకృత భాగం.

     ఆదిలో అవ్యక్తః, అవ్యక్తాన్‌ మహత్‌ అనేదంతా శూన్యభాగంలో ఉంది.

    కాబట్టి ఎవరైతే సర్వాత్మ నిర్ణయము తెలిసిన వాళ్ళున్నారో, లేనెరుక అనే స్థితిని పొందిన వారున్నారో, ఆ స్థితిలో నిలబడినటువంటి వారికి ఈ శూన్యము సర్వము ఒక్కటై పోతుంది. ఈ శూన్య సర్వములు ఒక్కటే.

  పంచీకృతం అపంచీకృతం ఒక్కటైపోయాయి. రెండుగా లేవిక. ఉన్నది కేవల నిర్గుణ పరబ్రహ్మ మొక్కటే అనేటటువంటి నిర్ణయ స్థితికి చేరతాడన్నమాట. ఈ కేవల నిర్గుణ పరబ్రహ్మ స్థితిని ఈ చివరి శ్లోకంలో చెపుతున్నారు. దీని తరువాత ఒక్కటే శ్లోకం మంగళాశాసనము ఉంటుంది.

    'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం' స్ఫుటీకృతం అంటే స్పష్టంగా తెలియబడింది. కేవలం తెలియబడటం కాదు, స్పష్టంగా తెలియబడింది. ఎంత స్పష్టంగా అంటే సర్వాత్మగా తెలియబడింది. శూన్యము, సర్వము అనే విభజన లేకుండా తెలియబడింది. విభజించడానికి వీలు లేకుండా తెలియబడింది. శూన్యమని, సర్వమనీ గుర్తించేవాడు లేకుండా పోయాడు.

    'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మాద ముష్మిన్‌ స్తవే' ఇతి తరువాత మరల 'ఇదం' వేశారు. రెండు ఇదంలు వేస్తున్నారంటే అర్థం. ముందు సున్న పెట్టాడని అర్థం. 'ఓం' కారానికి ముందు సున్నా పెట్టాడు.

     మరల స్ఫుటీకృతం అంటే నీవు ఉన్నానంటావేమోనని, నీవు లేవని చెప్పడానికి ఇంకో ఇదం వేసి చెప్పారు. 'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతంః' 'స్ఫుటీకృతం' అంటే స్పష్టంగా తెలియబడింది. నిర్ణయమైనదంటున్నావుగా, నిర్ణయమైంది అనే నిర్ణయింపబడిన వాడున్నాడు అనే భావన నీకు కలుగుతుందేమోనని ఇంకో ఇదం వేశాడు. దాని అర్థం ఓంకారానికి ముందు సున్న పెడితే ఏమైంది, ముందు సున్నతో ఎలా పలకాలి? ంఓకారము పలకలేవు.

     త్రిమాతృకలతో కూడిన ఓంకారమునకు ముందు సున్న పెడితే అమాతృకం అయింది. మౌనం అయిపోతుందన్నమాట. అటువంటి స్థితిని సూచిస్తూ 'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం' అంటున్నారు.

       కాబట్టి ఈ రకంగా త్రిపుటి, ద్విపుటిలలో త్రిపుటి అంతా ఓంకారానికి దిగువ ఉంటుంది. అక్షర పరబ్రహ్మ స్థితి కేవల పరబ్రహ్మ స్థితిని సూచించేది ఈ చివరి శ్లోకం. 'కైవల్య నిర్ధారణ', పరబ్రహ్మ నిర్ణయ నిర్ధారణ అన్నమాట.

     'నిశ్శబ్దం బ్రహ్మ ముచ్యతే' ఇప్పటివరకు సగుణ బ్రహ్మ ఉపాసన నుంచి, నిర్గుణ బ్రహ్మ ఉపాసన వరకు బోధించిన బోధా విధానంలో ఇక్కడినుండి చిట్టచివరిదైన పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తుంది.

     నీవు లేనివాడవని ఎప్పుడైతే బ్రహ్మ నిష్ఠనుండి చూసుకుంటావో 'నాహం' అనే నిర్ణయాన్ని పొందుతావు. 'నాహం' అనే నిర్ణయాన్ని పొందినప్పుడు నీకు మోక్షం, కైవల్యం, జన్మ రాహిత్యం సిద్ధించినట్లు.

    ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఏతన్మిధ్యా శుద్ధ వియత్‌ కించిన్నాస్తి ఇతి తేమయా - కొంచెము కూడా లేదు.

'నిర్మూలమే తథా జ్ఞానాత్‌ శరీరం నాస్తి కేవలంఇది చాలా ముఖ్యమైన మంత్రం.

    కైవల్య మోక్షం శేషము.శేషించినదే పరిపూర్ణం, బయలు. బ్రహ్మ నిష్ఠ వరకూ పూర్ణం. పరబ్రహ్మ నిర్ణయం పరిపూర్ణం, బయలు. శూన్యమును బయలనరాదని ఒక నియమం. కారణం ఆ శూన్యం నుండే ఈ సర్వం ఉత్పన్నమైంది. మరల తిరిగి ఈ సర్వం అక్కడికి, అంటే ఆ శూన్యంలోకే చేరుతుంది.

     కాబట్టి శూన్య సర్వములు ఒక్కటే. అందుకని కేవలం శూన్యం, సర్వం అనే విషయం చెప్పటం అనే పద్ధతిగా భగవద్వచనంలో మొత్తం సిద్ధాంతాన్ని చెప్పినప్పటికీ కేవలం పరబ్రహ్మ నిర్ణయం వరకు బోధించడానికి శూన్యం నుంచి సర్వం, సర్వం నుండి శూన్యం అని రెండు పద్ధతులను బోధిస్తారు.

   ఈ రెండు పద్ధతులను బాగా అధ్యయనం చేయడం గురించి ఉప నిషత్తులలో బోధించబడింది. కాని మనకు అతి దగ్గరగా అవతారుడు మెహెర్‌బాబా కాబట్టి, వారు చూపించిన పద్ధతి భగవద్వచనం గ్రంథంలో శూన్యము నుండి సర్వము, సర్వము నుండి శూన్యము అనే నిర్ణయాన్ని మనం బాగా అధ్యయనం చేయవచ్చు. అదే అంశాన్ని ఇక్కడ సూచన మాత్రంగా తెలియచేస్తున్నారు.

'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మాద ముష్మిన్‌ స్తవే'

'యస్మాత్‌' 'ఇదం' తరువాత మళ్ళీ వేశాడు. 'యస్మాత్‌', 'తస్మాత్‌' రెండు శబ్దాలున్నాయి సంస్కృతంలో. 'యత్‌ కించిత్‌ కరోతి, యత్‌' అనే ధాతువు నుండి యస్మాత్‌ అనే శబ్దం, 'తత్‌' అనే ధాతువు నుండి తస్మాత్‌ అనే శబ్దం వచ్చాయి. కాబట్టి యస్మాత్‌ అన్నది ఏమి సూచిస్తోంది అంటే తత్‌ రహితంను సూచిస్తోంది. ఎందుకంటే తత్‌ కనుక ఉన్నట్లయితే, 'తత్‌' కలిస్తే ఎప్పటికైనా 'త్వం' వచ్చే అవకాశం ఉంటుంది.

   'త్వం' ఉన్నంతకాలం తత్‌ ఉంటుంది. త్వం లేకపోతే తత్‌ కూడా ఉండదు. తెలుసుకునేవాడు లేకపోతే తెలియబడేది లేకుండా పోతుంది. 'యస్మాద ముష్మిన్‌ స్తవే' మరల అక్కడే ఆగిపోతావేమోనని ఆముష్మిన్‌ స్తవే అన్నారు. ఆముష్మిన్‌ అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించేది.

మానవ జన్మకు రెండు ప్రయోజనములు. 
1. ఐహికము 2. ఆముష్మికము

      ఈ ఆముష్మికము అనే శబ్దాన్ని తరచుగా వాడరెవ్వరూ కూడ. ఎందుకంటే చిట్టచివరిదైన పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించేది ఆముష్మికము.

    ఐహికం అంటే, ఇహంలో సాధించేది అంతా. అందుకని నీకా సూచన తెలియాలనే ఉద్దేశ్యంతో 'యస్మాత్‌, పరస్మాత్‌' మరలా ఇందులో ఇహానికి సంబంధించినదని అనుకుంటావేమో, అనే సూచనతో పై వాక్యాలలోకూడ 'పరస్మాత్‌ విభో' అన్నారు.

    పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేయడానికి ఒకే ఒక సూత్రమున్నది. తత్‌ పరంచావలోకయేత్‌. ఎన్నిసార్లు వెళ్ళినా ఈ ఒక్క సూత్రమే చెబుతారు.
బ్రహ్మనిష్ఠుడైనటువంటివాడు, జీవన్ముక్తుడైనటువంటివాడు గురువును ఆశ్రయించినప్పుడు ఈశ్వర పంచీకరణం బోధించబడిన తరువాత ఇక బోధ లేదు.

        ఎప్పుడు చెప్పినా ఒకే సూత్రం చెబుతారు. 'తత్‌ పరంచావలోకయేత్‌' దీనికంటే పరాన్ని చూడు. 'అవలోకన', లోకన అంటే చూచుట. దృక్‌గా చూచుట. అవలోకన అంటే స్పష్టముగా చూచుట. 'తత్పరం' 'తత్‌'కి పరమైనటువంటి 'తత్‌ రహిత' స్థితిలో ఎరుక లేని పద్ధతిగా లేనిఎరుక పద్ధతిగా 'బట్టబయలులో గురుడు చూపిన అట్లు లేకను పుడమి అందున'.

        'బట్టబవిడువకయలును గురుడు జూపినట్లు లేకను పుడమి అందున
        పట్టు  గుట్టు మరువక దిట్టమై పోవె జీవా మేలుకొనవే'

        దేశికుడైనటువంటి మహానుభావుడు బట్టబయలును దర్శింపచేస్తాడు. నిజానికి అనంత విశ్వమే లేనటువంటి బయలును అనంత విశ్వమని అనకూడదు. అఖండ ఎరుక ఎలా కనబడుతూందట? అనంతంగా కనపడుతూంది ఇప్పటివరకు. కాని విశ్వం అంతరిక్షంలో అణుమాత్రమనే సత్యం ఎప్పుడు బోధపడింది? విశ్వం లేనటువంటి అంతరిక్ష దర్శనాన్ని నీకు చూపెట్టినప్పుడు ఆ దృష్టితో విశ్వాన్ని చూశాక, ఇప్పుడు అనంత విశ్వం అనటం మానేశాడు.

     ఎందుకంటే 'అనంత' శబ్దం ఒక్క బయలుకు, అంతరిక్షానికి మాత్రమే వర్తిస్తుంది. అందులో అణుమాత్రం విశ్వం. ఆ విశ్వంలో అణుమాత్రం మిగిలినవన్నీ. ఆ అణువులో అణువులో అణువు... ఇలా మన వరకూ లెక్క చూస్తే మనం ఎంత?

     కాబట్టి ఏ శూన్యం నుండి అయితే విశ్వం ఉత్పన్నమైందో మరల ఈ విశ్వమంతా ఆ శూన్యంలోకే పోతుంది. ఆ శూన్యం, ఈ విశ్వమూ కూడ కలిపితే అంతరిక్షంలో అణువు.

     'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం యస్మాత్‌ ఆముష్మిన్‌ స్తవేనీవు ఈ సృష్టిలో శరీరధారివై ఉండగా దేని గురించి స్తుతించాలి?

       మానవుడు దేని గురించి స్తుతించాలనేది నిర్ణయంగా చెబుతున్నాడు. జన్మ రాహిత్య స్థితిని సూచించేటటువంటి సూచనను మాత్రమే స్తుతించాలి, ఆశ్రయించాలి.

        దీని ద్వారా మాత్రమే నీవు జనన మరణ భ్రాంతి నుండి వేరై యుంటావు. ఆ భ్రాంతి నీకు తొలగుతుంది. ఎవరైతే ములుగ్రుచ్చ సందులేనటువంటి బయలును దర్శించారో వారికి జననముందా? ఎక్కడ, ఎవరికి పుట్టాడని చెప్పాలి?

     ఏ గ్రహం మీద, ఏ సౌర కుటుంబంలో, ఏ నెబ్యులాలో, ఏ గెలాక్సీలో, ఏ విశ్వంలో పుట్టాడని చెప్పాలి?
ఇపుడు పుట్టాడని చెప్పడానికి వాడు లేడు, లేనివాడుగా ఉన్నాడు.

       కాబట్టి, 'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్‌ స్తవే' ఇపుడు ఆయన ఏ ఈశ్వరుణ్ణి కొలవాలి? రాముణ్ణో, కృష్ణుణ్ణో, శివుడినో, అమ్మనో ఎవరిని కొలవాలన్నా నేనుండాలి కదా!

       ఉంటేనే జీవుడు, ఈశ్వరుడు. నేనే లేని వాడనేటటువంటి చిట్టచివరి స్థితికి 'నిశ్శబ్దో బ్రహ్మ ముచ్యతే' బ్రహ్మమే లేనటువంటి వాడనే స్థితికి గనుక నీవు చేరిన వాడవైనప్పుడు దేశికుడవై పోయినప్పుడు, ఆ దేశికేంద్రుని యందు ఐక్యతా సిద్ధిని పొందినటువంటి, బయలులో ఏకత్వ స్థితిని పొందిన వాడవై, బయలును దర్శించిన వాడవైనటువంటి, బయలుగా ఉండి పోయినటువంటి వాడిక దేనిని స్తుతించాలి? స్తుతించడానికి వాడులేడు.

        సదా అనడానికి కూడ ఇప్పుడు వాడున్నాడా? సర్వ కాలములందు అంటే, కాలమొకటి ఉంది అంటే, ఆ కాలత్రయా బాధితమైనటువంటి వాడొకడుండాలి. ఏమి చెప్పినా దానికి సంబంధించిన వాడొకడుండాలి. దానికి సంబంధించిన మాటే లేదు. 'ఎరుక మీరిన చోట మాటెక్కడోయి' అంటుంది కందార్థం. అంతా హుళక్కే. ఏమిటి అంతా హుళక్కే..
ఈ మొదటి వాక్యాన్ని సూచన వాక్యంగా జీవితంలో స్వీకరించాలి.

'సర్వాత్మత్వమితి స్ఫటీకృతమిదం యస్మాదముష్మిన్‌ స్తవే, తేనాస్య శ్రవణాతదర్థ మననాత్‌ ధ్యానాచ్ఛ సంకీర్తనాత్‌మానవుడనేవాడు దేనిని స్తుతించాలి అనేది చెప్పారు సూచనగా.

        ఆ సూచన స్థితిలో నిన్నుండమని చెబుతున్నారు. 'తేనా' ఏ సూచన ద్వారా నీవీ దర్శన స్థితిని పొందావో, ఆ దృక్‌ రహిత స్థితిలోనే, 'బట్టబయలును గురుడు చూపిన కనుఅట్లే పుడమి అందున పట్టువిడువక గుట్టు మరువక దిట్టమై పోవే'.

      దిట్టమంటే స్థిరం, గట్టిగా ఉండాలని. ప్రతి దేవాలయంలో దిట్టముంది. అంటే ధ్వజస్థంభం క్రింద మట్టు ఉంటుంది భూమి లోపలికి. అదే దిట్టం. దేవాలయంలోకి ప్రవేశిస్తూనే దానికి నమస్కరించాలనే నియమం మన పెద్దవాళ్ళు పెట్టారు.

      ఎంత విశేషమైన ఋషి సాంప్రదాయమో దీనిని బట్టి తెలుసుకోవాలి. కర్మకాండని సంఙారూపకమైన బోధనగా అధ్యయనం చేయడం కోసం పెట్టారు.

      కాబట్టి దేవాలయం ఒక పాఠశాల. మొట్టమొదట వెళ్తూనే గోపుర శిఖరదర్శనం, గోపురానికి నమస్కరించాలి. దాటుతూ ఉండగా ఆ గోపురానికి అట్టడుగు భాగంలో ఒక దిట్టముంటుంది. అది కూర్మ యంత్ర ప్రతిష్ఠాపనతో ఒక గడప ఉంటుంది. దానిమీద కాలు పెట్టరాదు. ఆశ్రయించి నమస్కరించాలి.

      పైన శిఖరానికి, క్రింద కూర్మ యంత్రానికి మొదటి నమస్కారం. తరువాత కనబడే ధ్వజస్థంభ శిఖరమునకు నమస్కారం.

        అలాగే ధ్వజస్థంభానికి ఆధారభూతమైనటువంటి దిట్టం. ఏదైనా పడవచ్చు గాని, దిట్టం పడిపోకూడదు, చెదరకూడదు. ఆ దిట్టం ఉన్నంత కాలమూ ఆ ఆలయం ప్రాభవంగా ఉంటుంది. ఆ దిట్టానికి నమస్కారం.

    తరువాత ఆలయ శిఖర దర్శనము, దానికి నమస్కారము. ఇప్పుడు ఆలయంలో ప్రవేశించాం. గర్భాలయ ద్వారానికి నమస్కారం. గర్భాలయ ద్వారానికి ఒక కూర్మ యంత్రం స్థాపించబడి ఉంటుంది. కాబట్టి గర్భాలయ ద్వారాన్ని ఎప్పుడూ తొక్కకూడదు. తరువాత నమస్కారం మూలవిరాట్టుకు, అదే స్థిరం. దానిపేరే ధృవం. అందుకే వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు 'ధృవబేరము' అని పేరు. ధృవము అంటే కదలడు. అంతే!

       రాయి అని కదలదని కాదు. కదలడానికి ఇక స్థానం లేనటువంటిది. అంతటి వ్యాపకమైన శక్తి. ములుగ్రుచ్చ సందులేక ఉంటే కదలడం ఎలా? అందువలనే కదిలే అవకాశం లేదు. విశ్వానికి కదిలే అవకాశం ఉంది గాని అంతరిక్షానికి కదిలే అవకాశం లేదు. కాబట్టి అంతరిక్షానికి ధృవమని, స్థిరమని పేరు.

        కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా మూలవిరాట్టు కదలదు, ధృవము స్థిరము. దాని పేరు స్థిర లింగము అట. ఒట్టి లింగమైతే కదులుతుంది. దానిపేరు ధృవలింగం.

        కాబట్టి ఈ దేవాలయ దర్శనంలోపే ఈ వేదాంత తత్త్వ విచారణ అంతా ఇమిడ్చారు. అయితే దేవాలయాన్ని పాఠశాలగా స్వీకరించక పోవడంతో ఏమయ్యావు? ఆ ముష్మికాన్ని పొందవలసినవాడు ఐహికాన్ని పొందుతున్నాడు. ఎంత తేడానో చూడండి. మానవ జన్మకి లక్ష్యమైనటువంటి ఐహికమూ, ఆముష్మికమూ రెండూ పొందేటటువంటి పాఠశాల దేవాలయము. ఐహికంలో నీకేం కావాలంటే అదిస్తాడా ఆ భగవంతుడు? ఇవ్వడు. వేదాంత విచారణ స్పష్టంగా చెబుతుంది.

       ఎందుకని అంటే మానవుడికి లేనిది 'శాంతి' ఒక్కటే. మనసు ఉంది కాబట్టి మిగిలినవన్నీ మానవ ప్రయత్నంతో సాధ్యమే. కాబట్టి దేవాలయమునకు వెళ్ళి మానవులు అడిగే కోర్కెలన్నీ ప్రయత్న సాధ్యములు. ప్రయత్నంచేత సాధించబడనిది ఒకటే ఉంది. అదే శాంతి. ప్రయత్నం విరమించితే తప్ప శాంతి సాధ్యం కాదు.

       శాంతిగా ఉండి ప్రయత్నించండి అంటారు. ఈ రెండూ ఒకేసారి ఎలా పొసగుతాయి? ప్రయత్నించాలంటే కదలాలి, కదిలితే శాంతి లేదు.

     కాబట్టి మనమేం చేస్తున్నామంటే గాఢ నిద్రావస్థలో ఆ శాంతిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కూడ ప్రయత్నం ఉండటం వలన శాంతి కాస్తా అశాంతి అయి కూర్చుంది.

     ఈశ్వర వరదానం, జీవులందరికీ గాఢ నిద్రావస్థలో సహజంగా శాంతియే అయ్యే లక్షణాన్ని పెట్టాడు. మానవుని ప్రయత్నం ఐహికంలో ఎంత  బలపడిపోయిందంటే ఆ గాఢ నిద్రావస్థని కూడా ప్రయత్నపూర్వకంగా చేసే దశకి వెళ్ళేటప్పటికి అశాంతినే పొందుతున్నారు.

    కాబట్టి 'మనసన్నా, మాయన్నా, ఎరుకన్నా ఒకటేరన్నా' అనే సత్యాన్ని ఎరిగినటువంటివాడే ఆముష్మికమనే దాని జోలికి రాగలుగుతాడు. అప్పటిదాకా ఐహికము నిన్ను విడిచిపెట్టదు.

        ఎవరైతే మనసన్న, మాయన్న, ఎరుకన్న ఒకటేననే నిర్ణయాన్ని తత్త్వజ్ఞానం ద్వారా పొందారో వారు ఆముష్మికమును మాత్రమే స్పృశిస్తారు. అప్పుడు ఇక వానికి ఐహికంలో కూడ ఆముష్మికమే కనబడుతుంది. అంతటా ఉన్నది ఏదో దానిని మాత్రమే దర్శించేటటువంటి వానికి ఒకచోట ఉన్నది ఎలా తోస్తుంది?

        అందుకని ఈ రెండవ వాక్యంలో మొదటి పదం 'తేనాత్‌' వేశారు. ఆముష్మికాన్ని దర్శించినటువంటి దృక్‌ రహిత స్థితిలో ఉన్నవాడు 'తేనాత్‌'.

        ఆ దర్శన స్థితిని పొందినటువంటివారు ఎవరైతే ఉన్నారో, వారు తదర్థమననాత్‌, ధ్యానాత్‌, సంకీర్తనాత్‌, శ్రవణం, మననం, ధ్యానం చేస్తున్నాడా? చేయడం లేదా? మానవుడు పుట్టిన దగ్గరనుండి పోయేవరకు చేసేదేమిటి? శ్రవణ మనన నిధి ధ్యాసలు. సాధనలన్నీ ఈ మూడింటిలోనే ఉన్నాయి.

        ఈ మూడూ బ్రహ్మనిష్ఠ వరకు పనికొస్తాయి. 'తేనాస్య శ్రవణాతదర్థ మననద్ధ్యానాచ్ఛ సంకీర్తనాత్‌' నాల్గవది సంకీర్తన. దేనిని గురించి సంకీర్తన చేయాలి. ఏ స్థిరాన్ని, ఏ ధృవ పదాన్ని, ఏ మార్పు చెందని దానిని, ఏ కదలని దానిని దర్శించాడో, ఆ దర్శన స్థితిలో తానే లేకుండా పోయాడో అట్టి స్థితియందు నిలకడ కలిగి ఉండటమే దిట్టమైపోవడం. శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా నీవు స్థిరమై పోవాలి, అని క్రిందనుండి ఏ పద్ధతిగా చెప్పారు నీకు? నీవు ఆత్మ స్వరూపుడవని శ్రవణం, మననం చెయ్యి.

        ఆ ఆత్మ భావమే జీవుడుగా ఉన్నప్పుడు జీవాత్మ అయింది. అదే బ్రహ్మ భావనతో ఉన్నప్పుడు బ్రహ్మమైంది. ఆ ఆత్మ భావమే పరబ్రహ్మ మైనప్పుడు పరబ్రహ్మమైంది. అంటే జీవుడుగా ఉన్నది, బ్రహ్మముగా ఉన్నది, పరబ్రహ్మగా నిలబడి పోయింది కూడ ఆ ఆత్మ స్వరూపమే. అందుకని ఆత్మని పురుషుడన్నారు. పురుషుడనే పద్ధతిగా క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు ఏ పేరుతో ఎలా అన్వయం చేసినా అదే. కాబట్టి నీవా పురుషోత్తమ స్థితిని తెలుసుకున్నవాడవైనపుడు ఇంక శ్రవణ మనన నిధి ధ్యాసలు దేని గురించి చేస్తావు

        ఉదాహరణకు ఒక పిల్లవాడు పొద్దున లేచిన దగ్గర్నుండీ, రాత్రి నిద్రపోయే వరకు నాకు బంతి కావాలి, నాకు బంతి కావాలి అంటాడు. వాడు శ్రవణ మనన నిధి ధ్యాసలు బంతికోసం చేశాడిపుడు.

        కాబట్టి నీవు పుట్టినప్పటినుండి శ్రవణ మనన నిధి ధ్యాసలు ఏదో ఒకదానిమీద నీకంటే అన్యంగా ఉన్న దానిమీద పెట్టడం అలవాటు చేసుకున్నావు. దానినుండి ఎదిగే కొద్దీ తత్త్వ జ్ఞానంలో ప్రవేశించే కొద్దీ ఏం చెప్పారు? నీ కంటే అన్యంగా ఉన్నదానిని శ్రవణ మనన నిధి ధ్యాసలు చేయటం వలన ఉపయోగం లేదు.

        'సోహం' అది నేనై ఉన్నాను. 'స అహం' అనేటటువంటి ఆత్మ భావనలో, బ్రహ్మ భావనలో నిన్ను ప్రవేశింపజేసి, దానియందు శ్రవణ మనన నిధి ధ్యాసలు చేసే పద్ధతిగా నిన్ను నడిపిస్తున్నారు. ఆ నడక నడచి సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తుల ద్వారా బ్రహ్మ నిష్ఠను ఎవరైతే పొందారో వారికి ఇప్పుడు ఏం చెప్తున్నారు?

        యస్మాత్‌, పరస్మాత్‌ అనే రెండు విశేషణల ద్వారా స్థిరమైనటువంటి, ధృవమైనటువంటి, ములుగ్రుచ్చ సందు లేనటువంటి పరబ్రహ్మమును సూచించారు. ఇప్పుడేం చేస్తున్నాడింక? 'తేనాస్య శ్రవణాత్తదర్థ మననాత్‌ధ్యానాచ్ఛ సంకీర్తనాత్‌'. ఇప్పుడు అన్నమయ్య గారు వేంకటేశ్వర స్వామి వారి మీద సంకీర్తనలు రాశారు. ఇది అందరికీ తెలిసిన సత్యం.

        కానీ అన్నమయ్య వెంకటేశ్వరస్వామి గురించి రాశారా అంటే. వాటి యొక్క అర్థాన్ని వెంకటేశ్వరుడికి అన్వయం చేసే పద్ధతిగా చూసినంత సేపు అలాగే తోస్తుంది. ఆ అన్వయాన్ని ధృవము అనే దానివైపు అన్వయం చేస్తే పరబ్రహ్మమే.

        కాబట్టి తత్త్వజ్ఞానము కలిగినటువంటివాడు ఎవడైతే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వాడున్నాడో, పరబ్రహ్మ నిర్ణయ స్థితిలో నిలబడిన వాడున్నాడో, దేశికుడిగా  నిలబడిన వాడున్నాడో, దేశికేంద్రునియందు ఐక్యతా స్థితిని పొందినవాడున్నాడో వాడికి ఇహము, పరము రెండూ లేవు.

        ఇహమే పరమై ప్రకాశిస్తుంది. ఇపుడు మోక్షమంటే ఏమిటి? నేనెపుడూ పుట్టలేదు, నేనెప్పటికీ పోను, నేనెప్పుడూ ఉన్నవాడను, ఏ మార్పు లేక ఉన్నవాడను, ఏ కదలిక లేక ఉన్నవాడను.

        ఈ విచారణా క్రమం ఎక్కడో చివర ఉన్నవారికి, అనగా జీవితాన్ని అనుభవించాలి అనే భోగిభోగ్య భావనతో ఉన్నవారికి, కర్తృత్వ, భోక్తృత్వ అభిమానములు కలిగి ఉన్నవారికి ఆ చిట్టచివరిదైన పరబ్రహ్మ నిర్ణయం గురించి చెప్పరాదు. ఇది పరిపూర్ణమైనటువంటి ధృవ నిర్ణయమైనటువంటి కేవల సూచన వాక్యములైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి అన్నమాట.

        అందుకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నారు. మిగిలిన 18 యోగాలలో ఎక్కడా 'ప్రాప్తి' అన్న శబ్దం లేదు. 'ప్రయత్నపూర్వకముగా సాధ్యము కానిది, సిద్ధమై ఏది ఉందో అది ప్రాప్తి'. అందుకని భారతదేశంలో మాత్రమే ఈ ప్రాప్తి అన్న శబ్దాన్ని వాడుతున్నారు. మిగిలిన దేశాలలో వాడరు.

        ఎందుకని అంటే మిగిలిన దేశాలన్ని చోట్లా కృష్ణమార్గములు. శుక్ల మార్గములు కావు. అవి ప్రయత్న సాధ్యమే. సాధన సాధ్యమే అంటారు కానీ, పురుషోత్తమ స్థితియందు ప్రయత్నం లేదు. ప్రయత్నం చేయడానికి వాడుండాలి కదా! వాడు లేనివాడు కదా! లేని స్థితిలో ప్రయత్నం ఎలా చేస్తాడు? ఇదెలా? అనే వాడికి ఈ బోధ చెప్పరాదు. అతడు ఈ బోధకు అధికారి కాడు.

        'లేని పద్ధతిగా సూచించినవాడు, లేని పద్ధతిగా తెలుసుకోవలె' అంటుంది కందార్థం. ఆ దేశికేంద్రుడు తాను లేడు, అశరీరి. అట్టి అశరీర స్థితి నుండి సూచన చేశాడు. సూచన పొందినటువంటి సచ్చిష్యుడు లేని వాడయ్యాడు. ఈ పద్ధతికి సరిపోయిన వాడైతేనే ఈ బోధకు కుదురుతాడు. అందువలన దీనిని ప్రాప్తి అన్నారు. కాబట్టి మార్జాల కిశోర న్యాయంతో మాత్రమే ఈ స్థితి సాధ్యమౌతుంది.

        ఇంకా భ్రమర కీటక న్యాయం, మర్కట కిశోర న్యాయం, నీరక్షీర న్యాయం.. ఇలాంటివన్నీ ఇక్కడ పనికిరావు. మార్జాల కిశోర న్యాయంగా దేశికేంద్రుని చేత సచ్చిష్యుడయ్యే అర్హత పొందినటువంటివాడికి సూచన చేస్తే తెలుసుకోగలిగే వాళ్ళకు మాత్రమే కేవలం సూచన చేశాడట.

        ఎలాంటి సూచన? 'సర్వాత్మత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాద ముష్మిన్‌ స్తవే' అన్నాడు. శిష్యుడేమన్నాడు? 'తేనాస్య శ్రవణాత్తదర్ద్థ మనన్యాద్ధ్యా నాచ్ఛ సంకీర్తనాత్‌'

        ఎలా సూచించారో, ఆ సూచించిన స్థితిలోనే నిలబడిపోయాను అన్నాడు. ఆయన సూచించితే ఈయన నిలబడిపోయాడు. 3వ వాక్యం. 'సర్వాత్మత్వమితి మహా విభూతి సహితం స్యాద్‌ ఈశ్వరత్వం స్వతః' మరల 'సర్వాత్మత్వం ఇతి' అన్నారు. ఇపుడు సర్వాత్మ ఎవరు?

        మొదట సర్వాత్మ ఎవరు? దేశికేంద్రుడు. ఆయన సూచించితే సచ్చిశిష్యుడు నిలబడిపోయాడు. ఆ దేశికేంద్రునితో అభేద స్థితిని, ఏకత్వం పొందాడు. పొందగానే ఏమయ్యాడు? తానూ ఆ సర్వాత్మే అయ్యాడు.
విభూతి మంత్రం : 'విభూతిర్‌ భూతికరీ సర్వైశ్వర్యకరీ సదా శివకరీ' విభూతిని ధరించిన వారు ఈ మంత్రం తెలుసుకుని ధరించాలి.

        అందుకే భగవద్గీతలో కూడ విభూతి యోగం ఉంది. ఏముంటుంది అక్కడ? ఈ అనంత విశ్వంలో నా విభూతుల గురించి తెలియచేస్తాను అన్నారు. వకార శబ్దం మీద విభూతి యోగంతో పాటు, విశ్వ సందర్శన యోగం ఒకటుంది.

'సర్వ్మాత్వ మహా విభూతి సహితం'
ఎవరికైతే ఈ సృష్ఠి మొత్తాన్ని, ఈ విశ్వం మొత్తాన్ని ఈశ్వర విభూతిగా దర్శించగలిగే శక్తి ఉందో ఇదంతా ఈశ్వర విభూతి.

        ఈశ్వరుడంటే శివకేశవులని అర్థం కాదు. జగత్‌కర్త, సర్వకర్త ఒకడున్నాడు. ఒక స్థితి ఉంది. అది శూన్యం. ఆ శూన్యం నుండే సర్వం వచ్చింది. శూన్యం నుండి ఏమీరాదు కదా. ఇపుడు వేదాంత విజ్ఞాన శాస్త్రం ఏదైతే చెప్పిందో, పదార్థ విజ్ఞాన శాస్త్రంలో కూడా అక్కడికే చేరాము.

        గెలాక్సీ మధ్యలో పెద్ద బ్లాక్‌ హోల్‌ ఉంది. ఆ బ్లాక్‌ హోల్‌ మధ్యలో శూన్యం ఉంది. ఆ శూన్య ప్రభావం చేతనే ఈ గెలాక్సీ అంతా తిరుగుతుంది. శూన్యం నుండి కృష్ణ పదార్థము వ్యక్తమై, ఆ కృష్ణ పదార్థమే ప్రకాశ ద్రవ్యమై, ప్రకాశ ద్రవ్యము, కాలము, దేశముతో అనుబంధపడి, 'దిశ' అయింది.

        ఇలా తేల్చి చివరికి శూన్యం నుండి గెలాక్సీ వచ్చింది. శూన్యం నుండి సర్వం వచ్చింది అని వాళ్ళుకూడ నిర్ధారణగా చెప్పేశారు. మరల పోతే ఎక్కడకు పోతుంది? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పోతుంది ఎంతకాలమైనా సరే.

        కాలమనేది అవిభాజ్యం, అవిచ్ఛిన్నం. నీవు చూసే సూర్యోదయ, సూర్యాస్తమయాలతో ముడిపడినటువంటి కాల ప్రమాణం నువ్వున్నటువంటి శరీరానుగత పద్ధతిగా లెక్కేసినటువంటి కాల ప్రమాణం అంతే కదా!

        ఇదే అంతరిక్షంలోకి వస్తే ఈ కాల ప్రమాణం సరిపోలేదు. కాంతి వేగంతో కొలిచేటటువంటి Light years లోకి మార్చాం. కాంతి వేగంతో కనుక ప్రయాణం చేసినట్లయితే ఒక సం|| కాలంలో ఎంత దూరం వెళుతుందో దానిని ఒక Light year అన్నాం. ఫలానా నక్షత్రం ఎంత దూరంలో ఉంది? ఇన్ని Light years దూరంలో ఉంది అని అంటాము.

        ఫలానా గెలాక్సీ ఎంత దూరంలో ఉంది. ఇన్ని బిలియన్‌ Light years దూరంలో ఉంది. కాబట్టి ఇదే కాల ప్రమాణాన్ని అక్కడ చెప్పడానికి వీలుకాలేదు. కాల ప్రమాణమునకు 10 times పనిచేస్తున్నాయి. బ్రహ్మాండ పురాణంలో చెప్పిన విధానంలో 10 times ఉంది.

        బ్రహ్మ గారికి ఒక పగలు సంఙారూపమన్నమాట. బ్రహ్మ అంటే అక్కడెవరో ఉన్నారన్నట్లుగా పౌరాణిక సినిమా ఆధారంగా చెప్పలేదు. ఇది ఆ పురాణం సూచించిన విధానాన్నే గ్రహించే అవకాశం లేకపోవడం చేత, ఆ వేదాంత తత్త్వ విజ్ఞానం లేని వారిచే తీయబడటం చేత ఐహికం కంటే కూడ అధోగతి పట్టింది.

        కాబట్టి పురాణం చదివేటప్పుడు, అది ఏమి సూచిస్తోందో అర్థం చేసుకోవాలి. అంటే తత్త్వజ్ఞాని అయినటువంటివాడే పురాణం బోధించాలి.

        బ్రహ్మనిష్ఠుడైనటువంటివాడు, పరబ్రహ్మ నిర్ణయం ఎరిగినవాడే భాగవతం బోధించాలి. శుక మహర్షి బోధించారు. ఆయన పరబ్రహ్మ నిర్ణయం ఎరిగినవారు కాబట్టి బోధించవచ్చు. చెప్పిన వేదవ్యాసునికి పరబ్రహ్మ నిర్ణయం ఉంది. అన్నీ వ్యాస ప్రణీతములే. 'ఆత్మవిత్‌ కురుత్‌' కావ్యం. ఒక కావ్యాన్ని చేయాలన్నా, విమర్శించాలన్నా నీవు ఋషివై ఉండాలి. తపస్సు చేసి దానిని సిద్ధింపచేసుకుని దాని హృదయాన్ని ఎరిగి, దాని యొక్క లక్ష్యాన్ని నీవు అనుభవించినవాడవై అనుభూతి స్థితిలో ఉండి, ఆ బ్రహ్మ నిష్ఠలో ఉండి బోధించేటటువంటివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే దానిని సహజమైన స్థితిలో, అందించవలసిన స్థితిలో లోపం లేకుండా తెలియచెప్పగలుగుతాడు. ఇంత విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే దాని పేరు యుక్తి. ఇదీ విభూతి అంటే.

        అణువు నుంచి మహత్తు స్థితి వరకు ఏదైతే ఉన్నదో, అంతా కలిపి ఒక మాటలో చెప్పడానికి 'విభూతిర్‌ భూతికరీ' అన్నారు. ఆ మహత్‌ స్థితిని ప్రాప్తింపచేసేది ఏదైతే ఉందో అది.

        ఆత్మః భస్మోద్ధూళిత విగ్రహాయ అని శివుడికొక పేరు. ఆయన భస్మోదూరిత విగ్రహుడు. ఆయనకు ఏ ధూళి నచ్చదట. గోధూళి విగ్రహుడు కృష్ణుడు. ఏమిటీ ధూళి సంబంధం! మట్టిలో పుట్టి మట్టిలోనే పోతుందీ శరీరము. అంతకు మించి ఈ శరీరానికి పెద్ద విశేషం లేదు.

        విభూతి అన్న శబ్దాన్ని ఈ రకమైన అన్వయం చేయాలి. నీయొక్క అన్వయ స్థితిని బట్టి నీ నిర్ణయం ఎలా ఉందో తెలుస్తుంది.

        'సర్వాత్మత్వ మహా విభూతి సహితం' 'మహా విభూతి సహితం' ఇపుడీ సర్వాత్మ ఏ స్థితికి వెళ్ళింది? అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా సర్వాత్మయే. క్షర అక్షరం వీళ్ళంతా ఏమై పోయారు. సహితం అంటున్నారు. ఎందులో కలిసిపోయారు? పురుషోత్తమ స్థితియందు కలిసిపోయారు.

        క్షరుడు లేడు, అక్షరుడు లేడు. ఉన్నవాడెవడు పురుషోత్తముడొక్కడే. వాడు కూడా లేనివాడుగా ఉన్నాడు.

        'తదిదం' తరువాత ఏ శబ్దం వచ్చింది? 'స్యాత్‌' వాడు ఉన్నవాడని భ్రాంతి పడతామేమోనని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఉండుట అనే భ్రాంతి ఉంది మానవుడికి. నేను క్షర పురుషుడుగా ఉన్నాను. నేను అక్షర పురుషుడుగా ఉన్నాను అని.

       ఈ ఉండుట అనే బ్రాంతి ఉందట నీకు. ఎక్కడున్నారు అనగానే అందరూ ఫలానా ప్లేస్‌లో ఉన్నామండి అంటారు. ఇది శరీరంతోనే కాదు, జీవాత్మ దగ్గర మొదలుపెడితే చిట్టచివరిదైనటువంటి పరమాత్మ స్థితియందు, పురుషోత్తమ స్థితియందు పరబ్రహ్మ నిర్ణయమందు ఈ ఉండుట అన్న భ్రాంతి ఏదైతో ఉందో ఇపుడు అదంతా లేకుండా పోయింది.
సర్వాత్మత్వ మహా విభూతి సహితం స్యాత్‌ - స్యాత్‌ విడిగా పలకాలి.

       స్యాత్‌ అంటే లేనివాడైపోయాడు. అణువు నుండి మహత్తు వరకు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నాం, ఇది ఉన్నది, ఇది ఉన్నది అని చూపెట్టిన వాడు కడతేరేప్పటికీ ఏమయ్యారు? కడతేరటం అంటే వాడే లేనివాడవటం. దేనినన్నా వేసేసి కడతేర్చటం గురించి కాదు.

       అణువునుండి మహత్తు వరకు ఇది ఉన్నది. ఇది ఉన్నదంటూ వెళ్ళినవాడు లేనివాడై మరల క్రిందికి రావటం.పరబ్రహ్మ నిర్ణయాన్ని, బయలు దర్శనాన్ని పొందిన తరువాత ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు. ఎందుకని? తానే లేని పద్ధతిగా ప్రయాణం చేయాలి. మరల మొదటికి అణువుదాకా వచ్చేశాడు. మరల అణువు దగ్గర ప్రయాణం మొదలుపెట్టి మహత్తు దాకా చేరాడు ఎలా?

        ఇది లేనిది, ఇది లేనిది, న ఇతి, న ఇతి అంటూ మొదటి ప్రయాణం తత్‌, త్వం, అసి, తత్వమసి మహావాక్య పద్ధతిగా ప్రయాణం చేశాడు. చేరి చేరి చిట్టచివరకు ఏమి తెలుసుకున్నాడు? 'వస్తుమద్రహితం', 'తత్‌ రహితం' అన్న స్థితిని తెలుసుకున్నాడు. తెలుసుకుని దిట్టమైపోవాలి, స్థిరమై పోవాలి, ధృవమై పోవాలి. మరల సాంతం సున్నాకొచ్చి మరల రివర్స్‌ ప్రయాణం మొదలుపెట్టాడు. ఈసారి న ఇతి న ఇతి నేతి నేతి అంటూ రోజూ భోజనంలో నేతిని అభీకరించుకోవటం, నేతి అభీకరణ 'నేతి' న ఇతి న ఇతి అనే స్థిరమైన స్థితిలో ఉండటానికి ఆహారం తీసుకుంటున్నాం.

        అభీకరణ అంటే అప్పటికప్పుడే ఉన్నది ఉన్నట్లుగా పొందుట. ఉన్నది ఏమిటి? నఇతి. ఇది లేదయ్యా. ఎందుకని? అంతకుముందు ఎలా ఉన్నాడు. అన్నంచ బ్రహ్మ అహంచ బ్రహ్మ భోక్తాచ్చ బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మమే అంటూ ఉన్నాడు.

భోజనం ముందు చెప్పే మంత్రం : 

'బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్‌, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విదం

అని చెప్పుకున్నాక ఇంకా ఏం చెప్తున్నాడు? అహంచ బ్రహ్మ, భోక్తాచ్చ బ్రహ్మ అన్నంచ బ్రహ్మ 'ఇదమిదగ్‌దమం' అని మొదలుపెట్టి నేతిని అభీకరించారట. అపుడేమైంది? న ఇతి అక్కడ కూడ ఉపాస్యమే ఉంది. ప్రాణులకు ఔపోసన. అంటే ఎవడై  బ్రహ్మనిష్ఠుడున్నాడో వాడు తన గురించి తాను చెప్తున్నాడు. 'అన్నంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ' అని చెపుతున్నాడు.

        ఈ ఉపాసన చేసే కర్త ఎవడైతే ఉన్నాడో వాడు మరల ఒకసారి నేతిని వేసి న ఇతి అంటున్నాడు. ఎంత గొప్ప సాంప్రదాయమో ఇది. తత్త్వ విజ్ఞానం కలిగినటువంటి వాడికి మాత్రమే సుబోధకమయ్యేటువంటి విధానమన్నమాట. ఎవడైతే ఈ న ఇతి న ఇతి అని అభీకరణ లేకుండా తిన్నాడో అది విసర్జకం. సూకరము యొక్క తిండితో సమానమైనది అన్నారు.

        మనం కూడ రోజూ ఎలా భోజనం చేస్తున్నాము. అణువు నుండి మహత్తు వరకు న ఇతి అనే ప్రయాణంలో భాగంగా చేస్తున్నాము. ఇది కాదు అంటూ ప్రయాణం జరుగుతోంది. అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటి? తత్త్వమసి మహావాక్యంతో చివరిదాకా అణువునుంచి మహత్తుదాకా తెలియబడినదంతా అంతర్ముఖ ప్రయాణం

        అసలైన అంతర్ముఖ ప్రయాణం ఏమిటి? మార్జాల కిశోర న్యాయంగా జరగవలసినదేదైతే ఉందో, ఈ న ఇతి అనే ప్రయాణం.

        4 మహా వాక్యాల తరువాత అవాంతర వాక్యంగా నీవు చేయవలసిన ప్రయాణం ఏదైతే ఉందో అది నేతి నేతి మహావాక్యంతో చేయవలసిన ప్రయాణం

        అవతార్‌ మెహెర్‌బాబా నాలుగు దివ్యయానములుగా విభజించారు. నీవు మానవుడివి అవటంతో దివ్యయానం పూర్తయింది. మానవ ఉపాధిని ధరించటం ద్వారా ఈ సృష్టిలో అణువు నుండి మానవోపాధికి వచ్చేప్పటికి దివ్యయానం ప్రథమభాగం పూర్తయింది. ఇక ఇక్కడ నుండి క్షరము, అక్షరము పురుషోత్తముడు మూడు స్థితులని మూడు దివ్య యానములుగా విభజించారు.

        ఈ శరీరం నేను కాదు. జీవుడు, చైతన్యము, జ్ఞాత అని ఎరగడం ఏదైతే ఉందో అది దివ్యయానం రెండవ భాగం. అక్కడినుండి నేను బ్రహ్మ స్వరూపుడను, నేను అక్షరుడను అని తెలుసుకునే స్థానం వరకు, జీవన్ముక్తావస్థ అనుభవం వరకు ఉన్నది దివ్యయానం మూడు. అక్కడినుండి చివరి భాగమైనటువంటి చైతన్య రహిత పద్దతి, చైతన్యం తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోయేటటువంటి చిట్టచివరి ప్రయాణం దివ్యయానం నాలుగు.

        ఇది జన్మరాహిత్య పద్ధతి. ఈ దివ్య యానముల చార్టు చూస్తే 4వ దివ్యయానము తరువాత ఒక చుక్క ఉంటుంది. దాని తరువాత ఏమీ ఉండదు. వేదాంత తత్త్వ విజ్ఞానం కూడ ఆ బిందువునుంచే ఆరంభమైందని తెలుస్తుంది. మరల బిందువు ఎప్పుడు లేకుండా పోయిందో, బిందు మధ్యమందు శూన్యమున్నది. ఇది శాక్తేయ విధానంలో కూడ బోధించబడుతుంది.

        కాబట్టి ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికి ఉన్న సత్యమంతా ఇదే. తత్త్వమసి మహావాక్య ప్రధానంగా నీవు బ్రహ్మ నిష్ఠుడవై సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యములనే చతుర్విధ ముక్తులను కరతలామలకంగా బ్రహ్మనిష్ఠ ద్వారా అనుభూతి చెందినవాడవై, తిరిగి, మరల అణువు వరకు వచ్చి న ఇతి న ఇతి అంటూ కైవల్యాన్ని పొందాలి. కేవల పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి.

        'సర్వాత్మత్వమితి మహా విభూతి స్యాత్‌ ఈశ్వరతత్వం స్వతః' అంటే ఏమిటి? ఇపుడీశ్వరుడు ఎక్కడున్నాడు? అణువు నుంచి మహత్తు వరకు ఉన్నదంతా ఈశ్వరుడే.

        'జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్‌ పూర్ణేందు కాంతా వాతామృతైః  యస్తోకామృత మేకమీశనమనిశం యస్తోభి శివం' నమకం, చమకం ప్రారంభానికి ముందు ఈ శ్లోకమే చదువుతున్నాం.

        'ఆ పాతాళ బ్రహ్మాండమావిస్ఫురత్‌' పాతాళం నుంచి నభము వరకు అణువు నుండి మహత్తు వరకు వ్యాపకమై జ్యోతిస్ఫాటిక లింగమై ఉన్నదంతా ఈశ్వరమే, నశ్వరం, లేదు, నశించేదే.

        నశించిపోయే స్థితినుండి నశించనటువంటి స్థితికి చేరావు. ఇక్కడ ఈశ్వరం అంటే ఈశ్వరత్వం 'స్వతః' తనకు తానుగా తానే లేకుండా పోయాడు. అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా ఈశ్వరమే. ఐశ్వర్యం ఐశ్వర్యం అంటాము కదా! ఐశ్వర్యమంటే చిటికెడు విభూతి ఐశ్వర్యం.

        ఎందుకని? అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా విభూతే. ఈశ్వరుని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో అది ఐశ్వర్యం. మనని ఈశ్వరుని కోరుకోమంటే మనం వారి యొక్క ప్రతిబింబమైన ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాం. సాక్షాత్‌ విభూతిని ధరించి నీవే ఆ ఈశ్వరుడవని తెలుసుకో. అణువు నుండి మహత్తు వరకు ఉన్నదంతా ఈశ్వరమయమే.

        ఇప్పటివరకు ఐహికాన్ని ఎలా చూసేవాడివి? ఇది నశించి పోయేది, ఇది మార్పు చెందేది, నశ్వరమని, నాటకమని, నాలుగు గడియల వెలుగిది అని. ఎవరైతే నేతి నేతి అనే మహా వాక్య దర్శన ప్రభావం చేత కైవల్యం చేరాడో, అట్టి కైవల్య స్థితిలో వారికి ఏం కనపడినదటా? ఈశ్వరత్వం స్వతః. నశించిపోయేది. ఏమున్నదసలు? ఉన్నదంతా ఈశ్వరుడే. అంటే నశించేదొకటి, నశించనిదొకటి అనే ద్వైతీ భావంలో నీ ఉండటం చేత ఆ జీవేశ్వరుడనే భ్రాంతి కలిగి జగత్తు యొక్క మోహంలో నీవు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా మోహం క్షయించిపోయింది. 'ఈశ్వరత్వం స్వతః' సమస్తమూ కూడ ఈశ్వరత్వమే. నేను లేను, ఉన్నదంతా ఈశ్వరుడే, ఈశ్వరత్వమే అనే స్థితియందు నిలకడ చెందాలి.

        సర్వాత్మత్వ మహా విభూతి సహితం స్యాత్‌ ఈశ్వరత్వం స్వతః సిద్ద్యేత్‌ తత్పురనష్టదా పరిణతం చ ఐశ్వర్య మవ్యాహతమ్‌. ఎంత గొప్పగా ఒక్క వాక్యంలో మొత్తం తేల్చేశారు!

        అణువు నుండి మహత్తు వరకు, ఈశ్వరత్వం స్వతః వరకు చెప్పినటువంటివాడు.. చైశ్వర్య మవ్యాహతమ్‌ ఎటువంటి సిద్ధిని పొందాలి అంటే సిద్ధ్యేత్‌ తత్పునరష్టదా...!

        పైన ఏమి చెప్పారు? 'భూరం భాంస్య నలోనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్‌, ఇత్యాభాతి చరాచరాత్మక మిదం యస్త్యెవ మూర్త్యష్టకమ్‌' 'మూర్త్యష్టకః' అష్టమూర్తులుగా తిరిగి రానటువంటి, సిద్ధి నందించేటటువంటి స్థితికి నీవు చేరాలి.

'సిద్ధ్యేత్‌ తత్పునరష్టదా పరిణతం చ ఐశ్వర్యమవ్యాహతమ్‌'

చ అన్న ఉపసర్గ చాలా విలువైనది.
పరిణితం చ : అష్టమూర్తులుగా గనుక నీవు దిగి వస్తే సర్వంలోకి మరల శూన్యంలోకి ఏ శూన్యం నుంచి అష్టమూర్తులు వ్యక్తమౌతున్నాయో, మరల ఏ శూన్యంలోకి ఈ అష్టమూర్తులు లేకుండా పోతున్నాయో ఇదే పరిణతంచ. వ్యక్తమవడం, లేకుండా పోవడం. రాకడ, పోకడ ఆ రెంటినీ కలిపి పరిణామం అన్నాం. పరిణామం అంటే రాకడ, పోకడ, జననం, మరణం, సృష్టి, లయం. ఈ రాకడ, పోకడ అనే పరిణామం కలిగినటువంటి అష్టమూర్తులుగా పునః తిరిగి రానటువంటి పద్ధతిగా పునః చ. ఆ చివర చ అనే ఉపసర్గ యొక్క విశేషమది. 'సిద్ద్యేత్‌ తత్పునరష్టదా పరిణతం చ ఐశ్వర్య మవ్యాహతమ్‌' హతమంటే లేకుండా పోయేది.

'అవ్యాహతమ్‌' : ఈశ్వరుడు, ఐశ్వర్యం లేకుండా పోవడం, ఈశ్వరుడు, ఆయన యొక్క ప్రతిబింబం ఐశ్వర్యం ద్విపుటి. కాబట్టి మాయ, ఎరుక అంటున్నాం, ఇదంతా ఈశ్వరుని ప్రతిబింబం, ఐశ్వర్యమంటే.

        కాబట్టి ఇప్పుడు ఆ ఐశ్వర్యాన్ని పొందాలి అని ఉపాసన చేసేవారంతా మనసు, మాయ, ఎరుకలో చిక్కుకున్నారు. ఈశ్వరుడవాలనుకున్న వాడు ఆ ఎరుకే లేకుండా అయిపోయాడు. ఆ మాయని దాటినటువంటి స్థితికి చేరిపోయాడు. 'నాన్యత్కించన విద్యతే' అన్నారు పైన. న అన్యః కించన. కొంచెం కూడ ఎరుక లేకుండా పోయేట్లుగా పోవాలట. ఎందుకని? అణుమాత్రం ఎరుక మిగిలినా అది మరల ఏమై పోతుందిమహత్తయిపోతుంది. అణు మాత్రమైనా ఎరుకలేక, ఈశ్వరుడని చెప్పుకోవడానికి కూడ మిగలకుండా పోయాడు.

        ఇప్పటివరకు ఈశ్వరుడని అంటున్నాం. ఎంతగా లేకుండా పోయాడంటే తానే లేకుండా పోయాడు. ఇది ఈశ్వరుడు, ఇది మాయ, ఇది శూన్యం, ఇది సర్వము అని గుర్తించేవాడే లేకుండా పోయాడు.

        'సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం.. చైశ్వర్యమవ్యాహతమ్‌!!' ఈ పద్యంలో విశేషమేమిటంటే గురువని, శిష్యుడని, చెప్పుకోవాలంటే ఎరుక మిగిలి ఉండాలి. అష్టమూర్తులలో భాగమై ఉంటేనే ఎరుక మిగిలి ఉంటుంది. కాట్టి ఈ శ్లోకంతో ముగింపు వాక్యమన్నమాట. 'గురుశిష్యులేకమాయెను. గురుశిష్యులెరుక లేక, గురుతెరుగలేక పోయారు'. దీనికి కందార్ధం 'గురుడు శిష్యుడేకమాయెను, కులము గోత్రము లేకపాయెను, కుడి యెడమలు సమమె ఆయెను, గురుతెరుక బాయెన్‌'.

        ఈ రకంగా ఇది ముగింపన్నమాట. బోధించేటటువంటి దక్షిణామూర్తి, ఆశ్రయించినటువంటి సచ్చిష్యుడు ఇద్దరూ అశరీరులే, 8 శరీరాలు లేనివారే.

        నిర్మూలమే తదాజ్ఞానాచ్చరీరం నాస్తి కేవలం. దీనికి సంబంధించిన ఉపదేశ వాక్యం ఏమిటి? గురుశిష్యుల ఐక్యతా సిద్ధిని బోధించే పంచదశీ మహా వాక్యాన్ని కూడ చిట్టచివర బోధించారు.

        'ఐశ్వర్య మవ్యాహతమ్‌' అంటోంది. 'కర్పూర దీప కళికా సంయోగం జ్యోతిరూపం యధాతధా' కర్పూరం వెలిగించినపుడు ఎలా ఉన్నది? వెలుగు వేరుగా, కర్పూరం వేరుగా ఉన్నట్లుంది. కాసేపటికి అయిపోయింది. కర్పూరం, జ్యోతి రెండూ ఒక్కసారే లేకుండా పోయాయి. కర్పూరం మిగిలి ఉన్నంతసేపూ జ్యోతి మండుతూనే ఉంది. కర్పూరం అయిపోగానే రెండూ లేకుండా పోయాయి.

రెండూ ఉన్నట్లుగా తోచి రెండూ ఏకకాలంలో లేకుండా పోయినవి.

        అలాగే గురుశిష్యులిద్దరూ ఉన్నట్లుగా తోచారు ఇప్పటివరకు. ఈ చిట్టచివరి శ్లోకంతో ఏమైంది? కైవల్యస్థితియందు, కేవల స్థితియందు ఇద్దరు లేరు. ద్విపుటి లేదు, 'త్రిపుటి, ద్విపుటులబట్టి తెగకోసివేసి, తెగకోసివేసి' అని ఒక కందార్థం. సాధన ఏమి చేయాలయ్యా అని శిష్యుడు గురువునడిగితే త్రిపుటి, ద్విపుటి రెండున్నాయి. అవి పట్టి తీసివేస్తే నీవు లేకుండా పోతావు అని చెప్పారు.

        పట్టి అంటే కొండ. స్థిరమని అర్థం. స్థిరంగా ఆ కదిలే వాటిని గట్టిగా పట్టుకుని త్రిపుటి, ద్విపుటులెపుడూ కదులుతూ ఉంటాయి. వాటిని తెగకోసివేసి, తెగకోసివేసి అని రెండుసార్లన్నారు.

        మొదటి తెగ కోసివేసి ఏమిటి? తత్త్వమసి మహావాక్యం. రెండవ తెగకోసివేసి ఏమిటి? నేతి నేతి మహావాక్యం. ఈ రకంగా నీవా రెంటిని తీసేస్తే నీవు లేకుండా ఉంటావు.

        వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమంలో కొత్త కోడలును ఆడపడుచు చేత పట్టినిస్తావా? బొమ్మనిస్తావా ? అని అడిగిస్తారు. అపుడా కొత్త కోడలు చేత పట్టిస్తాను కానీ బొమ్మనివ్వను అని అనిపిస్తారు.

        కానీ కాలాంతరంలో అది పట్టినిస్తాను బొమ్మనిస్తాను అనే మాటకు మారిపోయింది. ఆ బొమ్మనిచ్చి నూతన వస్త్రాలిస్తారు.

        నూతన వస్త్రాలు పెడుతున్నారంటే అర్థం అది జ్ఞాన ప్రచోదనమన్న మాట.

        ఇప్పటివరకూ ఆ కుటుంబంలోనివారు అంతా మూసపోసిన పద్ధతిలో ఒక్కరీతిగా పెరిగారు. వారందరిలో జ్ఞాన ప్రచోదనం చేయటానికి ఆ కోడలు పట్టినిస్తాను, అందరిలో అస్థిరంగా ఉన్న ఎరుక, అజ్ఞానం అష్టమూర్తి పద్ధతులున్నాయి. నేను ఇప్పుడు స్థిరత్వమొచ్చేటట్లు చేస్తాను. పట్టినిస్తాను అంటే అర్థం ఇది.

        కోడలు ఈ ఇంటినుండి ఆ ఇంటికి ఎందుకు వెళుతుంది? పుట్టింట్లో తాను నేర్చుకుని పొందిన జ్ఞానంతో వారిలో గల వెల్తిని పూర్తిచేసి స్థిరత్వం వచ్చేట్లు చేసి వాళ్ళు కూడా జ్ఞానం పొందేలా చేస్తుంది. అలా అని ఆమె బ్రహ్మజ్ఞానులందరి సమక్షంలో అగ్ని సమక్షంలో వాగ్ధానం చేస్తుంది. ఇదీ దానియొక్క విశేషం.

        అప్పగింతలు సామాన్యంగా బ్రహ్మ ముహూర్త కాలంలో పెడతారు. బ్రహ్మ ముహూర్త కాలంలో సూర్యచంద్రుల సాక్షిగా ఆచంద్ర తారార్కం నేను నీకు అనువర్తినై ఉంటాను. ఆ స్థిరత్వాన్ని పొందిస్తాను. ఆ జ్ఞానంతో స్థిరత్వ స్థితిలో నేనుంటాను, అనే ప్రమాణం అన్నమాట. అలాంటి సూచనలతో ఏర్పడిన కర్మకాండ విభాగమంతా భారతీయ తాత్త్విక ధృక్పథంలో ఉంది. గురువు లేడు, శిష్యుడు లేడు. చిట్టచివరి దశకి వచ్చేటప్పటికి ఆ కైవల్య స్థితితో అచల నిర్ణయంతో, ఆ బయలు నిర్ణయంతో ఆ పరిపూర్ణ స్థితిలో 'గురువు శిష్యుండేకమాయెను, గురుతెరుకబాయెన్‌' అనేటటువంటి నిర్ణయంతో మోక్షం స్థిరమై పోయింది. కడతేరాడు. ఎవరు? ఆశ్రయించిన సచ్చిశిష్యుడు కడతేరాడు. 'ఐశ్వర్యమవ్యాహతమ్‌' కడతేరాడు, గమ్యం చేరాడు.

ఈ రకంగా దక్షిణామూర్తి శ్లోకాలను ముగించుకొంటున్నాం.

సర్వం గురు చరణారవిందార్పణమస్తు!