2

2వ శ్లోకం

       బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః
       మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతమ్‌ |
       మాయావీన విజృంభయత్యపి మహా యోగీవ యః స్వేచ్ఛయా
       తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||


        ఈ స్తోత్రాన్ని చదవడం కంటే ఆ స్థితిలో ఉండి పాడటం ఉత్తమం. స్థితిలో ఉంటే తప్ప పాడలేవు. చదవడం ఎవరైనా చదువుతారు. అలా పాడాలి అంటే స్థితి ఉండాలి. ఆయా స్థితి భేదాలను బట్టి ఆయా స్థాయిలలో పాడుతుంటారు.

        అనంత విశ్వానికి చెప్తున్నారు కదా! అన్వయం దేనికి చేస్తున్నాడు? విశ్వం ఉన్న స్థితి, విశ్వం లేని స్థితి.

        ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు? అనంత విశ్వం ఉన్నదిగానూ, బయలు లేనిదిగానూ తోస్తున్నది. కారణం విశ్వం కనపడుతోంది, బయలు కనపడటం లేదు. ఎవరైతే మహానుభావులు దేశికులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉన్నదట? విశ్వం లేనిదిగానూ, బయలు ఉన్నదిగానూ తోస్తుంది. కాబట్టి సర్వకాలమూ వారు ఏ స్థితిలో ఉన్నారు.

        ఎల్లకాలమూ ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఈ ఎరుకకి మూలం ఏమిటి? అనేది చెప్తున్నారు.

'బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః'

        ఒక బీజం, ఒక విత్తనంలో నుండి అంకురం ఎలా వస్తుంది? అంకురం ఎలా వస్తోందో మనం తెలుసుకున్నట్లయితే ఒక బీజం నుండి అంకురం ఎలా వస్తోంది? సమయానికి పరిస్థితులు అనుకూలిస్తే, ఆ పంచభూతాత్మకం దానికి సహకారాన్ని అందిస్తే ఒక విత్తనం అంకురించింది. అంతేకదా! కాని విత్తనం మొలకెత్తిందా? పంచభూతాలు మొలకెత్తించినాయా? పంచ భూతాలే మొలకెత్తించినాయి.

        దీన్నేమంటారు? కార్యం ఏమిటంటే బీజం మొలకెత్తడం. కారణం ఏమిటి? పంచభూతాలు తోడ్పడటం.

        నిజానికి పంచభూతాలు తోడ్పడ్డాయా? పంచ భూతాలలో ఉన్నటువంటి చైతన్యమే బీజంలో నుండి అంకురించిందా? చైతన్యమే అంకురించింది. ఇట్లా ఒకదానిమీద ఒకటి, ఒక కార్యము, ఒక కారణము ఉన్నాయా లేదా? ప్రతి కార్యమునకు ఒక కారణం ఏర్పడుతూ ఉంటుంది. ఆ కారణం నుండి కార్యం ఉద్భవిస్తూ ఉంటుంది. చూడటానికి కళ్ళెదురుగా కనపడుతున్న చుట్టుప్రక్కల ఉన్న ఈ ప్రపంచం అంతా ఎవరో ఒకరు చేస్తున్నట్లుగా కనపడుతున్నప్పటికీ, వాస్తవానికి కారణం ఎవరు? దాని వెనుక ఉన్న చైతన్యం.
'సర్వకారణ మీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్‌'

        సర్వ జీవులయందు, సర్వ భూతములయందు పరచభూతాత్మకంగా ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు ఉన్నాడో, ఆ ఈశ్వరుడే కారణము, కర్త. వివేకములు ఎన్ని స్థాయిలలో ఉన్నాయి? ఐదు స్థాయిలలో ఉన్నాయి.

        నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసత్‌ వివేకము, దృక్‌ దృశ్య వివేకము. కాబట్టి ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని ఈ ఐదు వివేకముల స్థాయిలో అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే చిట్టచివరిదైన దృగ్‌ దృశ్య స్థాయిలో అర్థం చేసుకో గలుగుతాడో, దర్శించగలుగుతాడో, వారిద్వారా ఏమి తెలిసింది?

        ఒకేసారి దృగ్‌ దృశ్య వివేకం సాధించడం కుదరదు. మొదట ఏమి విచారణ చేయాలట? కనపడుతున్న బీజం అంకురించిందా లేదా అని విచారణ చేశారు. కనపడింది. కనపడితే నిత్యమా? కాదు. బీజం లోపల అంకురించగల శక్తి అంతకుముందే ఉంది. అంతకుముందు అవ్యక్తంగా ఉన్న శక్తి ఇప్పుడు దానినుండి వ్యక్తమై అంకురించింది. అంతే కదా! కాబట్టి కనపడుతున్న చెట్టు సత్యమా, దానికి ముందున్నటువంటి బీజం సత్యమా అని విచారణ చేశావ్‌. ఏం తేలింది? దానియందు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి గనుక పని చేయకపోయినట్లయితే, బీజం అంకురించలేదు. అన్ని బీజములు అంకురిస్తున్నాయా? అంకురించడం లేదు.

        దీనినిబట్టి ఏమి తెలిసింది? బీజం ఆకారానికి ఉన్నప్పటికీ, దానియందు అంకురించే శక్తి లేనట్లయితే అంకురించదు. అలాగే పంచభూతాలు సహకరించలేదనుకో, బీజంలో ఉండే అంకురించే శక్తి ఉన్నప్పటికీ, ఆ అవ్యక్తం వ్యక్తమయిందా? అవలేదు.

        కాబట్టి కనపడేదంతా సత్యమేనని చెబుదామా? పంచభూతాలకి అవతల ఉన్నటువంటి సూర్యకిరణ సముదాయం సహకరించకపోతే అంకురించడం సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టే సూర్యుణ్ణి కారణంగా చెప్దామా? పంచ భూతాలని కారణంగా చెప్దామా?

   అంటే అర్థం ఏమిటంటే, అవ్యక్త స్థితినుండి వ్యక్తం కావాలి అంటే ఒక ఆధారభూతమైనటువంటి చైతన్య శక్తిలో స్పందన, సంకల్పం వస్తేనే, క్రియ జరుగుతోంది. కార్యం అనేది జరుగుతోంది.

        కాబట్టి ఆ 'నేను' అనే చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఆత్మ శక్తి ఏదైతే ఉందో, ఆ ఆత్మ యందున్న స్పందన మూలంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సూర్యుడు ప్రకాశింపజేసే శక్తి ఆత్మ శక్తి, చైతన్య శక్తి.

        ఆ సూర్యుడు కూడ withdraw అయ్యే కాలం ఉంది కదా! అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరల అవ్యక్తానికి వెళ్ళిపోయాడు. కాబట్టి బ్రహ్మాండానికి కూడ ఒక అవ్యక్త స్థితి ఉంది.

        ఇక్కడ ఎలా అయితే పిండాండంలో ఒక బీజం అవ్యక్తంగా ఉందో, ఆ బీజం నుండి అన్నీ ఒనకూడినప్పుడు వ్యక్తమై అంకురం ఉద్భవించిందో,
అలాగే కాలాంతరంలో బ్రహ్మాండంలో కూడ ఒక అవ్యక్త స్థితి ఉంది.       ఆ అవ్యక్త స్థితిలో నుండి కాలాంతరమున అన్నీ ఒనగూడినప్పుడు ఏమైందిమరల అంకురించింది, వ్యక్తమైంది.

        కాబట్టి బ్రహ్మాండం రావడానికి ఇదే థియరీ. పిండాండంలో          ఈ భూమిమీద జరుగుచున్న జీవన సృష్టికి ఇదే థియరీ.

        కాబట్టి అవ్యక్తం వ్యక్తమౌతోంది. అంతకుముందున్న స్థితిలో అది లేదు. కాని ఒక అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది.
అంతేనా? కాదా?

        ఈ అనంత కోటి బ్రహ్మాండాలు విశ్వంలో పరిభ్రమిస్తున్నాయా లేదా? ఇలాంటి Solar networks ఎన్ని ఉంటాయి?

        అవ్యక్తాన్ని ఏమంటున్నాం? ''అనంతకోటి బ్రహ్మాండ జననీ'' అంటున్నాం ఆవిడని. అనంతకోటి బ్రహ్మాండ జననీ, ఆ బ్రహ్మకీట జననీ అనే పేర్లతో పిలుస్తున్నాం. విశ్వం దృష్ట్యా చూస్తేనేమో బ్రహ్మాండాలను సృజిస్తోంది, పోషిస్తోంది, లయింపజేస్తోంది. బ్రహ్మాండం దృష్ట్యా చూస్తే కీటకం నుండి బ్రహ్మ వరకు ఆవిడే సృష్టిస్తోంది, ఆవిడే పోషిస్తోంది, ఆవిడే లయింపజేస్తోంది.

        ఇక్కడ ఏ సిద్ధాంతం ఉందో, అక్కడా అదే సిద్ధాంతం ఉంది. కాబట్టి అన్నిటికి ఆధారభూతంగా కనపడుతున్నది ఏమిటి? ఆ అవ్యక్తం. మరి అవ్యక్తమే పరమాత్మ అని అందామా? లేదు. ఎలా? దానికి వ్యక్తం చేసుకునే శక్తి లేదు కాబట్టి.

        తనంతట తాను వ్యక్తీకరించగలిగే శక్తి ఉన్నప్పటికీ, కాలము, సంకల్పము, శూన్యము ఈ మూడూ అనుకూలించినప్పుడే వ్యక్తం అవుతుంది.

        అనంత విశ్వంలో ఏమున్నాయి? కాలం ఉంది, సంకల్పం ఉంది, విశ్వం ఉంది. ఆ విశ్వం శూన్యంగా ఉంది.

        కాబట్టి శూన్యము, సంకల్పము, కాలము ఈ మూడూ ఒక స్థితిలో అనుకూలమైనప్పుడు మాత్రమే అనంత విశ్వం ప్రకటితమవుతోంది. ప్రకటితమైనటువంటి విశ్వంలో మరల ఇదే అయి అవ్యక్తం నుండి బ్రహ్మాండం ఉత్పన్నమైంది.

        మరల అదే Principle apply అయి ఒక బ్రహ్మాండంలో జీవసృష్టి వ్యక్తమైంది.
        ఒక జీవసృష్టి మరల అదే Principle apply అయి మరల మానవుడు ఉద్భవించాడు. అదే Principle apply అయి మానవుడు ప్రతిరోజు గాఢ నిద్రావస్థలోకి పోతున్నాడు. తనను తాను తెలుసుకోలేనవంటి అవ్యక్త స్థితికి చేరుతున్నాడు. మరల వ్యక్తం అవుతున్నాడు. కాబట్టి నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఈ జీవుడు అవ్యక్త స్థితిలోకి ప్రతిరోజూ చేరిపోతూ, మరల మెలకువలో వ్యక్తంగా వ్యక్తమౌతున్నాడు.

        ఈ రకంగా అనంత విశ్వపు ఆవిర్భావం నుండి మొదలుపెడితే, జీవుని యొక్క మెలకువ, కల, నిద్ర వరకు కూడ ఒకే సూత్రం పోషించ బడుతుంది.

        అది ''బ్రహ్మణోరవ్యక్తః, అవ్యక్తాన్‌ మహత్‌, మహతో మహదహంకారః మహదహంకారో ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నియోరాపః, ఆపయోః పృథ్విః పృథ్వియోర్‌ ఓషధిః, ఓషధియోర్‌ అన్నం, అన్నంయో జీవః'' ఇదే థియరీ.

        పిండాండంలో ఈ భూమి మీద జరుగుచున్న జీవసృష్టికి అదే థియరీ. కాబట్టి అవ్యక్తం వ్యక్తవమవుతోంది. అంతకుముందున్న స్థితిలో వ్యక్తమైనది లేదు. కాని ఒక అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది. అంతే కదా!

        ప్రపంచము, వాటియొక్క లయస్థితి, అలాగే ఈశ్వర తనువులు నాలుగు, వాటి వ్యవహారం, వాటియొక్క లయస్థానం, విచారణ కూడా చేసి చూశాడు, దర్శించి చూశాడు, అనుభూతి చెంది చూశాడు, నిర్ణయించి చూశాడు. ఈ లక్షణంగా గుర్తించాడు.

        లక్ష్యమైన బయలును ఆశ్రయించాడు. ముందు ఎలా ఉన్నాడు?   ఈ విజ్ఞాన క్రమములో అంతా ఎరుకగా ఉన్నాడు. అవ్యక్తమన్నా, మాయ యన్నా, ఎరుక అన్నా, మనసన్నా, అన్నీ ఒక్కటే. ఆ ఎరుక స్థితిలో ఉన్నవే శూన్యము, సంకల్పము, కాలము.

        ఎప్పుడైతే కాలాతీతమైనటువంటి స్థితికి చేరాడో ఎలా చేరతాడు? శూన్యము శూన్యాతీతము, సంకల్పము సంకల్పాతీతము, కాలము కాలాతీతము. ఈ ఎరుక లేనిదైపోయింది. ఎప్పుడు లేనిదై పోయింది?   బయలును దర్శించగానే. తన మూలమేది? అనే ప్రశ్న కలిగింది. దానికి విచారణ చేసి చూస్తే, ఈ ఆరు పద్ధతులుగా, తనను తాను లేకుండా చేసుకుంటూ బయలును దర్శించి, తన మూలమును విచారించగా తానే లేకుండా పోయాడు.

                ఇక్కడి వరకూ వచ్చినటువంటి విచారణా పద్ధతి అంతా కూడ ఆధార ఆధేయ పద్ధతి, అధిష్టాన ఆశ్రయ పద్ధతి.

        ఈ పద్ధతిగా కీటకమునుండి బ్రహ్మము వరకు విచారణ చేస్తూ వచ్చాడు. అనంత విశ్వాన్నీ కూడా అలాగే విచారణ చేశాడు. కానీ తనకు మూలమైనటువంటి బ్రహ్మము, బ్రహ్మమునందు చూడగా, తానే లేకుండా పోయాడు. మూలాన్ని గుర్తెరిగే శరీరము ఏదీ లేదు అనే నిర్ణయాన్ని పొందాడు. 'బీజస్యాంత రివాంకురో జగదిదం' ఒక పోలిక ద్వారా ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెప్పాడు ఇప్పుడు? విత్తనం మొలకెత్తడానికి ఏ సృష్టి లక్షణం ఆధారమైందో, జీవ సృష్టి జరగడానికి అదే ఆధారం. బ్రహ్మాండ సృష్టి జరగడానికి అదే ఆధారం. అనంత సృష్టి సృష్టింపబడటానికి కూడా అదే లక్షణం ఆధారమయింది. 

'బీజస్యాంత రివాంకురో జగదిదం'
        'ఇదం' - అన్న దాంట్లో అన్నీ కలసి వచ్చేసినాయి. ''ప్రాఙ్‌ నిర్వికల్పం పునః'' బ్రహ్మం ఎలా ఉందిట ఇప్పుడు? నిర్వికల్పంగా ఉంది. 'సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ సమాధి నిష్ఠ'' అని బ్రహ్మము యొక్క స్థితి, బయలు యొక్క స్థితి.

        సంకల్పము, వికల్పము, నిర్వికల్పము అందులో ఈ మూడూ లేవు. కాబట్టి ''ప్రాఙ్‌ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతమ్‌'' దేనిచేత కల్పించబడినదట? మరల మాయచేత తనకు తానే సృజించబడి, తనకు తానే విస్తరించి, తనకు తానే లయించేటటు వంటి ఎఱుక పద్ధతిగా మాయ తనయందే విశ్వాండమును, బ్రహ్మాండములు, పిండాండములను సృజించి, పోషించి, లయింప జేయుచున్నది. మాయా కల్పిత దేశ కాల కలనా మూడింటితో కూడుకుని ఉంది సృష్టి.
     
దేశము, కాలము, కలన, కలన అంటే కదలిక (సంకల్పము). దేశము అంటే శూన్యము. దేశము, కాలము, సంకల్పము ఈ మూడింటితో కూడి అంతా జరుగుతోంది. కాని ఈ మూడింటికీ అతీతంగా ఉంది, ఈ మూడింటి రహితంగా ఉంది బయలు.

        అక్కడ ఈ మూడింటి యొక్క ఉనికి లేదు. కానీ దర్శిస్తున్న మానవులందరూ కూడ ఆశ్రయిస్తున్నదంతా కూడ ఈ మూడు దేశము, కాలము, కలనము అనే పరిమితులకు లోబడినటువంటి దానినే ఆశ్రయిస్తున్నారు. అట్టి ఎరుకనే ఆశ్రయించి ఉన్నారు.

        కారణం ఏమిటటా? 'వైచిత్ర చిత్రీకృతమ్‌'. ఇప్పుడు చూసినది రేపటికి ఉండదు. నిరంతరాయంగా మార్పు చెందుతుంది.

        ఇవాళ అంకురించింది, రేపటికి మూడాకులు వేసింది. ఆ తరువాత ముప్పది ఆకులు వేసింది, తరువాత పుష్పించింది. ఆ తరువాత ఫలించింది, ఆ తరువాత రాలిపోయింది. మరల బీజం అంకురించింది. ఈ process ఏమైనా మారిందా? అలాగే 84 లక్షల జీవరాసులు ఉత్పత్తి అవుతున్నాయి, పోషింపబడుతున్నాయి, మరల మరల పునరుత్పత్తి చేయబడుతున్నాయి. అదే మాయచేత రక్షింపబడుతుంది, దానియందే లయిం అయిపోతుంది. అదే బ్రహ్మాండ సృష్టి మరలా.

        అశరీర పద్ధతిగా ఉన్నటువంటి యక్ష, కిన్నెర, కింపురుష, సాధ్య, రాక్షస, పిశాచ, దేవ, గంధర్వ వీళ్ళందరూ కనపడుతున్నారా? కన్పించడం లేదు, వీరంతా అశరీరులు, అనిమేషులు.

        ఇదంతా సృష్టిలో ఉంది. వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ జీవుల యొక్క మనసు మీద ప్రభావితం అవుతున్నారు. ఒకరు బాగా పాడతారండి, ఏమంటారు? గంధర్వగానం అంటారు. వారి మనసు మీద గంధర్వులు ప్రభావితం అయారు. అప్పుడు వారికి గంధర్వగానం వచ్చింది. ఒకడు జన్మతహః ఇతరులను పీడించే లక్షణంతో పుట్టాడు, రాక్షస స్వభావంతో పుట్టాడు. ఇలా అశరీరులందరూ కూడా ఆయా జీవుల యొక్క మనసులలో స్థానం సంపాదించుకుని, సృష్టి వ్యవహారంలో పాలుపంచుకుంటున్నారు.

        వాడికి పట్టిందల్లా బంగారమేనండి, 16 ఏళ్ళకే వ్యాపారంలోకి వచ్చేసాడు. వాడి అదృష్టం ఏమిటోగాని, పట్టిందల్లా బంగారమే. పూర్వజన్మ సుకృతం అనేది కామన్‌ వర్డ్‌. కాని వాడి మనసుయందు ఎవరు స్థానం సంపాదించాడటా మరి? యక్షుడు. కుబేరుడు అనే యక్షుడు.

        ఇట్లా అనేక రకాలైన కర్మకాండలు పుట్టినాయి. ఎవర్ని అనుగ్రహం చేసుకోవడానికి? యక్ష, కిన్నె, కింపురుష, సిద్ధ, సాధ్య, రాక్షస, పైశాచిక దేవతా సమూహములను స్వాధీనపరచుకోవడానికి, ఆవాహన చేయడానికి, ఆ రకమైన ఫలితాలను సృష్టిలో పొందడానికి, రకరకాలైన కర్మ కాండలు పుట్టినాయి. కాబట్టి ఆ రకమైన తంత్రాలు, మంత్రాలు, ఆ రకమైన జపాలు, యజ్ఞాలు, పూజలు, యాగాలు, ఆ రకమైన సాధనలన్నీ పుట్టినాయి.

        వాటన్నిటి ద్వారా ఏమౌతావు మహా అయితే! ఆయా కామ్యక కర్మలు తీరతాయి, అంతేగాని తత్త్వ జ్ఞానం లభించే అవకాశం లేదు. కాబట్టి రాముడు వశిష్ఠ మహర్షిని అర్థరాత్రి ఆశ్రయించి, ఇవన్నీ తెలిసినటువంటి రామావతారం ''నేనెవరు'' అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే వశిష్ఠులవారు యోగవాశిష్ఠాన్ని బోధించారు. తెల్లవారేలోపు బోధించారు. 32,000 శ్లోకాలు తెల్లవారే లోపు పూర్తయ్యాయి. అంటే బోధించినవారు ఏ స్థితిలో ఉండి బోధించారు? ఆశ్రయించినవారు ఎలా ఆశ్రయించారు?

        మనకి ఒక శ్లోకానికి ఎంత సమయం పడుతోంది? రెండు గంటలు. మరి వారు 32,000 శ్లోకాలు చెప్పారు, ఈయన విన్నాడు. తెల్లవారే సరికల్లా ఆత్మ నిష్ఠుడై బయటకు వచ్చేశాడు.

        ఇదంతా ''స్వకీయ సృష్టి'' అని తెలుసుకోగలిగాడు రామబ్రహ్మం.

        అంటే అర్థం ఏమిటటా? ''మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర చిత్రీకృతమ్‌'' ఈ సత్యాన్ని గ్రహించాడు. తానెవరు? అఖండ అనంత, నిర్వికల్ప, నిరాకార చిద్‌ బ్రహ్మ రూపుడు. తన స్వరూపం ఏమిటి? అఖండ, అనంత, నిర్వికల్ప, నిర్విశేష, నిరాకార బ్రహ్మము.

        కాబట్టి ఆ నిర్వికల్ప స్థితిలో ఉన్న బ్రహ్మమునకు ఏమీ అంటటం లేదు. ఏమీ తోచడంలేదు. తన ఉనికిని తానే గుర్తించకుండా ఉన్నాడు. తానే లేకుండా ఉన్నాడు. 'నాహం' నేను లేనివాడను. అంటే 'సోహం' అన్నప్పుడు ఎలా ఉన్నాడు? నేను అదియై ఉన్నాను, నేను ఇది కాదు. ఇప్పుడు 'నాహం', నేను లేను.

        ''తత్త్వమసి'' లో 'త్వం' నేను కాదు. నేను అదియై ఉన్నాను. 'తత్‌' స్వరూపుడనై ఉన్నాను. కాబట్టి నేను ఇది కాదు, నేను అది అనేటటువంటి ఆధార ఆధేయ పద్ధతిగా, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా తన యొక్క అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తిచేశాడు.

        కాని తన మూలాన్ని తాను గుర్తెరిగే స్థితిలో పడ్డప్పుడు తానే లేకుండా పోయాడు. ఆ 'అసి' పద స్థితిలో ఉండిపోయాడు. ''తత్త్వమసి''లో 'తత్‌', 'త్వం' ప్రధానమా? 'అసి' ప్రధానమా? 'అసి' ప్రధానం. కానీ మనం అన్ని ప్రార్థనల్లో దేన్ని ప్రార్థిస్తున్నాం? తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం కదా! కాబట్టి బ్రహ్మ విచారణ అంతా, బ్రహ్మానుష్ఠానం అంతా, సాధనలన్నీ ఏ లక్ష్యంతో సాగుతున్నాయి? 'తత్‌' అన్న స్థితికి చేర్చడానికే పనికొస్తున్నాయి. బ్రహ్మము ఏ బ్రహ్మము ఇదిసగుణ బ్రహ్మము. అఖండ, అనంత, నిర్వికల్ప, నిర్విశేష, నిరాకార పరబ్రహ్మమునకు నిన్ను చేర్చాలీ అంటే, 'అసి' పదాన్ని ఆశ్రయించాలి. పరబ్రహ్మ స్థితిలో బ్రహ్మము యొక్క మాయయొక్క సగుణ నిర్గుణ స్థితుల యొక్క ఛాయ లేదు.

''మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యఃస్వేచ్ఛయా''
        ఇప్పుడేం తెలుసుకోవాలి? ఈ మాయా ప్రభావం చేత జీవసృష్టి, బ్రహ్మాండసృష్టి, విశ్వ సృష్టి  ఈ మూడింటినీ దాటగలిగేటటువంటి స్వేచ్ఛను పొందాలి. మోక్షము అంటే అర్థం ఏమిటి? స్వేచ్ఛ. ఎటువంటి స్వేచ్ఛ? పిండాండము, బ్రహ్మాండము, విశ్వాండము ఈ మూడింటిని దాటినటువంటి స్థితి, అవతల ఉన్నటువంటి స్థితి.

        ''తత్‌ పరంచావలోకయేత్‌'' అనేది సూత్రం. 'తత్‌'కి పరమైనటువంటి స్థితియందు దర్శనం పొందాలి. ఆ దర్శన స్థితిలో నిలకడ చెందియుంటే ఏమయ్యాడు? తానే లేనటువంటి స్థితిలో నేను లేను, 'నాహం' అనే స్వేచ్ఛను పొందాడు.

        'ఉండుట' అనేటటువంటిది జీవ సృష్టిలో గాని, లేకుంటే బ్రహ్మాండ సృష్టిలో గాని, లేకుంటే విశ్వ సృష్టిలో కాని భాగమై ఉంటుంది.

        అంతరిక్షం అనే బయలునందు అనంత విశ్వము ఒక బిందువు వంటిది. మరల అనంత విశ్వమునందు బ్రహ్మాండము బిందువు వంటిది, మరల అనంత బ్రహ్మాండమునందు జీవుడు బిందువు వంటివాడు, మరల అనంతముగా ఉన్న 84 లక్షల జీవరాసులయందు మానవులు బిందువు వంటివారు. మరల అసంఖ్యాకంగా ఉన్న మానవులలో యోగులు ఎంతమంది ఉన్నారు? బిందువు వలే ఉన్నారు. యోగులైనా, జ్ఞానులైనా తత్త్వ విచారణ చేసేవారిలో మరల చైతన్యం ఎలా ఉంది? బిందువుగా ఉంది.

        పరమాణువు ఎలా ఉంది? బిందువే, పరమాణువు ఎప్పుడూ బిందువే. కాబట్టి ఆ పరమాణువు యొక్క కంపనం ద్వారానే నీలో కదలికలు వస్తాయి. కదలికలను గమనిద్దామా? పరమాణు స్థితిని గమనిద్దామాపరమాణు స్థితినే గమనించాలి.

        పరమాణు స్థితి మరల జీవసృష్టి అంతటికీ కూడా ఒకటేగా. మరల అదే పరమాణు స్థితి పంచభూతాత్మకం అయిన బ్రహ్మాండ సృష్టికి కూడ ఒకటేగా. అదే పరమాణు స్థితి అనంత బ్రహ్మాండాన్ని సృజించిన విశ్వానికి కూడా ఒకటేగా.

        కాబట్టి మౌలికంగా ఏదైనా భేదం ఉందా? ''మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవయః స్వేచ్ఛయా'' ఈ రకంగా తెలుసుకున్నటువంటి యోగి మాయ నుండి విముక్తం అగుచున్నాడు. తెలుసుకున్న యోగి, అంటే దర్శించిన యోగి, అంతే. ఎందుకంటే వేదాంతం అంతా దర్శన పద్ధతి కదా! సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంస దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, ఇవీన్న షడ్దర్శనాలు. విచారణ లేకుండా దర్శనం సాధ్యమా?
'జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి'.

        జ్ఞాతుం - విచారణ చేసి తెలుసుకున్నావు. ద్రష్టుం - అన్నింటినీ ఆయా స్థితులలో దర్శించావు. ప్రవేష్టుం - దర్శించిన స్థితులలో ప్రవేశించావు, ప్రవేశించాక అనుభూతి నిర్ణయ ప్రమాణం జరిగిపోయింది. లక్షణంగా మిగిలి పోయావు, లక్ష్య స్థితిలోకి చేరిపోయావు.

        అధిగచ్ఛతి - దాటిపోయావు. యోగీవ యఃస్వేచ్ఛయా - ఇలా ముక్తిని సాధించాలి. మొత్తాన్ని సాధించాలి. ఎవరు అణువు గురించి చెప్పినా ఇదే. వ్యాఖ్యాన భేదమే. ఎంతగా వ్యాఖ్యానంలో ప్రక్కకు పోతూ ఉంటామో అంతగా ఆయా సృష్టియందు చేరిపోతూ ఉంటాం. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు? 'నాయనా! ఇదంతా ప్రజ్ఞా సూత్రము' అనే దానిమీద నడుస్తున్నది. కాబట్టి స్థిత ప్రజ్ఞుడివి కా! కాబట్టి దానిని పట్టుకుని నీవు ఏమవ్వాలి? జీవుడు ఆత్మ స్వరూపుడు అవ్వాలి. ఆత్మ స్వరూపుడు బ్రహ్మ స్వరూపుడవ్వాలి. బ్రహ్మ స్వరూపుడు పరబ్రహ్మ నిర్ణయం పొందాలి.         

ఈ నాలుగూ ఒకే ప్రజ్ఞమీద ఆధారపడి ఉన్నాయి. జీవుడైనా, ఆత్మ అయినా, బ్రహ్మ అయినా, పరబ్రహ్మ అయినా ఇవన్నీ ఒకే సూత్రం మీద ఉన్నాయి.

        అయితే నీవు ఈ సూత్రం మీద నడక సాగిస్తే త్వరగా చేరతావు. అదే ఎక్కడికక్కడ బయటకు పోయావనుకో, అప్పుడు ఎంత టైం పడుతుంది? మరల కథ మామూలే.

        'బీజస్యాంత రివాంకురో జగదిదం' అన్నారు కదా! ఈ భూమి మీద ఎన్ని మొక్కలున్నాయో, ఎలా మొలకెత్తుతున్నాయో పరిశోధించి చూసి వస్తాను అంటే అది కుదిరే పనికాదు. ఎన్ని జన్మలు పడుతుంది?

        సరే, 'బీజస్యాంత రివాంకురో' అన్నారు కదా! జీవసృష్టికి ఆధారభూతం అమీబా కదా! అమీబా నుండి ఒక్కొక్క సృష్టి అధ్యయనం చేస్తూ తెలుసుకుంటానంటే అప్పుడేమయింది? అప్పుడింకా ఎన్నో జన్మలు, కొన్ని లక్షల జన్మలు వెళ్ళిపోతాయి. 84 లక్షలు పుట్టి పోయి, పుట్టి పోయి అనుభవించి, సాక్షివై అధిగమించి ఎదుగుతూ ఎదుగుతూ వచ్చావు.

        మానవ జన్మ బహు దుర్లభం. ఈ విచారణంతా పూర్తిచేసి మానవ జన్మకొచ్చావు. మరి 'జంతూనాం నరజన్మ దుర్లభం' కదా!

        మరి అటువంటి మానవ జన్మ లభించింది. ఏమిటో దీనిలో విశేషం అంటే ప్రజ్ఞ అధికంగా ఉంది దీనిలో. దీనికి వివేకం, జ్ఞానం అధికంగా ఉంది అంటున్నాం. ఎలా వచ్చిందటా? ఈ ప్రజ్ఞా సూత్రాన్ని పట్టుకోగలిగే శక్తి మానవ ఉపాధికే ఉంది.

        ఏ ప్రజ్ఞా సూత్రమును పట్టుకుని, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ అనే కడపటి నిర్ణయానికి చేరి మోక్షమును అధివసిస్తాడో, ఆ మోక్ష పదమును లక్షించకుండా ఎక్కడికక్కడ ఏమౌతున్నాడు మరల? ఆయా జీవ సృష్టి యందుగాని, ఆ ఆత్మ చైతన్య సృష్టియందు గాని, ఆ బ్రహ్మ యొక్క సృష్టియందు గాని, ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందకముందే విక్షేపమును పొంది, ఆయా సృష్టులందు ఏకత్వాన్ని చెందుతున్నాడన్నమాట.

        ఎక్కడికక్కడ ఇదే లక్ష్యం అనుకుంటాడు. ఇదే గమ్యం అనుకుంటాడు. ఎక్కడిక్కడ నా జీవితం ధన్యత చెందిపోయింది అనుకుంటాడు. ఎందుకంటే  క్రింది దానితో పోల్చి చూసుకున్నాడు. పోల్చి చూసుకోవడం ఉత్తమమే. కాని నీవు సాధించవలసిన లక్ష్యాన్ని చూసుకోవాలి. ఎప్పటికప్పుడు పైకి చూసుకోవాలి.

        అందుకే మనవాళ్ళు ఏమన్నారు? Aim High. కాని aim low అంటే లాభం లేదు. క్రిందకు చూసుకుని అమీబా కంటే బెటర్‌ కదా అనుకుంటే ప్రయోజనమేముంది? కాబట్టి మానవుడు ఎలా తెలుసుకోవాలట ఈ సృష్టి మొత్తాన్ని?

        'బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్ప పునః... తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'.

        పరబ్రహ్మ అయినటువంటి ఆ దక్షిణామూర్తి అనుగ్రహం చేత, నీకు కూడ పరబ్రహ్మ పదమును, ఆ లేని యెరుక స్థితిని, ఆ బయలు స్థితిని   ఆ అనంతము అనుకునేటటువంటి స్థితిని, ఆ పరమాత్మ స్థితిని పొందుము.

        కాబట్టి ఈ స్థితిని సాధింపజేయాలీ అంటే, నీవు అనుభవించి,         ఆ అధిగచ్ఛతి అన్న స్థితికి చేరాలి. అంటే ఎటువంటి గురువును ఆశ్రయించాలి ఇప్పుడు? దక్షిణామూర్తి వంటి గురువుని ఆశ్రయించాలి.

'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!'
        మరి దక్షిణామూర్తి మౌనం కదా! మరి పరతత్వం, విశ్వానికి అవతల అంతరిక్ష స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర  ఏ యెరుక లేనివాడు. మరి మాటలతో ఎలా చెప్తాడు? చెప్పడానికి వీలవుతుందా? అవదు.

        నీవే ఉన్నావు నీ గాఢనిద్ర గురించి చెప్పమంటే ఏమంటావ్‌? చెప్పడానికి వీలు కాదు, అనుభవించడం వీలవుతుంది. కాని, చెప్పడం కుదరదు. అంటే చెప్పడం నిమ్నస్థాయి కదా! అనుభవించావు కదా! ఎలా మేల్కొన్నావు అని అడిగితే తెలీదు, మెలకువ వచ్చింది, లేచాను అంటావు. కాబట్టి నీవు కూడా అట్లా అనుభవించి, మేల్కొంటేనే తెలుస్తుంది అంటావు. నీవు ఎట్లా అధిగమించావు అంటే ఏం చెప్పావు? ఓ స్పందన వచ్చింది, స్పందన వ్యక్తం అయింది, వ్యక్తమై మరల సృష్టిని సంకల్పించింది. సంకల్పించిన సృష్టి మరల నీకు దర్శనంగా వచ్చింది. సాధన సాధ్యంగా ఇంద్రియాలలోకి దిగి వచ్చింది, ఇంద్రియాలలోకి దిగింది, విషయ విచారణకి క్రమంగా వచ్చేసింది. క్రియా కార్యక్రమంగా వచ్చేసింది.

        ఇప్పుడు మేల్కొన్నావు. మరీ నీ లోపల ఈ ప్రక్రియ అంతా జరగలేదా? మరి దాని కాల పరిమాణం ఎంత? ఏ దేశంలో జరిగింది?

        నేను లేను. ఆ దేశం ఏమిటి? ఏ నేనైతే ఇదంతా చేస్తున్నాడో, 'నేను' లేకుండా శూన్యంగా ఉన్నావు. ఆ శూన్య స్థితిలో ఒక స్పందన.   ఆ స్పందనకు పట్టిన కాలం.
        ఈ మూడింటికంటే ముందు నీవు లేవా? ఉన్నావు. మరి వాడెవడు? వాడు లేనివాడు, వాడు లేని యెరుక. కాబట్టి తురీయాతీతంలో మేల్కొన్న వాడిది లేని యెరుక అదే తురీయంలో మేల్కొన్నావనుకో ఈ మూడింటినీ తెలుసుకుంటావు. దేశము, కాలము, కలన ఈ మూడింటినీ గుర్తించడమే తురీయం అంటే.

        దానికి అవతల ఉన్నదానిని లక్ష్యించినప్పుడు తురీయాతీతం. అప్పుడు తురీయాతీతంగా ఉండాలా? తురీయంలో వుండాలా? తురీయాతీతంగానే వుండాలి.

        తురీయం ముందుగా అనుభవంలోకి వచ్చాక, దానిని విడగొట్టి చూపితే ఏమి అనుభవం కలిగింది? విడగొడితే  సంకల్పం కనపడుతోంది. ఇట్లా తెలుసుకోవడాన్ని 'జ్ఞాతుం' అన్నారు.

        దానిని రోజువారీ జీవితంలో నీవు దర్శించాలి. తరువాత మూడు అవస్థలలో కూడ ఎప్పుడూ పని చేస్తున్నది ఏమిటి? దేశము, కాలము, కలన, దాని తరువాత మిగిలినవన్నీ వస్తున్నాయి.

        ఎవరైనా కనపడ్డారంటే, వారికి సంబంధించిన స్పందనలు ఉంటేనే వారు కనపడ్డారు. స్పందనల కంటే ముందు ఏముందిదేశం, కాలం, కలన.

        ఆ మూడింటిలో ఉన్నప్పుడు వారు కనపడలేదు. ఏమయ్యారు? అప్పుడు అవ్యక్తంలో కలసిపోయారు.
        ఒక స్పందన రాగానే వ్యక్తమయింది. వ్యక్తమైనాక, దాని పని అది చేయడం మొదలుపెట్టింది. వ్యక్తమవగానే పంచభూతాత్మకమైన తత్త్వాలను సమీకరించింది, మూడు గుణాలను సమీకరించింది. ప్రాణశక్తిని సమీకరించింది, స్మ ృతులను సమీకరించింది. వాసనా బలాన్ని సమీకరించింది. అంతఃకరణలోకి దిగి వచ్చేసింది. దిగి వచ్చినాక ఇంద్రియాలను జత చేసుకుంది. విషయ జ్ఞానాన్ని పోగుచేసింది. వ్యక్తం అయి ఇక సొంత సృష్టిగా వచ్చేసింది. జీవ సృష్టిగా వచ్చేసింది. వచ్చేసినాక క్రియా కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది.

        మరి మూలంలో దేశము, కాలము, కలన కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? లేవు. కాబట్టి జీవ సృష్టికైనా అదే, బ్రహ్మాండ సృష్టికైనా అదే. ఇలా స్థాయీ భేదంగా, స్థితి భేదంగా దర్శించి గుర్తించాలి.

        ఈ చతుర్విద సృష్టి ప్రక్రియలన్నింటికీ అతీతంగా వున్నాడు అంటే వాడు పరబ్రహ్మము కదా! వాడే లేనివాడు కదా!

        కాబట్టి చతుర్విధ సృష్టులకు సంబంధించినదంతా మాయా స్వరూపం కదా! బయటేమో స్థావర జంగమాత్మక సృష్టి. అంతరంలోనేమో జీవ సృష్టి. ఆధారం లోనేమో బ్రహ్మ సృష్టి, అఖండం గానేమో విశ్వ సృష్టి.

        అదే అనంత స్థితికి చేరిపోయాడు, అప్పుడేమయ్యాడు? బయలుగా ఉన్నాడు, లేని ఎరుకగా ఉన్నాడు, పరబ్రహ్మముగా ఉన్నాడు. పరమాత్మ గా ఉన్నాడు, పరతత్త్వంగా ఉన్నాడు.
        ఇప్పుడు మిగిలిన వ్యవహారం అంతా ఉందా? వ్యవహారం లేదు. కాబట్టి ఉత్పత్తి, స్థితి లయమును దాటిపోయినవాడు.

        త్రిపుటి, ద్విపుటి రెండు ఉంటాయి. త్రిపుటిని దాటితే బ్రహ్మం. ద్విపుటిని దాటితే పరబ్రహ్మం.

        కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా ఈ నాలుగు స్థాయిలలో ఐదు వివేక స్థాయిలలో చక్కగా విచారణ చేసి, తెలుసుకుని జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి అనేటటువంటి పద్ధతిగా ఎవడైతే చేరాడో, వాడు ఏమయ్యాడుమహా యోగి అయ్యాడు.
'మహాయోగీవ యఃస్సేచ్ఛయా'

        దీనినుంచి ముక్తి, మోక్షాన్ని పొందాడు. జన్మ రాహిత్య స్థితికి చేరుకున్నాడు. కాబట్టి జన్మ రాహిత్యం పొందాలి అంటే ఎటువంటి గురువును ఆశ్రయించాలి?

'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'

        అవ్యక్తాన్ని వ్యక్తం చేయకుండా వుంచగలమా? దాని పని అది ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. దానితో రమించకుండా ఉండాలి. నిరసించగలిగే స్థాయికి చేరితే, అప్పుడు నీలో ఏదీ వ్యక్తం కాదు.
        ఆది శంకరులు 5 సంవత్సరాల వయస్సులో మొట్టమొదట చెప్పిన స్తోత్రం కనకధారాస్తవం.

        ఆ తరువాత అద్వైత చతురామ్నాయ పీఠాలను స్థాపించి అద్వైత బోధనంతా రంగరించి చెప్పినటువంటిది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి అద్వైతామృత సారమంతా కూడ దక్షిణామూర్తి స్తోత్రంలో ఇమిడి ఉంటుంది. ఇది ఈ చివర, అది ఆ చివర. అద్వైతామృతాన్ని ఒక నదిగా భావిస్తే    ఈ ఒడ్డుకు మొదట కనకధారాస్తవం అయితే, ఆ ఒడ్డుకు చివర దక్షిణామూర్తి స్తోత్రం. అయితే ఎవరైనా సరే ఈ అద్వైత సిద్ధిని పొందాలి అంటే తప్పనిసరిగా దర్శనశక్తిని పొందాలి. దర్శన స్థితి లేకుండా అద్వైతం సిద్ధించడం సాధ్యం కాదు. కాబట్టి సాధకుడు తప్పకుండా ఎలా ఉండాలి?  ''స్వాత్మానమేవాద్వయం'' అని బోధించే గురువు గారికి, వినే శిష్యుడికి మధ్య అద్వైత సిద్ధి ఉండాలి. గురువు శిష్యుడు ఏకత్వానుభూతిలో ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే అద్వైతానికి సిద్ధిదశ అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది.

        అవాంఙ్మానస గోచరమైన పరబ్రహ్మ పదాన్ని వాక్కుతో తెలియచెప్పటం సాధ్యమైన అంశం కాదు. అద్వైతానికి చివరిమెట్టు పరబ్రహ్మ పదం. ఆ పరబ్రహ్మ పదాన్ని సూచించే సూచనా వాక్యాలే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నాయి.

కాబట్టి ప్రారంభంలోనే ఎక్కడ ప్రారంభించారు?
'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం'...1వ శ్లోకంతో ప్రారంభించారు.

        బోధించే గురువు దక్షిణామూర్తి అనేటటువంటి మౌనవ్యాఖ్య స్థితిలో ఉండి బోధించాలి. వినేటటువంటి శిష్యుడు కూడ సచ్చిశిష్యుడై, అట్టి సద్గురు మూర్తిని ఆశ్రయించి, సద్గురు హృదయాంతర్గతంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ పదం యొక్క అనుభూతిని నిర్విశేషంగా, నిర్వికారంగా, నిర్వికల్పంగా పట్టుకోగలగాలి.

        ఈ లక్షణాలు మూడు నిర్విశేషం, నిర్వికారం, నిర్వికల్పం శిష్యుడికి ఉండాలి. వీటితో సచ్చిశిష్యుడు పరబ్రహ్మ పదములో రమిస్తున్నటువంటి, స్థితమై ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క హృదయాన్ని ఆకళింపు, అనుభూతి చేసుకునే ప్రయత్నం చేయాలి.

        వాచాగా, వాచ్యార్థంగా దీనిని అనుసరిస్తే, ఆశ్రయిస్తే ఎన్ని జన్మలపాటు చేసినా సిద్ధిని పొందలేరు అనేది ఇందులో ఉన్న సత్యం అన్నమాట. కాబట్టి అధికారిత్వం అనేది అలా ఉండాలి. అయినా సాధ్యమైనంతవరకూ క్రిందికి దిగివచ్చి అందించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.

        దానిని వాచాగా తెలియజెప్పడానికి వీలుకాకపోయినప్పటికీ, ఇన్ని స్థాయిలలో అనగా జీవుడు, ఆత్మ, బ్రహ్మము, పరబ్రహ్మ అనే స్థాయిలో చెప్పే ప్రయత్నం చేశారు. జీవులన్నీ ముఖ్యంగా మానవులు ఈ నాలుగు స్థితి భేదాలతో ఉంటారు. జీవ భావంతో ఉండేవారు, ఆత్మ భావంతో ఉండేవారు, బ్రహ్మ భావంతో ఉండేవారు, పరబ్రహ్మ పదమును అధివసించి నటువంటివారు.

        ఈ రకమైన నాలుగు జ్ఞాన స్థాయీ భేదాలతో, అంటే పంచ వివేకాలలో ఉన్న భేదాలతో అన్నమాట వారి వారి జీవన విధానాన్ననుసరించి వారి వారి ముక్త స్థితి ననుసరించి వారి వారి వివేక స్థితిననుసరించి ఈ స్థాయి, స్థితి భేదాలుగాను సూచించడం జరిగింది.

        కాబట్టి జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, ఈ నాలుగు క్రమ ముక్తిలో మార్గాలుగా నిర్ణయించడ్డాయి. సాధనా సాధ్యమైనటువంటి అన్ని సాధనలూ కూడ జీవుడు, ఆత్మ అనే పరిమితి వరకే ఉంటాయి. ఆత్మ నిష్ఠుడైనవాడు బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మ నిష్ఠను పొందాలి. ఇదొక్కటే అక్కడ సాధన. వేరే సాధనలు ఉండవు.

        మహావాక్య నిర్ణయ పద్ధతిగా, లక్షణ పద్ధతిగా బ్రహ్మ నిష్ఠ నిర్ణయం చేయబడాలి. బ్రహ్మ నిష్ఠుడైనటువంటివాడు అవాక్‌గా, వార్తీక నిర్ణయ పద్ధతిగా ఈ పరబ్రహ్మ పదాన్ని సూచన ద్వారా పొందాలి. ఇదీ ఇందులో ఉన్న నడక.

  ఈ నడకని సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడ ఆయా అర్హతలననుసరించి అధికారిత్వాన్ననుసరించి సాధించడం సాధ్యమౌతుంది. అంతేకాని సద్యోముక్తులుగా, అంటే హస్తమస్తక సంయోగం ద్వారా ప్రేరేపించవచ్చు. కానీ ఇది చాలా అత్యంత అరుదైన సంఘటన. అలా జరిగింది పరమహంసకు, వివేకానందులకు; అరవిందుడు, మాతారవిందలకు; రమణులు, కావ్యకంఠ గణపతికి.

     ఇలాంటి సందర్భాలు భారత దేశంలో చాలా ఉన్నాయి. కానీ అలా ఒక్క శిష్యుడికివ్వడానికి మాత్రమే సాధ్యపడుతుంది. కాలాన్ని మీరిన, కడతేరిన మహానుభావుడు కాలంలోకి దిగివచ్చి ఒక్కరికి మాత్రం సహాయం చేయగల సమర్ధత, అవకాశం సృష్టి ధర్మంలో ఇవ్వబడింది.

        ఇలా ఏదైతే చేయబడుతుందో అది మరల రెండోసారి చేసే అవకాశం ఉండదు. ఇట్లా పారంపర్యంగా, అనూచానంగా ఒకరిచే ఒకరికి ఇవ్వబడుతూ వస్తున్నటువంటి ఈ సూచనా పద్ధతిననుసరించే ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఈ దృష్టితో మీరు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేయాలి.

        1వ శ్లోకంలో విశ్వాన్ని దర్పణ దృశ్యంగా చూడగల్గేంత సమర్ధతను సాధించాలి. ఒక దర్పణంలో ''కొండ అద్దమందు కొంచెమై యుండదా'' అనేటటువంటి లక్షణాన్ని చూపెట్టారు. ఎంతటి పెద్దదైనా కూడ, దర్పణ దృశ్యంలో చిన్నదై, లేనిదై కనపడుతుంది. దీనిని ఎలా స్వీకరించాలి అంటే నీయొక్క దర్శన శక్తి, దృక్‌ శక్తి ఎంత ఉండాలయ్యా అంటే, సమస్త జీవరాశిని ఒక బిందువు రూపంగా సమస్త జీవరాశికూడ పంచభూతాత్మకమైన జగత్చక్షువైనటువంటి సూర్యస్థానం నుండి చూసినప్పుడు, ఈ భూమండలం మీద ఉన్న సమస్తము ఒక బిందు స్థానంగా మారిపోయింది. అదే జగత్చక్షు స్థానాన్ని సూర్యగోళం నుంచి అవతలకు నడిపి, ఒక కేంద్రక స్థానానికి  తీసుకు వెళ్ళినట్లయితే, బ్రహ్మముగా మారినట్లయితే ఆ బ్రహ్మముగా బ్రహ్మీ భూతస్థితి నుండి చూసినప్పుడు ఈ సౌర కుటుంబ వ్యవస్థంతా కూడ ఒక బిందువుగా మారింది. ఇంకా అక్కడనుండి పైన ఉన్నటువంటి విశ్వం అనే స్థాయికి తీసుకెళ్ళినపుడు, ఆ విశ్వంలో ఈ సౌరకుటుంబ వ్యవస్థ నామమాత్రమై పోయింది. ఆ అనంత విశ్వానికి అవతల ఉన్నటువంటి అంతరిక్ష స్థానాన్నుంచి చూసినపుడు ఈ అనంత విశ్వము ఒక బిందువై పోయింది.

        ఇలా ఒక్కొక్కదాన్ని దాటుతూ చూడగలిగేటటువంటి, అతీతమైనటువంటి అధిగమించే దృష్టితో ఎక్కడైతే ఈ దిగువ చెప్పబడినటు వంటి, తన మూలము లేదో, తన కారణము లేదో తన శరీరము లేదో అటువంటి స్థితిని సాధించాలి. అలా సాధించేటటువంటి స్థితిని అందించడమే ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క ఉద్దేశ్యము, లక్ష్యమూ కూడ. కాబట్టి అటువంటి దర్శన సిద్ధిని పొందిన మహానుభావులైన గురువులు ఈ రకమైన దర్శనాన్ని దృక్‌ దృశ్య రహిత పద్ధతిని అందిస్తున్నారన్నమాట.

     ఆ విధానాన్ని దృక్‌ దృశ్య రహిత పద్ధతి అంటారు. ఇక్కద ద్రష్ట లేకుండా పోయేటటువంటి మార్గాన్ని మాత్రమే సూచించుచున్నారు. దృశ్య రహిత పద్ధతి ఆత్మ వస్తువు నుండి బ్రహ్మ వస్తువు వరకు చేసే పద్ధతిగా బోధించబడుతుంది. దృక్‌ దృశ్య వివేకం అంతా ఆత్మ నిష్ఠుడికి బ్రహ్మాను సంధానం చేసేటప్పుడు బోధించే వివేకాలలో భాగంగా ఉంది. ఈ చిట్టచివరిదైన పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు ఉపయోగించవలసింది 'దృక్‌ రహిత పద్ధతి, ద్రష్టు రహిత పద్ధతి' అంటారు. కాబట్టి తనను తాను కోల్పోయే విధానంలో ఈ దక్షిణామూర్తి స్తోత్రం బోధించబడుతోంది. అందువలననే ''విశ్వం దర్పణ.. నిజాంతర్గతం'' దాని యొక్క యధార్థ స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయి, అనుభూతి చెందే, దర్శించే ప్రయత్నం చేయి. గురువుతో ఐక్యతా సిద్ధిని చెందే ప్రయత్నంతో అనుభూతి చెందే ప్రయత్నం చేయి.

'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'
        అటువంటి దక్షిణామూర్తి స్థితిలో ఉన్న గురుమూర్తికి నమస్కారం. 'తత్‌' స్థితిని దాటించేటటువంటి 'తత్‌', 'త్వం' అనే రెండు స్థితులు లేనటువంటి సర్వ దృక్‌ రహిత పద్ధతిని ఇందులో బోధిస్తున్నారన్నమాట.

        నాయనా! ఈ అనంత విశ్వమూ కూడ శూన్యము, సంకల్పము, కాలము అనే మూడింటితో తయారవుతోంది. ఇవే ''దేశ కాల కలనలు''. ఇవి వస్తువులూ, పదార్థాలు కావు. ఈ మూడూ లక్షణాలు. ఈ లక్షణ త్రయం చేత ఆ అనంత విశ్వమూ తయారవుతోంది. ఈ అనంత విశ్వమంతా కూడ ''మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతమ్‌''.

        దీనిని విజ్ఞాన శాస్త్రం ఎలా చెప్పిందంటే  ఫోటాన్‌ అంటే కాంతి రేణువు, అంటే నాదము -నాదభేదము-లేక నాదశక్తి, శబ్దభేదం అన్నమాట. ఈ ఫోటాన్‌, టైం, స్పేస్‌ ఈ మూడూ Immergible infinite గా Time space గా ప్రతిపాదిస్తున్నాం. Time, Space ఈ రెండింటినీ Infinite గా చెప్పి, కాంతి రేణువు అందులో సంయోగం చెందుతోందని విజ్ఞానశాస్త్రం చెప్పింది. దీనినే సంస్కృత భాషలో ఏం చెప్పారంటే Space ను దేశమని, కాలంను కాలం అని, కలనను కాంతి రేణువు అని 'కలన' శబ్దంతో సూచించారు. కాబట్టి దేశము, కాలం, కలన - ఇవే బ్రహ్మం అనే స్థాయికి చెప్పారు. బ్రహ్మాండ సృష్టి స్థాయికి దిగి వచ్చినప్పుడు అవి నాదబిందుకళ లవుతాయి. ఈ నాద బిందు కళలతో కలసినటువంటిది బ్రహ్మాండ సృష్టి. దేశ కాల కలనలతో కూడినటువంటిది విశ్వసృష్టి. ఇదే రెండు సృష్టుల మధ్య భేదం.

        అక్కడ పంచ భూతాత్మకమైన చైతన్య సృష్టి ఉంటుంది. మీకు తెలిసిన త్రిపుటులు అన్నీ ఇందులోనే ఉన్నాయి. జీవసృష్టి భాగమంతా త్రివృత్కరణం చేయబడినటువంటి త్రిపుటి. సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్నదంతా, జగత్‌ జీవేశ్వర సృష్టితో కూడి ఉన్నదంతా కూడ. దీనినే బ్రహ్మాండ స్థాయికి తీసుకెళితే నాదబిందుకళ లతో ఉపాసించి, అధిగమించే పద్థతిని తెలియచేస్తారు. దానినే అనంత విశ్వస్థాయికి తీసుకెళ్ళినప్పుడు దేశ కాల కలన పద్ధతిగా సూచిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు బీజము తెలుసుకోవాలి.

        ''బీజస్యాంత రివాంకురో జగదిదం...'' నీకు కనపడుతున్న జగత్తంతా కూడి ఒక విత్తనంలో నుండి అంకురించిన దానివలే కనపడుతోంది. బీజమేమిటి అంటే ఆ త్రిపుటియే బీజమన్న మాట.

        బ్రహ్మము, పరబ్రహ్మము మధ్యలో ఉన్నటువంటి దేశ కాల కలనలలో కాలము నందే ఈ కలన వ్యక్తమౌతున్నది. కాలములో ఈ కలన వ్యక్తమై కలనలో దేశము వ్యక్తమై, ఒకదానిలో నుండి మరొకటి తనకు తానుగా వ్యక్తమౌతున్న పద్ధతిగా ఇవి ఏర్పడ్డాయి. నిజానికి ఈ మూడు ద్విపుటిగా ఉన్నాయన్నమాట. బ్రహ్మం వరకు త్రిపుటి అయితే, బ్రహ్మం పైన ద్విపుటి. కాబట్టి ద్విపుటి, త్రిపుటుల మధ్య 'తెగకోసివేసి' అని కందార్థాలలో అందించారన్నమాట. మనం బీజాన్ని నిర్బీజం చేసే పద్ధతిగా ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవాలి. ఎప్పటికీ తిరిగి అంకురించనటువంటి పద్ధతిగా ఏ కాలములోనూ అంటే అర్థం ఏమిటి?

        కాలములో దశ విధ ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పది ప్రళయాలను కలిపి మహా ప్రళయంగా సూచించబడుతుంది. ఏ ప్రళయ కాలంలో కూడ అది నశించనిదై, ఏ కాలంలో కూడ మరల పుట్టనిదై ఉండాలి. కాబట్టి జనన మరణ రహిత పద్ధతిగా సూచించేటటువంటిదే ఈ ''బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునః''. నిర్వికల్ప స్థితినుంచే సంకల్పం ఏర్పడుతోంది. ఆ నిర్వికల్ప స్థితిలో సంకల్పానికి ఆధారభూతమైనట్టి స్థితి లేదు. మూలమైన స్థితి లేదు. కారణమైన స్థితి లేదు. తనకు తానే ఆది సంకల్పం ఉద్భవించింది. అదే విషయాన్ని అనేక మతాల వాళ్ళు వారి వారి పద్ధతిలో వ్యక్తీకరించారు. అవతార్‌ మెహెర్‌ బాబా దీనినే 'లెహర్‌' అన్నారు. సనాతన ధర్మం ''ఓంకారము'' అన్నది. అలాగే ''ఆదియందు వాక్యముండెనని'' బైబిలు చెప్పింది. ఈ రకంగా ఒక్కొక్కరూ ఆ మౌనాన్ని వాక్‌ పద్ధతిగా చెప్పబూనేప్పటికి బ్రహ్మాండ స్థితిలోకి దిగి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడిపోతోందన్న మాట. కాబట్టి పరబ్రహ్మమును మాటల రూపంలోనికి వ్యక్తం చేయబూనేప్పటికి, అది బ్రహ్మమై పోతుంది. కాబట్టి మనం బ్రహ్మీ భూత స్థితిలో ఉండి, పరబ్రహ్మ నిర్ణయాన్ని గురించి బోధించే ప్రయత్నం చేస్తున్నామన్నమాట. బ్రహ్మనిష్ఠుడై ఉండి, పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించే ప్రయత్నం చేస్తున్నారు.

2.     బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాజ్ఞ్‌ నిర్వికల్పం పునః
        మాయా కల్పిత దేశ కాల కలనావైచిత్ర చిత్రీకృతమ్‌ |
        మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
        తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

        కాబట్టి ఇక్కడ బోధించే పద్ధతి, 'బీజస్యాంత రివాంకురో.. మాయాకల్పిత...మాయావీవ.. మహా యోగీవ యః స్వేచ్ఛయాఎటువంటి ముక్తిని సాధించాలయ్యా! నీవు మహా యోగివై మహా యోగి ఎవరు? సదా శివుడే మహాయోగి. ఇంక ఎవరూ లేరు. ఆ సదాశివ స్థితిని పొందినటువంటి ఏ గురువైతే ఉంటారో, అటువంటి సదాశివ స్థితికి ఒక స్వేచ్ఛ ఉన్నదట. ఏమిటది? అంటే దేశ కాల కలనలతో కూడినది కానిది, పంచ బ్రహ్మలలో భాగమైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు వారియొక్క సంకల్ప శక్తులైనటువంటి ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, ఆది, పరాశక్తులు అనేటటువంటి పద్ధతిగా సనాతన ధర్మం వీటిని విశదీకరించింది. ఆయా స్థాయీ భేదాలతో ఈ పంచ బ్రహ్మలు, పంచ శక్తులు, బ్రహ్మాండ విస్తరీకరణ, విశ్వాండ విస్తరీకరణ, వాటి వ్యవహారం, వాటి స్థితి, వాటి రక్షణ, లయం ఇదంతా సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలనే పంచ క్రియలను కలిపినటు వంటి దానిలో వివరించబడుతున్నది.

        ఈ రకంగా పంచ బ్రహ్మలను, పంచ శక్తులను విశ్వాండ పంచీకరణ పద్ధతిగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దానిని దర్శిస్తారు. పంచీకరణం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే సాంఖ్య విచారణలో బోధించబడేటటువంటి పంచీకరణ దృష్ట్యా ఆ దర్శన పద్ధతిగా నీవు దానిని దర్శించాలి. పిండాండ, బ్రహ్మాండ, ఈశ్వర పంచీకరణలను సాంఖ్య విచారణా పద్ధతులలో బోధిస్తారు. ఈ మూడు పంచీకరణలను అందుకున్నటువంటి వారికి సాంఖ్యం పూర్తిగా కరతలా మలకమై ఉన్న శిష్యుడికి ఈ ఏ స్థితి కా స్థితి తారక అమనస్క పద్ధతిగా బోధిస్తారు.

        ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడుతున్నది సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ పద్థతి. దీనిని ఆశ్రయించేవారు ఈ మౌన వ్యాఖ్య ద్వారా పరబ్రహ్మ నిర్ణయ పద్ధతి పొందాలి. అన్నింటికంటే ఉత్తమమైన సాధనా స్థితి ఏమిటి? సిద్ధి స్థితి ఏమిటయ్యా అంటే 'సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ స్థితి'. ఇదే వేదాంతం మొత్తం మీద అత్యుత్తమ స్థితి.

        దీనినే ఉన్మనీ, మనోన్మనీ అవస్థలుగా ఆది శంకరులు యోగ తారావళి గ్రంథములో బోధించారు. ఈ ఉన్మనీ, మనోన్మనీ అవస్థలను ఎవరైతే సాధిస్తారో, వారే ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతారు అనేది నిర్ణయంగా యోగతారావళిలో నిష్కర్షగా బోధించారు.

        ఈ రకంగా ఎవరైతే ఈ బీజమును, అంకురమును, దాని విస్తృతిని, దాని వ్యావృతిని, దానియొక్క లయాన్ని ఈ ఐదు స్థితులను ఎవరైతే దర్శించి, దాటగలిగినటువంటి సర్వ దృక్‌ స్థితిలో ఉంటారో, వారు ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతారు అనే సత్యాన్ని ఈ రెండవ శ్లోకంలో నిరూపించారు.