6వ శ్లోకం
రాహుగ్రస్థ దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో
యో-భూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాస్సమితి ప్రబోధ సమయే యః
ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
శ్రీ దక్షిణామూర్తయే ||
ఇప్పటివరకూ అనంత సృష్టి నుండి వ్యష్టి
సృష్టి వరకు చెప్పారు. తరువాత క్రమంలో మానవుడు ఏ రకమైనటువంటివాడు వాసనా బలంతో ఏ
రకమైనటువంటి జీవన విధానంతో జీవుడు అనేటటువంటి బంధాన్ని కలిగి ఉంటున్నాడు అనేది
ఇందులో వివరించి చెప్పారు.
''స్త్రీ
బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః'' భ్రాంతి
అనే బంధంచేత బాధించబడుతున్నాడు.
విశేషం ఏమిటంటే 'భ'కార శబ్దం చాలా విశేషమైంది. 'భ' అంటే ప్రకాశం. అదే 'భ'
చేత ఇంకా భ్రాంతి కూడా ఉంటుంది.
ఎక్కడ వెలుగుంటుందో, అక్కడే చీకటి కూడ ఉంటుందట. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే
అజ్ఞానం కూడ ఉంటుందట. రెండూ ఒకేచోట ఉండే అవకాశం ఉందా? లేదు.
మానవుని యొక్క
బుద్ధి మేరకు ఆలోచించినప్పుడు ఇలా కనపడుతుంటుంది. The logical
brain cannot explain the internal root of the universe.
విశ్వంలో ఎలా ఉంటుందీ అంటే కాంతి, చీకటి కలిసి ఉంటాయి. అంతరిక్షంలో విడివిడిగా ఉండవు. ఒక
రాకెట్లో వెళ్ళామనుకోండి. భూమిమీద నుండి చంద్రుని మీదకు వెళ్ళాం. ఏమౌతుంది?
చుట్టూ చంద్రుడిలాగ ప్రకాశిస్తూ ఉంటుంది.
సూర్యుడు ప్రకాశిస్తూ కనపడతాడు. భూమి కూడ చంద్రుని వలే ప్రకాశిస్తూ ఉంటుంది.
చంద్రుడు కూడ ఇంకా చిన్నగా ప్రకాశిస్తూ ఉంటాడు.
చంద్రుని కంటే భూమి పెద్ద చంద్రునివలె కనబడతుంది.
ప్రకాశించాలంటే చుట్టూతా అంతరిక్షమంతా
చీకటి ఉంటేనేకదా, ఈ ప్రకాశాన్ని
గుర్తిస్తున్నాం. చీకటి లేకుండా ప్రకాశాన్ని గుర్తిస్తావా ? కాబట్టి
అసలు అంతరిక్షమంతా ఏమి వ్యాపించి ఉంది? కృష్ణ పదార్థము
వ్యాపించి ఉంది. అదే 'కృష్ణతత్వం' అంటే.
అది అంత తీవ్ర వేగంతో both centrifugal and centripetal అదే double helix అంటే దీనిలో ఉన్న double helix దేనిని చూపిస్తోంది?
ఒక serpant ఏమో centrifugal ని ఒక serpant ఏమో centripetal ని రెండు force ఒకసారి పనిచేయడమే జీన్ [Gene] అంటే. ఇవి రెండు
శక్తులు. పనిచేస్తున్నది Galaxy లో. So
center of Galaxy లో ఎప్పుడూ కూడా ఒక Black hole ఉంటుందన్నమాట.
ఆ Black hole
లోకి both ways నుండి కూడ లోపలికి వెళ్ళిపోతూ
ఉంటుంది. అదే way లో, out way లో మరల బయటకు out come వస్తూ ఉంటుంది. ఈ రకంగా ఒక
చీకటి బిందువు, ఒక ప్రకాశ బిందువు కలిసి ఉంటాయన్నమాట.
ఇది చీకటి యనిగాని, ఇది ప్రకాశము అని గాని చెప్పడానికి ప్రత్యేకంగా లేదు. ఇది
అనంత విశ్వంలో వున్నటువంటి స్థితి. అదే ఒక బ్రహ్మాండానికి దిగి వచ్చేశాం. ఏమైందిప్పుడిక్కడ?
ఒక సూర్యుడు ఒక solar network ఒక భూమండలం,
ఒక వాతావరణం. ఇందులోకి దిగి వచ్చేశాం. పంచభూతాల్లోకి దిగి వచ్చేశాం.
అప్పుడు చీకటి వేరుగా, ప్రకాశం వేరుగా ఉన్నాయా? సూర్యుడి దగ్గర
లేవు. జగత్ చక్షువు అయినటువంటి సూర్యస్థానం నుంచి చూశాం. అక్కడ కూడ చీకటి,
ప్రకాశం లేవు. సూర్యస్థానంలో చీకటి లేదు, ఎప్పుడూ
వెలుగే ఉంది. భూమి మీద చూసినప్పుడు ఏమైంది? సూర్య ప్రకాశం
పడ్డవైపు వెలుతురని, పడని వైపు చీకటని అనేటటువంటి
నిర్వచనాన్ని చెప్పుకున్నాం
మరి ఇప్పుడు మనదాకా వచ్చేసాం, వ్యష్టి సృష్టి వరకూ. ఇప్పుడు ఏమంటున్నాం? మాకు చీకటి అనుభూతమౌతోంది కదా అని. మనకు పగలు, రాత్రి
అనుభూతమవుతున్నాయంటే ఏం చెప్తున్నారు?
నీది పరిమితమైన బుద్ధి నాయనా! ఆ పరిమితమైన
బుద్ధిచేత, పరిమితమైన దృష్టిచేత, వికాసం పొందనటువంటి సమర్ధత లేనటువంటి, విచారణాబలం
లేనటువంటి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు రాత్రి అంటే రాత్రే, పగలు పగలే. సూర్యుడు ఉదయించకా మానడు, అస్తమించకా
మానడు.
భూమి స్థిరంగా ఉంది. సూర్యుడే భూమి చుట్టూ
తిరుగుతున్నాడు అన్నాం. రాత్రి పగలు సత్యం అనేటటువంటి దృష్టితో నిర్ణయం
చేసినప్పుడు విశ్వం మొత్తానికి ఎలా నిర్వచనం చెప్పాం? సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి స్థిరంగా
కనబడుతోంది నాకిక్కడ. భూమి తిరుగు తున్నట్లు కనపడటం లేదు. సూర్యుడు
తిరుగుతున్నట్లు కనబడుతున్నాడు అవునా!
సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు ఇక్కడ
కనబడుతున్నాడు. అస్తమయానికి వచ్చినప్పుడు దిగిపోతున్నాడు. మరి సూర్యుడే
తిరుగుతున్నట్లు కనబడుతుంటే మీరు భూమి తిరుగుతోందని అంటారేమిటి? విచారణ చేయనప్పుడు భూమి స్థిరంగా ఉంది. సూర్యుడే
తిరుగుతున్నాడు అంటున్నాం. కానీ విచారణ చేసి ఏమంటున్నాం? భూమి
తిరుగుతోంది, సూర్యుడు స్థిరంగా ఉన్నాడు అంటున్నాం.
కాబట్టి భ్రాంతికి మూలం ఏమిటటా? విచారణ లేకపోవడం.
ఇప్పుడు ఇది
తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి? ప్రాణాయామం
చేస్తే తెలుస్తుందా? ధ్యానం చేస్తే తెలుస్తుందా? ఉపవాసం, యజ్ఞాలు, షోడశోపచారాలు
పూజలు చేస్తే తెలుస్తుందా? అంటే భ్రాంతి తొలగాలి అనే
లక్ష్యంతో విచారణ చేస్తే తప్ప, విచారణాబలం చేత, సమర్ధత చేత నీవు నిర్ణయించుకోవాలి. అప్పుడు సత్యం తెలుస్తుంది.
విచారణలో రెండు రకాల పద్ధతులున్నాయి.
ఉపనిషత్ ప్రతిపాదిత పద్ధతులు రెండు ఉన్నాయి.
1. మహావాక్య విచారణా పద్ధతి
2. వార్తీక
పద్ధతి.
ఈ రెండు పద్ధతులు శ్రేష్ఠమైనటువంటి విచారణా పద్ధతులు.
మహావాక్య విచారణ అంతమునందు
నిర్ణయించబడుతున్న బ్రహ్మ పదమైననూ, వార్తీకాంతమునందు
నిర్ణయించబడుతున్న పరబ్రహ్మమైననూ, నీకు సరియైనటువంటి భ్రాంతి
రహిత పద్ధతిని అందిస్తాయి.
ఎక్కడికక్కడ దాని అవతల స్థితి ''తత్పరంచావలోకయేత్''. ఆ తత్ పద
దర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దృష్టితో నీవు దానికి పరమైనటువంటి స్థితిని
ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు భ్రాంతి రహితం అవుతుంది. అంటే అర్థం ఏమిటటా?
నీవు మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? తెలుసుకుంటే గాని అది భ్రాంతి రహితం అవదు. మరణము ఒక భ్రాంతి. మరణము
మనకిప్పుడు సత్యమా? భ్రాంతా? మరణం
సత్యమైతే జననం కూడ సత్యం. ఎలా?
జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ!
తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితు మర్హసి!!
తస్మాత్ పరిహార్యార్థే అనేది అక్కడ
మూలమైన శబ్దం. అందరూ ఈ జీవులంతా ఏమి చేస్తున్నారట. ఈ జనన మరణాలని పరిహరింప
జేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. పరిహరించడం అంటే ఏమిటి? 'పరి' అనేది ఉపసర్గ అక్కడ, 'హరణము', ఇవి నిన్ను లేకుండా చేస్తున్నాయట. జననములో
ఉన్నట్లుగా తోస్తోంది. మరణములో పోతున్నట్లుగా తోస్తోంది. నువ్వేం ప్రయత్నం
చేయాలిటా? 'తస్మాత్ పరిహ్యారార్ధే' 'తత్'
స్వరూప పద్ధతిగా నీవు దీనిని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే
పరిహరించబడతాయి.
అంటే 'త్వం'
పదము నుండి, అధ్యయనం చేసినట్లయితే ఇవి ఎప్పుడూ
ఉన్నాయి. ప్రతి స్థాయిలోనూ ఉన్నాయి. ప్రతి స్థాయిలోనూ ఆయా కాలములందు ఆయా స్థితుల
యందు జనన మరణములు రాకడ పోకడ ఏర్పడుతున్నాయి. అదే తత్ పద దృష్ట్యా నీవు విచారణ
చేసినట్లయితే ఇవి పరిహరించ బడతాయి.
తత్ పదం అంటే అర్థం ఏమిటి? 'తత్వం'లో 'త్వం'
నేను విచారణ చేసేవాడు. ఈ నేను యొక్క ధీశక్తి, నేను
యొక్క ప్రజ్ఞాశక్తి ఏ స్థాయిలో ఉందో ఏ
భ్రాంతిచేత ప్రభావితం అవుతోందో, ఆ భ్రాంతిని దూరం చేయగలిగే
శక్తి 'తత్' పద దర్శనంలో ఉంది.
కాబట్టి నేను శరీరము అంటే అప్పుడు 'తత్' ప్రాణమయింది. ఎందుకని ఆ ప్రాణం
లేకపోతే ఈ శరీరం పనిచేయదు కాబట్టి. ప్రాణాన్ని స్వాధీనం చేసుకుని, నేను ప్రాణము అంటే 'తత్' మనస్సు
అయింది. ఎందుకంటే ఆ మనస్సు పనిచేయకపోతే, ప్రాణం ఉన్నా
ప్రయోజనశీలం కావట్లేదు.
కోమాలో ఉన్నవాడికి ప్రాణం కొట్టుకుంటోంది
కానీ మనసు పనిచడం లేదు. వాడున్నాడా? పోయాడా?
ఉండీ పోయినవాడితో సమానం. ఎందుకని? వాడిలో ఏ
చలనములు లేవు. కాబట్టి చలింపచేయ కలిగేశక్తి ఎవరిలో ఉందట ఇప్పుడు? ప్రాణంలో ఎంతుందో, మనసులో కూడ అంతే ఉంది.
కాబట్టి మనసు అనే ఆధార కేంద్రం
పనిచేయకపోయినట్లయితే నీలో ఏ చలనాలూ కలగట్లేదు. అంతర్గత అవయవాలు ఒకటే పనిచేస్తే
సరిపోయాయా? కిడ్నీ పని చేస్తోంది. గుండె
కొట్టుకుంటోంది, కాబట్టి వీడు బ్రతికే ఉన్నాడు అన్నావనుకో
ప్రయోజనశీలం లేని జీవితం కదా! ఈ రకంగా 'తత్' అంటే ప్రాణం కాస్తా మనసయింది.
ఇప్పుడు నేను మనసును స్వాధీనం
చేసుకున్నాను. నేను మనసుని అన్నావు. అనగానే 'తత్'ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? బుద్ధి దగ్గర.
ఎందుకని? త్రిగుణాత్మకమైనటువంటి మనసు చెప్పినట్లుగా ఈ ప్రపంచం పని చేయడంలేదు.
నిర్ణయించగలిగేటటువంటి ధీశక్తి ఎక్కడైతే ఉందో ఆ బుద్ధి శక్తిని ఆధారంగా చేసుకునే
త్రిగుణాత్మకమైన మనసు పని చేస్తోంది.
ఇలా 'తత్'
పద దర్శనం అంటే అర్థం ఏమిటంటే, ఈ రకంగా
ఒక్కొక్క స్థాయిని అధిగమిస్తూ నేను శరీరం కాదు, శరీరం
భ్రాంతి. అంటే ఒక్కొక్కటి స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుని దాటాలి.
'తత్
పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః' అంటున్నాం కదా! అలాగే
ఇక్కడ కూడ మకుటం ఏముంది? 'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
శ్రీ దక్షిణామూర్తయే' అంటున్నాం.
'తత్'
శబ్దం యొక్క విచారణ చాలా ముఖ్యమైన విచారణ. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని
స్వాధీనపరచుకుంటూ, సాధనలతో శరీరాన్ని, ప్రాణాన్ని,
మనస్సును, బుద్ధిని స్వాధీనపరచుకుని ప్రజ్ఞా
స్థితిలో నిలిపి ఉంచగలిగే స్థాయికి చేరాలి మొట్టమొదట.
ఈ 'త్వం'ను అక్కడదాకా తీసుకు వెళ్ళాలి. 'త్వం' ను ప్రజ్ఞ అనే స్థాయికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే 'తత్'
బ్రహ్మం అవుతుంది. త్వం
ప్రజ్ఞ అయినప్పుడు మాత్రమే తత్ బ్రహ్మమైంది. త్వం బ్రహ్మమైతేనే 'తత్' పరబ్రహ్మమైంది. ఈ రకంగా 'తత్' ఎప్పుడూ ఒక మెట్టు అవతల ఉంటుంది. చిట్టచివరికి
తద్రహితం అయిపోతుంది. త్వం రహితం ఉండదు ఎపుడూ. ఏమౌతుంది? 'తద్రహితం', 'వస్తుమద్రహితం', అనేటటువంటి
బయలు అనే స్థితికి చేరతామన్నమాట.
వస్తుమద్రహితం అనే బయలు స్థితికి చేరుతాం.
ఆ బయలే అంతరిక్షం. ఇలా సృష్టిలో కనపబడిన వాటన్నింటినీ 'అది నేను', 'అది నేనైతిని' అంటూ ప్రయాణం చేసే పద్ధతేమో మహా వాక్య పద్ధతి. మహా వాక్య పద్ధతి అంటే
విచారణ. అంటే 'అది నేనైతిని'. 'అది'
అంటే 'తత్', ప్రతి
దానినీ తత్ శబ్దంతో సూచిస్తూ ఉంటాం అన్నమాట. ఆదిత్యుడిని 'తత్'గా పెట్టాం. అప్పుడు 'త్వం' ఏమయ్యావు?
ప్రజ్ఞా స్వరూపుడివి అయ్యావు. కొంతకాలానికి ఈ ప్రజ్ఞా ప్రకాశం,
ఆ ఆదిత్య ప్రకాశం రెండూ ఒకటే అనేటటువంటి స్థితిలోకి దర్శన
ప్రభావంచేత చేరుతావు. చేరగా చేరగా ఏమౌతావు? ఆ ఆదిత్యుడిని
నేనే, 'త్వం' ఆదిత్యుడు అయ్యాడు
ఇప్పుడు.
ఆ 'తత్'
ప్రభావంతో మండల త్రయానికి అవతల ఉన్న బిందు స్థానాన్ని, నాద బిందు కళల యొక్క సంయోజనీయత ఏ స్థానం నుండి ఏర్పడుతుందో, ఆ స్థానాన్ని లక్ష్యిస్తావు. లక్ష్యించేటప్పటికి, నాద బిందు కళాతీతమైనటువంటి నిష్కళను ఆశ్రయించావు. నిష్కళను
ఆశ్రయించినప్పుడు అది 'తత్' పదం
అయిపోయింది. కాబట్టి మహా వాక్య పద్దతిలో అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిలో నడక సాగుతుంది.
అదే వార్తీక పద్ధతిలో అయితే అధిష్ఠాన రహిత
పద్ధతిగా, ఆశ్రయ రహిత పద్ధతిగా సాగుతుంది. అన్నింటికీ
రహితం Add చేసుకోవాలి. ఇక్కడేమో మహా వాక్య నిర్ణయ పద్ధతిగా
విచారణ చేస్తాం. అదే వార్తీక పద్ధతిలో మహవాక్యా నిరసన పద్ధతిగా విచారణ చేస్తాం. ఈ
రకమైనటు వంటి, స్పష్టమైనటువంటి తేడా బ్రహ్మము అనే స్థాయికి,
పరబ్రహ్మము అనే స్థాయికి మధ్య భేదం ఉంటుందన్నమాట. జీవుడికి, ఆత్మకి మధ్యలో ఎలాగైతే జీవ భావమును నిరసన చేస్తేగాని, ఆత్మ స్థితిలో నిలకడ పొందటం లేదో, అలాగే బ్రహ్మ
నిష్ఠ పొందినటువంటి వారు, ఆ బ్రహ్మ నిష్ఠను పొందిన విధాన
క్రమమంతా నిరసించినప్పుడు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతారు.
ఇలా 'తత్',
'త్వం' ను ఆధారం చేసుకుని చెప్పేటటువంటి,
అతి గొప్పదైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఆ
విజ్ఞానం అంతా కూడా తత్వజ్ఞానం. అందుకని దానికి 'తత్వజ్ఞానం'
అని పేరు పెట్టాం. ఈ విజ్ఞానం మొత్తానికి 'తత్'
'త్వం' రెండు శబ్దాలే ఆధారం.
సమస్త సృష్టి, సమస్త విశ్వం, సమస్తమైనటువంటి జీవరాశి,
సమస్త ప్రపంచంలో ఏవైనా ఉండనీయండి. అన్నీ ఆ 'తత్'
'త్వం' అనే శబ్దాలతో విచారింపబడతాయి. దానిలోకి
రానిదటువంటిది ఏమీలేదు. ఎంతవరకు ఈ విచారణ సాగుతుందయ్యా అంటే, నీవు లేకుండా పోయేటంతవరకూ. నేను తత్, నేను తత్, అంటూ నేను త్వం కాదు, నేను త్వం కాదు. 'న ఇతి, న ఇతి',
అనే మహా వాక్యాన్ని స్వీకరించి ఇది కాదు, ఇది
కాదు; అది నేనైతిని, అది నేనైతిని అనే
పద్ధతిగా విచారణ చేస్తూ వెళతాడు. ఈ విచారణనే మహావాక్య విచారణ అంటారు. ఈ రకంగా ఈ
విచారణా జ్ఞానంచేత మాత్రమే భ్రాంతి తొలగుతుంది.
ఉపమానం ఎలా? నాయనా! రోజూ సూర్యోదయం కనబడుతోందా? కనబడట్లేదా?
కనపడుతోంది. సూర్యాస్థమయం కూడ కనబడుతోంది. ఇంకా భ్రాంతిలో ఉన్న
పిల్లలైతే ఏమన్నారు? సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు.
సముద్రం దగ్గరకు తీసుకెళ్తే ఏమయ్యాడు? సముద్రంలో నుండి పైకొచ్చాడు. మళ్ళీ సముద్రంలో మునిగిపోయాడు.
సూర్యుడు ఎక్కడకు పోయాడని అడిగితే సూర్యుడు మునిగిపోయాడని చెప్తారు. కాబట్టి
వాచ్యార్ధంగా చూసినట్లయితే ఇంద్రియార్థంగా చూసినట్లైతే ఏం కనపడింది? సూర్యుడు సముద్రంలో, నీళ్ళలో మునిగిపోయాడు. సముద్రమే
కాకపోవచ్చు. కొండ ప్రక్కన నివసించేవారున్నారు. వాళ్ళకి సూర్యోదయం ఎలా అయింది?
కొండమీద సూర్యోదయం అయింది. కొండలోంచి సూర్యుడు వచ్చి మరలా
కొండక్రిందికి పోయినట్లు కనపడింది.
ఇలా మానవుడు అజ్ఞాన జనితమైనటువంటి
ఇంద్రియార్థములచేత చూపబడుతున్నటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి ఆ పరిమితమైన జ్ఞానాన్ని
సృష్టి విధానానికి apply చేసినప్పుడు
ఏమైంది? ఆ విజ్ఞానానికి సరిపోలేదు. అందుచేత ఈ సృష్టి
విజ్ఞానం పట్ల పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించి నటువంటి వారు ఏం చేశారు? ద్వైత పద్ధతిలో వారి కంటికి కనబడేటటు వంటి దానినే సత్యము అనే నిర్ణయము
స్వీకరించి వ్యాఖ్యానించారు. మొదట్లో అలా వ్యాఖ్యానించేప్పటికి ఏమైంది? భూమి స్థిరంగా ఉంది. సూర్యుడు తిరుగుతున్నాడు. భూమి చుట్టూ అనే నిర్ణయం
చెప్పేటప్పటికి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు? ఓ బుర్ర
తక్కువ వారలారా! ఆకాశంలోకి వెళ్ళి చూస్తే గాని తెలియదు అంటే మనం సూర్యస్థానానికి
భూమి స్థానానికి చంద్ర స్థానానికి అవతలకు వెళ్ళి చూస్తే ఈ పంచభూతాలకు అవతలకు
వెళ్ళి చూసినట్లయితే అధిగమించిన దృష్టితో చూసినట్లయితే కానీ, అవి ఏ స్థానంలో ఉన్నాయి. ఎవరు ఎవరి చుట్టూ తిరుగుతున్నారు అనేది తెలియదు
మనకు. అంతేకదా! తిరిగే దానివెంట పడి నీవు పరుగెడుతూ కళ్ళకు కనబడుతున్నది సత్యమని
కనుక నీవు నిర్ణయం చేసి అందరికీ నీవు పాఠాలు బోధించితే ఏమవుతుంది? గులాబి పువ్వు ఎర్రగా ఉంటుందా? పచ్చగా ఉంటుందా?
ఎర్రగా ఉండదు, పచ్చగా ఉండదు సత్యమేమిటంటే దాని
వర్ణములు సత్యము కావు.
ఎవరు నిరూపించారు? కాంతి విజ్ఞానాన్ని పరిశోధించాం. ఏదైనా కనపడాలంటే ఆధారం
ఏమిటసలు? కాంతి. కాంతి లేపోతే కనపడటం లేదు. కాబట్టి కాంతి
విజ్ఞానాన్ని పరిశోధిస్తే ఏం తెలిసింది? సప్త వర్ణ శోభితంగా
కనపడింది. ఆ సప్త వర్ణాలలో ఎన్ని వర్ణాలైతే శోషించి పోతున్నాయో, అవి కనపడటం లేదు. ఏవైతే శోషించకుండా మిగిలినాయో అవి కనపడుతున్నాయి. So what we visualize, what we see మనం చూసేవి ఏవీ కూడా సత్యం కాదు. It’s an
optic illusion చక్షుగత భ్రాంతి. ఇదే మాట ఉపనిషత్‌లో వస్తుంది.
మానవుడు తన జ్ఞానంలో 50% భాగం
చక్షురింద్రియం మీద ఆధారపడుతున్నాడు. మన జ్ఞానమంతా, చక్షురింద్రియ జ్ఞానంమీద ఆధారపడిన జ్ఞానమే ఎక్కువ పనిచేస్తుంటుంది. మనం
ఏదైనా నిజం నిర్భయంగా చెప్పాలంటే, ఏం చెప్తాం? నేను చూశాను, అది సత్యమే అంటాం.
ఇపుడు ఒకరు తెల్లగా, ఒకరు నల్లగా ఉన్నారు. ఏది సత్యం? తెలుపూ
సత్యం కాదు. నలుపూ సత్యం కాదు. ఎందుకనీ? సప్తవర్ణ శోభితంలో
ఏడు వర్ణాలు శోషించితే నలుపయింది. ఏడు వర్ణాలు కలిస్తే తెలుపయింది.
ఏడు వర్ణాలూ
తెలుపుతో సహా శోషించితే నలుపయింది. అందుకని కృష్ణుడు నల్లగా ఉన్నాడు. 'నల్లనివాడు పద్మ నయనంబుల వాడు' అర్థమైందా!
కృష్ణుడు తెల్లగా ఏమీ ఉండడు. మానవులందరూ తెల్లగా ఉండాలని అనుకుంటూ ఉంటారు .కానీ
దేవతలందరూ నల్లగానే ఉన్నారు. ఎందుకని? ప్రకాశం చేతనే సృష్టి
ప్రారంభమైంది. అదీ ఇక్కడ ఉద్దేశ్యం. సృష్టి ప్రారంభం దేనివలన? ప్రకాశంతోనే. సృష్టికి అవతల ఏముంది? నలుపే వుంది.
Originally sky is
black కానీ మనకెలా కనడడుతోంది? Sky is blue వలన.
Troposphere,
lonosphere, mesosphere
ప్రభావం వలన sky is blue. But you cannot observve
this blueness anywhere in the sky.
అంటే వాస్తవిక జ్ఞానం దృష్ట్యా
చూసినట్లయితే, సత్యత్వ నిర్ధారణ చేసినట్లయితే ఈ
భ్రాంతులు తొలగిపోతాయి.
కాబట్టి సర్వ కాల సర్వావస్థలయందునూ ఎట్టి
మార్పు లేక ఉన్నది ఏదో అదే సత్యము. సత్యము నిర్ధారించాలంటే ఏం ప్రమాణం పెట్టాం? సర్వకాల సర్వావస్థలయందునూ మార్పు లేనిది ఏదైతే ఉన్నదో అదే
సత్యము.
ఇట్టి సత్య నిర్ణయాన్ని శోధన చేయడానికే ఈ
తత్వజ్ఞానం పనికి వస్తుంది. ఈ తత్త్వజ్ఞానం యొక్క ప్రయోజనమేమిటీ అంటే సత్యత్వ
నిర్ధారణ. ఇంకా వేరే ఏం ప్రయోజనం లేదు.
ఎవరికైతే ఈ సత్యత్వ నిర్ధారణ కలిగిందో
వాడికి వస్తు నిశ్చయ జ్ఞానం కలిగింది.
అంటే అర్థం ? ఉప్పు ఉప్పగా ఉంటుందా
ఉండదా? ఉంటుంది. మిగిలిన ఐదు రుచులు లేవా? రుచులెన్ని? ఆరు కానీ ఉప్పులో ఏమైంది? అది ఎక్కడైనా ఉప్పే. మిగిలిన రుచులు లేవు అన్నాం. ఎందుకు? ఉప్పు ఎన్నిసార్లు తిన్నా ఉప్పగానే ఉంటుంది. మిగిలిన ఐదు రుచులు లేవన్నాం
కదా!
వస్తు నిశ్చయ జ్ఞానంగా చెప్పమన్నాం.
అప్పుడు ఉప్పులో ఉప్పదనం అనేది గౌణంగా ఉంది. లెక్కించడానికి అనువుగా ఉంది. మిగిలిన
ఐదు రుచులు అప్రధానంగా ఉన్నాయి. అంటే ఈ సృష్టిలోని ఏ పదార్థమైనా సరే, ఆరు రుచులు కలిగి ఉంటుంది. అంటే వాటిలో ఒకటి ముందుకొచ్చి
ప్రధానంగా ఆక్రమించింది.
చక్కెర ఉంది. తియ్యగా ఉంటుందా? ఉండదా? తియ్యగా ఉంటుందని ఒప్పుకుంటే అది
భ్రాంతి. చక్కెర తియ్యగా ఉండదు, ఉప్పు ఉప్పగా ఉండదు. వాటిలో
మిగిలిన ఐదు రుచులు కూడా ఉన్నాయి.
కానీ చక్కెరలో ఒక్క మధురమైన గుణం దానిలో
గౌణంగా ఉంది. వింతైన విషయం ఏమంటే 84 లక్షల జీవరాసుల సమమే తత్త్వ విజ్ఞానంలో
మానవుడికి ఏ విశిష్టత లేదు. మానవత్వం గౌణంగా ఉంది.
నీకు అమీబాకు ఏం తేడా లేదు, తత్త్వ విజ్ఞాన దృష్ట్యా చూస్తే! ఎందుకని? అమీబా ఎలా పుట్టి పోతుందో, నీవు కూడా అలాగే పుట్టి
పోతున్నావు. కానీ ఏమన్నారు? బుద్ధి ఒక్కటి గౌణంగా ఉందట. ఆ బుద్ధి ఒక్కటీ గౌణంగా
పనిచేసేప్పటికి ఏమైంది? బుద్ధి ప్రధానంగా పని చేసేప్పటికి
మానవ ఉపాధి వచ్చింది. ఎప్పుడైతే బుద్ధి అప్రధానంగా ఉందో అప్పుడేమయ్యావు? మిగిలిన జీవరాసుల్లో కలసిపోయావు.
కాబట్టి మానవ ఉపాధి ఎలా వచ్చింది? ఆ వస్తు నిశ్చయ జ్ఞానంగా చూస్తే గాని తెలియదు. ఈ రకంగా తత్త్వ
విజ్ఞానాన్ని సంపాదించాలి. వస్తు నిశ్చయ జ్ఞానాన్ని సంపాదించాలి.
ఈ రకంగా తత్త్వ విజ్ఞాన దృష్ట్యా
చూసినప్పుడు మాత్రమే ఇది వీలవుతోంది. వస్తు నిశ్చయ జ్ఞాన పద్ధతిగా చూసినప్పుడు
మాత్రమే వీలవుతుంది. భ్రాంతి రహిత పద్ధతిగా చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమౌతుంది.
ఈ మూడు లక్షణాలను చాలా జాగ్రత్తగా
పట్టుకోవాలి. ఈ మూడింటినీ దర్శనాలు అంటారు. ఈ మూడూ కలిస్తేనే తత్త్వ విజ్ఞానం
అవుతుంది.
షడ్దర్శనాలు ఏవైతే ఉన్నాయో, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఇవి
షడ్దర్శనములు. ఇవన్నీ కూడ తత్త్వ విజ్ఞానాన్ని అందించగలిగే సమర్ధతను తయారుచేశాయి.
షడ్దర్శన గ్రంథాలన్నీ తత్త్వ విజ్ఞానాన్ని అందిస్తాయి. మహావాక్య విచారణ, వార్తీక విచారణ చేయడానికి కావలసిన అధికారిత్వాన్ని అందిస్తాయి.
అందువలన మన సాధనలన్నీ షడ్దర్శనాలలో
ఉంటాయి. సాంఖ్యం అంతా విచారణా జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. యోగం అంతా శరీర ప్రాణ
మనోబుద్ధులను స్వాధీనపరచుకునే ఇంద్రియ సంయమనం మీద ఆధారపడి ఉంటుంది. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనేవేమో సృష్టి విజ్ఞానాన్ని అందించే విచారణా
క్రమంలో అందించబడిన దర్శనాలు.
న్యాయ, వైశేషిక
దర్శనాలు ధార్మికమైనటువంటి, మోక్ష మార్గగామి అయిన జీవనాన్ని
ఎలా జీవించాలో చెప్పేవి. ఈ రకంగా షడ్దర్శనాలు నీకు అధికారిత్వాన్ని ఇస్తున్నాయి.
దేనికి? మహావాక్య విచారణకి, వార్తీక
విచారణకి. కాబట్టి ఈ షడ్దర్శన గ్రంథాలను కొన్నిటినైనా అందులో ఒకటి రెండయినా ప్రతి
ఒక్కరూ తప్పనిసరిగా అధికారిత్వం కోసం స్వీకరించాలి.
విజ్ఞానం కొఱకు ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస శాస్త్రాలను, దర్శనాలను
పరిశీలించాలి. ఈ విధమైన విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇది పూర్వం
ఋషులు అభ్యసించినటువంటి విధానం. ఈ రకమైన అభ్యాసం ద్వారా ఇంద్రియ నిగ్రహము, సాంఖ్యం ద్వారా స్వాత్మ దర్శనము, నిన్ను నీవు
తెలుసుకోవడం అనే ప్రక్రియ సాంఖ్య విచారణలో, సాంఖ్య దర్శనంలో
ఉంటుంది. ఈ రెండింటికీ కలిసి శిరోభాగంలో నీకు సృష్టి యొక్క విజ్ఞానాన్ని విడగొట్టి
చెప్పేటటువంటి పదార్థ విజ్ఞానం దృష్ట్యా చెప్పేటటువంటి పూర్వ మీమాంస, ప్రజ్ఞా స్థితిలో స్థిరత్వాన్ని కలిగించేటటువంటి ఉత్తర మీమాంస, అంటే బ్రహ్మమే సత్యం అని నిరూపించేదేమో ఉత్తర మీమాంస. ఉత్తర అనే శబ్దంలోనే
ఉంది. తరించుట, ఉత్కృష్టమైన తరణము. మనకి కూడ ఉత్తరం వైపు
ఏముంటుంది? భారత దేశానికి ఉత్తరాన ఏముంది? కైలాసం. హిమాలయాలు కాదు ఉత్తరాన కైలాసం ఉంది. ఈశ్వర దర్శనమే ఉత్తర
మార్గంలో ప్రయాణం చేయడమంటే అర్థం.
అయ్యా! జీవిత చరమాంకంలో ఉత్తర దిశగా
ప్రయాణం చేయాలి అన్నాం. అలాగే ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది. అది కూడా ఈశ్వర
స్థానమే. ఈ రకంగా మానవులు ఏం చేశారు? ఉత్తర
అనే శబ్దంలో (అది సంస్కృత శబ్దం) ఉత్తమమైన తరణము చేయాలి అంటే ఉత్తర దిశగా
వెళ్తారు. మహాభారతంలో, శాంతి పర్వంలో పాండవులు ఉత్తరానికి
ప్రయాణం చేశారు. నేను ఉత్తరానికి వెళ్తున్నాను అని చెప్తే, మోక్షగామి
అయ్యాను అని చెప్పడం.
ఈ రకంగా మొట్టమొదట మనం తత్త్వ
విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం సాధించాలి. అందుకే మానవులు నిరంతరాయంగా ఈ విధంగా
అధ్యయన శీలురై ఉండాలి అని చెప్తున్నారు.
ఈ షడ్ దర్శనాలలో సాంఖ్య, యోగ, పూర్వ ఉత్తర మీమాంసా శాస్త్రాలు
బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ దర్శన గ్రంథాలను బాగా విచారణ చేస్తే నీవు మోక్షగామివి
అవుతావు. ఇందులో పూర్వ మీమాంస దర్శనానికే 'చార్వాకదర్శనం'
అని పేరు.
చార్వాక దర్శనం అంటే ఏమిటి? పదార్థమే సత్యము అనే ఈ దృష్టి కోణంలో సాగుతుందన్నమాట. అంటే ఈ
ఆశ్రయం అనే దానిని తీసుకువచ్చి కళ్ళెదురుగా కనబడుతున్న సృష్టి దగ్గర
పెట్టామన్నమాట.
ప్రత్యక్షంగా కనబడతున్న ప్రకృతే ఆధారం.
ప్రకృతే భగవంతుడు. ప్రకృతే ఆశ్రయము. ప్రకృతే సర్వాధిష్ఠానము అనేటటువంటి పద్ధతిగా
చూపెట్టే దర్శనం పూర్వమీమాంసా దర్శనం.
ఉత్తర మీమాంసా దర్శనం ఏం చెప్పింది? బ్రహ్మమే అధిష్ఠానము, బ్రహ్మమే ఆధారము,
బ్రహ్మమే ఆశ్రయము. ఈ ఆధార ఆధేయ విమర్శ తుదకు నశిస్తుంది ఈ
దర్శనాలలో.
ఈ ఆధార, ఆధేయ విమర్శ పద్దతిగా సాగేటటువంటి అధికారిత్వం చేత నీకు నాలుగు మహా వాక్య
దర్పణం - మహావాక్య దర్పణం అంటాం అందుకే
దానిని. నాలుగు మహావాక్య దర్పణాలలో ఆ మహా వాక్య దృష్ట్యా సృష్టిని ప్రతిబింబ
సమానంగా చూడగలిగే సమర్ధత వస్తుంది.
మహావాక్య దర్పణం అని ఎందుకన్నారు? ఆ నాలుగు మహావాక్యాలు సృష్టిని దర్పణంగా చూసే సమర్ధత
నిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే దక్షిణామూర్తి స్తోత్రం వార్తీక పద్ధతిగా
చెప్పబడింది. ఇది మహావాక్య పద్ధతిగా చెప్పబడలేదు.
ఇది వార్తీక పద్ధతిగా చెప్పబడింది. అంటే
మహవాక్యాలకంటే అవతల వార్తీక వాక్యాలున్నాయి. ఆ వార్తీక పద్ధతిగా, అవాంతర పద్ధతిగా చెప్పబడింది.
ఇక్కడ మహావాక్య పద్ధతిగా
నిర్ణయించబడినటువంటి, బ్రహ్మమనే ఆశ్రయానికి
ఆధారమైనటువంటి అవతల అతీతమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిగా చెప్పబడింది.
పునాది లేకుండా విచారణ కూడదు కాబట్టి ఇంత
ఉపోద్ఘాతం అవసరమైంది. దక్ష్షిణామూర్తి స్తోత్రం అవగాహన కావాలీ అంటే నీవు ఇంత
పరిశ్రమ చేయాలన్నమాట.
ఈ క్రమంలో అధ్యయనం చేస్తూ రావాలి.
స్వాధ్యాయన శీలివై ఉండాలి. తత్త్వ దర్శన సమర్ధుడవై ఉండాలి. ఈ 'త్వం' పదము 'తత్'
పదము రెండూ తెలిసి 'త్వం' పద స్థితినుండి 'తత్' పద
స్థితికి ఆరూఢత చెందాలి. ఇట్టి ఆరూఢమైనట్టి జ్ఞానం కలిగినవాడు 'తత్' రహిత పద్ధతికి, భ్రాంతి
రహిత పద్ధతికి స్థిరమౌతాడు.
కాబట్టి ఆరూఢ జ్ఞానం లేకుండా నీవు 'తద్రహిత' పద్ధతికి, భ్రాంతి రహిత పద్ధతికి చేరుకోలేవు. అక్కడ అధికారిత్వం ఇదేనన్నమాట. బ్రహ్మ
నిష్ఠే అధికారిత్వం అవుతుంది. ఈ రకంగా ఈ విజ్ఞానాన్ని మనం అందుకోవాల్సిన అవసరం
ఉంది. అందించగలవారిని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది.
ఇదంతా అపరోక్ష పద్ధతి. ఇక్కడ ప్రత్యక్ష పద్ధతిగా ఏమీ సాగదు.
6వ శ్లోకం
రాహుగ్రస్థ దివాకరేందు సదృశః
మాయా సమాచ్ఛాదనాత్,
సన్మాత్రః కరణోపసంహరణతః
యోభూత్సుషుప్తః పుమాన్!
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః
ప్రత్యభిజ్ఞాయతే,
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
శ్రీదక్షిణామూర్తయే!!
ఇక్కడ చెప్తున్నారు వింతైన విషయం ఏమంటే? రెండు ఉపమానాలు ఒకేసారి చెప్తున్నారు. భూమిమీద ఉన్నావు,
చంద్రుడిని చూస్తున్నావు. 'రాహుగ్రస్థ
దివాకరేందు సదృశః' ఒక సమయంలో చంద్ర గ్రహణం వచ్చింది.
చంద్రగ్రహణం వచ్చేసరికి చంద్రుడు కనిపించకుండా పోయాడు.
భూమిమీదనుండి చూసినవాడు 'చంద్రుడిని ఎవడో మింగేశాడు' అన్నాడు.
ఎవరు మింగేశారు? రాహువు మింగేశాడు అన్నారు.
అక్కడ అర్థం ఏమిటసలు? అలాంటివి జరుగుతాయా? కాని
జరుగుతున్నట్లు అనుభూతం అవుతోందా? లేదా ? అవుతోంది. ఎందుకని? భూమిమీదనుండి చూస్తున్నావు
కాబట్టి. నువ్వు ఎక్కడున్నావు? 'త్వం' పదం ఎక్కడుందిప్పుడు? భూమిమీద. తత్ పదాన్ని చంద్రుడిని లక్ష్యంగా పెట్టావు.
'తత్'
పదం నుండి చూడవయ్యా అంటే 'త్వం' పదం నుండి చూస్తున్నావు. అలాగే సూర్యుడు కూడా గ్రహణానికి గురయ్యాడు.
అవుతున్నాడా లేదా? అయినప్పుడు ఏమైంది ఇంతకీ?. భూమండలంమీద ఉన్న వాళ్ళందరికీ కనపడకుండా పోయాడా? పోలేదు.
ఏదో ఒక ప్రాంతంలో ఒకచోట ఉన్నవారికి
మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం, సంపూర్ణ
చంద్రగ్రహణం.
అంటే అర్థం ఏమిటటా? నీ కళ్ళకి చేయి అడ్డుపెట్టుకున్నావు. అడ్డుపెట్టుకుని
సూర్యుడు లేడు అంటున్నావు. నీ కళ్ళకి చేయి అడ్డు పెట్టుకుని చీకటిగా ఉంది, చీకటివల్ల సూర్యుడు లేడు అని. ఓకే! కళ్ళమీద చేయి తీస్తే సూర్యుడు
కనబడతాడు అన్నారు. తీస్తే చీకటిలేదు అప్పుడు.
అలాగే రాహువు, కేతువు సూర్యుడిని, చంద్రుడిని గ్రసించటం ద్వారా సూర్యచంద్రులు లేకుండా పోతున్నారని చెప్పడం భ్రాంతిగతం. మనం చెప్పేటటువంటి గ్రహణ పద్ధతి ఇది. కానీ దీని తరువాత కాలంలో వక్రీకరించబడింది. వక్రీకరించబడి 'రాహు కేతువుల వల్ల సూర్యచంద్రులు గ్రస్థమయ్యారు' అని మీరు చెప్పారు. కానీ అలా గ్రస్థం కాలేదు. రాహువు, కేతువు అడ్డం రారు. సూర్యుడికీ, చంద్రుడికీ మధ్యలో ఎవరూ లేరు.
సూర్యచంద్రులు, భూమి ఒకే లైన్‌లోకి వచ్చినప్పుడు, ఒకరికొకరు
అడ్డు రావడం వలన ఆ కాసేపు కనపడకుండా పోతున్నారే తప్ప, ఇంతకు
మించి ఇందులో ఏమీలేదు అని ఈ విషయాన్ని వారు కనుగొన్నట్లుగా విజ్ఞాన శాస్త్రవేత్తలు
చెప్తున్నారు.
అదే విషయం ఇక్కడ ఏమి చెప్పారు? 'రాహుగ్రస్థ దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్' వాస్తవవేమిటి? లేని మాయ నిన్ను ఆచ్ఛాదించింది. 'సమాచ్ఛాదనాత్'
ఎంతగా ఆచ్ఛాదించిందయ్యా? నీ వాస్తవిక స్థితి
నీకే గుర్తు రాలేనంతగా ఆచ్ఛాదించింది. నిన్ను నీవు ఎవరో తెలుసు కోవడానికి
వీలులేనంతగా ఆచ్ఛాదించింది, ఆవరించింది.
ఇదీ సమాచ్ఛాదనాత్. ఎవరిచేత? మాయచేత. దాని అవతల సూర్యుడు ఉన్నాడు అంటే తెలుసుకోవడానికి
అవకాశం లేకుండా ఉంది. దాని అవతల చంద్రుడు ఉన్నాడు అంటే తెలుసుకోవడానికి వీలులేకుండా
ఉంది.
అంతగా నీ స్వరూప జ్ఞానం మాయచేత
ఆచ్ఛాదించబడింది. నీ ఆత్మ స్వరూపం ఆచ్ఛాదితమైంది. నీ నిజ స్వరూప జ్ఞానం నీకు మరుపు
కొచ్చింది. ఎంతగా మరుపుకొచ్చింది? 'సన్మాత్రః కరణోప
సంహరణతో యోభూత్ సుషుప్తః పుమాన్' అన్నాడు.
నీ సుషుప్తిలో ఏం జరుగుతోందట? నీ ఇంద్రియాలన్నీ ఉండికూడ లేనివవుతున్నాయి. నీ మెలకువలో
ఏమౌతోందతటా? నీ ఇంద్రియాలు మేల్కొని వ్యవహరిస్తున్నట్లు
కనబడుతున్నది గాని నీ ప్రజ్ఞ నీకు కనబడటం లేదు.
మెలకువలో ఇంద్రియాలు, విషయాలు, వ్యవహారం మాత్రమే
కనబడుతున్నాయి గాని ప్రజ్ఞాస్థితి కనపడటం లేదు. అదే సుషుప్తి స్థితిలో చూశావు,
అప్పుడేమైంది? ఇంద్రియాలు, విషయాలు, వ్యవహారం కనబడకుండా పోయాయి. నిన్ను నీవు
కూడ తెలుసుకోలేకుండా పోయావు. రెండూ లేకుండా పోయాయి. అక్కడ ఎలా జరుగుతుందో, ఇక్కడ అలాగే జరుగుతోంది. నీవు వాస్తవంగా లేకుండా పోయే అవకాశం
మెలకువలోనూ లేదు, సుషుప్తిలోనూ లేదు.
నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. ఎల్లప్పుడూ
సూర్యచంద్రులు ఎలా అయితే ఉన్నారో ఎల్లకాలం ఉన్నారా? పంచభూతాత్మకమైన సృష్టి ఉన్నంతకాలమూ సూర్య చంద్ర అగ్ని మండలాలు అనే మండల
త్రయము సృష్టి ఉన్నంతకాలము ఉంటాయి. వాళ్ళే సృష్టికి సాక్షీ స్వరూపాలు.
అందుకని ప్రతిజ్ఞలు ఎలా చేసేవారు? సూర్యచంద్రులు ఉన్నంతకాలం అని ప్రతిజ్ఞ చేసేవారు. అంటే సృష్టి
లయం అయిపోయే వరకూ కూడ ఆ ప్రతిజ్ఞకు భంగం ఏర్పడదన్నమాట.
ఆజన్మాంతమైనటువంటి కీర్తి, ఆచంద్ర తారార్క కీర్తి అనేవారు. కీర్తి ఎంతవరకూ సంపాదించాలట.
సూర్యచంద్రులున్నంతకాలం ఆయన యశస్సుకి భంగం వాటిల్లదు. ఎందుకని? ఆయన ఆ స్థాయిలో ఉద్ధరించాడు కాబట్టి ఉత్తరణము.
కాబట్టి ఆ రకంగా సూర్యచంద్రులు ఎంతకాలమైతే
ఉంటారో, పంచభూతాత్మక సృష్టి లయం అయిపోయే వరకు కూడ
మారనిది సత్యము. నీవుకూడ ఆత్మ స్వరూపంగా, ప్రజ్ఞా స్వరూపంగా,
సాక్షీ స్వరూపంగా ఉన్నావనేది కూడ అంతే సత్యము.
ఇంకో మెట్టుపైకి వెళ్తే అనంత విశ్వంలో
పరశివ స్వరూపం అలా ఉంది. అనంత విశ్వంలో, ఈ
సూర్యచంద్రులు ఎలాగైతే పంచభూతాత్మక సృష్టిలో కదలక శాశ్వతంగా ఉన్నారో, శాశ్వత ప్రకాశాన్ని ఇస్తున్నారో, సూర్యుడు ఎలా అయితే
ఇస్తున్నాడో, అనంత విశ్వానికి ఆ పరశివ ప్రకాశం అలా ఉంది అది
శాశ్వతం. అట్టి పరశివ స్థితిని సాధించడమే జన్మ రాహిత్యం. ఆ స్థితిలో నిలిచి
ఉండాలి. కాబట్టి రెండు ఉపమానాలని ఒకేసారి చెప్తున్నారు.
ఒక ఉపమానం: 'రాహుగ్రస్థ దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్'
రెండో ఉపమానం
: 'సన్మాత్రః
కరణోప సంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్'
చూడండి! ఉపసంహరించబడుతోందట. నువ్వే వాటిని
వ్యక్తం చేస్తున్నావు. నీ లోపలికే వాటిని ఉపసంహరిస్తున్నావు. సూర్యచంద్ర అగ్ని
మండలముల ద్వారా పంచభూతాత్మక సృష్టి వ్యక్తమైంది. మరల ఉపసంహరించబడుతున్నది.
నాద బిందు కళల ద్వారా సృష్టి వ్యక్తమైనది.
మరల ఉపసంహరించ బడుతోంది. దేశ కాల కలనల ద్వారా అనంత విశ్వం వ్యక్తమైంది. మరల
ఉపసంహరించబడుతోంది. జాగ్రద్ స్వప్న సుషుప్తులలో జీవుడు వ్యక్త మౌతున్నాడు. మరల
ఉపసంహరించబడుతున్నాడు.
కాబట్టి జీవభావం అంటే ఏమిటి? ఎవరైతే జాగ్రత్ స్వప్న సుషుప్తువులు అనుభవిస్తున్నాడో అతడే
జీవుడు. ఎప్పుడు ఆత్మ స్వరూపుడు అయ్యాడు.
ఎప్పుడైతే బ్రహ్మీభూత స్థితినుంచి, బ్రహ్మ నిష్ఠనుంచి సృష్టిస్థితి లయలు వ్యక్తీకరించబడి,
మరల ఉసంహరించబడుతున్నాయో వాటికి అతీతమైనప్పుడు బ్రహ్మము అయ్యాడు.
అవస్థాత్రయానికి అతీతుడైతే ఆత్మ
స్వరూపుడయ్యాడు. సృష్టి స్థితి లయలకు అతీతమైనప్పుడు బ్రహ్మమయ్యాడు. నాద బిందు
కళలకు అతీతమైనప్పుడు నిర్గుణ బ్రహ్మమయ్యాడు. దేశకాల కలనలకు అతీతమైనప్పుడు
పరబ్రహ్మం అయ్యాడు.
కాబట్టి ఇంత స్పష్టంగా తత్త్వ విజ్ఞానం
తెలియచేస్తుంది. సత్యత్వంలో నుండి మొదట అవ్యక్తము, అవ్యక్తము నుండి వ్యక్తము ఈ రకంగా ఏర్పడుతోంది అని సృష్టి స్థితి లయలు
మూడూ కూడ ఒకే ఉపమానంలో బోధించబడ్డాయి. కాసేపు లేనట్లుగా కనపడినంత మాత్రాన అవి
వాస్తవంగా లేకుండా పోలేదు.
కాబట్టి 'రాహుగ్రస్థ దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్' మాయ యన్నా, ఛాయ అన్నా రెండూ ఒకటే. Umbra, Penumbra ఆ ఛాయ వచ్చి
దీనిమీద పడిందట. పడగానే వీడు కనిపించకుండా పోయాడు. అంతకు మించి వేరే ఏమీలేదు. అలా
ఎప్పుడెప్పుడైతే ఇంద్రియాలు, విషయాలు, ప్రపంచం
యొక్క ఛాయ నీమీద పడిందో, అప్పుడు నీ వాస్తవిక స్వరూపం
మరుపుకు వచ్చింది.
మరల యధార్థ ప్రకాశం కాసేపటిలో నీకు
తోచింది. నీ స్వరూప జ్ఞానం నీకు తోచింది. కాబట్టి ప్రపంచం విలువైనదైనప్పటికీ
ప్రపంచం నీవు అవుతావా? కావు. కానీ మానవులు
ఎలా అనుకుంటారు?
''స్త్రీ
బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః... మహావ్యామోహ సంహారిణే''
శరీరమే ఇల్లుగా జీవించమంటుంటే మనం
అంతస్తులు చూస్తున్నాం. ఈ రకంగా అంగబలాన్ని, అర్థబలాన్ని,
ప్రాపంచికమైన లక్షణాలను పట్టుకుని అది 'నేనైతిని'
అనుకోవడం భ్రాంతి కదా!
కాబట్టి తత్ పద దర్శనాన్ని అధోముఖ తరణం
చేయకు. ఉత్తమమైనటువంటి తరణం, ఉత్కృష్టమైనటువంటి
తరణం చేయి. కాబట్టి 'తత్'కి పరబ్రహ్మం లక్ష్యంగా అర్థం చెప్పాలే కాని
ప్రపంచం లక్ష్యంగా అర్థం చెప్పకూడదు.
'ప్రాగస్వాప్సమితి
ప్రబోధసమయే యఃప్రత్యభిజ్ఞాయతే'
ప్రబోధ సమయే అంటే ఈ రకమైనటువంటి విజ్ఞానం
యొక్క ప్రబోధ. దీన్ని ప్రబోధ అన్నారు. బోధ కాదిది ప్రబోధ. ప్రకృష్టమైన బోధ.
బోధ రెండు రకాలు : బోధ, ఉద్బోధ.
తెలియనిది
తెలియజెప్పుట బోధ.
ఉత్తమమైనదానిని
ఉత్కృష్టమైన దానిని బోధించుట ఉద్బోధ.
అంటే దిగువున ఉన్న స్థితినుండి లక్ష్య
స్థితిలోనికి మేల్కొల్పడాన్ని ఉద్భోధ అంటారు. ఆ మేల్కొలుపు అందుకున్నటువంటి వాడికి
దానికి అతీతమైన దానిని తెలియచెప్పడం, తరువాత
దర్శింపజేయడం.
'జ్ఞాతుం
ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి'
అని ప్రభోదలో నాలుగుంటా యన్నమాట. ఈ నాల్గింటినీ కలిపి ప్రబోధ
అంటారు. మామూలుగా తెలియనిది తెలియజెప్పడం బోధ అయినప్పటికి కూడ ఆ బోధా స్థితిని
నీవు అందుకోవడం చాలా ముఖ్యం. అందుకునేటప్పుడు, తెలియనిది
తెలుసుకోవడం జ్ఞాతుం. ఆ జ్ఞాతుం ద్వారా నీ లోపల గురువు స్థిరపడతాడు. ఈ
స్థిరపడినవాడు ద్రష్టుం. ఇక్కడ దర్శింపచేసే స్థితికి నిన్ను లేవనెత్తుతాడు.
గురువు నీయందు ప్రవేశించి, నిన్ను తన స్థితికి లేవనెత్తుతాడు. లేవనెత్తడం ద్వారా
దర్శింపచేస్తాడు. ఇది ద్రష్టుం. దర్శింపచేసిన తరువాత ప్రవేష్టుం. ఈశ్వరానుగ్రహం
చేత, సద్గురు కృపచేత నీవా స్థితిలోకి చేరుతావు.
ప్రవేశించి, ఆ స్థితిని అనుభవించి, స్థిరంగా ఉంటావు. ఈ స్థిరంగా
ఉన్న స్థితినుండి దానిని అధిగమించి, అతీతమైన స్థితిలోనికి
చేరడం, అధిగచ్ఛతి.
అక్కడ నీవే లేనటువంటి తత్ రహిత పద్ధతిగా అవుతావు. అయ్యుండుటయే. ఇక్కడ చేయడం
ఉండదు. అధిగచ్ఛతిలో గురుశిష్యులు లేరు. అక్కడ ఇద్దరుండరు. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం వరకూ సద్గురువు, సచ్చిశిష్యుడు ఉంటారు. ఆ తరువాత అధిగచ్ఛతి.
గురు శిష్యులు ఇరువురూ లేరక్కడ. ఒకరుండి, ఒకరు లేకుండా ఉండే పద్ధతి కాదు. ఒకటి కూడా లేదు. ఎప్పుడూ
ఆత్మే ఉంది, ఎప్పుడూ ఈశ్వరుడే ఉన్నాడు, ఎప్పుడూ బ్రహ్మమే ఉంది, అని ఒకటి ఉండే పద్దతిగా
చెప్తే అది ప్రబోధ అవదు.
ఏ ఒకటి తరువాత సున్నాలు పెడితే సృష్టి
పెరుగుతూ పోయిందో, ఆ ఒకటికి వెనుక సున్నా
పెట్టినట్లయితే పరిపూర్ణం. ఒకటికి కుడి ప్రక్కన సున్నాలు పెడుతూ పోతే పూర్ణం.
ఓంకారమునకు 'ఓ' ప్రక్కన సున్నా పెట్టడం
వలన ప్రణవమేర్పడింది. అదే ఓంకారమునకు బిందు సంయుక్తం. ఒక బిందువును చేర్చి కనుక,
ధ్యానించినట్లయితే, ఆ ప్రణవమునకు అతీతమైన
స్థితి బోధపడింది. కాబట్టి ప్రణవాక్షరము, ఏకాక్షరము బ్రహ్మ
స్వరూపము. దానికి అతీతమైన పరబ్రహ్మమును ఎరుగవలెనంటే దానికి వెనుక సున్నా ఉండాలి.
'ఓంకారం
బిందు సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగినః’
ఆ పద్ధతిగా చెప్పేటటువంటిది ప్రబోధ. ఈ
రకంగా అధిగచ్చతి అన్న స్థితిలో, ప్రబోధ స్థితిలో
నిన్ను స్థిరం చేసేటటువంటి మార్గం. 'ప్రత్యభిజ్ఞ' ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. అంటే నీవద్ద ప్రత్యభిజ్ఞ ఉండాలి. ఈ
ప్రత్యభిజ్ఞను ఆశ్రయించక పోయినట్లయితే ఈ తత్ రహిత పద్ధతిని నీవు పొందలేవు.
కాబట్టి ఏం చెప్తున్నారు? 'ప్రాగస్వాప్స' అంటే ప్రాక్ అంటే
పూర్వము. ప్రతిదానికి పూర్వస్థితి ఒకటుంటుంది.
పూర్వం అంటే దానికి ముందు, అతీతం. 'ప్రాగస్వాప్సమితి'. 'ఇతి' అంటే ఆ అతీత స్థితిని, ఆ
పూర్వ స్థితిని, అధిగచ్ఛతి అన్న స్థితిని, తత్ రహిత స్థితిని, ఎప్పుడు పొందాలి? ప్రబోధ సమయే ప్రబోధ కాలంలోనే పొందాలి. ఆ బోధాకాలంలోనే పొందగలిగే స్థితిని
నీవు సాధించాలి. అట్లా సాధించిన వాడు మాత్రమే ప్రబోధకు అర్హుడౌతాడు.
ఎందుకని అంటే వాడిలో ప్రజ్ఞాస్థితి
మేలుకొంది. ఆ మేలుకున్న ప్రజ్ఞతో జ్ఞాతుం, ద్రష్టుం,
ప్రవేష్టుం, అధిగచ్ఛతి అన్నీ చకచకా
దాటిపోతాడు. అధిగచ్ఛతే అతడి లక్ష్యం. ఆ రకంగా ప్రయాణం
చేసేవారు ఎవడైతే ఉన్నాడో, వాడిలో ఇపుడు
ప్రత్యభిజ్ఞ మేల్కొన్నది.
ప్రత్యభిజ్ఞ అంటే, 'జ్ఞ' అంటే జ్ఞానము. అభిజ్ఞ అంటే గుర్తు
ఏ గుర్తు చూపెడితే నీకు నీ స్వస్వరూప జ్ఞానం కలుగుతుందో, ఈ
అభిజ్ఞానం పేరుమీద ఉన్న గ్రంథం ఏమిటి? అభిజ్ఞాన శాకుంతలము.
ఉంగరం చూడగానే ఆయనకు గుర్తు వచ్చింది.
ఇలాంటి పని రామాయణంలో కూడ జరిగింది.
చూడామణి, అంగుళీయకము. రాములవారు ఏంచేశారు? ప్రత్యభిజ్ఞ, అభిజ్ఞ, అంగుళీయకం
ఇచ్చారు. సీతమ్మకు ఇవ్వమన్నారు. ఆమెకూడ ఒక అభిజ్ఞ ఇచ్చింది. చూడామణి ఇచ్చింది.
అంటే ఆ జ్ఞానం కలిగేటట్లు చేసే గుర్తు అన్నమాట. అది అభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ.
అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే కాదు.
జ్ఞానానికి అతీతం అవ్వాలి. బ్రహ్మమనే జ్ఞానం ఒకటుంది. ఒక గుర్తును చూపెడితే, నీవు బ్రహ్మ నిష్ఠుడివి అయ్యావు. ఆ బ్రహ్మ నిష్ఠకి
పరమైనటువంటి స్థితి, పూర్వము అంటే. 'ప్రాగస్వా..
ప్రత్యభిజ్ఞాయతే'
ఏ గుర్తు చూపెడితే నీకు బ్రహ్మ నిష్ఠ
కలిగిందో దానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని నీవు పొంది తెలుసుకొనుట, ఉండుట, అయ్యుండుట జరిగిపోయింది. అంటే పరబ్రహ్మమయ్యావు.
ప్రత్యభిజ్ఞ
వలన ఏమయ్యావు? పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందావు.
పొందితే?
'తస్మై
శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'