8

8వ శ్లోకం


        విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః
      శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః |
      స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషః మాయా పరిభ్రామితః
      తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

        ఇవి స్తోత్రాలు కదా. స్తోత్రం అంటే గానం చేయాలి. ఆనందంతో పొంగినప్పుడు నీ లోపల ఆ పొంగు వచ్చినప్పుడు ఆ తాదాత్మ్యతా స్థితి ఏర్పడినప్పుడు, ఆ స్థితిలో వున్నటువంటి లక్షణాలతో నువ్వు కీర్తిస్తున్నావన్న మాట. కీర్తన పాడాలన్నమాట.

        ఆ రకమైనటువంటి ఆనందానుభూతి నీకు కలిగినప్పుడు మాత్రమే నువ్వు గానం చెయ్యగలుగుతావు. ఎప్పుడు పడితే అప్పుడు గానం చెయ్యగలుగుతావా? బాగా దుఃఖపడేవాడి దగ్గరకు వెళ్ళి ఏదైనా పాట పాడమంటే ఏం చెప్తాడు? నేను పాడలేను అంటాడు. ఎందుకని? గొంతు పట్టేస్తుందన్నమాట. దుఃఖం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఉదాన వాయువు యొక్క సహకారం ఉండదన్నమాట.

        తద్వారా స్వరపేటిక మూసుకుపోతుంది. మూసుకుపోయి ఆ ఆనందం కాస్తా కుంగిపోతుంది. కాబట్టి అటువంటి కుంగుబాటుకు లోనైనవాడు ఏం పాడతాడు? కాబట్టి నాదానుసంధానం చేయాలి.

        అంటే నిరంతర ఆనంద స్రవంతిలో మునిగి తేలేవాడే ఆ నాదానుసంధానం చేయగలుగుతాడు. ఇతః పూర్వ శ్లోకంలో యో ముద్రయా భద్రయా అని చెప్పారు. ఆయా ముద్రలలో చేసేది అంతా కూడా నాదానుసంధానమే.

        నిరంతరాయంగా నాదానుసంధానం చేయడానికి అనుకూలించే వాటిని ముద్రలు అన్నారు. ఆ ప్రణవానుసంధానం నిరంతరాయంగా చేయడానికి కావాల్సిన వాటిని ముద్రలు అన్నారు.

        అందుకే దానిని ముద్రయా భద్రయా అని కూడా అన్నారు. 'ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ'. ఆ బ్రహ్మాను సంధానం, ప్రణవాక్షర సంధానం చేయడానికి కావాల్సిన స్థితి పేరు ముద్ర అని అర్థం.

        భౌతికమైన, బాహ్యమైనటువంటి కళ్ళు తెరిచావా, కళ్ళు మూశావా, కళ్ళు సగం మూశావా, అన్నదానికి పెద్దగా ప్రాధాన్యత లేదు అక్కడ. ఎందుకంటే మానవుడికి ప్రజ్ఞాపాటవాలు విశేషంగా వుంటాయి. మానవ ఉపాధిలో ఉన్న విశేషం అదే. ప్రజ్ఞ అంటే అర్థం ఏమిటంటే త్రిపుటిని గుర్తించగలిగేది ఏదో అదే ప్రజ్ఞ.

        త్రిపుటి అంటే ఏమిటి? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. ఇదొక త్రిపుటి. మొదటి త్రిపుటి ఇదే. జ్ఞాత జ్ఞానము, జ్ఞేయము
అనగా తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకొనుట, అనేది త్రిపుటి.

        ఈ త్రిపుటి ద్వారా ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది. ప్రజ్ఞ ఈ త్రిపుటికి సాక్షి. అర్థమైందా అండి? దీనికి అవతల అంతా నిర్గుణం, నిరాకారం, నిరవయం, నిరంజనం, అప్రమేయం, అనంతం.

        కాబట్టి అట్టి అనంత స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 'విశ్వం పశ్యతి'. నేనెవరిని? అనంత విశ్వము లేదని తెలుసుకున్న వాడిని. నేనెవరిని?

        ఈ అనంత విశ్వము ఎరుక సమానమైనది. అఖండ ఎరుకతో కూడుకుని ఉన్నది. అట్టి ఎరుక మూలం లేనిది. మూలమే లేనటువంటి  ఈ ఎరుక నేనెలా అవుతాను?

        నేను శాశ్వతుడను, నేను గంభీరుడను, నేను మార్పులేనివాడను. నేను అవ్యయుడను, అప్రమేయుడను, అనేటటువంటి లక్షణంతో గుర్తించబడిన పరశివ తత్త్వాన్ని నేను.

        ఈ పరశివ తత్వం నుంచి స్థిరీకరణం చేసి ఈ శ్లోకంలో నిర్ణయంగా చెప్తున్నారు. 'విశ్వం పశ్యతి' నీవు అనంతం అంటున్న ఆ విశ్వం అంతా కూడా అంతరిక్షంలో ఎంత ? అణుమాత్రం. అంతరిక్షంలో అనంతంగా తోస్తున్న ఆ విశ్వమంతా అణుమాత్రమై యున్నది.

        అణుమాత్రమైన విశ్వాన్ని చూస్తున్న నేను బిందువుగా చూస్తున్నాను. ఏ స్థితి నుంచి చూస్తున్నాను? పరశివతత్త్వం నుంచి చూస్తున్నాను. బయలు అన్న స్థితిలో నుండి చూస్తున్నాను. చూస్తే ఏమైందట? లేనిదిగా తోచింది. అదే ఆ అణువు లోపలికి ప్రవేశించాడు. ఆ అణువునందు ప్రవేశించేటప్పటికి, సర్వత్రా వ్యాపకమై ఉన్నది ఆ అణువునందు లేదా? అంతటా వున్న ఆకాశం అన్నింటా ఉన్నదా  లేదా? ఉన్నది కదా!

        అదేకదా 'ఘట కుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవచ తద్వద్‌ బ్రహ్మమితి సర్వం ఇతి వేదాంత డిండిమః' ఘటముగా కనబడినప్పటికీ గోడగా కనబడినప్పటికీ మృత్తిక తయారైన దానిచేత అందంతటా మృత్తికయే ఉన్నట్లు ఎలా తోచుచున్నదో అదే ఉపమానం.

        అలా అనంత విశ్వం అంతటా కూడా వ్యాప్తమైయున్నటువంటి ఎరుక బయలునందు అణుమాత్రమై యున్నది. వాస్తవానికి లేనిది, ఎలా లేనిది? అని నిరూపణ చేస్తున్నారు ఇందులో.

        'విశ్వం పశ్యతి కార్యకారణ తయా'. ఎరుకని లేనిదిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకారణ సంబంధం చేత మాత్రమే ఉన్నట్లుగా తోచేది వాస్తవానికి లేదు.

        ఈ అనంత విశ్వం అంతా ఒక సంబంధం నెలకొని ఉందట. ఏమిటది? కార్యకారణ సంబంధం. ఇంతకు మించి ఏమీ లేదయ్యా అన్నారు.

        ఏమిటట? అందులోది silent గా వున్నది? కార్యము, కారణము. మూడోది ఏంటి త్రిపుటిలో? కర్త, కర్మ, క్రియ. వివేకంలో ఎప్పుడూ కూడా ద్విపుటులే చెప్తారు. అంటే అర్థం ఏమిటిట?

        నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసత్‌ వివేకము, దృగ్‌ దృశ్య వివేకము. ఇవన్నీ ద్విపుటులకి సంబంధించిన వివేకములు. అంటే రెండుగానే చెప్పబడుతాయ్‌. మూడో దానికి స్థానం లేదక్కడ. కాని వాస్తవానికి ప్రపంచంలో చూస్తే ఎలా ఉందట? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయముగా కనబడుతుందట.

        వ్యవహారాత్మకంగా చూసినప్పుడేమో మూడుగా కనబడుతోంది. ఉన్నదిగా చూస్తే రెండుగా కనబడుతోంది. లేనిదిగా చూస్తేనేమో ఒకటి కూడా లేకుండా ఉన్నది.

        తత్త్వ విజ్ఞానంలో ఈ మూడూ ఒకచోటే చెప్పబడటం వలన గురువు యొక్క ఆవశ్యకత అత్యంత అవశ్యం అయిపోయింది. తత్త్వవిజ్ఞాన శాస్త్రాలు అన్నిటిలోనూ కూడా ఈ విచారణా క్రమాన్ని మొట్టమొదట వ్యవహార క్రమమైనటువంటి త్రిపుటీ దృష్ట్యా, తదుపరి వివేకస్థానం నుండి ద్విపుటి దృష్ట్యా, ఆ తదుపరి యధార్థ స్థితియందు లేమిగా,

        ఈ త్రిపుటి, ఆ ద్విపుటి, ఈ రెండింటి యొక్క లేమి స్థితిని సూచిస్తూ మూడు స్థాయిలను ఒకే క్రమంలో క్రింద నుంచి పైదాకా చెప్పడం భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి స్థిరపరచే ప్రయత్నం చేశారు. ముందు బోధ స్థిరపడితే తప్ప దానిని దర్శించగలిగే సమర్ధత ఏర్పడదు.

        కాబట్టి భ్రమర కీటక న్యాయమని, మార్జాల కిశోర న్యాయమని, ఇంకా ఏమైనా తెలుసా మీకు? 'దీపో దీపాంతర స్థదా' అని ఒక న్యాయం వుంది. అంటే వెలుగుచున్న దీపమే మరొక దీపమును వెలిగించగలుగు చున్నది. ఇది కూడా ఒక న్యాయమే. ఎవరైతే బ్రహ్మ నిష్ఠుడైనటువంటి గురువు ఉన్నాడో, ఆ బ్రహ్మ నిష్ఠుడు అయినటువంటి గురువు మాత్రమే ఆశ్రయించినటువంటి శిష్యుడిని బ్రహ్మ నిష్ఠలో మేల్కొల్పగలుగుతాడు.

      ప్రబోధకి లక్ష్యం ఏమిటంటే మేల్కొల్పుట. ఏమిటండీ ఈ మేల్కొల్పడం? తెలిసినదానిలోకి నిన్ను మేల్కొల్పుట. తెలియపరచుట. ఇదీ మేల్కొల్పడం అంటే.

        తెలియని స్థితిలో ప్రమత్తత వుంటుంది. ప్రమతత్త అంటే ప్రకర్షమైన మత్తత. మత్తత అంటే మత్తుగా వుండటం. ప్రకర్షమైన మత్తత అంటే ఎప్పటికీ మేలుకోలేనంతగా ఉండుట.

        ఇప్పుడు మనం గాఢ నిద్రావస్థని ఎన్ని జన్మలలో అనుభవిస్తున్నాం? ఎన్ని జన్మలుగా ఆహారాన్ని భుజిస్తున్నాం? ప్రతి జన్మలోనూ చేసినదేమిటి? ఆహార నిద్రా భయ మైధునములే కదా! అంతకుమించి విశేషం ఏమీ లేదు కదా! మరి వాటియందు ఏమైనా సంతృప్తి కలిగిందా? తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? ఏమైనా కొత్తది వుందా అందులో?

        కాని వ్యవహార సాదృశ్యంలోకి వచ్చేప్పటికీ ఆ సాదృశ్యంలో ఎలా ఉన్నాడట? ప్రతిరోజు ఏ రోజు నిద్ర ఆ రోజు క్రొత్తగా అనుభవిస్తున్నాడనీ, ప్రతిరోజూ అన్నం తినేటప్పుడు ఈ రోజు అన్నం ప్రత్యేకంగా తింటున్నాడనీ, విశేషాన్ని ఆపాదించుకుని ప్రమత్తతకు లోనవుతున్నాడు.

        ఎంతగా లోనవుతున్నాడయ్యా? తన స్వస్థితి మరపుకు వచ్చేటంతగా లోనవుతున్నాడు. స్వరూప జ్ఞానం మరపుకి వచ్చేటంతగా లోనవుతున్నాడు. మరి ఈ ప్రమత్తత చేతనే జీవుడయ్యాడు. ఎందుకనిట?

        ప్రమేయం, ప్రమాణం, ప్రమాత. చూడండి. అన్నింటిలోనూ ప్రకార శబ్దం వుంది. ప్రకారమనే ఉపసర్గ వుంది.

        ఈ మోక్ష సౌధంలో ప్రవేశించాలనే జీవులన్నింటికీ కూడా ఈ ప్రమత్తతని విదుల్చుకోవాల్సిన అవసరం ఉంది. మోక్షం ఎవరికి అవసరం?

        ఈ ప్రమత్తతతో కూడిన జీవుడికే అవసరం. కాబట్టి బంధం ఏమిటయ్యా? ఏ స్థాయికి సంబంధించిన ప్రమత్తత అయినా బంధమే. అష్ట తనువులలో ఏ స్థాయికి సంబంధించిన ప్రమత్తత అయినా అది బంధ హేతువే.

        మోక్షం అంటే ఏమిటి? ఈ అష్టతను నిరసన చేసినట్లయితే, అఖండ ఎరుక నిరసన జరిగినట్లయితే అప్పుడు ఆ ప్రమత్తత నిన్ను విడిచిపెట్టింది. ఈ సత్యాన్ని గ్రహించాలట. సత్యమైనటువంటి పరశివతత్త్వమే సర్వకాలము సర్వత్రా ములుగ్రుచ్చ సందులేక వ్యాపించి యున్నది.

        'ఉండుట' మాత్రమే కలిగినది. దానికి ప్రమేయం లేదు. ప్రమేయం అంటే ఏమిటి? ప్రమాణం కూడా లేదు. ప్రమేయమే లేనప్పుడు ప్రమాణం కూడా వుండదు.

        అంటే అర్థం ఏమిటి? నీవు వ్యహార సంకల్పం చేత, ఏ సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్ప ప్రమేయంలో నువ్వు ప్రవేశిస్తున్నావ్‌.

        ఒక సంకల్పం కలుగగానే ఆ సంకల్పం అనే ప్రమేయంలో ఈ ప్రమాత ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి ఒక ప్రమాణ పూర్వకమైన వ్యవహారాన్ని చేశాడు. చేసి తనలో తాను స్థిరీకరించుకున్నాడు. ఆవరణ దోష సహితంగా స్థిరీకరించుకున్నాడు. ఈ రకంగా స్థిరీకరించుకున్నటువంటివాడు వ్యవహారం అనే విక్షేపాన్ని పొందాడు. విక్షేపాన్ని పొందగానే ఆ వ్యవహార జాగ్రత్‌  జగత్‌ ఏదైతే వుందో, ఆ జగత్‌ సంబంధమైన మలాన్ని కూడా సంపాదించు కున్నాడు.

        ఈ రకంగా ఆవరణ విక్షేప మల దోషాలనే త్రిపుటిని మూట గట్టుకున్నాడు. ఇప్పుడు మూడు త్రిపుటుల గురించి చెప్పుకున్నాము.

        ఏమిటది? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమాత, ఆవరణ, విక్షేపం, మలం. ఈ మూడు త్రిపుటులు త్రిగుణాత్మక మైనటువంటి అంతర్లీనంగా వున్న త్రిపుటితో పనిచేస్తున్నాయి.

        ఈ మూడింటిలో కూడా త్రిగుణాత్మకమైనటువంటి త్రిపుటి ఉంది. అంతర్లీనంగా అంటే ఒక సంకల్పం జరగాలి. అసలు సంకల్పమే లేక ముందు ఏముంది? అవ్యక్తం.

'బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహతు మహతో మహదహంకారః మహదహంకారో ఆకాశః, ఆకాశాద్‌ వాయుః, వాయోరగ్నిః అగ్ని యోరాపః ఆపయోర్‌ పృధ్విః పృధ్వియోరన్నం అన్నయోర్‌ జీవః', ఇది క్రమ సృష్టి.

        కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ శ్లోకం మొదట్లో? 'విశ్వం పశ్యతి'. ఎక్కడి నుండి చెప్తున్నాడు ఇప్పుడు? 'బ్రహ్మణోరవ్యక్తః'. అవ్యక్తానికి ముందున్న బ్రాహ్మీభూత స్థితిలో, బ్రహ్మమనేటటువంటి స్థితిలో ఆ బ్రహ్మ నిష్ఠుడు 'విశ్వం పశ్యతి' విడిగా ఉండి, విలక్షణంగా ఉండి, సాక్షిగా ఉండి చూశాడు ఆ విశ్వాన్ని.

        సర్వసాక్షిత్వ స్థితిలో ఉండి చూశాడట. చూస్తే ఏం తోచింది? అంతా కార్యకారణ సంబంధమే తప్ప, ఇంకేం కనబడలేదు. ఎందుకని?

        ఈ ప్రమాతకి ప్రమేయం కలుగగానే ప్రమాణ స్ఫురణ కలిగింది. సంకల్ప స్థితి రాగానే, ఓంకార బిందువు వ్యక్తం కాగానే, సర్వ సృష్టికి బీజం పడిపోయింది. ఓంకారం అనేటటువంటి నాదం ద్వారా, నాదం వ్యక్తం కాక ముందు ఉన్నది అవ్యక్తం. అక్కడేం ఉందయ్యా? బిందువు లోపలికి నాదము, కళ కుంచించుకుపోయినాయి. లయించిపోయినాయి. సుప్తచేతనం అయిపోయినాయి. చైతన్యమే లేని స్థితికి వెళ్ళిపోయినాయి.

        కాబట్టి ఏ బిందు స్థానం నుండి చైతన్యం వ్యక్తీకరించబడినదో దానికి 'సంకల్పం' అని పేరు. ఏ చైతన్యమైతే బిందువునందు లయించబడిన స్థితిలో ఉన్నదో దానికి 'నిర్వికల్పం' అని పేరు. ఏ బిందువయితే లేకుండా పోయిందో దానికి శూన్యం అని పేరు.

        స్థితి బేధాన్ని సూచిస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు స్థితులు చెప్పారు. ఈ శ్లోకంలో నిర్ణయంగా చెప్పేస్తున్నాడు. 'విశ్వం పశ్యతి' చూశాడట. చూస్తే ఎలా కనబడింది? నాదబిందు కళల సమాహారమైన విశ్వం అంతా ఏమైందట? ఆ నాదము అవ్యక్తంలో లీనమైపోయింది. ఆ బిందువు నిర్వికల్ప మందు లీనమైపోయింది. బిందువు నుండి చైతన్యము వ్యక్తమయ్యేటటువంటి లక్షణ స్థితినే సంకల్పమని పేరు. ఇట్టి సంకల్ప స్థితియందు అనంత విశ్వము బీజవత్తుగా వున్నది. ఆ సంకల్పమునకే ప్రణవమని పేరు. ఏకాక్షరమని పేరు. అక్షరమని పేరు. అంటే నశించినదని పేరు. వ్యక్త స్థితిలో ఉన్నదంతా నాశము చెందినప్పటికీ అక్షర స్థితిలో నాశనము లేనటువంటిదన్నమాట. అక్షరము అంటే నాశనము లేనటువంటిది. అక్షరము అంటే నశించనిది.

        దీనికి అవతల పురుషోత్తముడు. మూడవ స్థితియందు ఎవరున్నారు? పురుషోత్తముడు. అక్కడేమిటి? ఈ బిందువు కూడా లేని స్థితిలో శూన్యము. ఆ కళ కూడా అవ్యక్తంలో లీనమై పోయింది. ఆ వ్యక్తము బిందువునందు లీనమై పోయింది.

     అట్టి శూన్యమునకవతల 'పరం'. శూన్యాతీతం. కాబట్టి అనంత విశ్వాన్ని నిర్వచించేప్పుడు మూడు స్థాయీ బేధాలను మనం గుర్తించాం. సంకల్పము - సంకల్పాతీతము, శూన్యము - శూన్యాతీతము, కాలము  -కాలాతీతము. ఇవే లేని ఎరుక స్థితులంటే

        ఎవరైతే ఈ మూడు స్థితులని దాటినటువంటి వారు ఉంటారో, ఈ మండల త్రయాలని దాటినటువంటివారు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పరశివతత్త్వమైనటువంటి బయలునందు ప్రవేశించినటువంటివారు.

        వాళ్ళ స్థితి నుంచి ప్రారంభించాడు ఈ శ్లోకాన్ని. దేశికులైనటువంటి వారి స్థితి నుండి ప్రారంభించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? 'విశ్వం పశ్యతి'. వాళ్ళకేం పనీపాటా లేదు. వ్యవహారం లేదు. కదలడం లేదు. ఉనికి లేదు. వ్యక్తీకరణ లేదు. వ్యవహారం లేదు. ఉన్నావా అంటే ఉన్నట్టూ లేదు. లేరా? లేకుండా ఉన్నారు. ఇలా ఉన్నారట దేశికులు.

        ఈ దేశికుడు 'విశ్వం పశ్యతి కార్య కారణ తయా'. ఇది కార్యము, ఇది కారణము. కారణోపాధి ఈశ్వరుడు, కార్యోపాధి జీవుడు అనే వాటికి విలక్షణుడు.

        సృష్టి అంతా ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నవట? జీవేశ్వరులు తప్ప ఇంకేమీ కనబడటం లేదు. అదేంటండీ? జగత్తు కూడా ఉంది కదా అన్నావే అనుకో. అప్పుడు ఎక్కడికొచ్చేశావు? త్రిపుటిలోకి వచ్చేశావు. కాబట్టి జగత్తు లేనిదయ్యా బాబూ! ఇప్పుడు వ్యవహరించినప్పుడు జగత్తు ఉన్నట్టు తోస్తోంది.

        ఈశ్వరుడు వ్యవహరిస్తే సృష్టి ఉన్నట్టు తోస్తోంది. వ్యహార సాదృశ్యం అన్ని వేళలా లేదు కదా. సర్వకాలమందు లేదు కదా. తనయందు నుంచి వ్యక్తం అవుతున్నది కదా. కాబట్టి ఎవరైతే కారణ స్థితియందు ఉన్నాడో, ఆ కారణ స్థితియందు ఉన్నవాడి యొక్క సంకల్పంచేత కదా జగత్తు ఉన్నట్లుగా తోస్తోంది.

        సంకల్పం అనే దానిని గనుక నువ్వు దాటినట్లయితే, సంకల్పాతీత స్థితిలో గనుక ఉన్నట్లయితే, ఏ జీవుడైతే జగత్తుచేత భ్రమింపజేయ బడుతున్నాడని తోస్తోందో, ఆ జగత్తు జీవుని యొక్క సంకల్పమే కదా. అట్టి సంకల్పాతీతమైన స్థితికి జీవుడు చేరగానే ఆత్మ స్వరూపంగా మారిపోతున్నాడు కదా. ఈ జగత్తు వాడిలో లయమైపోతోంది కదా. లీనమై పోతోంది కదా. లేనిదైపోతోంది కదా.

        కాబట్టి జగదుత్పత్తి స్థానం జీవుడే. వేరే ఎవడున్నాడు? కాబట్టి జగత్తు అనే కార్యమునకు కర్త, కారణము జీవుడే. అదే ఈశ్వరోపాధితో చూశాం. కారణోపాధితో చూశాం. జీవుడేమో కార్యోపాధి. కారణోపాధి ఈశ్వరుడు.

        అట్టి ఈశ్వర స్థితియందు నుండి చూస్తే, సంకల్పం చేత సృష్టి వ్యక్తమయింది. అది బ్రహ్మాండ సృష్టి. ఆ సంకల్పం చేతే పోషింపబడుచున్నది. ఆ సంకల్పంచేత లయించబడుచున్నది. ఆ సంకల్ప చేతే రక్షింపబడుచున్నది. ఆ సంకల్పంచేతే మరల వ్యక్తీకరించబడుచున్నది.

        కాబట్టి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు ఐదు పనులు ఉన్నాయట. ఈశ్వర స్థితిలో ఐదు పనులు చేయబడుతున్నాయి. ఏమిటవి? సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ. అదే సంస్కృతంలో చెప్తే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహము.

        ఈ ఐదు పనులు కూడా నిర్వహించబడుతున్న కారణ స్థానం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. అదే బ్రహ్మము. దానికి నామరూపాలు లేవు. ఎందుకని? సంకల్పాతీతమై ఉన్నది.

        నామరూపాత్మకమంతా కూడా వ్యవహార సదృశంలో మాత్రమే వుంది. సచ్చిదానంద ఘన స్థితిలో ఇవి లేవు. ఉయ్యాలలో ఆడుకుంటున్న పిల్లవాడి జగత్‌ ఇప్పుడు నీకుందా? ఎక్కడికి పోయింది మరి? ఇప్పుడు నీకుందా? లేదు కదా. మరి అప్పుడు లేడా?

        ఆడుకుంటున్నాడా లేదా ఉయ్యాలలో వున్న పిల్లవాడు? ఆనందిస్తున్నాడా లేదా? పంచభూతాత్మకమైన సృష్టిని ఆనందిస్తున్నాడా లేదా? గ్రహిస్తున్నాడా లేదా? స్పందిస్తున్నాడా లేదామరి వాడికి ఇప్పుడు జగత్‌ వున్నట్టేగా. అటు ఇటు చూస్తూ ఉంటాడు. వస్తువులను గుర్తుపడుతూ ఉంటాడు. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి.

        వ్యవహార సదృశ జగత్తును తన స్థితిలో నుండి తాను గుర్తించాడు. నీకున్న జగత్తు, వాడికున్న జగత్తు ఒక్కటేనా? లేదుగా. వాడి జగత్తు వాడి సంకల్పంలో నుండి ఉద్భవించింది. వాడి వ్యవహారం ఎంతమేరకు ఆ సంకల్ప ప్రభావం చేత నిర్ణయమైవుందో, అంతే ఉంది ఆ జగత్తు.

        నేను ఈ భూమండలంమీద ఉన్న దేశాలన్నీ తిరిగేశానండి, ప్రపంచమంతా చుట్టేశానండీ అన్నావు. అప్పుడు నీ జగత్తు ఎంతయింది? భూ మండలమంత. మీ అందరికి జగత్తు విశాలమైనది. భారతదేశం సరిపోలా.

        అందుకని అమెరికాకు వెళ్ళారు. పూర్వం ఉన్న ఊరు దాటి వెళ్ళకూడదయ్యా అనేవారు. ఎందుకని చెప్పేవారంటే ఇది అంతరార్థం. అంటే జగత్తుని విశాలపరిచే కొద్దీ ఏమైపోతున్నావు? నీ సంకల్పం తామరతంపరగా పెరిగిపోయిందట.

        ఈ పాఠం చెప్పడానికి చెరువుగట్టుకి తీసుకువెళ్ళేవాడట గురువు గారు. ఎందుకని? చెరువంతా శుభ్రంగా బాగుచేసినప్పుడు చూపెట్టేవారట. అందులో ఏమీ లేవు. తామర పూవులు లేవు. తామరకాడలు లేవు. తామర ఆకులు లేవు. ఏమీ లేవు.

        కానీ అడుగున వున్న బురదలో ఆ తామర విత్తనాలు ఉన్నాయి. ఒక ఋతువు మారి, ఒక కాలం మారి, ఒక వర్ష ఋతువు వచ్చేవరకూ కూడా అంతా ఎండాకాలంలో ఎండిపోయి, వసంత ఋతువులో చక్కగా క్లీన్‌ అయిపోయి ఎంతో నీట్‌గా క్లీన్‌ చేస్తారు. ఏదో వర్షాకాలం వచ్చేటప్పటికీ చక్కగా రెడీ చేస్తారన్నమాట. ప్రెష్‌ వాటర్‌ పెట్టాం. ఆ తామర విత్తనాలు అన్నీ ఎందులో ఉంటాయి. అందులోనే వుంటాయన్నమాట. సమయం వచ్చేటప్పటికి ఆ పంచభూతాత్మకమైన సహకారం అందేటప్పటికి ఒక్కో తామర మొలిచింది.

        మొదట్లో ఒకటో రెండో ఉంటాయి అంతే. ఒక మూడు నెలల తరువాత వచ్చి చూసేటప్పటికి చెరువంతా తామరే ఉంటుంది. ఒక ఋతువు మారే సమయానికి, ఒక ఋతువుతో మొదలైనది  ఆ ఋతువు పూర్తయ్యే కాలానికి చెరువు నిండా తామరే ఉంటుంది.

        ఎట్లా వచ్చింది అది? ఒక్క సంకల్పమే అనేకం అయిపోయింది. ఒక్కటే అనేకం అయ్యింది. 'ఏకోహం బహుస్యాం'. దీనికి సూత్రం ఏమిటి? 'ఏకోహం బహుస్యాం'. ఒక్కటే అనేకం అయింది.

        'ఏకోహం' అందులోనే రహస్యం వుంది. ఏకోహం, ఏదైతే ఉన్నదో 'నేను' కోహం అంటే ఎవరు అనగా నేనెవరు? ఏ కోహం నేనెవరు? అని ప్రశ్నించే ఏ బ్రహ్మమైతే ఉన్నాడో, ఆ బ్రహ్మమే ఏమయ్యాడు? సంకల్ప స్థితికి వచ్చేటప్పటికీ అనేకం అయ్యాడు.

        గాఢనిద్రావస్థయందు, సుషుప్త్యావస్థయందు ఒక్కడిగానే ఉన్నాడు. ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. ప్రజ్ఞా స్వరూపుడిగా ఉన్నాడు. అయినవాడు ఏమయ్యాడు? సంకల్పంలోకి ప్రవేశించాడు. వాసనా బలంతో ప్రమేయములు వచ్చినాయి. ఆ ప్రమేయములచేత ప్రమాణ పూర్వక జ్ఞానం పనిచేసింది.

        ఈ వాసనా బలం సుఖాన్ని ఇస్తుంది అనే నిర్ణయం అయింది. గుణ బలాన్ని సమీకరించింది. ప్రాణశక్తిని సమీకరించింది. ఇంద్రియ సమూహాన్ని సమీకరించింది. మేలుకొంది. జగత్తు తోచింది. తోచిన జగత్తులో ఆ వాసనా బలంతో వ్యవహరించావు. ఆ సంకల్పంతో వ్యవహరించావు.

        వ్యవహరించి ఏం చెప్పావు? నేనే దీనిని సృష్టించాను. నేను దీనిని అనుభవించాను. నాయందే ఇది లయం అయిపోయింది.

        చక్కగా కష్టపడి జిలేబి తయారు చేశారు. ఎవరు తయారు చేశారు? నేనే తయారు చేశాను. తరువాత ఏం చేశావు? శుభ్రంగా భుజించావు. అనుభవించావు. ఏమైంది అప్పుడు? నీ లోపలికి పోయింది. ఇంకా కొతసేపు అయింది. ఏమైపోయిందప్పుడు? నీయందే లయం అయిపోయింది. ఇంకేమయింది? అదంతా నీయందు శక్తి రూపంలో పోషించబడింది, క్రియోన్ముఖమై వెలువడింది. తిరోధానం చెందింది. మరల ఏం చేశావు? మరల శక్తిని సంకల్ప రూపంలో వ్యక్తం చేశావు. అనుగ్రహించావు.

        సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానములు. రోజూ చేస్తున్నావా? చేయడం లేదా? మీరందరూ ఆది శక్తి స్వరూపాలని మీకెందుకు చెప్పారు? తెలుసా మీకెవరికైనామీ నుంచే సృష్టి వ్యక్తమవుతోంది. సంకల్ప సృష్టి. వ్యక్తమయ్యి, మీచేతే పోషింపబడుతోంది. మీచేతే అనుభవించబడుతోంది. మరల నీయందే లయమైపోతోంది. లయమై పోయింది మరల నీలోనే శక్తిరూపంలో పోషించబడుతోంది. మరల ఒక కాలంలో సంకల్ప రూపంలో మరల తిరిగి అనుగ్రహించబడుతోంది. జీవుడెక్కడున్నాడయ్యా? జీవుడే లేకపోతే జగత్‌ ఎక్కడుందయ్యా? ఎందుకని?

        ఎక్కడ చూసినా ఈ పంచకృత్యములే ఉన్నాయి. ఏది విచారణ చేసినా ఈ పంచకృత్యములే కనబడుతున్నాయి. అయితే కారణోపాధి అయిన బ్రహ్మము, ప్రతిబింబ సమానమైన కార్యోపాధి అయిన జీవుడు ఇద్దరూ ఒక్క పనే చేస్తున్నారుగా. ఆయన సృష్టికి చేస్తున్నాడు. ఈయన స్వయంగా చేస్తున్నాడు. ఆయన స్వయంగా చేస్తున్నాడు. ఇద్దరూ స్వయమే.

        కాబట్టి పంచకృత్య పరాయణా. పుట్టింది మొదలు పోయే వరకు కూడా నువ్వు అనేకమైన పనులు ఏమీ చేయడం లేదయ్యా బాబూ. ఇదంతా ఒక పనే. ఏమిటది? తన్ను తానెరుగుట. తనని తాను ఎరుగుట. Self Realization.

        ఏమెరిగాడయ్యా ఈ పంచకృత్యముల ద్వారా? నాయందే సంకల్పము ఉద్భవిస్తున్నది. నాయందే అనుభవించబడుతున్నది. నాయందే లయమగుచున్నది. నాయందే తిరోధానపరచబడుచున్నది. మరల అనుకూలమైన కాలమందు తిరిగి నాయందే అనుగ్రహించబడుచున్నది.

        అట్లే బ్రహ్మమునందు సంకల్పవత్తు సృష్టి ఏర్పడింది. అదే సృష్టి ఆయన చేతనే పోషించబడింది. అదే సృష్టి ఆయనయందే లయమయింది. అదే సృష్టి తిరిగి కొంతకాలము సంరక్షించబడి, మరల కొంతకాలమునకు వ్యక్తీకరించబడింది.

        ఈ రకంగా సృష్టి, స్థితి లయ తిరోధాన అనుగ్రహములు, ఎక్కడ తిరగేసి చూసినా, ఏ స్థాయిలో చూసినా, ఎనిమిది శరీరాలతో ఎక్కడ చూసినా, సర్వ వ్యవహారమును, అనంత విశ్వమును పరిశీలిస్తే పంచశక్తులు, పంచ బ్రహ్మలు, పంచకృత్యములు, పంచబీజములు అన్నీ అయిదయిదుగా కనబడుతున్నప్పటికీ ఏకముగానే ఉన్నవి.

        పంచభూతములన్నీ ఏకముగా కలిసి పనిచేస్తున్నాయి చైతన్య శక్తిగా నీ శరీరంలో. శరీరమే నువ్వందామా ఇప్పుడు? శరీరమే నువ్వంటే శవాన్ని నువ్వనాలి. ఎవరైనా శవం నేను అని ఒప్పుకుంటారా?

        ఒప్పుకోవడం లేదుగా. శవానికి పేరు లేదు. నేనుకు కూడా పేరు లేదు. చైతన్యానికి కూడా పేరు లేదు. అందరిలో ఉన్న చైతన్యానికి చైతన్యం అనే పేరు. అందరిలో ఉన్న సంకల్పానికి సంకల్పమనే పేరు. అందరిలో యధార్థముగా సత్యం ఏదైతే ఉందో దానికి సత్యమనే పేరు. అనేకమైన పేర్లు లేవు. కాబట్టి ఏం జరిగిందట? ప్రమేయము ప్రమాణము ప్రమాత అనేటటువంటి త్రిపుటిలో అనేకత్వానికి స్థానం వచ్చింది.

        ఈ త్రిపుటిని దాటినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్షరుడు. అక్కడే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనే త్రిపుటి పుట్టింది. ఎందుకనిట? సృష్టించేటటువంటి శక్తి, సృష్టించగలిగేటటువంటి జ్ఞానం, పోషించగలిగే టటువంటి జ్ఞానం, లయింపజేయగలిగే జ్ఞానం, మరల దానిని సంరక్షించ గలిగేటటువంటి జ్ఞానం, తిరిగి ఒక కాలానికి అనుగ్రహించ గలిగేటటువంటి జ్ఞానం. ఈ మొత్తం జ్ఞానం మీదే ఆధారపడి వుంటుంది.

జ్ఞేయము జ్ఞానము జ్ఞాత - ఈ మూడింటిలో జ్ఞాత శేషించి పోతున్నాడు. ఎప్పటికప్పుడు. శేషించిపోతే ఎప్పటికప్పుడు ఈ త్రిపుటి అంతా అద్వైత స్థితికి చేరుతుంది. ఎందుకనిట?

        ఆ కారణ స్థితియందు నేనే వున్నాను. 'కోహం - సోహం'. కోహం కాస్తా ఏమైంది ఇప్పుడు. ఈ జ్ఞానంచేత ? సోహం అయింది.

        జీవుడుగా ఉన్నదీ నేనే. ఈ బ్రహ్మముగా ఉన్నదీ నేనే. జీవోబ్రహ్మెవ నాపరః ప్రణవాక్షర సంధానంతో, ప్రణవోపాసన ద్వారా ఈ అనంత సృష్టి యొక్క పంచకృత్యముల యొక్క స్థితిని ఎవరైతే కార్యోపాధిగా, కారణోపాధిగా  రెండింటిలోనూ తెలుసుకోగలిగాడో, ఈ అష్టతను నిర్ణయాన్ని ఎరిగాడో, వాడే బ్రహ్మ నిష్ఠుడు.

        వాడికి సర్వమూ సంకల్ప సృజనమే. ఆ సంకల్ప సృష్టి ఎలా వున్నదో బోధపడింది. అనంతమైనదిగా వ్యాపించినటువంటిది అంతా కూడా బిందు సమానమైనదే. ఈ బిందువుకు అతీతమైనటువంటి స్థితిలో, ఈ బిందువు కూడా లేనిదయి శూన్యమైంది. అక్కడ ఆ శూన్యమందు త్రిపుటి లేదు.

        కాని కార్యకారణ వివేక సదృశమైన ద్విపుటి ఉండిపోయింది.  అదే ఒక కాలంలో మరల సృష్టికి ప్రాదుర్భావం జరిగింది. కాబట్టి జ్ఞానమునకు మనవాళ్ళు చక్కని విభజననిచ్చి, జీవ స్థానంలో చక్కగా విచారణ చేశారు. పంచకృత్యాలని జీవ స్థానంలో విచారణ చేస్తే నిత్యానిత్య వస్తు వివేకము వచ్చింది.

        నీ లోపలనుంచే పంచకృత్యాలు ఏర్పడుతున్నాయ్‌, నీ సంకల్పమే ఆధారమని జీవ స్థానంలో తెలుసుకోగలిగావు. ప్రజ్ఞా స్థితిలో స్థిరపడ్డావు. స్థితప్రజ్ఞుడివి అయ్యావు. సర్వాన్ని కూడా వ్యవహార త్రిపుటులుగా చూశావు. త్రిపుటి అనే వ్యవహారం లేనిదని గ్రహించావు.

        అప్పుడు ఆత్మ నిష్ఠని పొందావు. అప్పుడు ఆత్మానాత్మ వివేకాన్ని సాధించావు. కార్యోపాధి లేనిది అని తేలిపోయింది.

        ఎందుకని? సముద్రం సత్యమా? అలలు సత్యమా అని విచారణ చేశావు. అనేకమైన అలలు వచ్చిపోతూ వున్నాయి. సముద్రము మాత్రము ఎల్లకాలమూ ఉంది.

        84 లక్షల జీవరాశుల సృష్టి అలలు అలలుగా ఏర్పడుతున్నాయి. అల ఎక్కడ పుట్టిందో అక్కడే లయమైపోతున్నది. జీవులందరూ ఎక్కడ పుడుతున్నారో అక్కడే లయం అయిపోతున్నారు. జీవ జగత్తులు రెండూ లేకుండా పోయినాయి.

        ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి స్థిరమైన నిర్ణయానికి చేరాడు. తురీయ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. ఆత్మ నిష్ఠ నుండి బ్రహ్మ నిష్ఠుడు అయ్యాడు. సర్వదా ఉన్నది బ్రహ్మమే. సర్వకాల సర్వావస్థలందు ఉన్నది బ్రహ్మమే అని అవస్థాత్రయాన్ని దాటాడు. అప్పుడేమయ్యాడు?

        కార్యకారణ పద్ధతిని బాగా అర్థం చేసుకోగలిగాడు. కార్యోపాధి, కారణోపాధి ఈ రెండింటిని చక్కగా విచారణ చేశాడు. చేసి కార్యోపాధి అయినటువంటి జీవుడు బ్రహ్మము యొక్క ప్రతిబింబము. కారణోపాధి యొక్క ప్రమేయము, కారణోపాధి యొక్క ప్రమాణము.

        ప్రమాణము చేత నిర్ణయించబడేది ఏదైతే ఉన్నదో అది ప్రమాత. కాబట్టి నేను బ్రహ్మనేదే సత్యము. నేను జీవుడు, కనబడే జగత్‌, కనబడే సృష్టి నా సంకల్ప సృష్టే అని ఎవడైతే గ్రహించాడో, ఎవడికైతే ఈ కార్యకారణో పాధుల యొక్క వైచిత్రిని అర్థం చేసుకుని వెనక్కి తీసుకోవడం వచ్చిందో, బ్రహ్మ స్థానం నుంచి పంచకృత్యాలను తెలుసుకోగలిగాడో, వాడు బ్రహ్మ నిష్ఠుడయ్యాడు. వీడిప్పుడు సదసత్‌ వివేకాన్ని పొందాడు. ఏది సత్‌? ఏది అసత్‌? అసత్‌ యొక్క స్థానం లేకుండా పోయింది. ఎందుకని?

        అంతటా ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు, అంతటా ఉన్నది సత్తే. అసత్తుకి స్థానం ఎక్కడ? అసత్తుకి స్థానం లేదు అని తనలోకి తాను రమించడం మొదలుపెట్టాడు. తనయందు తానుండుట చేత, అనేకాన్ని సృజించడానికి ఆధారమైనటువంటి ప్రణవనాదం నిశ్శబ్దం అయింది.

        ఏకాక్షరం బ్రహ్మ ఉచ్యతే. ఏ ఏకాక్షర శబ్దమైతే బ్రహ్మముగా పిలువ బడుతూ ఉన్నదో అట్టి ప్రణవనాదాతీతమైన నిశ్శబ్దంలోకి చేరాడు. నిశ్శబ్దో బ్రహ్మ ముచ్యతే.

        నాదము, కళ రెండూ కూడా బ్రహ్మము నందు లయించిపోయినాయి. ఇప్పుడు బిందువు మాత్రము అందు కంపించుచుండును. ఒక్కటే ఉంది. ఆ బిందువు యొక్క కంపనం చేత, ఆ కదలిక చేత అంతా కదులుతూ ఉన్నది. ఈ రకంగా బిందు స్థానమునకు చేరినటువంటివాడై అట్టి బిందువెచ్చట లేదో అక్కడ మేల్కొల్పబడ్డాడు.

        ఇటువంటి మేల్కొల్పు పొందటమే సద్గురువు కృపంటే. ఈ ప్రమత్తత అనే దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాడు. ఏయ్‌ లేవరా! అని గట్టిగా లాగి ఆ దుప్పటి తీసేశాడు. తియ్యగానే ఏమైంది చాలా మందిని గమనించండి. దుప్పటి ముసుగేసుకున్నంత వరకు నిద్ర. దుప్పటి లాగేయగానే మేల్కొంటాడు. ఎందుకని? చాలామందికి ఉంటుంది ఈ లక్షణము. విమానంలో కూడ అందుకే కళ్ళకి గంతలు ఇస్తాడు. గంతలు కట్టుకుంటే గాని నిద్ర రాదు. కొంతమందికి కళ్ళమీద తువ్వాలు వేసుకుంటేనే నిద్ర. తువ్వాలు తీసేస్తే మెలకువ వచ్చేస్తుంది.

        జీవుడు కూడా అంతే. ఈ 8 శరీరాలు అనేటటువంటి ముసుగు వేసుకుని వస్త్రానికి విలువిచ్చాడు. ఈ సత్యాన్ని ఎవడైతే గ్రహించాడో బిందు స్థానంలో, వాడికి అష్టతను నిరసన తెలిపినటువంటివాడై ఆ నిరసన చేయగల సమర్ధత వచ్చినప్పుడు నీవు శూన్య స్థితిలో మేల్కొంటావు. సంకల్పము- సంకల్పాతీతము, శూన్యము - శూన్యాతీతము, అయిపోయావు.

        ఇక మిగిలింది కాల మొక్కటే. ఆ కాల స్థితిని దాటగలిగే సమర్ధత కాలాతీతమైన వారి దగ్గర ఉంటుంది. పూర్ణ గురువుల దగ్గర ఉంటుంది. పూర్ణ గురువులు కాలము నుండి నిన్ను దాటిస్తారు.

        దశవిధ ప్రళయాలని దర్శింపచేసి, ఆ దశ విధ ప్రళయాలలోను నువ్వు పోనివాడివని నిరూపించి శాశ్వత స్థితిని నీకు కలిగిస్తారు. ఆ శాశ్వత స్థితి యొక్క నిర్ణయం నీలో ఎప్పుడైతే అయిందో, నీవు లేక ఉన్నావు.

        అంతా ఉన్నావా? అంటే లేనంటావు. లేవా అంటే లేక ఉన్నానంటావు. ఈ రకంగా బయలు స్థితిలో మేల్కొన్నాడు. అంతరిక్ష స్థితిలో మేల్కొన్నాడు. అనంత విశ్వము లేనిదయింది.

        ఈ రకంగా 'విశ్వం పశ్యతి కార్య కారణ తయా' అంతా ఈ కార్య కారణాలతో ముడిపడి ఉందయ్యా! ఈ రెండింటిని నిరసించ గలిగినవాడు శాశ్వత స్థితికి చేరియున్నాడు. కేవలం కార్య నిరసన చేసి కారణాన్ని పట్టుకుంటే నీ పని సగం అయ్యిందయ్యా మిగిలిన సగం అవలేదు.

        కాబట్టి 'కార్యకారణ తయా స్వస్వామి సంబంధతః' 'రెండు' రెండు చెప్తున్నాడు. కార్యకారణములు ఎలా అయితే ద్విపుటిగా ఉన్నదో, ఆ ద్విపుటి గనుక తెగకోసివేస్తే ఆ ద్విపుటి గనుక లేకుండాపోతే, నువ్వు శాశ్వత స్థితిని పొందుతావు.

        దృక్కు లేనిదే, దృశ్యము లేనిదే ఒక్క దృశ్యాన్ని నిరసించి, దృక్కు ఉన్నదంటావా. మరల ఏదో ఒక కాలంలో ఆ దృశ్యం కలిగే అవకాశం వస్తుంది. పంచకృత్య పరాయణ.

    కాబట్టి స్వస్వామి సంబంధతః 'స్వామి' అన్నావు అంటే ఆ దేశికేంద్రుని, దేనికాశ్రయించావు! 'స్వస్వామి సంబంధతః' నేను స్వరూప జ్ఞానాన్ని ఎరిగాను. ఆత్మ నిష్ఠుడనయ్యాను, కాని శాశ్వత స్థితిని పొందలేక పోయాను. బ్రహ్మ నిష్ఠుడనయ్యాను. కానీ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందలేక పోయాను. స్వామీ నన్ను మేల్కొల్పుము.

       స్వామి అంటే అర్థం ఏమిటంటే మేల్కొల్పువాడు. స్వామి అంటే ఎవరు? మేల్కొల్పువాడు. నువ్వు నిద్రపోతూ వుంటే వాడు మేల్కొల్పుతూ వుంటాడు. వాడి పని వేరే ఏమీలేదు. దీనిచేత పరిమితించబడుతుంది.

        నీ స్వస్థితిలో ఇది లేదు కదా. నీ స్వరూప జ్ఞానంలో ఇది లేదు కదా. నువ్వు ఇది కదా అని గుర్తుచేసే వాడెవడో వాడు స్వామి కాబట్టి ఎవరినైనా 'స్వామీ' అన్నామంటే ఏమి చెయ్యాలి? వారు ఎక్కడికి సంబంధించినవారు? దేశికేంద్రులు. ఆ మేల్కొల్పు కలిగినటువంటి వారు. త్రిపుటి, ద్విపుటి రెండింటినీ దాటినటువంటి వారు. తనను తాను లేకుండా చేసుకున్నటు వంటి వారు.

        కాబట్టి అటువంటి స్వామిని ఆశ్రయించినప్పుడు ఏమి పొందాలంటే? 'విశ్వము పశ్యతి కార్యకారణ తయా' 'జీవోబ్రహ్మైవనాపరః' ఈ జీవుడు, ఆ బ్రహ్మము ఒకటే. పరమైనటువంటి స్థితిలో ఇద్దరు లేరు. ఉన్నారంటావా, లేక జీవుడు జీవుడుగానే ఉన్నాడు, బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది అంటావా?

        అది ఇంకా మిథ్యాభూతం. ఈ రెండూ ఒకటేనంటావా? ఒకటే అనేకమైందని ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఇంకా దోషం.

        ఒకటే లేదంటావా? ఏదీ లేదని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఉన్నదేదో ఎల్లకాలం వున్నది. లేనిది ఎల్లకాలం లేదు. ఇదే సర్వకాలములందు సత్యము. బయలు సర్వకాలమునందు వున్నది. ఎరుక సర్వకాలమునందు లేనిది. ఈ నిర్ణయం ఎరిగినటువంటి పరబ్రహ్మ నిష్ఠులు ఎవడైతే ఉన్నాడో వాడికి 'స్వస్వామి సంబంధత'.

        అటువంటివాడిని ఒక్కడినైనా గుర్తించు జీవితంలో. వాడిని ఆశ్రయించు. వాడితో సంబంధపడు. వాడు తప్ప నీకు శరణ్యం లేదు. వాడు మేల్కొల్పితే తప్ప నువ్వు మేల్కోలేవు. అందుకే అవతారుడైన మెహెర్‌బాబా చెప్పారు. నేను మేల్కొల్పుటకే వచ్చితిని గాని బోధించుటకు రాలేదు. ఇదీ మేల్కొల్పంటే అర్థం.

        త్రిపుటిలోనుండి, ద్విపుటిలో నుండి, బ్రహ్మ నిష్ఠ నుండి పరబ్రహ్మ నిర్ణయానికి మేల్కొల్పుతారు. అక్కడ చేయడానికి సాధన ఏమీ లేదు. కేవలం మేల్కొల్పు ద్వారా నీకా నిర్ణయాన్ని తెలియచేస్తారు. తురీయాతీతంలోకి మేలుకోగానే తురీయం లేనిదైపోయింది. ఈ రకంగా 'స్వస్వామి సంబంధతః' ఎందుకు పుట్టిందయ్యా? 'శిష్యాచార్యతయాతథైవ పితృపుత్రాద్యాత్మ్రనాభేదత'. 'అభేదతః' గురుశిష్యుల ఐక్యతా సిద్ధి జరిగింది.

        పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగానే ఏ స్వామినైతే ఆశ్రయించావో ఆ స్వామితో నీకు అభేదం వచ్చింది. అట్టి ఐక్యతాసిద్ధి చేత మాత్రమే పొందదగినటువంటి గొప్పదైనటువంటి, శాశ్వతమైనటువంటి, మార్పు లేనటువంటిది ఆ పరబ్రహ్మ నిర్ణయం.

        అట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని అలాగే పొందాలి. 'ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు' ఇక. సాధనలన్నీ బ్రహ్మనిష్ఠ కంటే క్రిందే. 'సాధనలందు మరిగితే రాకు' అనే కందార్థం ఒకటుంది.

        ఏ సాధనైనా నీకు చెయ్యాలని తోస్తే అయ్యో ఈ సాధన నేను చెయ్యలేదని తోస్తే ఎక్కడికి పోతావు? మరల బ్రహ్మ నిష్ఠలోకి, మరల ఆత్మ నిష్ఠలోకి, మరలా జీవుడిగా వ్యవహరిస్తావు. మరల త్రిపుటిలో వ్యవహరిస్తావు. లేక ద్విపుటి అనేటటు వంటి పులినోట పడతావు.

        కాబట్టి ఆ ఎరుక అనేటటువంటి పులినోట పడమాక. శిష్యాచార్య తయా తథైవ పితృపుత్రాద్యాత్మనాభేదతః. నాకూ మహానుభావు డైనటువంటి దేశికేంద్రుడికీ ఎట్టి భేదమూ లేదు.

        'అభేదతః' కాలాతీతులైన దేశికేంద్రులయందు, నాకు ఐక్యతా సిద్ధి ప్రసాదించినటువంటి మహనీయుడియందు నేను లేకుండా పోయాను. నేను లేనివాడను అని తనకు తాను ఎరిగి, తనని తాను తెలుసుకున్నవాడై తనను తాను పోగొట్టుకున్నాడు.

        ఇంతేనయా! వేదాంతం అంతా రెండు వాక్యాలు. 

        'విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః'
        'శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మ నా భేదతః'

        ఈ అభేద స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరావో, నీవు లేకుండా వున్నటువంటి స్థితికి ఎప్పుడైతే చేరావో, సర్వకాల సర్వత్రా, సర్వే సర్వత్రా ఉన్నది ఒక్క గురువు మాత్రమే. ఉన్నది పరబ్రహ్మమే, నేను లేనివాడను.

        ఈ స్థితికి ఎప్పుడైతే చేరావో ఇప్పుడేముందటా? మూడవ పాదంలో ఏం చెప్పాడు.
        'స్వప్నే జాగ్రతి వా యఏష పురుషః'. స్వప్నే ఏమయ్యా మాట్లాడుతున్నావుగా. లేనివాడు అంటున్నావు. పాఠాలు చెప్తున్నావుగా. స్వప్నే జాగృతి వాయ ఏష పురుషః స్వప్నంలో వాడు ఎలా మాట్లాడుతున్నాడు? సత్యమేనా వాడు మాట్లాడేది?

        ఎప్పుడైనా కలలో మాట్లాడావా? చిన్న పిల్లలు కలవరిస్తారా లేదా? మనం కూడా కలవరిస్తాం. ఎప్పుడు? ఆ బలమైన జ్ఞాపకం చేత ప్రేరేపించబడినప్పుడు.

        ఎప్పుడైతే నీలో వున్నటువంటి అహంకారంమీద బలమైన ముద్ర పడుతుందో, ఆ అహంకారాన్ని బద్దలు కొడతామో unveil అంటాడు అవతారుడు. 'తెరతీయరా తిరుపతి దేవరా!' ఆ తెర ఎప్పుడైతే తొలగించ బడిందో కలవరపాటు కలిగిందట. అప్పటివరకు ఏముందట?

        ఆ తెర అడ్డుగా వుంది. ఆ తెర ఎప్పుడైతే తొలగించబడిందో, జీవుడుగా గాని, బ్రహ్మముగా గాని, శూన్యముగా గాని, సర్వముగాని, మొత్తము అంతా కూడా ఆ కలలో కలవరింతలాగా కనబడిందట.

        ఇప్పటివరకు ఏదైతే కార్యకారణ సంబంధముతో చేయబడిన సమస్తము ఉందో దానికి చిన్న పోలిక వేశాడు. 'స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషః' కల కంటున్నవాడు ఎన్నో పనులు చేసినట్లుగా, మాట్లాడి నట్లుగా, జీవించినట్లుగా తోచినప్పటికీ 'జాగ్రతి వా య ఏష పురుషః' మేలుకోగానే ఏమయిందంట? ఆ కల లేకుండా పోయింది. ఆ కలవరం లేకుండా పోయింది. ఇప్పటిదాకా ఏదో మాట్లాడావు? ఏదో పాటలు, ఏదో పద్యాలు చెప్పావు?

        జీవుడు, బ్రహ్మము, సృష్టి, పంచశక్తులు, పంచబ్రహ్మలు, పిండాండం, బ్రహ్మాండం అన్నావు. ఎనిమిది తనువులు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, ఆ వ్యవహారం చేశాను. ఈ వ్యవహారం చేశాను, దశవిధ ప్రళయాలు, ఎనిమిది తనువులు ఉన్నాయని చెప్పావ్‌ అని వేదాంతం మొత్తాన్ని ఒకే ఉపమానంలో ఇమిడ్చేశాడు.

        'స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషః మాయా పరిభ్రామితః'. అదిట సంగతి. 'యా మా సా మాయ'. ఏదైతే లేదో అదే మాయ. ఉన్నది బయలు, లేనిది ఎరుక. 'ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే కదరా ఓ యన్నా!'. ఎన్ని పేర్లతో పిలుస్తున్నావు? 'ఎఱుకన్న, మాయన్న, మనసన్న ఒకటే కదరా ఓయన్నా'.

        'నామాట తెలిసుంటివేని మరి నీవు ఎఱుకనంటకు ఓయన్నా'. సులభంగా చెప్పేశాడు ఒక్క మాటలో. దేశికేంద్రుడు ఏమి చెప్పాడు? ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే కదరా ఓ యన్నా. మరి నీవు ఎఱుకనంట బోకన్నా. అంటకుండా ఉంటే ఏమైపోయావు, బయలై పోయావు. పరబ్రహ్మమై పోయావు. శాశ్వత స్థితిని పొందావు. అప్పుడేం తెలిసింది?

        'మాయా పరిభ్రామితః'. ఏంట్రా పద్యాలు చదువుతున్నావు అని పిల్లాడిని లేపావు. వాడిచేత Twinkle Twinkle little star అని స్కూల్లో బాగా వల్లెవేయించారు. ఆ డ్రిల్లింగ్‌ వాడిమీద ఎంతగా వుందినిద్రపోతూ చెప్తాడు. పద్యం చెప్తాడు. 'ఉప్పుకప్పురంబు ఒక్క పోలికనుండు' అంటూ పడుకుని కలవరిస్తుంటాడు. నీవు కూడా కార్యోపాధిలోనూ, కారణోపాధిలోనూ ఈ తీరుగానే ఉన్నావు.

        ఈ రకమైనటువంటి స్వప్న భ్రాంతి కలిగిందయ్యా నీకు. ఎప్పుడు పోయింది? 'స్వప్నే జాగృతి వా య ఏష పురుషః' మేల్కోగానే లేకుండా పోయింది. ఈ జగత్తు నీ యొక్క స్వప్నం. ఆ సృష్టి నీ యొక్క స్వప్నం. సంకల్ప ప్రభావితం. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ సుఖం ఉంది. అక్కడ దుఃఖం ఉంది. అంటే అది నీ స్వప్నం. వాస్తవానికి అవేమీ లేవు.

        ఎందుకని? వాస్తవానికి నువ్వే లేవు. ఈ సత్యాన్ని గ్రహించినవాడవైతే, ఇప్పుడు మానవుడు, బ్రహ్మనిష్ఠుడైనటువంటివాడు, బ్రహ్మర్షి గృహస్థాశ్రమం స్వీకరించాలా మానెయ్యాలా?

        ఈ కలవరపాటులో ఏది చేస్తే ఏమిటి? ఏది చేయకపోతే ఏమిటి? పద్యం పాడితే ఏమిటి? పాడకపోతే ఏమిటి? 'స్వప్నే జాగృతి వా య ఏష పురుష'.

        మేలుకోవడం ప్రధానం. శాశ్వత స్థితియందు మేలుకోవడం ప్రధానం. కాలాన్ని దాటడం ప్రధానం. కాలాతీత స్థితిలో ఉన్న బయలులో నిలబడి వుండటం ప్రధానం. అట్టి పరశివతత్వంలో మేల్కోవడం ప్రధానం. మిగిలినదంతా ఏమిటి? 'మాయా పరిభ్రామితః'. ఇప్పుడు ధనేషణ లెక్కెడెదామా? ధారేషణ, పుత్రేషణ లెక్కెడదామా?

        'మాయా పరిభ్రామితః', దైవఋణాన్ని, ఋషిరుణాన్ని, పితృ రుణాన్ని లెక్కెడదామా? 'మాయా పరిభ్రామితః' సృష్టి స్థితి లయాలని లెక్కెడదామా? జీవేశ్వర జగత్తును లెక్కెడదామా? ఈ మేలుకొలుపు ఎవడికైతే కలిగిందో వాడికెలా తోచిందట

'మాయా పరిభ్రామితః
'స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషః
'మాయా పరిభ్రామితః'
'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'

        అటువంటి మేల్కొల్పు ఇచ్చేటటువంటి దక్షిణామూర్తి స్వరూపానికి సదా వందనం. అటువంటి దక్షిణమూర్తి స్వరూపమైన గురు స్వరూపాన్ని 'తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం' నమః అంటే అర్థం ఏమిటి? ఈ నమః శబ్దం చాలా చోట్ల వస్తుంది.

        మంత్రంబులు త్రివిధంబులు. ఉచ్ఛాటన, మారణ, మోహన, స్వాహాకారంతో వచ్చేటటువంటివి అన్నీ కూడా మారణ మంత్రములు. నమః అని వచ్చేటటువంటివి అన్నీ కూడా మోహన మంత్రములు.

        వశీకరణ మంత్రములు అంటే అర్థం ఏమిటట? 'నమశ్శివాయ' అన్నాం. జగమంతా ఉపదేశం పొందినా పొందకపోయినా 'శివాయ నమః' అనికాని, 'నమశ్శివాయ' అని కానీ జపం చేయవచ్చు. పంచాక్షరీ మంత్ర జపానికి అందరూ అర్హులే. మానవులందరూ అర్హులే.

        అయితే విధి విధానంగా ఉపాసనా క్రమం తెలిసినవాడేమో అంగన్యాస కరన్యాసాలతో చేస్తాడు. అవి లేనివారు నామాంతర స్మరణ జపం చేస్తారు. స్మరణకి, శ్వాసతో సమంగా చేయడం గాని, స్మరణకి అంగన్యాస కరన్యాసములకు విధి విధానములు గాని లేవు.

        సదా సర్వకాలములందు శాశ్వతో సమంగా స్మరణ చేయడానికి అన్ని నామాలు అర్హమే. నమః అనే శబ్దం ఎక్కడెక్కడైతే వచ్చిందో 'నాయనా నీకు వశవర్తినై వుంటాను' అని చెప్పడం. ఏం చెప్తున్నామండి? ఇపుడు నా వశంలో నేను ఉన్నాను. నీ వశంలో నువ్వు ఉన్నావా లేదా? అది కూడా లేదంటే ఆలోచించాలి.

        లేకపోతే నీవు సాధకుడివే కాదన్నమాట. కనీసం నా వశంలో నేనున్నాను అంటే నీకు నాలుగు లక్షణాలు వుండాలి. శమం, శమం అంటే ఇంద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేంద్రియ, అంతరేంద్రియాలు అన్నీ కూడా నా వశమై వున్నాయి. అవి నేను చెప్పినట్లే నడుస్తాయి. ఇది శమం అంటే.

       రెండవది ఆత్మ విచారణ. నేను ఆత్మ నిష్ఠుడను, ఆత్మ స్వరూపుడను, నామరూపాత్మకమైన శరీరం నేను కాదు, శరీర ప్రాణేంద్రియ సంఘాతం నేను కాదు, ఈ సమూహం నేను కాదు. నేను సర్వకాలమందు ఆత్మ తీరుగా ఉన్నటువంటి ప్రజ్ఞా స్వరూపుడను, చైతన్య స్వరూపుడను, సాక్షీ స్వరూపుడను. ఇట్టి ఆత్మ విచారణ నిష్ఠ కలిగి వుండటం రెండవ quality.

        మూడవ quality సంతుష్టి. అంటే అర్థం ఏమిటి? 'యల్లభతే' ఏదైతే లభించిందో అదే చాలు. ఈశ్వరానుగ్రహం. నాకు రెండవ ఆలోచన లేదు.

        కారణ స్వరూపం అయిన ఈశ్వరుడే నేను అయ్యుంటే, ఇక నాకు లభించేదేమిటొకటి? సర్వ సృష్టినాదే కదా. ఇది లభించింది, అది లభించలేదు. ఇది జరిగింది, అది జరగలేదు. ఇది చేయబడింది, అది చేయబడలేదు, అవేవి నాకు లేవు.

        నేను బ్రహ్మమును. ఇది సంతుష్టి. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్న సమస్తము కూడా నాకవసరం లేదు. ఇది సంతుష్టి. చీమనుండి బ్రహ్మము వరకు అమీబా నుండి, బ్రహ్మము వరకు, సర్వమూ ఈ సంతుష్టియందు ఇమిడి వున్నాయి. నిత్య సంతృప్తుడు.

        ఇక నాలుగవది సజ్జన సాంగత్యం. ఈ సౌధానికి నాలుగు ద్వారాలున్నాయండి. ఈ నాలుగు ద్వారాల వద్ద నలుగురు పాలకులు వుంటారు. మొదటి పాలకులు శమము, రెండవది ఆత్మ విచారణ, మూడవది సంతుష్టి. నాలుగవది సజ్జన సాంగత్యం.

        యోగావాశిష్ఠంలో చెప్పబడింది. ఈ నాలుగు ద్వారాల ద్వారా మనం ఈ మోక్ష సౌధానికి చేరాలి. ఈ నలుగురు ద్వారపాలకులు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించాలి. సగౌరవంగా ఆహ్వానించాలి. అలా నువ్వు మార్పు చెందాలి.

        కాబట్టి నమః ఇదం. ఈ నమః అన్న శబ్దంలో అంత విశేషం ఉంది. 'నమ ఇదం' అంటే అర్థం. ఈ సర్వ సృష్టి లేనిది అని తెలియబడేంత వరకు. ఎఱుక లేనిది అని తెలియబడేంత వరకు, సంకల్ప శూన్య కాలములు లేనివని తెలియబడేటంత వరకు, మండల త్రయములు లేనివని తెలియ బడేంతవరకు, బయలే సత్యమని బోధపడేటంత వరకు, నిర్ణయ మయ్యేటంత వరకు నీకు వశవర్తినై ఉంటాను. ఎవరికి? సద్గురువుకి.

        నీ శరీర ప్రాణ సంఘాతాన్ని వాడాలి అంటే, ఆ గురుమూర్తి   చెప్పినటువంటి మేరకు లోబడినటువంటిదైతేనే నేను అనుమతిస్తాను. లేకపోతే అనుమతించను. ఎందుకని? నాకు స్వేచ్ఛ లేదయ్యా బాబూ. నేనొకాయనకి దాసానుదాసుడనని ఒప్పుకున్నా. ఎవరికి? ఆ స్వామి గారికి ఒప్పుకున్నా. ఒక స్వామిని ఆశ్రయించా నేను. ఒక దేశికేంద్రుణ్ణి ఆశ్రయించాను. ఒక దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆశ్రయించాను.

        వారు ఇచ్చినటువంటి జ్ఞానపరిధి ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి వశవర్తినై వున్నా. ఎందుకని?

        'శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః' వారికి నాకు అభేదం. కాబట్టి దక్షిణామూర్తితో అభేదస్థితిని నువ్వు పొందాలి. మీ జీవిత లక్ష్యం అది. మానవ జీవిత లక్ష్యాన్ని ఎంత స్పష్టంగా బోధించాడో చూడండి. ఆ దక్షిణామూర్తితో ఎవడైతే అభేద స్థితిని పొందాడో, ఆ పరబ్రహ్మ స్థితిని పొందాడో

      'యః పరస్య మహేశ్వరః తస్య ప్రకృతిలీనస్య' ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి లీనమైపోయిన్పటికీ ఏ మహేశ్వరుడైతే మిగిలిపోయి ఉంటాడో వాడు వీడేనయ్యా. శరీరంలో ఉన్నట్లు తోస్తున్నాడు. కానీ వాడు అశరీరి. వాడు పరబ్రహ్మం. వాడు దక్షిణామూర్తి. వాడు దేశకాలములకు అతీతమైన వాడు. త్రిపుటి ద్విపుటిలకు అతీతమైనటువంటివాడు. తురీయాతీతమైనటు వంటివాడు. తానే లేనటువంటివాడు.

        'తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'. అటువంటి అవతార స్థితికి నాకు అభేదం. అటువంటి సద్గురు మూర్తికి నాకు అభేదం, అటువంటి శ్రీ గురుమూర్తికి నాకు అభేదం.
       కాబట్టి శ్రీ గురువైనా, సద్గురువైనా, అవతారుడైనా నీకనుగ్రహించే టటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే 'మేల్కొలుపు'. 'స్వప్నే జాగృతి వా య ఏష పురుషః'
        మేల్కొన్నాడు. 'మాయా పరిభ్రామితః' అంతా మాయా స్వరూపం కదయ్యా. నేనెవరిని? నేను సర్వకాల సర్వావస్థలయందు కూడా ఒక్క తీరుగా ఉన్నటువంటివాడిని. శాశ్వతుడను. ఏ త్రిపుటి ద్విపుటులు లేవు నాకు.

        ఏం మిగిలిందిక? మౌనవ్యాఖ్య. ఇంకా చెప్పడానికి ఏముంది? దక్షిణా మూర్తితో కలిసిపోయావు. అభేదత. రెండు లేవు. ఒకటి కూడా లేదు. నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. అటువంటి నిశ్శబ్ద బ్రహ్మమయ స్థితిలో ఇంకా బోధించడానికి ఏమన్నా మిగులుందా?