1

1వ శ్లోకం

       విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, నిజాంతర్గతం
       పశ్యన్నాత్మని మాయయా బహిరివోర్భూతం యధానిద్రయా
       యత్సాక్షాత్కురుతే ప్రభోదసమయే స్వాత్మాన మేవాద్వయం
       తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||


        ''విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం'' ఇందులో ప్రాణప్రదమైన శబ్దం ఏమిటంటే దర్పణం. విశ్వం అంటే ఏమిటి? ఆద్యంతములు కలిగినది విశ్వం. అంటే ఒక కాలంలో పుడుతుంది. ఒక కాలంలో పోతుంది.

        ఇలా ఆద్యంతములు, ఈ రెండు లక్షణములు కలిగినది ఏదైతో ఉందో అది విశ్వం. వేదాంత చర్చలో/బోధలో ఎప్పుడూ కూడా నాలుగు స్థాయి బేధములుంటాయి.

1. జీవ పద్ధతి : జీవుడికి అన్వయం చేసి చెప్తారు. నేను జీవుడిని అన్న చోటు నుండి బోధ చెప్తారు.

2. ఆత్మ పద్ధతి : నేను ఆత్మననే పద్ధతిలో, ఆత్మకు అన్వయం చేసి చెప్తారు.

3. బ్రహ్మ పద్ధతి : మూడవ స్థాయిలో నేను బ్రహ్మముననే స్థాయిలో అన్వయం చేసి చెప్తారు.

4. పరబ్రహ్మ పద్ధతి : నేను పరబ్రహ్మమును అనే స్థాయిలో అన్వయం చేసి చెప్తారు.

        నేనెవరు? అన్న ప్రశ్న ఒక్కటే, కాని ఆ సమాధానములు ఎన్ని ఉన్నాయి? నేను జీవుడు, నేను ఆత్మ, నేను బ్రహ్మము, నేను పరబ్రహ్మము అనే నాలుగు సమాధానములు వస్తాయి. కాబట్టి తత్త్వ విచారణకు సంబంధించిన ఏ అంశాన్ని స్పృశించినా కూడా ఈ నాలుగు స్థాయిలలో నీకు ఆ బోధ స్ఫురించాలి. అప్పుడు నీకు తత్త్వజ్ఞానం కరతలామలకం అయినట్లు లెక్క. నీవు ఎటువంటి గురువును ఆశ్రయించాలయ్యా అంటే ఈ నాలుగు స్థాయిలలో కూడ నీకు బోధ, స్ఫురణ, స్ఫూర్తిని ఎవరైతే అందించ గలుగుతారో అట్టి సద్గురుమూర్తిని ఆశ్రయించాలి.

        అయితే ఈ నాలుగు స్థాయీ బేధాలను నీకు అందించేటప్పుడు నీవు ఏ స్థాయిలో ఉన్నావనేది ముఖ్యంగా స్వీకరిస్తారు. ఎందుకని అంటే నీవు జీవ భ్రాంతి అనే స్థాయిలో జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా చూస్తున్నప్పుడు, నీకు సరాసరి పరబ్రహ్మ నిర్ణయాన్ని చెప్పాలనుకుంటే వీలవుతుందా?

        ఆయన చెప్పగలిగిన సమర్ధుడే అయినప్పటికీ, క్రిందకు దిగకుండా, పైపైన పరబ్రహ్మ నిర్ణయం చెపితే, నీవు అందుకోలేవుగా. అందుకని ఏం చేస్తారు? కొన్ని సూచన వాక్యాలు చెప్తారు. చెప్పేవాటిల్లో ఏముంటాయి? కొన్ని సూచన వాక్యాలుంటాయి. ఈ సూచన వాక్యములన్నీ కూడ పరబ్రహ్మమును బోధిస్తాయి. దాని తరవాత నిర్ణయ వాక్యాలు చెపుతారు. నిర్ణయ వాక్యాలన్నీ బ్రహ్మమును బోధిస్తాయి. దాని తరువాత లక్షణ వాక్యాలు చెబుతారు. లక్షణ వాక్యాలు ఆత్మని బోధిస్తాయి. ఆత్మ బోధను అందిస్తాయి. దాని తరువాత సాధనా వాక్యాలు చెప్తారు. జీవ భావంలో ఉన్నవాడు ఆత్మ  భావాన్ని అందుకోవడానికి ఆ సాధనా వాక్యాలు చెప్తారు. జీవభావంలో ఉన్నవాడు ఆత్మ భావాన్ని అందుకోవడానికి ఆ సాధనా వాక్యాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఏ గ్రంథాన్ని చదివినా, ఏ బోధ విన్నా కూడ వాటిని ఈ పద్ధతిగా విభజనచేసి చూసుకోగల స్పృహ శిష్యునికి రావాలి. అందులో సూచన వాక్యం ఏది? నిర్ణయ వాక్యం ఏమిటి? లక్షణ వాక్యం ఏమిటి? సాధనా వాక్యం ఏమిటి ? అని. ఈ నాలుగు కూడ బోధించేటప్పుడు సద్గురుమూర్తి స్వానుభవ ప్రమాణంతో కూడిన అనుభవ వాక్యం కూడ చెప్తారు. ఎందుకని? లేకపోతే వినేవాడికి విశ్వాసం కలుగదు.

        లేకపోతే వినేవాడు ఇదంతా. Utopian science అనుకుంటాడు. ఇదెప్పటికీ సాధ్యం కాదేమో, ఎక్కడో ఆకాశంలో చెపుతున్నారు. ఇదంతా అయ్యే పనేనా అనే సందేహం కలుగుతుంది. అలా కలగకుండా ఉండటానికి ఏం చేస్తారు? స్వానుభూతితో కూడిన ప్రమాణ వాక్యం చెప్తారు. కాబట్టి నీవు ఏ బోధ విన్నా కూడ, ఈ రకమైన విభజనతో వాటిని అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది.

        ఏ సిద్ధాంత గ్రంథం చదివినా, ఏ లక్షణ గ్రంథం చదివినా, ఏ ఉపనిషత్‌ చదివినా, భగవద్గీత చదివినా, ఏ తత్త్వ జ్ఞానానికి సంబంధించిన గ్రంథం చదివినా, ఏ బోధ విన్నా ఈ రకమైన విభజనను అందులో గ్రహించగలిగే నేర్పును సంపాదించాలి.

        ఈ నేర్పును సంపాదించినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సచ్చిశిష్యుడయ్యే అధికారాన్ని సంపాదిస్తాడు. ఇది శరణాగతి వలన మాత్రమే సాధ్యమౌతుంది. అంటే భౌతికమైనటువంటి ప్రక్రియతో ఇది సాధ్యం కాదు. మానవులలో చాలామంది ఎలా ప్రయత్నిస్తారు? Logic brain, logic mindను వాడతారు. బుద్ధి వికాసాన్ని వాడి, వీటిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎక్కడో ఒకచోట తికమక పడిపోయి ఆ విభజన సరిగా తెలుసుకోలేక గందరగోళంలో పడిపోతారు.

        కాబట్టి ఈశ్వరుడికీ, సద్గురువుకీ శరణాగతుడవై నీవు ఆ బోధను స్వీకరించాలి. దాన్ని జీర్ణం చేసుకోవాలి. దాన్ని విచారణ చేయాలి. దాన్ని నిజ జీవితంలో apply చేయాలి. ఆపాదించుకోవాలి. వాటిని స్వానుభూతి ప్రమాణంగా తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా నీ లోపల జరిగితే, నీవు ఆ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తిచేసి, సరిగ్గా పండుతావన్నమాట. ఇప్పుడు ఆ దృష్టితో నీవు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి పదం యొక్క అర్థం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ వాక్యాలన్నీ కలిపి ఏ లక్ష్యాన్ని సూచిస్తున్నాయో ఆ సూచన వాక్యం తెలుసుకోవాలి. అవి ఏ సాధన ద్వారా సాధింపబడాలో సాధనా వాక్యం తెలుసుకోవాలి. అవి అనుభూతి ప్రమాణంలో, ఏ రకమైన అనుభూతి నిస్తాయో ఆ ప్రమాణ వాక్యం కూడా తెలియాలి.

  కాబట్టి ఒకే వాక్యానికి శబ్దార్థము, వాక్యార్థము, లక్ష్యార్థము, అనుభవార్థము నాలుగున్నాయన్నమాట. ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఆ దక్షిణామూర్తి ఉన్నటువంటి ఈశ్వరీయ మౌనస్థితి పరబ్రహ్మ నిర్ణయము ఏదైతే ఉందో అది ఈశ్వరీయ మౌన స్థితి. ఆ ఈశ్వరీయ మౌనాన్ని అందించే ప్రయత్నం ఈ స్తోత్రంలో చేయబడింది. అది కాలాన్ని దాటినటువంటి స్థితి. కాలాతీతమైనటువంటి స్థితి. 'కాలకాలములయందు వాలాయముగా ఒక్కరీతి' 'లేని పద్ధతి' ఏదైతే ఉందో అది బోధించమని అడుగుతున్నాడు. అట్లా బోధించడం కోసమని దీనిని ఇలా స్వీకరించారన్నమాట.

    కాబట్టి విశ్వం అంటే అర్థం ఏమిటి? ఆద్యంతములు కలిగినది విశ్వం. ఇప్పుడు జీవభావంలో చూస్తే విశ్వం అంటే ఏమిటి? నీకు కనపడే ప్రపంచం, నిన్ను గుర్తించే ప్రపంచం, నీవు గుర్తుపట్టే ప్రపంచం, నీ చుట్టుప్రక్కల జీవరాశితో కూడిన ప్రపంచం, మార్పు చేర్పులకు లోనయ్యే ప్రపంచం దీనినే ప్రపంచం అని అనుకుంటున్నావు. పంచీకృతమైనదంతా ప్రపంచమే. ఎన్ని పంచీకరణలున్నాయి? పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, ఈశ్వర పంచీకరణ. ఈ మూడు స్థాయిలలో పంచీకరణలు ఉన్నాయి.

     కాబట్టి పిండాండ స్థాయిలో చెప్పిన పంచీకరణ జీవభావంలో చూస్తూ కనపడుతున్న ప్రపంచం. బ్రహ్మాండ స్థాయిలో చెప్పబడినటువంటిది పంచభూతాత్మకమైన పంచతన్మాత్రలు, అధిష్ఠాన దేవతలతో కూడిన ప్రపంచం. ఇది సమష్టి. ఈశ్వర స్థాయిలో చెప్పబడినటువంటిది విశ్వం. (విశ్వం అంటే నీకు కనపడేటటువంటి ఇల్లు, నీకు కనపడేటటువంటి పిల్లలు, నీకు కనపడేటటువంటి ఉద్యోగం, నీకు కనపడేటటువంటి ప్రపంచం అందామా? కాదు. Whole universe అనంత విశ్వం. విశ్వం ఏదైతే ఉందో అది అలా ఉంది కదా! లెక్కపెట్టటానికి కొలవడానికి వీలు లేనంతగా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందని అనుకుంటున్నావో అది. ఆద్యంతములతో కూడుకున్నటువంటిది. దానికే ఆద్యంతములు ఉన్నాయంటే నీకు ఉంటాయా, ఉండవా? కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడ ఆద్యంతములతో కూడుకుని ఉంటాడు. జీవ భావంలో ఉన్నప్పుడు ఆది అంతములతో ఉంటాడు. కాబట్టి ఇదేమిటి? ''విశ్వందర్పణ దృశ్యమాన..'' దర్పణ దృశ్యం అంటే ఏమిటి?

        వాచ్యార్థంగా చూస్తే అద్దంలో కనపడిన ప్రతిబింబం. ఈ విశ్వం మొత్తాన్ని ఏ అద్దంలో చూస్తావు. సాధ్యం కాదు కదా! అంటే మౌలికంగా అట్లా అర్థం తీసుకోకూడదని అర్థం. వాచ్యార్థంగా చూస్తే అద్దంలో ప్రతిబింబం. నీ ఎదురుగుండా అద్దం పెడితే, నువ్వు సత్యమా? అద్దంలో ప్రతిబింబం సత్యమా? నేనే సత్యం. నేను సత్యం కాబట్టి నేను బింబం. ప్రతిబింబం అసత్యం. నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రపంచాన్ని ఒక పెద్ద కొండెక్కి చూశావు. చిన్నగా ఉందా? పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. మరి సత్యమా అసత్యమా? (సత్యమే, మన దృష్టికి అలా ఉంది.)

       అంటే సాపేక్ష నిరపేక్ష దృష్టులు రెండున్నాయి. దగ్గరగా ఎదురుగుండా కనపడుతోంది. నీవు ప్రపంచంలో కలసి ఉన్నావు. అప్పుడెలా చూశావు? ప్రపంచంతో పోల్చుకుంటూ చూశావు. అది సాపేక్షం.

       దానిని అధిగమించి, అతీతమైన దృష్టితో సాక్షిగా ఉండి చూసావు. అది నిరపేక్ష దృష్టి. సాక్షికి అతీతమైన దృష్టి, దర్పణ దృష్టి. అంటే అర్థం ఏమిటి?

        ''కొండ అద్దమందు కొంచెమై కనపడదా!'' అన్నాడు వేమన. పెద్ద కొండ ఉంది, ఒక అద్దంలో ఆ కొండను చూశావు. అంత పెద్దకొండ అద్దంలో ఏమైపోయింది? చిన్నగా అయింది.

        ప్రతిబింబం చిన్నగా ఉందని బింబం కూడా చిన్నగా ఉందని చెబుదామామరి ఎప్పుడు తెలుస్తుంది? బింబానికి దగ్గరకు వెళితే తెలుస్తుంది. యధార్థ దర్శనం, ప్రత్యక్ష దర్శనం, సాక్షాత్కార దర్శనం కలిగినప్పుడు దానియొక్క విస్తృతి తెలుస్తుంది.

     అలాగే ఎంతో వ్యాపకంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా ఒక అద్దంలో చూసినప్పుడు ఎలా అయితే ప్రతిబింబ సమానం అయిందో, నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినట్లయితే ఈ ప్రపంచం అంతా నీకు అద్దంలో ఉన్న ప్రతిబింబం వలె కనపడుతుంది.

       ఏ జ్ఞానం కలగాలో తెలియాలి నీకు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ప్రపంచాన్ని గనుక నీవు చూసినట్లయితే, ఈ ప్రపంచం ఎలా కనపడిందట అప్పుడు? అద్దంలో ఉన్న ప్రతిబింబం వలే కనపడింది.

      ఇంకో సాక్షాత్కార జ్ఞానం ఉంది. బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. ఎవరైతే ఆత్మ నిష్ఠలో ఉన్నారో, వాడికి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగింది, బ్రహ్మానుసంధానం చేత. ఆ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానంచేత Solar Network (సౌర కుటుంబం)  (ఒక Solar Network అంతా ఒక  బ్రహ్మాండం.) అంతా అద్దంలో ప్రతిబింబంలాగా కనపడింది.

        ఇప్పుడు మూడవ సాక్షాత్కార జ్ఞానం చెప్తున్నారు. ఏమిటది?

        బయలును దర్శించాడు, ఆ బయలును ఎప్పుడైతే దర్శించాడో, అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమంతా కొంచెమైపోయి, దర్పణ దృశ్యంగా కనపడుతుంది. అంటే విశ్వమే ఏర్పడక ముందు ఉన్న స్థితిని దర్శించగలిగాడు. విశ్వమే లేనటువంటి స్థితిని దర్శించగలిగాడు.

     ఎవరైతే ఇట్లా విశ్వం ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితిని, విశ్వం లేకుండా ఉన్నటువంటి స్థితిని దర్శన రూపంలో పొందారో, వారు దేశికులు. కాబట్టి ఈ దేశికులకు కలిగినటువంటి దృష్టి దర్పణ దృష్టి. దర్పణ విద్యా విధానము అని ఒక ప్రత్యక్షమైన విద్యా విధానము ఉంది.

        దృక్‌ దీక్షా సాంప్రదాయం అని అంటారు దీనిని. ఈ దృక్‌ దీక్షా సాంప్రదాయం ద్వారా ఒక అద్దాన్ని ఆధారంగా చేసుకుని, అద్దంలో కంటిని ఆధారంగా చేసుకుని, కంటిని ఉద్దేశించి పంచీకరణ ద్వారా ఒక కంట్లోనే మొత్తం అన్నీ చెప్తారు.

        మంత్రపుష్పంలో  'నీవార శూక వత్తన్వీ పీతాభాస్వత్యణుపమా, తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శ్శివ స హరి స్సే న్ద్రస్సోక్షర పరమస్స్వరాట్‌!!
అని మంత్ర పుష్పంలో చదివి వినిపిస్తారు. ఏ గుడికి వెళ్ళినా ఇదే చదివి వినిపిస్తారు.

        అక్కడ మనం దీనిలోని విశేషాన్ని గుర్తించామా? లేదు. (ఎందుకని  ఆయన ఏదో చదువుతాడు, చేతిలో పూలు పెడతాడు, ఆ టైంకి పూలు వేయమంటాడు, వేసేస్తారు.) ఆయన చదివే మంత్రపుష్పాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు. తెలుసుకోవాలి కదా! పరమాత్మ ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు ఇది సమాధానం చెబుతోంది.

మంత్రపుష్పం అర్థం :

నీవార శూకమంటే వరిముల్లు. అటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రం ఎక్కడుందంటా? కంటికి మధ్యలో ఉంది.

        'పీతాభా స్వత్యణుపమా!' బంగారపు వన్నెలా ఉంది, మెరుపు వలే ఉన్నది. అణు స్వరూపంగా ఉంది. ప్రకాశిస్తోంది. మెరుపు వంటి ప్రకాశం కలిగి ఉంది. అది చిదగ్ని స్వరూపం. ఇప్పుడు చెప్పిన స్థానం చిదగ్ని స్థానం. ఈ చిదగ్నికి ఒక శిఖ ఉందట. చిదగ్ని అన్నా, దహరాగ్ని అన్నా రెండూ ఒకటే. ఈ దహరాగ్నికి మధ్య స్థానమందు ఆకాశం ఉందట. దానిని దహరాకాశం అంటారు. ఈ దహరకాశ మధ్యస్థానంలో పరమాత్ముడు ఉన్నాడు. ఆయన ఎటువంటివాడు? స బ్రహ్మ, స శివ, స హరి, స ఇంద్ర. ఎంతమంది దేవతలనైతే చెపుతున్నామో ఆ దేవతాగణములన్నీ ఆ పరమాత్మ యొక్క అంశీభూతములే. ఇంకా అక్షరుడు. 'సోక్షర పరమ స్వరాట్‌'. స్వరాట్‌కు పరమైనవాడు. మరి వీళ్ళందరూ ఎవరు?

        విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ. ఈ నలుగురూ జీవ శరీరాలకు సాక్షులు. ఈశ్వర తనువులు నాలుగున్నాయి. విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈ నాలుగు ఈశ్వర తను చతుష్టయము. జీవతను చతుష్టయము నాల్గింటికీ ఈశ్వర తను చతుష్టయము అధిష్టానము. జీవులయొక్క స్థూల శరీరము, స్థూల ప్రపంచము, స్థూల వ్యవహారమునకు అధిష్టానం ఎవరు? విశ్వుడు.

        పైన ఏమన్నారు? ''విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ..'' కాబట్టి ఎవరిని దృశ్యంగా చూశాడట? విరాట్‌ స్థితినుండి చూసినప్పుడు ఈ విశ్వుడు అన్న స్థితి ఎలా కనపడింది? దర్పణ దృశ్యంగా కనపడింది. బింబం ఎవరు ఇప్పుడు? విరాట్‌ ప్రతిబింబం విశ్వుడు. ఇంకొంచెం ఎదిగాడు. సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ వ్యవహారం, దానికి సాక్షి తైజసుడు. బింబం హిరణ్యగర్భుడు. ప్రతిబింబం తైజసుడు. ఇంకా ఎదిగాడు. కారణ శరీరం, కారణ ప్రపంచం, కారణ వ్యవహారం, దీనికి సాక్షి ప్రాజ్ఞుడు. ప్రజ్ఞా స్వరూపుడు. ఇతడు ప్రతిబింబం. బింబం అవ్యాకృతుడు. ఇంకా ఎదిగాడు. మహా కారణ శరీరం, మహా కారణ ప్రపంచం, మహాకారణ వ్యవహారం. దీనికి సాక్షి ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మ ఎవరి ప్రతిబింబం? పరమాత్మ. కాబట్టి బింబపరమాత్మకు ప్రతిబింబం ప్రత్యగాత్మ.

        భగవద్గీతలో ఏం చెప్పాడు? నేను అన్నింటికీ అతీతంగా ఉన్నాను. కాని అందరి హృదయములలో ఉన్నాను. అందరి హృదయములలో పరమాత్మ ఉన్నాడనేవాడు ఎవడు వాడు? ప్రత్యగాత్మ. ఎవరైతే ఈ జీవతను చతుష్టయాన్ని, ఈశ్వర తను చతుష్టయాన్ని తెలుసుకుని, జీవ తను చతుష్టయాన్ని ప్రతిబింబ సమానంగా చూసి, ఈశ్వర తను చతుష్టయాన్ని తెలుసుకోగలిగే వాడున్నాడో, ఎవరైతే ఈ పద్ధతిగా పరమాత్మ నిర్ణయాన్ని తెలుసుకోగలిగాడో వాడికి ఏమైంది? ''విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం.''

        నిజాంతర్గతం అంటే ఏమిటి? ఆ అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా, తాను పరమాత్మననే స్థితిని పొందినవాడు. ఎవరైతే పొందారో, అది నిజాంతర్గతం. ఆ నిజాంతర్గతమైన పరమాత్మ స్థితిని, పరబ్రహ్మ నిర్ణయాన్ని అందుకున్న వాడికి ఏమైందట

''విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం...''
''పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా''

        ఇలా చెప్పినప్పుడు సిద్ధాంతపరంగా మాత్రం అర్థమైంది. నీకు అర్థం కావడానికి ఒక పోలిక చెప్పారు. దీనికి స్వానుభూతి ప్రమాణాన్ని అందించాలి కదా! అందించడం కోసం ఏం చెప్పారు?

        ''పశ్యన్నాత్మని మాయయా'' లక్షణ వాక్యం చెప్పారిక్కడ. 'పశ్యన్‌' అంటే చూడటం. ఎలా చూస్తాడు ఆత్మ స్వరూపుడు మాయని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. ఎవరైతే ఆత్మ నిష్ఠుడిగా ఉన్నాడో, ఆ ఆత్మ నిష్ఠుడికి ఈ ప్రపంచం అంతా ఎలా ఉందట? మాయగా ఉంది. మాయ అంటే లేనిది. దాని సూత్రం 'యామాసా మాయ.' 'యా' అంటే ఏదైతే, 'మా' అంటే లేనిదో, '' అంటే అదే. ఏదైతే లేనిది ఉన్నట్లుగా తోపింపజేస్తోందో అదే మాయ. కాబట్టి ఆత్మ నిష్ఠుడైనటువంటి వాడికి నిజం తెలిసిపోయిందిగా.

        ఏం తెలిసింది? జగత్‌ జీవేశ్వరులు అనేటటువంటి త్రయం లేరు అని. ఆత్మ నిష్ఠుడికి జగత్‌ జీవేశ్వరులు లేరు. ఎవడైతే ప్రత్యగాత్మ స్థితికి చేరాడో, వాడికి జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే భేదం లేదు. వాడు త్రిపుటికి అతీతంగా ఉన్నాడు. వాడికి ఈ త్రిపుటితో కూడిన ప్రపంచం ఎలా కనపడిందట? మాయగా కనపడింది.

       ''పశ్యన్నాత్మని మాయయా'' లక్షణ వాక్యంగా అర్థమైంది. ఇప్పుడు దానిని జీవ భ్రాంతిలో ఉన్నవాడికి అర్థమయ్యేట్లు చెప్పాలి. ఎలా చెప్తున్నారు? ''బహిరివోద్భూతం యధానిద్రయా'' అంటే నీవు గాఢ నిద్రావస్థలో ఉన్నావు. అప్పుడు ఈ పంచ భూతాత్మకమైన ప్రపంచం ఏమైపోయింది? లేదు. కానీ కళ్ళు తెరిచి బయటకు వచ్చాం. అంతా ఉందిగా. అంతకుముందు లేనిది ఇప్పుడు ఎక్కణ్ణించి వచ్చింది? బహిరివోద్భూతం యధానిద్రయా అన్నాడు. బయటకు వచ్చిందయ్యా, ఈ ప్రపంచం అంతా నీవు లేచేప్పటికి బయటకు వచ్చింది. ఎక్కణ్ణించి వచ్చిందది? నిద్రలో ఈ పంచ భూతాత్మకమైన ప్రపంచం నీలోపలే లయమై పోయింది. లయమై పోయిన ప్రపంచం నీవు సంకల్పం చేస్తే, మేలుకోగానే మరల వ్యక్తమైంది. నీ లోపలికే లయమై పోతోంది, మరల నీ నుంచే వ్యక్తమౌతోంది. కాబట్టి ఏమన్నారు? 'బహిరివోద్భూతం యధానిద్రయా'. మెలకువగా ఉన్నంత సేపూ ప్రపంచం అంతా ఉన్నట్లే వ్యవహరిస్తున్నాడు. నిద్ర పోయేటప్పటికి ఏమైంది? ఆ ప్రపంచం అంతా తనలో లయం అయిపోయింది. మరల ఆ సాక్షి యొక్క సంకల్పంతో నిద్ర లేచాడు. ఆ నిద్ర లేచేప్పటికి ఏమైంది? తననుంచే ఆ ప్రపంచం అంతా వ్యక్తం అయింది. నిద్రలోనేమో తనలో ఇమిడిపోయింది. తనలో లయం అయిపోయింది.

      వేరే దగ్గరకు ఎక్కడికైనా పోయిందని చెప్పగలమా? కాబట్టి నీ ప్రపంచం అంతా ఎందులోకి లయమై పోయింది? నీలోకే లయం అయిపోయింది. సాక్షిలోకి లయం అయిపోయింది. నిద్రకు సాక్షిగా, ప్రత్యగాత్మగా నీవున్నావు.

        ప్రత్యగాత్మ స్థితిలో నీలో లయం అయిపోయింది. మళ్ళీ మేలుకున్నావు. ఈ ప్రపంచం అంతా నీలోనుండి వ్యక్తం అయింది. కాబట్టి మేలుకుని ఉన్నప్పుడు వ్యక్తంగా కనబడుతోంది. గాఢ నిద్రావస్థలో అవ్యక్తంగా ఉంది. మధ్యలో వ్యవహరించీ వ్యవహరించనట్లుగా ఉంది. కలలో వ్యవహరిస్తున్నట్లుగానూ ఉంది. మరల కలలో ఏమీ చేయనివాడి గానూ ఉన్నావు.

        మరి కలలోనే అలా ఉంటే మరి నీ మెలకువలో ఎలా చేస్తావు? కాబట్టి ఇక్కడ కూడ చేసి చేయని వాడిగానే ఉన్నావు. ప్రపంచమే లేనిది అంటుంటే, ప్రపంచంలో చేసే పనులు ఎలా సత్యం అవుతాయి? ప్రతిబింబమూ, ప్రతిబింబ వ్యవహారం లేదంటే ప్రతిబింబ  ఉనికి ఎలా సత్యం అవుతుంది? బింబానికి ఉనికి ఉంటుంది గాని, ప్రతిబింబానికి ఉనికి లేదుకదా!     ఉనికి లేనిది వ్యవహరిస్తుందా? వ్యవహరించనిది లయం అవుతుందా? కాబట్టి ఈ మూడూ లేనివే కదా!

      ప్రతిబింబ స్థితిలో ఉనికి లేదు, వ్యవహారం లేదు, లయమూ లేదు. ఎప్పుడూ ఏది ఉన్నదట? కేవల బింబ భావమే ఉన్నది. అభావంగా ఉంది. ఇప్పుడు బింబము ఏ స్థితిలో ఉంది? అభావ స్థితిలో ఉంది.

        ఆ అభావ స్థితికి సాక్షిగా నీవున్నావు. నీవెలా ఉన్నావు? అభావ స్థితికి సాక్షిగా వున్నావు. అభావ స్థితికి సాక్షిగా ఉన్నవాడు ఒక భావంచేత ఎలా కొట్టుకుపోబడ్డాడు? కాబట్టి అలా కొట్టుకుపోతున్నాడు అనేది అంతా మాయ.మారని నేనే సత్యము, మారేదంతా మాయ. కానీ ఎప్పుడు మాయ? నీవు మార్పుచెందని స్థితిలో ఉన్నప్పుడు.

        అంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలను ప్రతిబింబాలుగా చూసేటటువంటి విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మల స్థితులలో నీవు ఉన్నప్పుడు. ఉండీ ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులని నీవు తెలుసుకోవాలి. బింబ ప్రతిబింబాలు వేరుకావుగా. బింబం ఉంటేనే కదా ప్రతిబింబం. అది కూడ ఎప్పుడుంది?

        అభావ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ, భావ స్థితిలోకి దిగివచ్చి, సంకల్పాలు పూనితే ప్రతిబింబాలు కనపడ్డాయి. విశ్వం కనపడింది. లేకపోతే అసలు ఆ విశ్వం లేదు కదా! కాబట్టి విశ్వమే లేనిది. పరమాత్మ స్థితినుండి చూస్తే విశ్వమే లేనిది.

'యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం' ఇది ఎప్పుడు తెలియాలి నీకు?
'యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయేగురువుగారు బోధించే దశలోనే నీకీ దర్శనం కలగాలి. ఎవడైౖతే గురువుగారు బోధించే సమయంలోనే ఈ దర్శనాన్ని పొందాడో, యస్సాక్షాత్‌ అంటే ఎలా ఉన్నది అలాగే చూడగలడు. బోధా సమయంలోనే ఎలా ఉన్నది అలాగే చూడగలిగే దర్శన సిద్ధి కలిగిన సచ్చిష్యుడు ఎవడైతే ఉన్నాడో వాడు ''ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం'' 

        ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులని తెలుసుకోగలుగుతారు. ప్రత్యగాత్మ, పరమాత్మ రెండు చోట్లా ఆత్మ శబ్దాలే ఉన్నాయి. ఆత్మయొక్క ద్వయ స్థానములవి. ''స్వాత్మాన మేవాద్వయం'' ద్వయమా అద్వయమాఇప్పుడు అద్వయమయింది.

        ప్రబోధ సమయంలో దర్శన సిద్ధి కలిగేప్పటికి ఈ ప్రత్యగాత్మ, పరమాత్మ  రెండూ అభిన్నులయ్యారు. ఒక్కటే అయిపోయింది. ఈ ప్రతిబింబం వెళ్ళి బింబంలో  కలిసిపోయింది. అసలు ప్రతిబింబమే లేనిది ఎలా కలుస్తుంది? ప్రతిబింబం అంటే లేనిది కదా! బింబం అంటే ఉన్నది కదా! ఉన్నదాంట్లో లేనిది ఎలా కలుస్తుంది?

        కాబట్టి జీవేశ్వరైక్యం అనేది గాని, జీవ బ్రహ్మైక్యం అనేది గాని లేనిది. ఎప్పుడైతే పరమాత్మ స్థితికి చేరావో, పరమాత్మ స్థితినుండి చూసేప్పటికి జీవేశ్వరైక్యం, జీవ బ్రహ్మైక్యం అని చెప్పే బోధా పద్ధతి అంతా లేనిదై పోయిందిప్పుడు.

        ఆ సాధనలన్నీ లేనివయ్యాయి. ఆ బోధలన్నీ లేనివి అయిపోయాయి. ఆ దర్శనాలన్నీ లేనివి అయిపోయాయి. ఆ సిద్ధస్థితి అంతా లేనిది అయిపోయింది. ఆ జ్ఞాన పద్ధతులన్నీ లేనివి అయిపోయాయి.

        జ్ఞానాతీతమైన పరమాత్మ స్థితికి చేరిపోయాడు. తురీయాతీతమైన పరమాత్మ స్థితికి చేరిపోయాడు. పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడుతురీయాతీతంగా ఉన్నాడు. కాబట్టి ఆ తురీయాతీతం అనేటటువంటి స్థితిలోకి చేరుకునే సరికి ఏమయ్యాడు? ''యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం''

        ఎప్పుడో తెలియడం కాదు. ఆ సద్గురుమూర్తి బోధించే కాలంలోనే ఆ దర్శన స్థితిని పొందాడు. తద్వారా ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అని తెలిసి, నేను పరమాత్మని అనే నిర్ణయంలో స్థిరంగా ఉండిపోయాడు. ఈ విశ్వం అంతా లేనిదే అని దర్శించాడు. అటువంటి గురుమూర్తి ఎవరు? ఈ ప్రబోధించినవారు, దక్షిణామూర్తి. సహజ స్వరూపమే గురుమూర్తి.
''తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే''

        ''ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే'' ఈశ్వరుడే అందరికీ గురువు. నామరూప భేదం లేదు గురువులో. అందువల్ల ఆ దక్షిణామూర్తే సద్గురుమూర్తిగా వచ్చాడు. ''తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'' అటువంటి దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తికి నమస్కారం.

        Final గా అంతా లేనివే అయినప్పటికీ, నీవున్నావు బింబ ప్రతిబింబాల దగ్గర్నుండీ మొదలుపెట్టి నీవే ఉన్నావు. ఆ నీవే లేనివాడివి అయిపోతే, అంతా లేకుండా పోయినట్లే. భావం నుండి అభావం అన్నారు. మనసు ఉంటేనే కదా భావం ఉండేది. సాక్షాత్కారం పొందనిదే, మనో పరిధిలో నీవు ఆలోచించినంతసేపూ ఎప్పటికీ పరిష్కారం రాదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయంలో విచారణ చేస్తుంటే, అది ఎప్పటికీ తెలుసుకోలేవు. దానిని దాటి దానికి సాక్షి అయిన జ్ఞాతగా నిలబడితేనే తెలుసుకోగలుగుతావు. అంటే Logic తో అయ్యే పని కాదు ఇది. కాబట్టి సిద్ధాంత విచారణ చేసి, నిర్ణయం చేసేద్దామంటే అయిపోతుందా? కాదు. కాబట్టి ఎప్పటికైనా నీవు ముందు జ్ఞాతవి అవాలి. తరువాత సమష్టి సాక్షి అయినటువంటి కూటస్థుడివి అవాలి. తరువాత ఈ జ్ఞాత కూటస్థుడు అభిన్నులని తెలియాలి.

      ఇదంతా స్వానుభూతి ప్రమాణంలో తెలియాలి. అప్పుడే ఈ నిర్ణయాన్ని పొందగలుగుతావు. కూటస్థ స్థితికి చేరితే తప్ప అభావ నిర్ణయం తెలియదు.

ప్రశ్న : ఇప్పుడు వ్యక్తమైనదంతా దృశ్యమే. అవ్యక్తం కూడ దృశ్యమేనా? అది కన్పించదు కదా!
జ: అవ్యక్తం కూడ దృశ్యమే. కాని అది నీవు దానికి సాక్షివయినప్పుడు తెలుస్తుంది.

        ఇంతవరకే చూస్తున్నావు కాబట్టి ఇక్కడి వరకే చెప్తున్నావు. ఇప్పుడెలా? 'యధానిద్రయా' నీ లోపల కలిసిపోయినవి అన్నీ. మరి కలసి పోయినప్పుడు అవ్యక్తమేగా. సాక్షిగా ఉన్నావు నిద్రలో. అప్పుడు అవ్యక్తం కూడ లేనిదేగా. అట్లా ఎదగాలి.

ప్రశ్న : దృక్‌ దృశ్య వివేకం కూడ ఇంతేనా?
జ: ఇంతేగాని ఇంత సులభంగా ఆ పని అవదు.

ముందు 1. నిత్యానిత్య వివేకం. 
తరువాత 2. ఆత్మానాత్మ వివేకం. 
తరువాత 3. కార్యకారణ వివేకం. 
తరువాత 4. సదసత్‌ వివేకం. 
ఆ తరువాత 5. దృక్‌ దృశ్య వివేకం. 

ఇలా ఒక్కో వివేకం ద్వారా పరిణామం చెందాలి.కార్య కారణం ప్రకృతి అనడమనేది సమిష్టిలోనిది, వ్యష్టి కాదు.

ప్రశ్న : కాలం కూడ లేనిదే అవుతుందా?
జ: కాలాన్ని దాటితే, కాలాతీతమైన స్థితిలో చూస్తే, దేశికులు అయిన వారికి కాలం లేనిది.

      మనం మెలకువలో కూడ కలలాగా ఉండాలి. ఏ సమయంలోనైనా ఒక్కటే ఉంది. either విశ్వం or ఆత్మ. ఈ రెండూ ఒక్కచోటే ఉన్నాయి. ఒకటి కనపడుతుంది. ఒకటి కనడపటం లేదు. ఆత్మ, ప్రపంచం రెండూ ఒకచోటే ఉన్నాయి. కానీ మనకి ఏమీ కనపడుతోంది? ప్రపంచం కనపడుతోంది. ప్రపంచం కనపడినంతసేపూ ఆత్మ కనపబడదు. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఆత్మ దృష్టితో చూడటం వచ్చిందో, వాడికి ప్రపంచం కనపడటం లేదు. ఆత్మే కనపబడుతుంది. ఎవరికైతే పరమాత్మ స్థితి కలిగిందో, వానికి అనంత విశ్వం లేనిదై పోయింది. జీవుడుగా, ఒక శరీరధారిగా, ఒక ప్రపంచంలో, ఒక దిశలో, ఒక చోట జీవిస్తున్నటువంటి నీకు విశ్వం ఎలా ఉంది? అనంతంగా తోచింది. Universe is infinite అంటున్నావు. కాని పరమాత్మ స్థితినుండి గనుక చూసినట్లైతే ఆ విశ్వం అంతా ఏమైపోయిందట? లేనిదైపోయింది. ఎలా?

        ఉదా : మీ ఇల్లు ఉంది. నాలుగు గోడల మధ్యలో ఇంట్లో ఉన్నావు. బయట అంటే ఎటు చూపెడతాం? అవతల ఉన్నదంతా బయట. బయలు అయినది విశాలమైనది గదా మరి. బయలులో నీవు ఇల్లు కట్టుకున్నావు. నీవు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన బయలుకి ఏమైనా పరిమితులు వచ్చాయా? రాలేదు. కొంతకాలం తరువాత ఇల్లు పడిపోయింది. అప్పుడు కూడ బయలే ఉంది. ఇల్లు కట్టినప్పుడూ, లేనప్పుడూ కూడ బయలే ఉంది. బయలు ఎల్లప్పుడూ ఉంది. వ్యాపకంగా అంతటా ఉంది.

        శరీరమనే ఇల్లు వచ్చింది. అందులో నేను అనే జీవుడొచ్చాడు. ఈ శరీరం అనే ఇల్లు పడిపోయింది. అప్పుడు బయలుకేమన్నా మార్పు ఉందా? అలాగే పంచభూతాలు అనే ఇల్లు వచ్చింది. కొంతకాలం తరువాత పంచభూతాలు పోయినాయి. అప్పుడు బయలుకు ఏమైనా తేడా ఉందా? నక్షత్రాల సముదాయంతో కూడిన విశ్వం వచ్చింది. గెలాక్సీలు, నెబ్యులాలు, ఎన్నిటితో కూడి చెప్తున్నామో, వాటన్నిటితో కూడిన విశ్వం బయలులో వచ్చింది. బయలు అంటే అంతరిక్షం. ఆ అంతరిక్షంలో విశ్వం వచ్చింది. కొంతకాలం తరువాత విశ్వం పోయింది. అంతరిక్షానికి ఏమైనా కొరత పడిందా? అంతరిక్షం ఎప్పుడూ అంతరిక్షమే. కాబట్టి పరమాత్మ ఎప్పుడూ పరమాత్మే. బయలు ఎప్పుడూ బయలే. వచ్చిపోతున్నది ఏమిటి? విశ్వం అనే ఎరుక.  బ్రహ్మాండం అనే ఎరుక, పిండాండం అనే ఎరుక. 

'ఎరుక అన్నా మాయ యన్నా ఒకటే కదరా ఓ యన్నా'.
రెండూ వేర్వేరుగా లేవు. ఎరుక అన్నా, మాయ యన్నా, మనసు అన్నా ఒకటే, మూడూ ఒక్కటే.

ప్రశ్న : ఉన్నదంతా శూన్యం అనుకోవాలా ? చైతన్యం అనుకోవాలా ?
జ: నీ దర్శన స్థితి ఎక్కడిదాకా ఉన్నది అనే దానినిబట్టి శూన్య నిర్వచనం.

పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణ ముదచ్యతే! 
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే!!

        కాబట్టి ఉన్నదెప్పుడూ పూర్ణమే. పూర్ణము నుండి పూర్ణము ఉద్భవించినా పూర్ణమే. పూర్ణము నుండి పూర్ణము తీసివేసినా పూర్ణమే. పూర్ణమందు పూర్ణము లయమయినా, అదీ పూర్ణమే. ఎల్లప్పుడూ పూర్ణమే.అంతఃశూన్యం, బహిః శూన్యం, మధ్యశూన్యం, శూన్యకుంభం ఇవాంభరే ఎన్ని శూన్యాలున్నాయట? నాలుగు. అంటే అర్థం ఏమిటట. శూన్యంలో ఒక కుండ పుట్టింది. కుండ పోయింది. శూన్యం ఎప్పుడూ శూన్యమే. పూర్ణం అన్నా, శూన్యం అన్నా రెండూ ఒక్కటే. కాబట్టి చిట్టచివరి స్థితిలో మూడుంటాయి.

        బ్రహ్మనిష్ఠ కలిగినటువంటివాడు పరబ్రహ్మ నిర్ణయం పొందేటప్పుడు మూడు ఉంటాయి. ''సంకల్పం, శూన్యం, కాలం''. కాలం దాటితే పరబ్రహ్మమే. సంకల్పము - సంకల్పాతీతము, శూన్యము - శూన్యాతీతము, కాలము - కాలాతీతము అనే స్థితులు ఎవడైతే దాటతాడో, వాడు బయలు స్థితికి చేరినవాడు. వాడు పూర్ణస్థితికి చేరినవాడు. వాడు ఆ బయలును దర్శించి ఆ బయలు స్థితిలో ఉండిపోయాడు. అంతరిక్ష స్థితిలో ఉండిపోయాడు. వాడు శూన్యాన్ని దాటినవాడు. కాలాన్ని దాటినవాడు. సంకల్పాన్ని దాటినవాడు. ఇట్టి వాళ్ళందరూ ఎవరిప్పుడు? ఆ పరబ్రహ్మ నిర్ణయం పొందినవారు. 'పరాత్పర పరబ్రహ్మ' అన్నారు మెహర్‌ బాబా.

        బ్రహ్మము, పరబ్రహ్మము, ఇంకా అవతలకు చెప్తే పరాత్పర బ్రహ్మము. ఇవన్నీ కూడ జ్ఞాన చక్షువుతోనే దర్శిస్తారా?

        అసలు ఆత్మ సాక్షాత్కారంతో ప్రయాణం మొదలవుతుంది. చివరి దర్శనం బయలు. ఆ బయలు స్థితి తరువాత, నేను అనే వాడుండడు. ముందు చెప్పుకున్న దీపపుశిఖ, శిఖ మధ్యలో ఆకాశం, జ్ఞాన చక్షువుకి సంబంధించినది. అదొక దృష్టాంతరూపక పద్ధతి అన్నమాట. అంటే ఒక దర్పణంలో కన్నును చూపెట్టి, కంటి మధ్యలో ఉన్నటువంటి ఆ వెలుగును చూపెట్టి, ఆ వెలుగుమీద దృష్టి నిలుపుకో అంటారు. అలా నిలుపుకోగా, నిలుపుకోగా, కళ్ళెదురుగుండా అద్దం తీసేసినా కూడ అది కనపడటం మొదలువుతుంది. అలా కనపడటం ఏర్పడటాన్ని ఆర్యాదర్పణం ఏర్పడటం అంటారు.

        ఇట్లా ఆర్యా దర్పణం ఏర్పడటం మొదలైనవాడు ఎవడైతే ఉన్నాడో, వాడికి ఈ పిండ బ్రహ్మాండానికి సంబంధించినదంతా, ఈ ఆర్యా దర్పణంలో కనపడుతుంది. అలా ఎరిగి, దానిని లేకుండా చేసుకుంటాడు. కాబట్టి పిండ బ్రహ్మాండములందు ఏ వ్యవహారం అయితే ఉందో, ఏ నియమం అయితే ఉందో, ఏ లయం అయితే ఉందో, ఏ ఘటన విఘనటలు అయితే ఉన్నాయో, అవన్నీ కూడ ఆర్యాదర్పణంలో దృశ్యంగా చూస్తాడు.

        కాబట్టి అక్కడ చెప్పే దృశ్యం ఏం దృశ్యం? ఆర్యా దర్పణంలో కనపడిన దృశ్యం. జ్ఞాన నేత్రానికి కనపడిన దృశ్యం. నేనెవరు? దృక్‌ స్వరూపుడను. దృశ్యంతో పనిలేదు వాడికి. ఇట్లా ఎదగాలి.

       ఇట్లా ఎదిగి ఎదిగి నాకు మూలమేది అని విచారణ చేయగా, మూలం లేనివాడిగా తేలాడు. అట్లా ప్రయాణం చేసి చిట్టచివరకు తానే లేకుండా పోయాడు. ఈ రకమైన నడకను నేర్పేటటువంటి విధానం ఏదైతే ఉందో దాని పేరు మౌనవ్యాఖ్య. ఇక్కడ బోధించే విధానం లేదన్నమాట. దర్శన విధానం. 'ప్రబోధ సమయే' - అంటే మౌన వ్యాఖ్య అన్నమాట. ఆ దర్శనం పొందాడన్నమాట.

        ''యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మాన మేవాద్వయం''  ప్రత్యగాత్మ, పరమాత్మ అభిన్నులనే దర్శనం పొందాలి.

        మెలకువలో నిద్ర ఎక్కడకు పోయిందో, నిద్రలో ఈ మెలకువ ఎక్కడకు పోయిందో తెలీదు. తెలుస్తుందా? ఆ దర్శన స్థితి కలిగినవాడు సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ సాక్షాత్కార జ్ఞానంవల్ల తెలుస్తుంది.

        వచ్చే నిద్ర పోతుంది, వచ్చే విశ్వం కూడా పోవాలి, పోతోందా? ఆ రకమైన మెలకువను పొందితే పోతుంది. స్థూలంగా నిద్ర పోగొట్టమని చెప్పడం లేదు. దానికి అవతల చూడగలిగే దృష్టి ప్రాప్తిస్తే, ఆ దృష్టి ప్రభావం వలన నీవు మేల్కొంటావు. నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతూ ఉంటాయి. నీవు మేల్కొనే ఉంటావు. నిద్రపోతున్న ఇంద్రియాలకు సాక్షివి. దాన్ని చూడగలుగుతున్నావు. బయటనుండి చూచినవాడికి ఎలా ఉన్నావు? నా వలెనే తాకుచున్నాడు. నా వలెనే పరుండుచున్నాడు. కానీ వాడి లోపల ఉన్నవాడు నిద్రపోతున్నాడా? మేల్కొన్నాడు. అనుభవ రీత్యా, స్వానుభవరీత్యా నీవు అక్కడ మెలకువను గనుక పొందినట్లయితే అప్పుడేమైంది? నీ సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోయినవి. అప్పుడిక నీవు నిద్రపోలేదుగా. నీవున్నావుగా అప్పుడు. అప్పుడు ఈ ప్రపంచమంతా నీలోకే లయమైంది. మరల నీలో నుండే ఈ ప్రపంచం వచ్చింది. కాబట్టి అటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి.

        అట్లాగే బ్రహ్మం నుండి సృష్టి ఉత్పన్నం అయింది. అలాగే ఈ బ్రహ్మములోకే ఈ సృష్టి లయం అయిపోతుంది. ఇది కూడ దర్శనంగా చూడాలి కదా! ఆ రకమైన మెలకువను పొందాలిగా. అలాగే, వ్యాపకంగా ఉన్నటువంటి విశ్వం పరమాత్మ నుండి ఉద్భవించింది. మరల పరమాత్మ యందే లయం అయింది. అది కూడా చూడాలిగా.

        ఇట్లా ఎవరైతే దర్శన రీత్యా ఈ మూడూ ఉన్నవి ఎట్లాగో, లేనివి ఎట్లాగో తెలుసుకున్నాడో వాడు ఇప్పుడు ఉన్నవాడా? లేనివాడా? ఉండీ లేనివాడు. కాబట్టి లేని ఎరుకగా అయిపోయాడు. పరమాత్మ స్థితికి వచ్చే సరికి ఏమైపోయాడు? లేని యెరుకగా అయిపోయాడు.  'ఉన్నది బయలు, లేనిది యెరుక'

        కాబట్టి ఈ అచల సిద్ధాంతంలో మాట్లాడే మాటలు ఈపై స్థితి అన్నమాట. 'రాను యెటులో, పోను యెటులో, అయిన దెటులో, కాని దెటులో' కాబట్టి యెరుకకు రెండు లక్షణాలున్నాయి. రాకడ/పోకడ; అవుట/కాకపోవుట. ఇలాంటి లక్షణాలున్నాయి దానికి.

        అటు పిండాండ పద్ధతిగా కాని, బ్రహ్మాండ పద్ధతిగా కాని, వ్యష్టిగా కాని, సమష్టిగా కాని, విశ్వంగా కాని, ఏ తీరుగా అయినా సరే దానికి రాకడ, పోకడ ఉన్నాయి.

      దానితో సమానంగా నీవు కూడ పెట్టుకుంటే ఏమవుతున్నావు? దానితో పాటే వస్తున్నావు. దానితో పాటే పోతున్నావు. 
మరి నీవెవరివి? యెరుకను మీరిన వాడివి.

        కాబట్టి 'నేను పరబ్రహ్మను, పరమాత్మను. ఆ యెరుక యొక్క స్థితిగతులు నాకు లేవు. నేను లేనివాడను, ఎల్లప్పుడూ లేని పద్ధతిగా యున్నాను'.

        అంతరిక్షంలో ఏమీ కనపడటం లేదు కదా! యెవరికీ! మరేమి కనపడుతున్నాయి? వచ్చే పోయేవి కనపడుతున్నాయి. కానీ యెల్లప్పుడూ వున్నది ఏమిటి? అంతరిక్షం. వచ్చి పోయేవి లేకుండా పోతున్నాయి. కాబట్టి నేను అంతరిక్షాన్నే గాని, వచ్చి పోయేవాడిని కాదు. నేను బయలు.

        విశ్వంమీద ఆసక్తి లేకపోతే దానితో పనిలేదు. స్వస్వరూప జ్ఞానం కలిగింది. భ్రాంతి లేదు. అప్పుడు ఇక దానితో పని యేముంది?

        చిన్నప్పుడు ఆటబొమ్మలతో ఆడుకున్నావా లేదా? ఆట బొమ్మలు సుఖాన్నిచ్చాయా లేదా? ఇప్పుడు ఆడుకోమంటే? ఇష్టం లేదు. బొమ్మలేమన్నా మారినాయా? ఆసక్తులు మారినాయి. నీవు ఎదిగావు. ఆ భ్రాంతి వీడిపోయింది. బొమ్మలు సుఖాన్నివ్వవు అని నీకు తెలిసింది. బొమ్మలు ఆనందాన్ని ఇవ్వవు అని తెలిసిపోయింది. తెలిసేప్పటికి ఆ భ్రాంతి లేకుండా పోయింది. ఏం చేస్తే లేకుండా పోయిందిప్పుడు? అంతకంటే పై స్థితికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, క్రింది స్థితి లేనిది అయిపోవడం లేదూ? యవ్వన కౌమార దశలకు సంబంధించిన జ్ఞానం వచ్చేప్పటికి, బాల్యానికి సంబంధించినవన్నీ భ్రాంతి అయిపోయాయి.   నీవు అట్లా ఆడుకున్నావని ఎవరైనా చెబితే, ఏమంటావు? అది ఏదో తెలియని స్థితిలో అట్లా అయిపోయిందిలే అంటావు.

        ఆ భ్రాంతి, అవివేకం ఎలా పోయాయి? వివేకం ద్వారా పోయాయి.
కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందితేనేమో జగత్‌ భ్రాంతి పోయింది.

        ఆత్మానాత్మ వివేకం ద్వారా జీవభ్రాంతి పోయింది. కార్యకారణ వివేకం ద్వారా జీవేశ్వర భ్రాంతి లేకుండా పోయింది. సదసత్‌ వివేకం ద్వారా జీవబ్రహ్మ భ్రాంతి లేకుండా పోయింది. దృక్‌ దృశ్య వివేకం ద్వారా పరమాత్మ నిర్ణయం కలిగింది. కాబట్టి నిర్ణయాన్నందించింది దృక్‌ దృశ్య వివేకం. దర్శన రూపంగా వచ్చినది ఎల్లకాలం నిలిచిపోయింది. మిగిలిన ఆలోచనలు అయితే చెదిరిపోతాయి గాని, దర్శన రూపంలో జ్ఞాన చక్షువుతో కలిగిన దర్శనం కలకాలము అలా ఉండిపోయింది. అది సరైన జ్ఞానం.

        ఇలా తెలుసుకోవాలి కాబట్టి ఒక్కొక్క వివేకాన్ని పొందాలి. ఒక్కొక్క భ్రాంతిని విడవాలి. కాబట్టి వివేకాన్ని పొందడం ద్వారా భ్రాంతి పోయిందా?
భ్రాంతిని విడవడం ద్వారా వివేకం వచ్చిందా? వివేకాన్ని పొందడం ద్వారానే భ్రాంతి పోతుంది.

        అతి ముఖ్యమైన విషయం ఇదే. మానవుడు ఈ వేదాంత తత్త్వ విచారణా జ్ఞానంతో దీన్ని విడిస్తేనే గాని, దాన్ని పొందలేనని అనుకుంటాడు. చీకటి పోయిన తరువాత వెలుగు వచ్చిందా? వెలుగు వచ్చిన తరువాత చీకటి పోయిందా? వెలుగు వస్తేనే చీకటి పోతుంది. కాబట్టి నిరంతరం నీవు దేనికోసం ప్రయత్నించాలి? ఆత్మ సాక్షాత్కారం కోసం, బ్రహ్మ సాక్షాత్కారం కోసం, పరబ్రహ్మ స్థితికోసం ప్రయత్నించాలి. కాబట్టి నాకు జగత్‌ భ్రాంతి పోవాలి, జీవ భ్రాంతి పోవాలి, అలా పోవాలి, ఇలా పోవాలి అంటే పోతుందా? బాల్యం పోవాలి, పోవాలి అంటే పోయిందా? కౌమార, యవ్వనాలు వస్తే బాల్యం పోయింది. వృద్ధాప్యం వస్తే కౌమార యవ్వనాలు పోతాయి. సహజంగా పరిణామం చెందావుగా. అలానే జ్ఞానంలో కూడ అంతర్ముఖ ప్రయాణంతో, సాధనలతో సహజ జ్ఞానాన్ని పొందాలి. అసహజ పద్ధతులలో సాధించబడేది నిలబడదన్నమాట.

        విచారణా మార్గాన్ని ఎందుకు ఆశ్రయించాలి? పోగొట్టుకోవాలని కూర్చుంటే పోదు, తీసి పారేయటానికి వస్తువు కాదు గదా! కాబట్టి నీకు దానికి సంబంధించిన పూర్ణ జ్ఞానం వచ్చి, వివేకంలో మేల్కొంటే అది లేనిదైపోతుంది. కాబట్టి నిన్ను వివేకంలో మేల్కొల్పేలా చేయడమే గురుబోధా సాంప్రదాయం. ఏ వివేకానికి ఆ వివేకాన్ని అర్థమయ్యేలా చెప్పి, ఆ రకమైన పద్ధతిలో నిన్ను జీవింపజేస్తే ఆ రకమైన భ్రాంతులు దూరమై పోయాయని, నీవే మేల్కొని చెప్తే లేకుండా పోయినాయి. అంతేగా.

        నిద్ర నుండి లేచావు, మరల పడుకో అన్నారు, ఏమంటావ్‌? చాలు, ఇక అయిపోయింది అంటావ్‌. ఇప్పటిదాకా పడుకున్నావుగా, మరల పడుకో అంటారు, ఏమంటావప్పుడు? ఇక అంతా మెలకువే. ఆ! ఒక్కసారి వివేకం వస్తే అవివేకంతో పనిలేదు. జీవభావంతో వ్యవహరించే అవకాశం లేదు. పూర్వం అజ్ఞానంతో, అవివేకంతో కొన్ని పనులు చేశామా లేదా? ఇప్పుడు వివేకం వచ్చిందా లేదా? మరి మరల అలా ప్రవర్తించు చూద్దాం. అలా చేయలేం. ఎందుకని? ఇప్పుడు తెలిసింది కదా! కాబట్టి తెలియదనుటే అజ్ఞానము, తెలియుటే జ్ఞానము. సింపుల్‌గా చెప్పాలంటే తెలియదంటే అజ్ఞానము, తెలుసంటే జ్ఞానము. ఈ తెలుసు అన్నా, తెలియదు అన్నా ఒక తెలివి ఉండాలి కదా! ఆ తెలిసెడి తెలివిని బాయుటయే బ్రహ్మము.

        సులభంగా తేలిపోయింది. కాబట్టి ఇలా నేర్చుకోవాలి జ్ఞానాన్ని. శాస్త్ర పరిభాషలో చిక్కుపడకుండా బయటకు రావాలి. దానిలో చిక్కుపడకూడదు. విడదీసుకుంటూ రావాలి. మొట్టమొదట నిత్యానిత్య వస్తు వివేకంతో మొదలుపెట్టాలి. ఒక్కొక్క వివేకాన్ని పొందుతూ ఎదగాలి. ఎదిగి ఎదిగి లేనివాడవ్వాలి.