9

9వ శ్లోకం

        భూరం భాంస్య నలో నిలోంబర మహర్నాధో హిమాంశుః పుమాన్‌
       ఇత్యాభాతి చరాచాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‌ |
       నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్‌ పరస్మాత్‌ విభోః
       తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

      పంచభూతాల సంగతి చెప్తున్నారు. ఈ సృష్టి మొత్తం అష్టమూర్తులుగా వున్నది. విశ్వం అని చెప్పబడుతున్నదంతా కూడ అష్టమూర్తులుగా వున్నది.

       'అష్టమూర్తి రజాజైత్రీ' అని లలితా సహస్రనామంలో కూడ వస్తుంది. ఆ అష్టమూర్తులంటే ఏమిటో ఇక్కడ వివరిస్తున్నారు - 'భూరం భాంస్య నలో'..

'భూ' అంటే భూమి, 'అంబు' అంటే నీరు. 'అనలము' అంటే అగ్ని, 'అనిల' అంటే వాయువు. 'అంబర' అంటే ఆకాశము అని అంతరిక్షం అని అర్థం.
        అంబరము అంటే వస్త్రం అని ఆవరణ అని కూడ అర్థం. అంబరము అనే శబ్దానికి వేదాంత అర్థాలు, నానార్థాలు చాలా వున్నాయి. అన్వయాన్ని బట్టి వీటిలో ఏదో ఒకదానిని స్వీకరిస్తారు. దిగంబరుడు అనే పదానికి దిక్కులను వస్త్రముగా ధరించినవాడు అని అష్ట దిక్కులను వస్త్రముగా ధరించిన వాడెవడో వాడు దిగంబరుడు అని అర్థం.

        ఈ రకంగా ఆ అంబరము అనే శబ్దానికి ఆకాశం అని, అరతరిక్షం అని, వస్త్రం అని, ఆవరణ అని అనేకార్థాలు వున్నాయి.

'భూరంభాస్యనలోనిలోంబర మహర్నాధో హిమాంశుఃపుమాన్‌'

        ఐదవ లక్షణం దాకా వచ్చాము. ఇంక మిగిలిన మూడూ ఏమిటటా? భగవద్గీత కూడ చెప్పింది. ఆ మిగిలిన మూడూ ఏమిటిపంచభూతములు, ఇంకామూడు ఉన్నాయి అష్టమూర్తులలో.

        భగవద్గీతలో మనస్సు, బుద్ధి, అహంకారము అని కర్మ షట్కంలో జీవభావం నుండి, ఆత్మభావంలోకి మరలించేటటువంటి పద్ధతిలో చెప్పబడింది.

        కాబట్టి మనస్సు, బుద్ధి, అహంకారం అనే నిర్వచనం తీసుకునేటట్లుగా చెప్పబడింది. కానీ అక్కడ వాస్తవానికి ఏముందంటే బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు. ఆకాశం తరువాత చెప్పేటప్పుడు ఆకాశం నుండి పైకి చెప్పాలా? క్రిందికి చెప్పాలా? అన్వయ క్రమం చెప్పేటప్పుడు ఆలోచించండి.

        అందుకని భగవద్గీతలో ఎలా చెప్పారు అంటే 'భూమిరాపో అనలో వాయుఃబ్రహ్మణో బుద్ధి రేవచ అహంకార ఇతీయం మే భిన్నాప్రకృతి రష్టదా'

        కాబట్టి 'తత్‌', 'త్వం'లో 'త్వం' అనేది ప్రకృతి గనుక అయినట్లయితే 'తత్‌' బ్రహ్మం అయింది. 'త్వం' ప్రకృతి అనే క్షరపురుషుడైనట్లయితే 'తత్‌' అక్షర పురుషుడైనటువంటి బ్రహ్మము అయింది. క్షరాక్షరుల మధ్య బోధింపబడుతుంది.

        ఈ రకమైన అన్వయంతో చెప్పేటప్పుడు దీనికి సూచించబడిన లక్ష్యార్థం మారిపోతుంది. ఇక్కడ ఏ పద్ధతిలో చెప్పబడింది అంటే - 
'భూరం భాంస్య నలోనిలోంబర మహర్నాధో హిమాంశుఃపుమాన్‌'  పైకి చెప్తున్నాడన్నమాట. బ్రహ్మము అవ్యక్తము మహత్తు, మహత్తు నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని  నుండి నీరు, నీరు నుండి పృథ్వి. ఈ విధంగా అష్టమూర్తులేర్పడ్డాయి అంటున్నారు.

        మూర్తిమంతం అంటే ఏముండాలి? ఒక ఆవరణ ఉండాలి, ఒక వ్యవహారం ఉండాలి, ఒక లయం ఉండాలి. అంటే ఈ ఎనిమిదింటికి కూడ వాటి వాటి స్థితులలో వాటికి ఆవరణ, కదలిక, లయం కూడ ఉన్నాయి. 

కాబట్టి 'భూమిరాపోఅనలో వాయుః ఖం మనోబుద్ధిరేవచ! అహంకార ఇతీయంమే భిన్నా ప్రకృతి రష్టదా!!'

        ప్రకృతిలో ఉన్నటువంటి ఎనిమిది లక్షణాలు చెప్పినప్పుడు కూడా అదే పద్ధతిలో చెప్పబడింది. ఆవరణ, కదలిక, లయం, సూత్రం ఏమీ చెడిపోలా. అట్లాగే ఇక్కడ పైకి చెప్తున్నారు. ఊర్ధ్వముఖంగా సృష్టి గురించి బోధిస్తున్నారు. 

'భూరంభాస్య.. ఇత్యాభాతి చరాచరాత్మకం'. రెండూ ఒకేసారి చెప్పేస్తున్నారు.

        'ఇత్యాభాతి' 'భాతి' అంటే భాసించుట, ప్రకాశించుట, ఉండుట. 'ఇత్యాభాతిఈ ఎనిమిది ప్రకాశిస్తున్నాయయ్యా, ఈ ఎనిమిది ఆవరణలు ఉన్నాయయ్యా. 'ఇత్యాభాతి' ఎలా? చరా, అచరా అనగా  కదిలేవిగానూ, కదలనవిగానూ కనబడుతున్నాయి. వీటికి రెండు లక్షణాలున్నాయట. ఎలా వున్నాయట?

        ఒక సమయంలో చూస్తేనేమో కదులుతున్నట్లుగానూ, ఒక స్థితిలో నుండి చూస్తే కదలనివిగానూ కూడా కనబడుతున్నాయి. వివేక దృష్టిని బట్టి ఇవి ఒక స్థితిలో ఎలా ఉన్నాయి. కదిలేవిగా ఉన్నాయి. ఒక స్థితిలో కదలనవిగా ఉన్నాయి. ఎలాగో చెప్పగలరా?

        'చరాచరాత్మకం' ఇక్కడ ఆత్మ శబ్దం ఎందుకు వేశారు? నీలో ఉన్న నేను యొక్క స్థితిని బట్టి, ఇవి చరములుగా, అచరములుగా కనపడుతున్నాయి. కదిలేవిగానూ, కదలనివిగానూ కనబడుతున్నాయి  ఈ ఎనిమిది మూర్తులే.

        బ్రహ్మము చెదిరిందట. అంటే సంకల్పం వచ్చింది. సృష్టి ప్రారంభం అయింది. కదిలిందా, లేదా ? కదిలింది. ఏమైంది? సృష్టి ప్రారంభం అయింది. ఆ కదలిక, సృష్టి మరల ఆ బ్రహ్మము నందే లయం అయింది.

        కాబట్టి బ్రహ్మము కదులుతాడా అంటే కదలడు అన్నారు. ఎవరన్నారు? బ్రహ్మ నిష్ఠ కలిగినవారు పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగినటువంటి వారు బ్రహ్మమునందు ఏ కదలికలూ లేవు అన్నారు. 'తాకదలడట పరమశివుడు, కదిలెడిది మాయయటా' అన్నారు.

      కదిలాడు అన్నావా? అది మాయ అన్నాడట. ఎవరు? పరబ్రహ్మ నిర్ణయం తెలిసినవాడు.  పరబ్రహ్మ నిర్ణయం తెలియలేదా? ఆ ఆత్మ స్థితికి పరబ్రహ్మ నిర్ణయం తెలియలేదు.
ఎవరు ఉత్తమ పురుషుడు? 'అహర్నాధో హిమాంశుః పుమాన్‌'

        పురుషులలో ముగ్గురు పురుషులు. క్షర, అక్షర, పురుషోత్తమ. పురుషోత్తమ స్థితిని ఎరిగినవారు ఏమి చెప్తున్నారు?

        ఇవేవీ కదలడం లేదు. అసలు కదలికలే లేవు అన్నారు. ఎందుకని? కదిలితే మాయ కాబట్టి, కదిలితే ఎరుక కాబట్టి. అందువలన భూమి తిరగడం లేదు, వాయువు తిరగడం లేదు, అగ్ని తిరగడంలేదు, పంచభూతాలు తిరగడం లేదు.

        బ్రహ్మము, అవ్యక్తము, మహత్తుకూడ ఏమీ కదలడం లేదయ్యా! ఇవేవీ కదలడం లేదు. వీటికి కదలికలే లేవు. ఎందుకని అంటే నేను పరబ్రహ్మ స్థితినుండి వీటిని చూస్తున్నాను. కాబట్టి కదలని స్థితిలో ఇవేవీ కదలడంలా. నీవే లేని స్థితిలో ఇవేవీ కదలడం లేదు. నేను లేను అన్న వాడికేమో ఇవేమీ కదలడం లేదు.

        నేను ఉన్నాను అన్నవాడికి ఏమైందటా? పరబ్రహ్మ నిర్ణయం నుండి బ్రహ్మీభూత స్థితికి వచ్చాడు, బ్రహ్మ నిష్ఠలోకి దిగి వచ్చేశాడు. ఆ బ్రహ్మము నందు సగుణ నిర్గుణ భేదములేర్పడ్డాయి. ఏర్పడేటప్పటికి అదే ప్రథమ సంకల్పం. ఆ సగుణ నిర్గుణ భేదములే ప్రథమ సంకల్పం.

        బ్రహ్మము కాస్తా అవ్యక్తం, మహత్తు అయిపోయింది. వెంటనే ఆ అవ్యక్తం మహత్తు అయిపోగానే పంచభూతాత్మకమైన ప్రకృతి దానినుండి ఆవిర్భవించింది. ఈ ఆవిర్భావం అంతా కూడా కదలికలే.

        మరి ఆవిర్భావం కదలికలైనప్పుడు స్థితి కూడా కదలికే. తిరిగి లయం కూడా కదలికే. తిరోధానం కదలికలే. అనుగ్రహం కూడా కదలికలే. పంచకృత్యములు కదలికలే. పంచక్రియలు కదలికలే, పంచ బ్రహ్మలు కదలికలే. పంచశక్తులు కదలికలే.

        కదలడం అనే ప్రక్రియ కనుక లేకపోయినట్లయితే, సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠ అయిన పరబ్రహ్మ నిర్ణయమందు ఇవేవీ కదలడం లేదు. కాబట్టి ఆ దృష్టితో చూసినటువంటి మహర్షులు ఏమన్నారయ్యా అంటే ఇవేవీ కదిలేవి కావు. ఇవన్నీ జడములు. జడములు, చేతనములని రెండు వస్తువులు లేవు అసలు. ఏ దృష్టికి తోచాయి, ఏ స్థితికి ఉన్నాయి?
క్రిందికి దిగి వచ్చి ఉపాధి తాదాత్మ్యత పొందినటువంటి జీవోపాధి నుండి మానవోపాధి నుండి పరిశీలించినప్పుడు జడచేతనములు కనపడుతున్నాయి.

    కాబట్టి స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి గమనించి, భోక్తగా అనుభవించేటటువంటి జీవుడి రూపంలో వున్నటువంటి మానవుడి దృష్టితో చూచినప్పుడు మాత్రమే ఈ కదులుతున్నవని, కదలనివి అనీ భ్రాంతి కలిగింది.

        ఇది వాస్తవానికి భ్రాంతి. ఎలా భ్రాంతి అయ్యా! అంటే, వెలుగులో చూస్తే తెలిసిపోతుంది. చీకట్లో చూస్తే భ్రాంతి. అజ్ఞానమనేటటువంటి చీకటితో చూచినప్పుడు ఆత్మ వస్తువు సహజ స్వప్రకాశ పరిజ్ఞానమైనటువంటి పరశివతత్త్వంగా నీకు తెలియబడినప్పుడు ఇవన్నీ లేనివే, ఇవన్నీ జడములే. ఇవన్నీ కదలడం లేదు.

        అదే ఆత్మ వస్తువు నీకు జీవుడిగానో, బ్రహ్మముగానో, మధ్యలో ఈశ్వరుడిగానో తోచినప్పుడు ఏమైంది నీకు? ఇవన్నీ అష్టమూర్తులన్నీ, ఆవరణలన్నీ ఉన్నట్లు, ఆయా ఆవరణలలో అవి పరిభ్రమిస్తున్నట్లు, భ్రమిస్తున్నట్లు నీకు తోస్తున్నది. అనుభూతమౌతున్నది. కాబట్టి సత్యం అనుకున్నావు. కాబట్టి 'యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ' అని ఉపనిషత్తు వాక్యం. దేనితో నిర్ణయిస్తున్నావంటే వాక్కు, మనస్సు, బుద్ధి ద్వారా నిర్ణయిస్తున్నావు.

        మీ నేను దేనిద్వారా పనిచేస్తోంది.. మీ 'నేను' ఈ వాక్కు, మనసు, బుద్ధిని ఆధారం చేసుకుని నిర్ణయం చేస్తుంది. 'యతో వాచో నివర్తంతే', ఆ వాక్కు విరమించినట్లయితే, నివర్తన మైనట్లయితే ఏ స్థితిలోకి చేరిందో అట్టి మౌనం?

'యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ' ఆ బుద్ధి కూడా మనస్సులో అంతర్భాగమే.

        మనసు విరమించబడినట్లయితే ఏ స్థితికైతే చేరిందో, అక్కడ వాక్కు విరమించబడిన స్థితి నీకు తెలియబడాలి. మనసు విరమించబడినటువంటి స్థితి కూడా నీకు తెలియబడాలి. తెలియబడితే 'యతో వాచోనివర్తంతే అప్రాప్యమనసా సహ' అనగా అనిర్వచనీయము.

        అప్పుడు నిర్వచనాలన్నీ పోయినాయి. ఈ నిర్వచనాలన్నీ చేయబడిన దంతా కూడా ఆ మాయే. ఆ అనిర్వచనీయము అని చెప్పబడుతున్నది కూడా మాయే. 'తత్‌ పరంచావలోకయేత్‌ఈ మాయనే 'తత్‌' పదార్థముగా భావించి 'త్వం' 'తత్‌' యందు కలసిపోతున్నదనేటటువంటి భ్రాంతి 'తత్త్వమసి' మహా వాక్యర్థ లక్ష్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని ఆశ్రయించినప్పుడు 'త్వం' 'తత్‌' యందు లీనమగుచున్నది. లయమగు చున్నది. ఏకమగుచున్న దనేటటువంటిది భ్రాంతి యగుచున్నది అనే 'తత్త్వమసి' మహావాక్యార్థ నిరసనగా ఈ శ్లోకాన్ని వేశారు.

        మహా వాక్య బోధకు ఈ వాక్యాన్ని వేయలేదు. ఈ శ్లోకాలు చిట్ట చివరివన్నమాట. దీని తరువాత ఇంకేమీ ఉండవు. ముగింపే అన్నమాట. అన్ని బోధలలోకెల్లా తత్త్వ విజ్ఞానమంతా ఆశ్రయించి నటువంటి ఉపదేశ వాక్యం 'తత్త్వమసి'. అటువంటి తత్త్వమసి మహా వాక్యంలో 'త్వం' పదము ఈ అష్టమూర్తులు. మరి 'తత్‌' పదమైనటు వంటి పరబ్రహ్మమును ఆశ్రయించినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి దేశికుడైనటు వంటి వాడికి 'త్వం' పద రాహిత్యంతో పాటు తత్‌ పద రాహిత్యం కూడా ఏర్పడుతుంది. ఏకకాలంలో తత్‌, త్వంలు రెండూ విరమించబడుతున్నాయి. రెండు ఆవరణలూ లేనివాడగుచున్నాడు. ఆవరణ రహితుడగుచున్నాడు.

'భూరం భాస్యనలోనిలోంబర మహర్నాధో హిమాంశుఃపుమాన్‌'
అందుకనే చిట్టచివరి శబ్దం 'పుమాన్‌' అన్నారు.

        ఏ పురుషోత్తముడైతే కలడో ఆ పురుషోత్తమ స్థితిని తెలుసుకున్నప్పుడు క్షరాక్షరులు లేనివారగుచున్నారు. అందుకే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నారు. ఆ ప్రాప్తి అని ఎందుకన్నారక్కడ? ఇదే విషయం అచల సిద్ధాంతంలో కూడ వస్తుంది. 'దాని ప్రాప్తిని కనవలయు' అంటారు.

        ఏమంటారూ! బయలును దర్శించాలి అంటే? ఏ సాధన చేయాలి? అని శిష్యుడడిగితే 'దాని ప్రాప్తిని కనవలయు' అంటారు. అంటే అర్థం ఏమిటి? సాధన ద్వారా అది దర్శించే అవకాశం లేదు.

        ఎవరైతే సాధన చేసి ఈ అష్టమూర్తులనే త్వం పదమునెరిగి ఇది లేనిది అని నిరూపించబడే పద్ధతిగా ప్రబోధను పొంది ఆ ప్రబోధ దృష్ట్యా, ఏక కాలంలో ప్రబోధా సమయంలోనే ఎవరైతే ఇవి లేనివి అని నిర్ణయింప చేసుకుంటారో అటువంటి స్థితిని పొందుతారో వారికి 'మొదలు అచలము వివరించెద కడకు ఎరుక విడిపించెద' అనే పద్ధతిగా దేశికేంద్రుని చేత మార్జాలకిశోర న్యాయముగా బయలు యొక్క దర్శనం జరుగుతుంది.

        ఆ దర్శన ప్రభావం చేతనే ఈ అష్టమూర్తులు లేనివై పోయాయి. క్షణ మాత్రంలోనే ఈ అష్టమూర్తులు లేని స్థితిలోకి చేరినాయి. అప్పటివరకు నేనున్నాను, నేనున్నాను అనేటటువంటి ఆవరణ దోషమంతా ఈ అష్టమూర్తులతో సహా ఏకకాలంలో రద్దు అయిపోతుంది. ఈ రకంగా రద్దయిపోయినటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారు దేశికులు దేశికేంద్రులు.
కాబట్టి 'భూరం భాస్య.. మూర్త్యష్టకమ్‌'

        కృష్ణావతారం అష్టమగర్భం. అందులో కూడ ఒక విశేషం వుంది. ఆ అష్టమ గర్భం రావడంలో ఎనిమిది మూర్తులలో ఆఖరి మూర్తి అయినటువంటి పురుషోత్తముడు ప్రావిర్భవించాడు, అష్టమమూర్తిగా.

        కాబట్టి కృష్ణావతారం తరువాత అవతారాలు లేవు. అదే ఆఖరి అవతారం. అదే పురుషోత్తమ స్థితి. మన కలిగయుంలో ఏ అవతారాలు లేవా? ఇక్కడ అవతారాలు అవతరించడానికి అవకాశం లేదు.

        ఎందుకంటే ఆ యా యుగ ధర్మాలకు సంబంధించిన విధానం ఈ యుగంలో లేదు కాబట్టి. మరి దశావతారాలు చెప్తున్నారు కదా! సత్యమే, 9, 10 అవతారాలు కలియుగం కోసమే చెప్పారు. అన్ని యుగాల వారికోసం కూడ చెప్పారు. ఎవరా 9,10 తొమ్మిది గురువు, పది శిష్యుడు. ఇవే దశావతారాలు. కాబట్టి ఎవడైతే సద్గురువుతో, ఆ దేశికేంద్రునితో ఐక్యతా స్థితిని పొందాడో, వాడు పదవ అవతారం.

        వీరికి మార్జాల కిశోర న్యాయం చేత ఎవరైతే ఆ స్థితిని బోధింప జేశారో, దర్శింప చేశారో, కలిగింప చేశారో ఆ దేశికులందరూ తొమ్మిదవ అవతారం. కాబట్టి దశావతారాలు ఎప్పుడూ పూర్తి అవుతాయి. పూర్తి అవకుండా ఆ సృష్ఠి విధానం పూర్తి అవదు.

        కాబట్టి కలియుగంలోనే ఎక్కువ అవతారాలున్నాయి. అందుకే కలియుగంలో లెక్క కడితే ఇక్కడ అందరూ భగవాన్‌ స్వరూపులే. నాయనా! ఇక్కడ నీవొక్కడివే భగవాన్‌ అంటే కుదరదు.

        పూర్వ కాలంలో, ఆ యుగంలో శ్రీకృష్ణుడు ఒక్కడే భగవానుడని నమ్మారు. ఆ అవతార విశేషాన్ని తెలుసుకుని కొలిచారు, ఆనందించారు, ఆశ్రయించారు.   కలియుగంలో ఎటువంటి పరిస్థితి వచ్చేసిందయ్యా! ''విధి వ్యాదభిమాన గ్రస్థం'' మానవులందరూ ఈ మూడిటిచేత గ్రసించబడతారట.

        ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలలో కలియుగాంతం అయ్యేవరకు కూడ విధి, వ్యాధి, అభిమానం ఉంటాయని భజగోవిందంలో ఆది శంకరులు చెప్పారు.

        నాయనా! నీ అజ్ఞానానికి మూలం ఈ మూడు. ఈ మూడింటిచేత గ్రసించబడటమే విధి. వ్యాధి, అభిమానం. ఈ మూడూ నీలో ఎప్పుడైతే ప్రవేశించాయో అప్పుడు ఏమై పోతావుట? క్షర పురుషుడిగా ప్రకృతికి లోబడి పడిపోతావు. అక్షరుడుగా కూడా ఉండడు. నశించేవే సత్యం అనే పద్ధతిగా ఉంటాడు. కనీసం అక్షర పురుషుడుగా ఉంటే నీకు బోధించవచ్చు.

        బ్రహ్మ నిష్ఠలో కనుక ఉంటే నీకు ఒక సూత్రాన్ని బోధించవచ్చు. అది 'భ్రమేణాహం, భ్రమేణత్త్వం, భ్రమయితి సర్వం' అని చెప్తారు.ఇదే ఆఖరి ప్రబోధ. ఇదేమిటంటే 'భ్రమేణాహః' కదలికలే నేను, 'భ్రమేణత్త్వంః' కదలికలే సర్వము.

        'భ్రమయితి సర్వంః' ఆ సర్వమూ కూడ కదలిక వలనే ఏర్పడినట్లు తోచుచున్నది. వాస్తవమునకు లేనిదే . శూన్యమన్ననూ లేనిదే, సర్వమన్ననూ లేనిదే. శూన్యసర్వములొక్కటే.

        'పూర్ణమదః పూర్ణమిదః' అని ఏ పూర్ణం గురించైతే చెప్పబడుతున్నదో, ఆ పూర్ణం అఖండ ఎరుక. దానియందు ఏదైనా కలిపిననూ లేనిదే, దాని నుండి ఏదైనా తీసివేసిననూ లేనిదే.

        లేనిదా, ఉన్నదా! ఉన్నది అంటే అఖండ ఎరుక. లేనిది అన్నప్పుడు కూడ అఖండ ఎరుకే. రెండు పద్ధతులుగా చెప్తున్నారు. లేని పద్ధతిగా చెప్పినప్పుడు శూన్యం అన్నారు. ఉన్న పద్ధతిగా చెప్పినప్పుడు పూర్ణం అన్నారు. అటు, ఇటు త్రిప్పి ఏమి చెప్పినా అఖండ ఎరుక గురించే చెప్పుచున్నారు కదా! అంటే కాదయ్యా! బయలే పరిపూర్ణము.

        'ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్త్యెవ మూర్త్యష్టకమ్‌' అష్టమూర్తులు కానటువంటిదేదీ ఈ అనంత విశ్వంలో శూన్య సర్వములుగా ఏదీ లేదు.  శూన్యం నుండి సర్వం వరకు, సర్వం నుండి శూన్యం వరకు మొత్తం అంతా కూడా ఈ అష్టమూర్తులుగానే ఉంది. కాబట్టి ఇదంతా కదలిక చేతనే ముడిపడి ఉంది. అనగా ఇదంతా మిథ్య. వాస్తవమునకు ఏ కదలికలూ లేవు. అంతరిక్షములకు ఏ కదలికలూ లేవు. బయలుకు ఏ కదిలకలూ లేవు. పరశివమునందు ఏ కదలికలూ లేవు. అట్టి కదలికలే లేని స్థితికి నీవు చేరినప్పుడు  ఏమయ్యావు? ఈ ఎనిమిది శరీరాలు, ఎనిమిది మూర్తులు లేనివయ్యాయి.
'భూరం భాంస్యనలో నిలోంబర మహర్నాధో.. మూర్త్యష్ఠకమ్‌'

        తరువాత 'నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్‌ పరస్మాత్‌ విభోః' ఈ చివరి వాక్యంలో పూర్తిగా తేల్చి చెప్పారు. 'నాన్యత్‌ కించన విద్యతే' జ్ఞానము వలన తెలుసుకోబడిందేదైనా సరే, 'న అన్యత్‌ కించన విద్యతే' ఇంతకు మించి అన్యము లేదయ్యా! 'కించన' కొద్దిగా కూడ లేదయా, దేనివలన? అజ్ఞానం వలన తెలుసుకోబడినదే కాదట. జ్ఞానం వలన తెలుసుకోబడినదంతా కూడా ఇంతకు మించి ఏమీ లేదట.

        ఎక్కడ మొదలుపెట్టారు? 'భూరం భాంస్య.. నాన్యత్కించన.. విమృశతాం' విమృశతాం అంటే విశేషమైనటువంటి మృష. విశేషమైనటు వంటి భ్రమ, విశేషమైన కదలిక.

        ఏ జ్ఞానము చేతనైతే మొదటి కదలిక ఏర్పడిందో, ఏ సర్వజ్ఞత్వ స్థితిలో మొదటి కదలిక ఏర్పడిందో, ఏ బ్రహ్మనిష్ఠ యందైతే మొదటి సంకల్పం ఏర్పడిందో అదే లేనిదయ్యా! ఆ కదలికయే లేనిది అనే దృష్టితో నీవు చూడగలిగేటటువంటి స్థితిలో నీవు ఉండగలగాలి. జన్మ రాహిత్యం అంటే అదీ. జనన మరణాలు లేకుండా ఉన్న స్థితి అంటే, అదీ. పరబ్రహ్మమంటే అదే, పరమాత్మ అంటే.

        ఈ నిర్ణయ స్థితిలో నిలకడ కలిగి ఉండు. నేను లేనివాడను, 'నాహం' అనేటటువంటి స్థితిలో నిలబడి ఉండు.

నాన్యత్‌ కించన విద్యతే విమృశతాం యస్మాత్‌ పరస్మాద్‌ విభోః
యస్మాత్‌, పరస్మాత్‌ అంటే అష్టమూర్తుల లోపల చెబితే యస్మాత్‌, దాని అవతల చెపితే పరస్మాత్‌.  అష్టమూర్తులనే ఆవరణలుగా చెప్తే ఆ ఆవరణ లోపల కనుక బోధిస్తే యస్మాత్‌. దాని అవతల ఉన్న పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియచేస్తే పరస్మాత్‌.

        కాబట్టి అవతార్‌ మెహెర్‌ బాబా 'పరాత్పర పరబ్రహ్మం' అన్నారు. పరబ్రహ్మం అన్నా, పరాత్పర బ్రహ్మ అన్నా రెండూ ఒక్కటే. తేడా లేదు.

        ఈ అద్వైత సిద్ధాంతానికి మెహర్‌ బాబా వారు ప్రవచించిన విధానానికి పరబ్రహ్మ నిర్ణయం ఎలా వచ్చింది అంటే  పరమాత్మ '', పరమాత్మ 'బి' అని బ్రహ్మమునందలి సగుణ, నిర్గుణ భేదములను వారు సూచించారు.

        ఆ పరమాత్మ ఎ, పరమాత్మకి బి, అవతల ఏమిటి అంటే పరాత్పరం అన్నారు. ఇక్కడ పరమాత్మ అని అన్నారు  కదా! కాబట్టి అక్కడ పరాత్పరం అన్నారు. ఎలా అక్కడ ఉన్నదని, ఇక్కడ ఉన్నదని చెప్పుకున్నా 'యస్మాత్‌', 'పరస్మాత్‌'.

త్వం శరీరం కనుక అయితే తత్‌ ప్రాణం అయింది.
త్వం ప్రాణం అయితే తత్‌ మనసు అయింది.
త్వం మనసు అయితే తత్‌ బుద్ధి అయింది.
త్వం బుద్ధి అయితే తత్‌ ప్రజ్ఞ అయింది
త్వం ప్రజ్ఞ అయితే తత్‌ ఆత్మ అయింది
త్వం ఆత్మయితే తత్‌ బ్రహ్మమయింది
త్వం బ్రహ్మమయితే తత్‌ పరబ్రహ్మము అయింది.
తత్‌ రహితమే ఆవరణ రహితం.

        నిరవయవం, నిరావరణం, నిరంజనం, నిర్లేపం, నిష్కళం, ఈ రకంగా పరబ్రహ్మ సూచకములన్నీ ''కార శబ్దంతో చెప్పబడినవి. ఉపనిషత్తులలో ఎక్కడెక్కడైతే ఈ నకార లక్షణాలు వచ్చాయో, అవన్నీ కూడా పరబ్రహ్మమును సూచిస్తున్నాయి.

        కాబట్టి 'సావయవం' అంటే నేను అవవయములతో కూడుకున్న వాడను అనగానే శరీర ధర్మానికి, దేహ తాదాత్మ్యతకు వచ్చేసి, జీవుడివయ్యావు. నిరయవయం అంటే ప్రజ్ఞ వద్ద మొదలుపెడితే పరబ్రహ్మం వరకూ నిరవయవమే.

        కాబట్టి 'యస్మాత్‌ ప్రజ్ఞ' అంటావో, 'పరస్మాత్‌ పరబ్రహ్మ' అంటావో? అసలు అంతర్ముఖ ప్రయాణం స్థితప్రజ్ఞతో మొదలై, మరల పరబ్రహ్మ నిర్ణయంతో పూర్తవుతుంది.

        ఈ ప్రయాణం ఎవరు చేయాలి? నీలో ఉన్నటువంటి చైతన్యం చేయాలి. ఆ చైతన్యమే తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోవాలి. కాబట్టి చైతన్యం అనేదే నీ మొదటి స్థానం.

        నేను శరీరం అన్న వాడికి ఈ పాఠం చెప్పడం కుదరదు. వాడు అనర్హుడు. నేను చైతన్యమును, నేను ప్రజ్ఞను, జ్ఞాతను అన్నవాడు కనీసం వినడానికి అర్హుడు. తెలుసుకోవాలి, అధికారి అయి ఉండాలి.

        అంటే కనీసం నేను కూటస్థుడై ఉండాలి. నేను బ్రహ్మము అయి ఉండాలి. ఆ మహావాక్య నిర్ణయం ఎరిగినటువంటి వారెవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మ నిష్ఠ కలిగినవాడు ఈ దక్షిణామూర్తి స్తోత్ర ప్రబోధ పొందడం ద్వారా ఈ రకమైన జనన మరణ రాహిత్య పద్ధతిని తెలుసుకోవడం ద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతాడు.

'భూరం భాస్య.. ఇత్యాభాతి.. నాన్యత్కించన'
        'విభో'.. విభో అంటే? ప్రభో, విభో సాధారణంగా గురువునుద్దేశించి గాని, బ్రహ్మనుద్దేశించి గాని ఈ రెండు పదాలూ వాడబడుతూ ఉంటాయి.
ప్రభో! కిం కర్తవ్యం. నా కర్తవ్యం ఏమిటి నాయనా! అని గురువును ఆశ్రయిస్తాడు.

        మహా ప్రభో! అంటే గురువు మహత్తు స్థితిలో ఉన్నాడని అభిప్రాయం. 'ప్ర' అనేది ప్రకర్షయతి భాత్‌ యితి ప్రభో. ఎంతటి ప్రకాశం కలిగి ఉన్నాడయ్యా అంటే, మహత్తంత వ్యాపక ప్రకాశం కలిగినటువంటివాడు అని చెప్పడం. ఆయన ప్రకాశం ఎంత దూరం వ్యాపించిందట? మహత్తు వరకు వ్యాపించిందట.

        బ్రహ్మణో అవ్యక్తాన్‌, అవ్యక్తో మహత్తు అని ఏదైతే చెప్తున్నారో, అట్టి మహత్తు వరకు వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశం కలిగినవాడా! కి కర్తవ్యం? నా కర్తవ్యమేమిటో తెలుపవయ్యా ! నన్ను మేలుకొలుపువయ్యా! జ్ఞానమును ప్రసాదించవయ్యా! అని గురువును ఆశ్రయించి హే మహా ప్రభో! అంటున్నాడు.

        ఇక్కడ 'విభో' అన్నారు. 'భాత్‌' అనేటటువంటిదేదైతే ఉందో, అంటే ప్రకాశించడమంతా అష్టమూర్తులుగా ప్రకాశిస్తున్నది.

        కాబట్టి 'ఇత్యాభాతి.. మూర్త్యష్టకమ్‌' అష్టమూర్తులుగా ఉన్న సమస్త  ప్రకాశం లేని స్థితి ఏదైతే ఉందో.. 'ప్రకాశమే లేని స్థితి' అంటే మనకు 'చీకటే' తెలుసు. స్వప్రకాశం లేని స్థితిని ఊహకందించలేవు. ఎందుకని అంటే సుషుప్త్యావస్థలో ప్రకాశం తగ్గిపోతుంది. అంతేగాని పూర్తిగా లేకుండా పోదు.

        ప్రకాశ ప్రభావం తగ్గిపోతుంది. సుప్త చేతనావస్థ ఏర్పడుతుంది. ఆ సుప్త చేతనావస్థకు వచ్చేటప్పటికీ ఇంద్రియములన్నీ పడిపోతాయి. తమ తమ ధర్మములను కోల్పోయినాయి. తమ చలనములను, గ్రహింపు శక్తిని కోల్పోయినాయి. దానినే విశ్రాంతిగా, పరమ సుఖముగా భావించి రోజూ అందులో మునుగుతున్నాడు.

        ఇలా మునిగేవాడు తెలుసుకోలేడు. ఎరిగి తురీయంలోకి వచ్చినవాడు, తురీయాతీతమును ఎరుగవలెనంటే సరిపోతాడు. వాడికి 'ప్రభో' అనేది తెలుసు. ఎవరికైతే ప్రభో అన్న శబ్దం తురీయంలో అనుభూతిగా తెలిసిందో వాడు విలుప్తమైనట్టి 'భాత్‌' 'విభో' అన్న శబ్దంలో 'వి' అనేది ఉపసర్గ. విలువైన 'భాత్‌'

        సర్వ వ్యాపక ప్రకాశమే అష్టమూర్తులుగా, అనంత విశ్వముగా, అఖండ ఎరుకగా ఉన్నట్లుగా తోచుచున్నదో, విలుప్తమైనటువంటి అట్టి అఖండ ఎరుక లేనటువంటిది నీకు తెలియబడింది. 'యస్మాత్‌ పరస్మాత్‌ విభో'. 'విభో' అన్న శబ్దం నిష్కళ స్థితిని సూచిస్తుంది.

        చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ఒక్కో అక్షరాన్ని, పదాన్ని కూర్చారు. మామూలుగా చదువుకుని వెళ్తే, అన్వయ వ్యతిరేకాలు సరిగ్గా బోధపడకపోతే లక్షిత స్థితినుండి దూరమై పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 'భూరం భాస్య.. యస్మాత్‌ పరస్మాద్విభో' విధి, వ్యాధి, అభిమానం లేవు. అభిమానం ఎనిమిది స్థానాలలో అష్ట శరీరాలలో ఏర్పడుతుంది.

        'విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యగాత్మలు', 'విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు'. ఈ ఎనిమిది తనువులలోను, ఎనిమిది సాక్షులలోను సర్వ సాక్షిగా ఆ అభిమానం ఏర్పడుతుంది. ఆ వ్యవహారం ఏర్పడుతుంది.

        'మూలాన్ని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేదు' అనే షోడశి వాక్యం ద్వారా 'ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదు' అనే ద్వాదశి వాక్యం ద్వారా 'కలలో తోచిన శరీరాలెలాగో అలాగే' అనే పంచదశి (ఇవే చివరి వాక్యాలు) ద్వారా ఎవరైతే దేశికేంద్రుని ద్వారా మేల్కొల్పబడ్డారో, నాహం, పరశివము స్థితియందు 'తాను లేని పద్ధతి'గా ఎవరు మేల్కొల్పబడ్డారో,

        'నాన్యత్కించన... విమృశతాం యస్మాత్‌ పరస్మాత్‌ విభో, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే'. వాడు దక్షిణామూర్తిని ఆశ్రయించినటువంటివాడు. వాడికి దక్షిణామూర్తికి ఎటువంటి భేదము లేదు. అందుకనే చెప్తున్నారు. 'ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే, వ్యోమవత్‌ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః' ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ మూడు ఒకటేనయ్యా

        'ఈశ్వరో గురురాత్మేతి' దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. గురువులందరికీ ఈశ్వరుడే ఆత్మ స్వరూపం అనే అన్వయం కూడా చెప్తారు.  కాని ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ మూడు స్థితులు ఒక్కదానినే సూచిస్తున్నాయి.

       'ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే' ఎనిమిది మూర్తులుగా చెప్పబడేటటువంటి భేదం ఏదైతే ఉందో, మూర్తిభేద విభాగినే ఆ విలుప్తమైన భాగం లేదు. ఎనిమిది మూర్తులే లేవు. ఎనిమిది అనే సంఖ్యే తప్పు. కాబట్టి లేనిది ఉన్నట్లుగా చెప్పడమే తగాదా అంతా. ఇది ఉన్నది, ఇది ఉన్నది అంటూ ప్రయాణం చేసి చివరకు ఏమి తెలుసుకున్నావు? ఇది లేనిది, ఇది లేనిది అని తెలుసుకున్నావు.

        చివరికి 'న యితి న యితి', 'నేతి నేతి' అనే మహా వాక్యాన్ని ఆశ్రయించి న ఇతి, ఇది లేనిది అనే స్థితికి చేరతావు. 'ఈశ్వరో గురరాత్మేతి మూర్తిభేద విభాగినే' అంటే అర్థం ఇది. అంతేకాని విభజించి చూడటం కాదు. 'భాగిణః' 'వి' విలుప్తమైన భాగం. అసలు భాగములు లేవు. అంతా ఏకమే, ఉన్నది అంటే 'అంతా ఏకమే', లేదు అంటే 'ఆ ఒకటి కూడ లేదు'.

        ఉన్నది అంటే ఒకటే ఉంది. ఒకటి పక్కన సున్నా లేదు. కానీ నీవు అష్టమూర్తులుగా విభజన చేసి చూపినప్పుడు ఏమైంది? ఒకటి పక్కన సున్నాలు పెరిగి అనేకంగా తోచింది. కాబట్టి అష్టమూర్తులుగా తోచేదంతా ఒకే సద్వస్తువు. ఒక్క సత్తే అష్టమూర్తులుగా తోస్తోంది. 'లేదు' అంటావా, 'సత్‌ రహితం'. అది కూడా లేనిదే. లేదనగలిగే సమర్ధత స్థితి కనుక నీకు ఉంటే, 'నేతినేతి' మహావాక్య నిర్ణయ పద్ధతి నీకు స్థిరమైతే ఆ 'సత్‌' కూడా లేనిదే.

        అసలు ఉన్నదంతా సత్తే అంటే 'అసత్‌'కు స్థానమెక్కడిది? అసలు ఉన్నదంతా బ్రహ్మమే. అంటుంటే మరల మరొకదానికి అవకాశం ఎలా వచ్చింది. ఉన్నదంతా ఆత్మే అంటే అనాత్మకు స్థానమెక్కడ? ఉన్నదంతా నిత్యమే అంటే అనిత్యమునకు స్థానమెక్కడ?

        కాబట్టి నిత్యానిత్య, ఆత్మానాత్మ, సదసత్‌, కార్యకారణ, దృగ్దృశ్య విభాగములు లేనివి. అవి ఉన్నట్లుగా తోచి, విచారణా క్రమంలో నువ్వు ఆ వివేకాన్ని పొందినట్లు భ్రాంతి చెందుతున్నావు.

        వాస్తవ విచారణలో చూస్తే పరతత్త్వ విచారణలో చూస్తే పరశివ తత్త్వ స్థితి నుండి చూస్తే జన్మరాహిత్య స్థితి నుంచి చూస్తే, దేశికేంద్రుని స్థితి నుండి చూస్తే శూన్యసర్వములు లేని స్థితి నుంచి చూస్తే ఏమైంది? అసలు ఇవేవీ లేనివి కదా! 'న ఇతి' 'న ఇతి'.

        'భేద విభాగినే' ఏమి మిగిలింది? పరతత్త్వంలో శేషించినదేది? బయలే. 'వ్యోమవత్‌ వ్యాప్తదేహాయ' ఇక్కడ పరిమతించబడింది, ఒక ఆవరణగా వ్యాప్తదేహాయ అంటున్నారు.

        ఎలా కుదురుతుంది? పైగా ఎంత వ్యాపించి ఉన్నాడట? 'వ్యోమవత్‌ వ్యాప్తదేహాయ' అనంతంగా ఉన్నటువంటి బయలు ఏదైతే ఉన్నదో, అంతరిక్షంలో ఏదైతే ఉన్నదో, ముల్లుగ్రుచ్చ సందులేక ఏదైతే ఉందో, అది కదా అక్కడ దేహం. 'నఇతి'. అంటే అష్టమ దేహం కూడా లేదు.
'వ్యోమవత్‌ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః'

        అనంతంలో ఈ విశ్వమంతా ఎంత? ఒక బిందువు. అట్టి విశ్వంలో మరలా ఒక నెబ్యులా, ఒక గెలాక్సీ. లేదూ ఇంకేదన్నా పెట్టుకో. అది ఎంత? ఒక బిందువు. వాటిల్లో మరలా పంచభూతాలు, ఒక భూమి, Solar network ఎంత? మరలా ఒక బిందువు. వాటిలో సృష్టి ఒక బిందువు. మరలా వాటిలో మళ్ళీ జీవులు. దానిలో మానవులు ఎంత? ఎంత సైజ్‌ తగ్గింది.

        పరబ్రహ్మం అయినటువంటి వ్యోమవత్‌ వ్యాప్తమైన దక్షిణామూర్తి ఎంత ఉన్నాడు. ములుగ్రుచ్చ సందులేక ఉన్నాడు. అంటే ఒక Pin point పెట్టి ఇతడు లేడు అని చెప్పడానికి వీలుకాదు. దీనినే పంచగగన పద్ధతిగా నిరూపించారన్నమాట. ఘట, పట, మఠ, దహర, కేవల ఐదు గగనాలున్నాయి. గగనము అంటే ఆకాశము, వ్యోమం అనే అర్థాలున్నాయి. గమించుటకు అవకాశం ఇచ్చినదేదో అది గగనం అని అర్థం. అసలు గమించడానికి వీలుకానిది ఏదో అది కూడా గగనమే.

        కదలడానికి వీలులేకుండా వ్యాపకమై ఉన్నదేదైతే ఉందో అది కూడ గగనమే. అందుకే రెండు ''లు వచ్చాయి. (సంస్కృతంలో ఉన్న విశేషం ఏమిటంటే ఏకాక్షర శబ్దాలు కూడా ఉన్నాయి).

        ఈ పంచ గగన పద్ధతి ద్వారా అభేద స్థితిని పొందాలి, ఎవరితో, దక్షిణమూర్తితో అభేద స్థితిని పొందాలి. బంగారాన్ని గీటురాయిమీద చూసినట్లుగా, నిరంతరాయంగా దక్షిణామూర్తితో అభేద స్థితిగా ఆ నిర్ణయానికి సరిపోతేనే గాని, లేకపోతే ఒప్పుకోను అనే నియమానికి కట్టుబడి, ఆ స్థితియందు నిలకడ కలిగిన వాడెవడైతే ఉన్నాడో, వాడికిపుడు దేహం ఉందని చెప్దామా, పుట్టిందని చెప్తామా, పోయిందని చెప్దామాఉన్నాడని చెప్దామా, లేడని చెప్దామా? మానవ సృష్టి  వరకు ఉన్నాడని చెప్దామా, జీవసృష్టి వరకు ఉన్నాడని చెప్దామా?

        'భూరం భాస్య నలోనిలోంబర.. పుమాన్‌' ఒకటే సమాసం. ఈ మూల నుండి ఆ మూలకు. 8 మూర్తులను కలిగి ఉన్నటువంటి సంస్కృత సమాసం వేశారు ఆదిశంకరులు. అన్వయం చేస్తే వేదాంతసారం అంతా అందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి ఎక్కడున్నాడని వెదుకుదాము?

        'భూరం భాస్య నలో నిలోంబర.. పుమాన్‌' అవస్థాత్రయాన్ని లేకుండా చేయగలిగిన సమర్ధవంతమైన వాక్యం ఇది. ఇది నన్ను (శ్రీ విద్యా సాగర్‌ గారిని ఎంతో కాలం వెంటాడింది) ఈ ఒక్క వాక్యాన్ని, రెండు వాక్యాలను అన్వయం చేసి తెలుసుకోవడానికి 20 సంవత్సరాలుగా అధ్యయనం చేయాల్సి వచ్చింది. దీనివలన అధ్యయన సమర్ధత లభించింది. అంటే నీకు అధికారిత్వం అక్కడ ఉండాలి. ఆదిశంకరుల యొక్క సమర్ధత అది. సాక్షాత్‌ శివ స్వరూపం. సాక్షాత్‌ దక్షిణామూర్తి స్వరూపం. కాబట్టి ఒక్క వాక్యంలో సమస్త సారాన్ని ఇమిడ్చి వేశారు.

        విస్తృతిగా చెప్పడం ఒక సమర్ధత అయితే, ఇమడ్చడం మరొక సమర్ధత. భాషా వైచిత్రిలో ఒక శబ్దం చెబితే ఆ శబ్దానికి అన్వయ వ్యతిరేకాలతో పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యానం చెప్పి ప్రవచనం చెప్పడం ఒక తీరు. కొన్ని వేల పుస్తకాలన్నింటినీ కలిపి ఒక్క శబ్దంలోనికి ఇమడ్చగలగటం ఒక తీరు. రెండవ దానికి అసాధారణ ప్రజ్ఞ, విశేష ప్రజ్ఞ కావాలి. మామూలు తెలివితేటలు సరిపోవు.

        కాబట్టి మౌనాన్ని విశ్లేషించాలంటే మౌనవ్యాఖ్య ద్వారా పొందిన ప్రబోధ ద్వారా నీవు మేల్కొల్పబడిన వాడివైనప్పుడు మాత్రమే 'నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే'.ఈప్రయాణం అంతా పూర్తిచేసిన వాడవై ఉండాలి. అపుడు మాత్రమే ఆ మౌన స్వరూపాన్ని ఎరుగగలుగుతావు.

       అప్పటివరకు నీకా ప్రజ్ఞా పాటవాలు ఏర్పడవు. కాబట్టి మానవుడు తన జీవిత లక్ష్యంగా దేనిని స్వీకరించాలో ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పేశారు. ఇంతకు మించిన నిర్ణయం లేదు. నీవు ఆశ్రయించదలచుకుంటావా? దక్షిణామూర్తిని ఆశ్రయించు. సాధించదలచుకుంటావా? ఆ దక్షిణామూర్తితో ఐక్యతా సిద్ధిని పొందు. ఆశ్రయించితే అట్టి దేశికేంద్రుని ఆశ్రయించు. ఆ దేశికేంద్రుని కరుణ చేత ఏర్పడేటటువంటి జన్మ రాహిత్య స్థితిని పొందు. మానవ జీవిత పరమ లక్ష్యం ఇదే. ఎట్టి పరము ఇది?

        'భూరం భాస్య... యిత్యాభాతి.. మూర్త్యష్టకమ్‌, నాన్కత్కించన'. ఇంతకు మించిన పరము లేదయ్యా! పరము నెరుగవలెనన్న కాంక్ష నీకు దీనితో రద్దయిపోతుంది. ఇంతకు మించిన పరము లేదు. 

'యస్మాత్‌ పరస్మాత్‌ విభో, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!'